Tuesday, December 28, 2010

పొగబారుతున్న బతుకులకు విముక్తి

క్లీన్'కుక్ స్టౌవ్'తో వంట చేస్తున్న మహిళ
     గ్రామాల్లో పొగబారిపోతున్న పేదల జీవితాలు మారిపోనున్నాయి. సంప్రదాయ పొయ్యిల నుంచి విడుదలయ్యే పొగ వల్ల సంభవించే మరణాలు తగ్గనున్నాయి. విషతుల్యమైన పొగతో ప్రమాదాన్ని తగ్గించే క్లీన్ స్టౌలు త్వరలో గ్రామీణ భారతానికి అందుబాటులోకి రానున్నాయి.

     భారత దేశ ఆర్థిక వృద్ధి రేటు రెండంకెలకు సమీపంలో ఉన్నా.. పేదల బతుకు చిత్రంలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు. దేశంలో సంపన్నుల ఆదాయం ఏ యేటికాయేడు పెరుగుతున్నా.. బడుగుల ఆర్థిక స్థితిగతుల్లో పురోగతి లేదు. పేదరికం కారణంగా గ్రామాల్లో ఇప్పటికీ చాలా మంది కట్టెలు, పిడకలను ఉపయోగించే వంట చేసుకుంటున్నారు. ఈ సంప్రదాయ పొయ్యిలు విడుదల చేసే పొగతో.. వారి జీవితాలు పొగబారిపోతున్నాయి. వంటగదుల నుంచి విడుదలయ్యే పొగతో దేశంలో ఏటా 4 లక్షల మంది చనిపోతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వెల్లడిస్తోంది. అంతేకాక సరైన వెంటిలేషన్ లేకపోవడం వల్ల పొగచూరి.. వ్యాధుల బారిన పడుతున్నవారెందరో..!! న్యుమోనియా, హృద్రోగ సమస్యలు, తగినంత బరువు లేకుండా శిశువుల జననం వంటి సమస్యలతో ఎంతో మంది సతమతమవుతున్నారు.

     అందుకే.. గ్రామీణ పేదల బతుకు చిత్రాన్ని మార్చేందుకు బ్రిటన్'కు చెందిన స్వచ్చంధ సంస్థ ముందుకొచ్చింది. బయోగ్యాస్, LPG గ్యాస్ వాడే స్తోమత లేనివారి కోసం క్లీన్ కుక్ స్టౌలను తయారుచేసింది. ఇవి గ్రీన్'హౌస్ గ్యాస్, పొగతో సంభవించే మరణాలను తగ్గిస్తాయి. ఇందులో కూడా వంట చెరకు, పిడకలు వాడొచ్చు. అయితే.. ఈ స్టౌలు తక్కువ పొగను విడుదల చేస్తాయి. అలాగే తక్కువ కట్టెలతోనే ఎక్కువ వంట చేసుకోవచ్చు.

     షెల్ ఫౌండేషన్ క్లీన్ స్టౌలను భారత మార్కెట్లో ప్రవేశ పెట్టనుంది. ప్రైవేటు భాగస్వామ్యంతో వీటిని మార్కెటింగ్ చేయనున్నారు. స్టౌ తయారీదారులు మైక్రో ఫైనాన్షియర్ల సహకారంతో ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్రలలో వీటిని ప్రమోట్ చేయాలని భావిస్తున్నారు. వచ్చే పదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా కోటి ఇళ్లకు ఈ క్లీన్ కుక్ స్టౌలను అందజేయాలని ఫౌండేషన్ లక్ష్యంగా పెట్టుకుంది.

Saturday, December 25, 2010

నోట్లో చక్కెర..!!

మీకు చీటికిమాటికి కోపం వస్తోందా..?

ఎదుటివాళ్ల మీద అనవసరంగా రెచ్చిపోతున్నారా..?

తోటివాళ్లతో దురుసుగా మాట్లాడుతున్నారా..?

ఇంట్లోవాళ్లతో ప్రతి చిన్నవిషయానికి విసుక్కుంటున్నారా..?

అయితే... నేనిప్పుడు మీకో శుభవార్త చెబుతున్నా..!
ఎంతటి శుభవార్త అంటే.. నోట్లో చక్కెర పోసినంత తీయని వార్త..!!

     తన కోపమే తన శతృవు అనేది సామెత.. మన నిత్య జీవితంలో  ప్రతి మనిషికి ఎదురవుతున్న అనుభవమే..! ప్రతి పనికీ మానవ సంబంధాలే ముఖ్యమైన ఈ రోజుల్లో చీటికిమాటికి వచ్చే ఉద్రేకం లేదా కోపం వల్ల అన్నీ అనర్థాలే..! మరి ఇలాంటి ఇలాంటి అనర్థాలను ఒక స్పూను చక్కెర నియంత్రిస్తుందంటే నమ్ముతారా..? అవును.. ఇది నిజం..!

     అమెరికాలోని ఒహియో యూనివర్సిటీ పరిశోధనల్లో ఈ విషయం తేలింది. మన ఉద్రేకానికి.. మెదడుకు శక్తిని అందించే గ్లూకోజే కారణమని వీరి అధ్యయనంలో తేలింది. మరి ఉద్రేకం కలగకుండా ఉండాలంటే ఏం చేయాలి..? ఇందుకు మనో నిగ్రహం కావాలి..! నిగ్రహం కావాలంటే శరీరానికి చాలా శక్తి అవసరం.. ఈ శక్తిని గ్లూకోజ్ మెదడుకు అందిస్తుంది.. ఈ గ్లోకోజ్ మెదడుకు అందితే ఉద్రేకం ఠక్కున మాయమవుతుంది. ఇదీ సంగతి..!!

     బాగా ఉద్రేకం కలిగినప్పుడు చల్లని కూల్ డ్రింక్ తాగినా కూడా తాత్కాలికంగా శక్తి లభించి.. ఇతరులపై నోరు పారేసుకోకుండా ఉండగలమని పరిశోధకులు చెబుతున్నారు. శరీరంలో గ్లూకోజ్'ను వినియోగించుకునే ప్రక్రియ దెబ్బతిన్నవారే త్వరగా ఉద్రేకాలకు లోనవుతారని.. ఇతరుల్ని క్షమించరని అధ్యయనాల్లో తేలింది..

     సో.. ఫ్రెండ్స్.. ఉద్రేకం తగ్గించుకోవడం సులభమే కదూ.. మరెందుకు ఆలస్యం..? ఉద్రేకం కలిగినప్పుడు ఓ స్పూను చక్కెర నోట్లో వేసుకోండి..!! అంతే.. u will be cool.. cool...!!


Friday, December 24, 2010

సెక్స్ అండ్ మ్యారేజ్

పెళ్లికి ముందే శృంగారంలో పాల్గొంటున్నారా..?

మస్త్'గా సెక్స్ ఎంజాయ్ చేస్తున్నారా..?

అయితే.. మీ బంధం మూణ్ణాళ్ల ముచ్చటే..!!


     "ప్రేమించి పెళ్లి చేసుకున్నాం.. కానీ లైఫ్'లో హ్యాపీనెస్ కనిపించడం లేదు.. పెళ్లికి ముందు చాలా బాగా ఉన్నాం.. కానీ మ్యారేజ్ అయిన మరుక్షణం నుంచే ఉత్సాహం తగ్గిపోయింది..".. ఇదీ పెళ్లి పక్షులుగా మారిన ప్రేమ పక్షుల అంతరంగం. ఎందుకీ పరిస్థితి..? ఎక్కడ పొరపాటు జరిగింది..? పెళ్లికి ముందు గాలి కూడా దూరనంతగా దగ్గరైన తాము.. పెళ్లి అయ్యాక ఎందుకింత గ్యాప్ వచ్చింది..?

     ప్రేమించుకున్నాం.. రేపోమాపో మ్యారేజ్ చేసుకోబోతున్నాం.. శృంగారంలో పాల్గొంటే తప్పేంటని నిష్ఠూరంగా మాట్లాడకండి.. ఎందుకంటే మ్యారేజ్ బిఫోర్ సెక్స్'కు... మ్యారేజ్ తర్వాత శృంగారానికి చాలా తేడా ఉందని చెబుతున్నాయి- అమెరికన్ అధ్యయనాలు..! ఒకరినొకరు ఇలా ఇష్టపడి.. అలా బెడ్ ఎక్కితే.. ఇక భవిష్యత్తులో మ్యారేజ్ లైఫ్ సరిగా సాగదంటూ జంటల సాక్షిగా సెలవిస్తున్నాయివి.

     పెళ్లికి ముందు సెక్స్'కు అలవాటు పడితే.. మ్యారేజ్ తర్వాత రిలేషన్ బలపడదట..! సెక్స్'కే ప్రయారిటీ ఇచ్చే జంటలు మ్యారేజ్ తర్వాత లైఫ్'లో వెనకబడుతున్నాయి. సంసారంలో ఎదురయ్యే సమస్యలను వీరు పరిష్కరించుకోలేకపోతున్నారు. శారీరకంగా కలిశాం.. మానసికంగా కలవకపోతామా.. అంటూ ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకోకుండానే పెళ్లి చేసుకోవడం వల్ల ఇలాంటి పరిస్థితులు తలెత్తున్నాయని రీసెర్చర్లు నిర్ధారించారు.

     శరీరాలే తప్ప మనసులు కలవకపోవడంతో.. పెళ్లి పెటాకులవుతోందని 2వేలకు పైగా మ్యారేజ్ అయిన వ్యక్తుల అధ్యయనంలో తేలింది. (శారీరకంగా కలిసినవారందరూ మానసికంగా కలిశారని చెప్పలేం.. కానీ మానసికంగా ఒక్కటైనవారు శారీరకంగా కలవడం సులభం).

     ప్రేమ ప్రేమ.. అంటూ ప్రేమ పక్షుల్లా తిరగండి.. ఒకరినొకరు అర్థం చేసుకోండి.. అర్థం కాకుంటే వదిలెయ్యండి. అంతేకానీ.. త్వరగా కమిటవ్వకండి.. కమిటైతే.. ఇక అంతే..! ఆ తర్వాత బాధపడక తప్పదు..!!

Thursday, December 23, 2010

3D టీవీతో తలనొప్పులు..!

     గాలి.. నీరు.. ఆహారం.. ఇవి లేకుండా ఒక్క క్షణమైనా మనిషి బతకడం కష్టం.. ఇప్పుడు ఈ జాబితాలోకి మొబైల్ ఫోన్, టీవీ కూడా చేరాయి. ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉండేవాడు భాగ్యవంతుడు.. కానీ ఇప్పుడు అట్టడుగు స్థాయి నుంచి సంపన్నవర్గాల వరకూ.. అందరి ఇళ్లలోనూ కలర్ టీవీ కామన్ అయిపోయింది. ఇక.. స్పెషల్ ఎఫెక్ట్స్ కోరుకునే వాళ్లకోసం లేటెస్ట్'గా మార్కెట్లోకి 3D టీవీలు వచ్చాయి. త్రీడీ టీవీలో దృశ్యాలు మన కళ్లముందు నిజంగా జరుగుతున్నాయా.. అన్నంతగా కనిపిస్తాయి.. దీంతో.. ప్రపంచవ్యాప్తంగా 3D టీవీల హవా కొనసాగుతోంది. మార్కెట్ విస్తరిస్తున్నకొద్దీ.. 3D టీవీల్లో ఫీచర్స్ కూడా అదిరిపోతున్నాయి. చూడ్డానికి బాగానే ఉంది సరే.. మరి ఈ 3D టీవీ సేఫేనా..? అన్న ప్రశ్న ఇప్పుడు చాలామందిలో తలెత్తుతోంది.

     సిగరెట్ ప్యాక్ మీద పొగతాగడం ఆరోగ్యానికి హానికరం అని రాసినట్లే.. 3D టీవీ బ్రోచర్స్'లో "కళ్లకు ప్రమాదం.. ముఖ్యంగా పిల్లలకు" అనే హెచ్చరిక కూడా ఉంటుంది. అయితే దాన్నెవరూ పట్టించుకునే స్థితిలో లేరు. 3D టీవీ ఎంతవరకూ సేఫ్ అనే అంశంపై నెదర్లాండ్స్'కు చెందిన ఐన్దోవెన్ యూనివర్సిటీ చేసిన పరిశోధనలు భయాందోళనలకు కలిగిస్తున్నాయి.

     3D టీవీ వీక్షకుల్లో చాలా మందికి తీవ్రమైన తలనొప్పి వస్తోందని తేలింది. దీనివల్ల బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం కూడా ఉందని యూనివర్సిటీ సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. 3D టీవీ వ్యూయర్స్ చాలామందిలో బద్దకం ఉన్నట్లు తేలింది. ఇది.. క్రమంగా సిక్'నెస్'కు దారితీసే ఛాన్స్ ఉన్నట్లు పరిశోధనలో గుర్తించారు. 3D సినిమాతో పోల్చితే.. 3D టీవీ చూడడం అనేక రెట్లు ఎక్కువ ప్రమాదమని ఈ పరిశోధన తేల్చింది. అంతేకాదు.. 3D టీవీ వీక్షకుల్లో 20 శాతం మందికి మానసిక సమస్యలతో పాటు శారీరక సమస్యలు కూడా తలెత్తినట్లు గుర్తించారు. సో.. రీడర్స్.. బివేర్ ఆఫ్ 3D TV..!!

Wednesday, December 22, 2010

చంద్రబాబు తిండి (డైట్)

      రోజూ తట్టెడన్నం, డజను రొట్టెలు, అరడజను గుడ్లు, ఇక మధ్యమధ్యలో పండ్లు గట్రా తీసుకునే నేతలు ఎంతో మంది ఉంటారు.. సకల సౌకర్యాలు, కోరుకున్నది తెచ్చిపెట్టే సిబ్బంది, తరాలకొద్దీ తిన్నా తరగని ఆస్తి చూస్తే.. ఎవరికైనా వాళ్ల మెనూ అదిరిపోతుంది అనుకోవడం సహజం.. కానీ బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్లు సైతం ఆదర్శంగా నిలిచేలా మెనూ కలిగిన నేత ఒకరున్నారు.. ఆయన మరెవరో కాదు.. మన చంద్రబాబే..! ఆయన డైట్ చూస్తే ఆశ్చర్యపోవడం ఖాయం.

చంద్రబాబు డైట్ మెనూ:

ఉదయం:
బ్రేక్'ఫాస్ట్: గుడ్డు తెల్లసొనతో వేసిన ఆమ్లెట్
              ఓ కప్పు ఓట్స్, గ్లాసు రాగి జావ..

మధ్యాహ్నం:
లంచ్: రెండు పుల్కాలు, 3 రకాల కూరలు

సాయంత్రం:
స్నాక్స్: చిన్న కప్ మిక్చర్, గ్రీన్ టీ

రాత్రి:
డిన్నర్: సీజనల్ పండ్లు, చిన్న గ్లాసు వెజ్ సూపు

     చూశారుగా.. చంద్రబాబు సీక్రెట్.. 60 ఏళ్లు దాటినా బాబు గారు అంత ఉత్సాహంగా ఉండడానికి ఈ తిండే కారణం.
ఇంతేకాదు.. ఇంకొన్ని ఆరోగ్య సూత్రాలు కూడా బాబుగారి వద్ద ఉన్నాయి.

     చంద్రబాబు ప్రతిరోజూ ఉదయం 4 గంటలకే నిద్ర లేస్తారు. 2 గంటలపాటు యోగా తదితర వ్యాయామాలు చేస్తారు. ఆ తర్వాత 6 గంటలకు న్యూస్ పేపర్లు తిరగేస్తారు. తర్వాత పైన చెప్పుకున్నట్లు లిమిటెడ్ బ్రేక్'ఫాస్ట్..
 
    పైనున్న మెనూ చూసిన వారెవరికైనా ఓ సందేహం రావడం ఖాయం. ఇంతకూ బాబుగారు అన్నమే తినరా.. అని..! ఓ.. ఎందుకు తినరు..? సండే రోజు ఆయన రైస్ తీసుకుంటారు. అది కూడా చాలా తక్కువ..! ఆదివారం మధ్యాహ్నం ఓ గరిటెడన్నం తీసుకుని.. గోరువెచ్చని నీళ్లు తాగుతారు.

     ఈ మెనూ చూసిన తర్వాత అర్థమైందా..? చంద్రబాబు నిరవధిక దీక్షకు అంత ధైర్యంగా ఎందుకు దిగారో..? బాబుగారు అన్నం తిన్నా.. తినకున్నా పెద్ద తేడా ఏం ఉండదు.. అందుకే ఆయన దీక్ష చేపట్టారు..!!

Tuesday, December 21, 2010

బెడ్'రూమ్'లో టీవీ..!!

   ప్రస్తుత కాలంలో టీవీ లేని ఇల్లు కనిపించదు.. కొందరి ఇళ్లలో ఒకటి కంటే ఎక్కువ టీవీలు కూడా ఉంటాయి. ఒకటి హాల్లో.. మరొకటి బెడ్'రూములో పెట్టుకుంటారు. అదే మీ కొంప ముంచే ప్రమాదముంది.. అవును.. పడగ్గదిలో టీవీ అంటే.. ఇక మీ సీన్ సితారే..!! హ్యాపీగా బెడ్'పై పడుకుని టీవీ చూడొచ్చని మీరనుకుంటే.. బెడ్'రూంలో మీకు కావల్సింది దొరక్క.. మీ సినిమా ట్రాజిడీ అయిపోతుందని పరిశోధనలు చెబుతున్నాయి..

     బెడ్'రూములో టీవీ సెట్ ఉన్న దంపతుల కంటే.. లేనివారే దాంపత్య మాధుర్యాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తున్నారట! ఇది ఆషామాషీగా చెబుతున్నది కాదు. పరిశోధనల్లో తేలిన కఠోర వాస్తవం. ఇటలీకి చెందిన ఓ సెక్సాలజిస్ట్ 532 జంటలపై పరిశోధనలు చేసి తేల్చిన నిజం..


     బెడ్'రూములో టీవీ సెట్ లేని కపుల్స్.. సగటున వారానికి రెండు సార్లు శృంగారంలో పాల్గొంటే.. టీవీ సెట్ ఉన్న వారు మాత్రం వారానికి ఒకసారి మాత్రమే ఆ సంతోషాన్ని అనుభవిస్తున్నారట..!! బెడ్'రూములో టీవీ సెట్ ఉన్నవారు ఎక్కువగా బాక్సింగ్ ప్రోగ్రామ్'లే చూస్తున్నారట..! యాక్షన్ ప్రోగ్రామ్స్ మీలో ఉత్సాహాన్ని నీరు గారుస్తుందట..!! దాని ప్రభావంతో శృంగారానికి దూరమవుతారని పరిశోధనలో తేలింది. ఒకవేల మీలో ఉత్సాహం ఉన్నా.. ఆ ఆనందాన్ని పొందలేకపోవచ్చు.. మీ పిల్లలు అక్కడే తిష్టవేసి మీ ఏకాంతానికి అడ్డంకి కావచ్చు.. మంచి మూడ్ ఉన్నా.. పిల్లల కోసం మీ కోరికను బలవంతంగా వాయిదా వేసుకోవాల్సి రావచ్చు..

     అంతేకాదు.. బెడ్'రూములో టీవీ ఉండడం వల్ల ప్రత్యక్షంగా.. పరోక్షంగా చాలా నష్టాలు ఉన్నాయి. ఈ రోజుల్లో నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నవారే అధికం. ఒకవేళ నిద్రపోయినా ఏవో కొద్ది గంటలే..!! బెడ్'రూములో టీవీ ఉండడం వల్ల ఆ కొద్ది నిద్రా దూరమవుతుందట..! బెడ్'పై రిలాక్స్ అయి.. టీవీ చూస్తుంటే.. ఆ సమయంలో మెదడు మొద్దుబారిపోతుందట..! అంటే.. ఆ సమయంలో మరో వ్యక్తికి దగ్గర కావడం ముమ్మాటికీ ఆసాధ్యమంటున్నారు సెక్సాలజిస్టులు..!

     ఒకవేళ బెడ్'రూములో టీవీ సెట్ లేకుండా ఉండలేకపోతే.. కనీసం కొన్ని నియమాలైనా పెట్టుకోండి.. ఇంత సేపే టీవీ చూడాలని ఖచ్చితంగా నిర్ణయించుకోండి. ఆ టైం కాగానే టీవీని ఆఫ్ చేసేయండి..

     కానీ.. రెండు అంశాల్లో మాత్రం బెడ్'రూములో టీవీ ఉంటే బెటర్ అట! మీరు రియాల్టీ షో ప్రేమికులైతే.. అవి మీలోని శృంగారాన్ని నిద్ర లేపుతాయట..! ఇక.. రొమాంటిక్ సినిమాలు చూసేటట్లయితే.. బెడ్'రూములో టీవీ ఓకే.. అంటున్నారు పరిశోధకులు..! మరి మీ బెడ్'రూములో టీవీ ఉండాలో.. వద్దో వెంటనే డిసైడ్ చేసుకోండి..!!

Saturday, December 18, 2010

డైటింగ్'తో డేంజర్..!!

ఆకలి వేస్తుంది...
వేస్తోంది కదా అని తింటే..
అమ్మో... లావైపోమూ..?
అలా తినుకుంటూ పోతే.. అందమంతా ఆవిరైపోతుంది కదా..!
స్లిమ్, సెక్సీనెస్ పోయి.. బొద్దుగా ఉంటే మనల్నెవరు చూస్తారూ..?

ఇప్పుడు చాలా మంది అమ్మాయిల్ని వేదిస్తున్న ప్రశ్నలివి.. తింటే లావైపోతాం అని కడుపు మాడ్చుకుంటున్నారు.. కాలేజ్ అమ్మాయిలే కాదు.. పెళ్లైనవారు కూడా డైటింగ్'ల మీద డైటింగ్'లు చేసేస్తున్నారు. అయితే.. ఇలా డైటింగ్ చేసేవారంతా.. పరలోకానికి తొందరగా టికెట్ బుక్ చేసుకున్నట్లే..!!

     కాస్మొపాలటన్ సిటీస్, సిటీస్, టౌన్స్.. అంతెందుకు.. పల్లెల్లో కూడా ఇప్పుడు చాలా మంది డైటింగ్ బాటపడుతున్నారు. తిండి తగ్గిస్తే కొవ్వు తగ్గుతుంది కదా అని సంబరపడిపోతున్నారు.. నకనకా మాడినా అలాగే పడుకుంటున్నారు..

     ఆకలి వేస్తే నోరారా తినాల్సిందే.. లేదంటే హార్మోన్లలో లోపాలు తలెత్తుతాయి.. డైటింగ్ పేరుతో శరీరానికి కావల్సిన కేలరీల ఆహారాన్ని తీసుకోనివారికి ఈ భూమ్మీద త్వరగా నూకలు చెల్లుతాయి. విటమిన్లు, ప్రొటీన్లు, మినరల్స్ శరీరానికి సరిపడా అందకపోతే.. హార్మోన్లలో సమతుల్యత దెబ్బతింటుంది. దాని ఫలితంగా ఎన్నో అనర్థాలను ఎదుర్కోవల్సి వస్తుంది.

     మితిమీరి డైటింగ్ చేసేవారు గుండెజబ్బుల బారిన పడతారు.. మధుమేహం, క్యాన్సర్ కూడావచ్చే ప్రమాదముంది.. అమెరికాలోని కాలిఫోర్నియా, శాన్'ఫ్రాన్సిస్కో, మిన్నెసోటా యూనివర్సిటీల పరిశోధనలో ఈ విషయం నిర్ధారణ అయింది. ఆ సర్వేలో 121 మంది మహిళల్ని పరిశీలించారు.. రోజుకి 2వేల కేలరీల ఆహారాన్ని తీసుకునేవారికి 3 వారాలపాటు రోజుకు 12వందల కేలరీల ఆహారాన్ని మాత్రమే ఇచ్చారు. ఆ 3 వారాల్లోనే వారిలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయట..!!

     డైటింగ్ చేసేవారంతా విపరీతంగా ఒత్తిడికి గురవుతున్నారని పరిశీలనలో తేలింది. మానసిక, శారీరక ఒత్తిడితో త్వరగా హార్ట్'ఎటాక్ బారిన పడుతున్నారనేది ఆ సర్వే సారాంశం. హార్మోన్లపై విపరీత ఒత్తిడి వల్ల షుగర్, క్యాన్సర్ వ్యాధుల బారిన కూడా పడుతున్నారని తేలింది.

     అంతేకాదు.. డైటింగ్ చేసేవారిలో కొంతమంది బరువు పెరిగారట కూడా..! అందుకే ఇప్పుడు ఆయా యూనివర్సిటీల డాక్టర్లు డైటింగ్'పై పునరాలోచించాలని కోరుతున్నారు.

     గ్లామర్'పై మోజు పెంచుకుంటూ డైటింగ్ చేస్తున్న లిస్ట్'లో మీరు కూడా ఉంటే తక్షణమే తిండి తినడం మొదలుపెట్టండి.. లేదంటే వైకుంఠానికి టికెట్'ను మీరే స్వయంగా తీసుకున్నట్లే..!!!

నెట్'వర్కింగ్ సైట్స్'తో తలనొప్పులు..!!

ఫేస్'బుక్'లో మెంబర్ కావాలి...

ఆర్కుట్'లో ప్రొఫైల్ అప్'డేట్ చేయాలి..

ట్విట్టర్'లో ట్వీట్ పెట్టాలి...

ఇంతేనా...?

     ఇంటర్నెట్ ద్వారా పాత ఫ్రెండ్స్ అందరినీ ఒకే ప్లాట్'ఫాంపైకి తీసుకురావాలి... అందరితో కాంటాక్ట్'లో ఉండాలి.. ప్రతి ఒక్కరికి మెసేజ్ చేయాలి.. ప్రపంచంలో ముక్కూ ముఖం తెలియని వారితో ఫ్రెండ్'షిప్ చేయాలి.. భూమ్మీద జరిగే ప్రతి గొడవపైనా మన అభిప్రాయం పంచుకోవాలి.. ఇలా ఒకసారి ఇంటర్నెట్'కు అలవాటు పడిన తర్వాత క్రమంగా చేసే పనులివే.. బాగుందనో.. ఫ్రెండ్ లింక్ పంపాడనో.. లేదా నిజంగా అవసరమని భావించో.. ఎంతో మంది సోషల్ నెట్'వర్కింగ్ సైట్స్'లో మెంబర్స్ అవుతుంటారు.

     కానీ సోషలైజేషన్ ఆరాటం.. నెటిజెన్స్'లో ఒత్తిడికి కారణమవుతోందని ఓ తాజా సర్వే తేల్చింది. ఫేస్'బుక్'లో వివరాలు త్వరగా అప్'డేట్ చేయాలని.. మెసేజ్'లకు చాలా ఫాస్ట్'గా రిప్లై ఇవ్వాలనే ఆతృతే ఇందుకు కారణం.. ఇది క్రమంగా స్ట్రెస్'కు దారితీస్తోందని ఆస్ట్రేలియాలో జరిగిన ఓ సర్వేలో తేలింది. ఈ బాధ పురుషుల కంటే మహిళల్లోనే మరింత ఎక్కువట..!!

     సర్వేలో పాల్గొన్నవారిలో 69 శాతం మంది ఆస్ట్రేలియా మహిళలు.. తాము ఫేస్'బుక్ డీటెయిల్స్ అప్'డేట్ చేయడంలో ఒత్తిడికి గురవుతున్నామని చెప్పారు. 39 శాతం పురుషులదీ ఇదే బాధ.. ఇక తమ స్ట్రెస్'కు సోషల్ సైట్సే కారణమని 63 శాతం మంది చెప్పారు. అలాగే ఎప్పటికప్పుడు కాంటాక్ట్'లో ఉండాల్సిన కంపల్సరీ పరిస్థితిలో ఉన్నామని 33 శాతం మంది తెలిపారు. ఎప్పటికప్పుడు మెసేజ్'లు చెక్ చేసుకోకపోతే ఏదో వెనకబడిపోయిన ఫీలింగ్ కలుగుతోందని చెప్పినవారు కూడా ఉన్నారు. అంతేకాదు.. ఎంట్రీలు గొప్పగా, క్రియేటివ్'గా ఉండాలని జుట్టు పీక్కుని టైంవేస్ట్ చేయడం.. ఇది మళ్లీ ఒత్తిడికి దారితీయటం కూడా కామన్'గా మారిపోయిందట..!

     అంతే మరి..! అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు. ఏదో సరదాగా అందరితో కాంటాక్ట్'లో ఉండేందుకు సోషల్ నెట్'వర్క్ సైట్లు వాడుకుంటే ఫరవాలేదు కానీ అదే లోకమైతే తలనొప్పులు తప్పవ్..!!!

Friday, December 17, 2010

వామ్మో.. తాజ్'మహల్..!!

     తాజ్'మహల్ ఒక్కసారి కూడా చూడలేదా..? అయితే వెంటనే ఆగ్రా వెళ్లి తాజ్ అందాలు తనివితీరా చూసేయండి.. లేకుంటే ముందు ముందు మీకా అవకాశం ఉండకపోవచ్చు.. అది సామాన్యులకు అందనంత ఎత్తులకు ఎదిగిపోతోంది మరి..

     అందాల తాజ్'మహల్ సందర్శన సామాన్యుడికి కలలో మాట కానుంది. ఒక్క తాజ్'మహల్ మాత్రమే కాదు.. ఈజిప్ట్'లోని గిజా పిరమిడ్స్, ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా.. అడుగడుగునా పిల్లకాలువలతో కనిపించే వెనిస్ నగరం.. ఇలాంటి ప్రపంచ వింతలను చూడాలంటే పెట్టి పుట్టాలి.. అవును..! ఇది నిజం..!!

    ప్రతిరోజూ వేల సంఖ్యలో వచ్చే పర్యాటకులు తాజ్'మహల్ వంటి కట్టడాల్లోకి దూసుకుపోతున్నారు. ఫోటోలు తీసుకుంటే ఫరవాలేదు.. తినుబండారాలు, కూల్'డ్రింక్'ల వ్యర్థాలతో చారిత్రక కట్టడాల ప్రాంగణాలను నింపేస్తున్నారు. వేల సంఖ్యలో వచ్చే పర్యాటకులు, వారి వాహనాలు.. లాంటి వాటితో చారిత్రక కట్టడాల ప్రాంగణాలు కుంగిపోతున్నాయట.! ఇది ఇలాగే కొనసాగితే మాస్ టూరిజం బారినపడి మన హెరిటేజ్ సైట్స్ మరో 20 ఏళ్లలో కుప్పకూలడం ఖాయమని అంతర్జాతీయ పురావస్తు శాస్త్రజ్ఞులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

     ప్రాచీన కట్టడాలను పరిరక్షించాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని వారు చెబుతున్నారు. ఇందులో భాగంగానే.. తాజ్'మహల్ వంటి వరల్డ్ హెరిటేజ్ సైట్ల సందర్శనకు.. టికెట్ ధరను భారీగా పెంచాలని సూచిస్తున్నారు. బ్రిటన్ వంటి దేశాల్లో.. ఇప్పటికే బస్సులు, రైళ్ల వంటి ప్రజాప్రయాణ సాధనాల్లో వచ్చిన టూరిస్టులను మాత్రమే ప్రాచీన కట్టడాల దగ్గరికి అనుమతిస్తున్నారు.
    
     మరి... ఇక తాజ్'మహల్'ను ఇక చూడలేమా..? అంటే.. చూడొచ్చు. భారీ మొత్తం పెట్టి టికెట్టు కొనలేని సామాన్య పర్యాటకులకోసం.. ప్రాచీన కట్టడాలకు కాస్త దూరంలో ప్లాట్'ఫారంలను ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచి మాత్రమే వాటిని చూడాల్సి ఉంటుంది. ఇక.. టికెట్టు కొన్నవారిని మాత్రం లోపలికి అనుమతిస్తారు. అడుగడుగూ చూడనిస్తారు.
    
     సో.. తాజ్'మహల్ కాస్ట్'లీగా మారకముందే.. ఓ సారి వెళ్లి చూసిరండి.. లేకుంటే వాహ్ తాజ్.. బదులు... వామ్మో తాజ్ అనాల్సి వస్తుంది...!!

Thursday, December 16, 2010

జేపీసీ అంటే...?


     ప్పుడు దేశవ్యాప్తంగా 2G స్పెక్ట్రమ్ కుంభకోణం సంచలనం సృష్టిస్తోంది. దీనిపై జేపీసీ వేయాల్సిందేనంటూ కేంద్రంలో ప్రతిపక్షం ముక్తకంఠంతో కోరుతోంది. ఇందుకు యూపీఏలోని మమతా బెనర్జీ లాంటి వాళ్లు కూడా మద్దతు పలుకుతున్నారు. అయినా యూపీఏ ప్రభుత్వం మాత్రం ససేమిరా అంటోంది. మన్మోహన్ సర్కార్'కు జేపీసీ అంటే ఎందుకింత భయం..? ప్రతిపక్షాలు జేపీసీ కోసమే ఎందుకు పట్టుబడుతున్నాయి..? అసలు జేపీసీ అంటే ఏంటి?
జేపీసీ అంటే...
     ఓ నిర్దిష్ట అంశంపై విచారణ జరిపేందుకు ఉభయ సభల్లో ఏసభలోనైనా ఓ తీర్మానం ఆమోదించి, మరో సభ కూడా దానికి ఆమోదం తెలిపితే జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ ఏర్పడుతుంది. ఉభయ సభల ప్రిసైడింగ్‌ ఆఫీసర్లు (స్పీకరు, ఉపరాష్టప్రతి) చర్చించి కూడా ఈ కమిటీని ఏర్పాటు చేసే వీలుంది. ఈ కమిటీల సభ్యులను ఆయా సభలు ఎన్నుకోవచ్చు లేదా ప్రిసైడింగ్‌ ఆఫీసర్లు (స్పీకరు, ఉపరాష్టప్రతి) నామినేట్‌ చేయవచ్చు.ఇతర పార్లమెంటరీ కమిటీల విషయానికి వస్తే, అవి వివిధ గ్రూప్‌ల నుంచి రూపుదిద్దుకుంటాయి. జేపీసీలో సభ్యుల సంఖ్య కూడా సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఒక జేపీసీలో 15 మంది సభ్యులే ఉంటే మరో దానిలో 30 మంది ఉంటారు. రాజ్యసభ నుంచి కమిటీలో ఉండే సభ్యుల కంటే కూడా రెట్టింపు సంఖ్యలో లోక్‌సభ నుంచి సభ్యులు ఉంటారు.

     జేపీసీ తన విచారణకు ముగించేందుకు ముందే లోక్‌సభ కాలపరిమితి ముగిసిపోతే.... లోక్‌సభ కాలపరిమితి ముగిసే లోగా లేదా అది రద్దు అయ్యే లోగా ఓ కమిటీ తన పనిని పూర్తి చేయలేకపోతే, అదే విషయాన్ని అది సభకు తెలియజేస్తుంది. అలాంటి సందర్భాల్లో అప్పటి వరకూ అది తయారు చేసిన ప్రాథమిక నివేదిక, మెమొరాండమ్‌ లేదా నోట్‌ను తదుపరి కమిటీకి అందుబాటులో ఉంచుతారు.


జేపీసీ అధికారాలేంటి....
     నిపుణులు, ప్రభుత్వ సంస్థలు, సంఘాలు, వ్యక్తులు లేదా ఆ అంశంపై ఆసక్తి గల వర్గాల నుంచి సుమోటోగా లేదా ఆయా వర్గాల అభ్యర్థన మేరకు సాక్ష్యాలను సేకరిం చే అధికారం జేపీసీకి ఉంది. తన ముందు హాజరు కావా ల్సిందిగా సమన్లు జారీ చేసే అధికారం జేపీసీకి ఉంది. కమిటీ ముందు హాజరుకావడంలో ఓ సాక్షి విఫలమైతే అది సభాఉల్లంఘన కిందకు వస్తుంది. నోటిమాటగా లేదా లిఖితపూర్వకంగా జేపీసీ ఆయా సాక్ష్యాలను సేకరించవ చ్చు. తన పరిశీలిస్తున్న నిర్దిష్ట అంశానికి సంబంధించిన డాక్యుమెంట్ల కోసం ఆయా విభాగాలను కోరవచ్చు. సాధారణంగా పార్లమెంటరీ కమిటీల ప్రొసీడింగ్స్‌ అన్నీ గోప్యంగా ఉన్నప్పటికీ, జేపీసీ తీరు మాత్రం అలా కాదు. సాధారణంగా ఇవి ఎంతో సంచలనాత్మకమైన అంశాలపై ఏర్పడినందున, వీటి పనితీరుపై ప్రజల్లో ఎంతగానో ఆసక్తి ఉన్నందున కమిటీ పనితీరుపై చైర్మన్‌ ఎప్పటికప్పుడు మీడి యా సమావేశాల్లో వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది.

మంత్రులనూ పిలిచే అధికారం...
     సాక్ష్యం ఇవ్వాల్సిందిగా సాధారణంగా మంత్రులను ఆయా పార్లమెంటరీ కమిటీలు పిలువవు. సెక్యూరిటీలు, బ్యాంకింగ్‌ లావాదేవీల్లో అవకతవకలకు సంబంధించిన ఉల్లంఘనల విషయానికి వస్తే మాత్రం ఈ సంప్రదాయా నికి కూడా మినహాయింపు ఉంది. స్పీకరు అనుమతితో, నిర్దిష్ట అంశాలపై సమాచారం కోరవ చ్చు. అంతేగాకుండా ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రులను తన ముందు హాజరు కావాల్సిందిగా ఆదేశించవచ్చు. 

స్పీకరుదే తుది నిర్ణయం
     దేశ ప్రయోజనాలకు భంగకరమని భావించినప్పుడు ఏదైనా అధికారిక పత్రాన్ని సమర్పించడాన్ని ప్రభుత్వం నిలిపివేయవచ్చు లేదా తిరస్కరించవచ్చు. ఓ వ్యక్తిని సాక్ష్యం కోసం పిలవడంలో, ఓ డాక్యుమెంట్‌ సమర్పణలో తుది నిర్ణయం మాత్రం స్పీకరుదే.

ఇప్పటి వరకూ ఎన్ని జేపీసీలు?

     ఇప్పటి వరకూ నాలుగు జేపీసీలు మాత్రమే ఏర్పాటయ్యాయి. 

1. మొట్టమొదటి జేపీసీ బోఫోర్స్‌పై విచారణకు ఏర్పడింది. నాటి రక్షణ మంత్రి కేసీ పంత్‌ ఈ తీర్మానాన్ని 1987 ఆగస్టు6న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఓ వారం తరువాత రాజ్యసభ కూడా దీనికి ఆమోదం తెలిపింది. ఈ కమిటీకి బి.శంకరానంద్‌ నేతృత్వం వహించారు. 50 సిట్టింగులు జరిగాయి. 1988 ఏప్రిల్‌ 26న ఈ కమిటీ తన నివేదికను సమర్పించింది. కాంగ్రెస్‌ ఎంపీలతో కమిటీని నింపివేశారని ఆరోపిస్తూ విపక్షం ఈ కమిటీని బహిష్కరించింది. జేపీసీ నివేదికను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టినప్పటికీ, విపక్షం దాన్ని తిరస్కరించింది.

2. రెండో జేపీసీని హర్షద్‌ మెహతా కుంభకోణం రట్టయినప్పుడు ఏర్పాటు చేశారు. సెక్యూరిటీలు, బ్యాంకింగ్‌ లావాదేవీల్లో అవకతవకలపై విచారణ దీని ప్రధాన ఉద్దేశం. దీనికి కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు రామ్‌ నివాస్‌ మీర్థా నేతృత్వం వహించారు. కమిటీ ఏర్పాటుకు సంబంధించిన తీర్మానాన్ని 1992 ఆగస్టు6న లోక్‌సభలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ అప్పటి మంత్రి గులామ్‌ నబీ అజాద్‌ ప్రవేశపెట్టారు. మరుసటి రోజే రాజ్యసభ దీన్ని ఆమోదించింది. ఈ జేపీసీ సిఫారసులను పూర్తిగా ఆమోదించలేదు లేదా ఆచరించలేదు.

3. మూడో జేపీసీని స్టాక్‌ మార్కెట్‌ కుంభకోణంపై పరిశీలనకు 2001లో ఏర్పాటు చేశారు. 2001 ఏప్రిల్‌ 26న పార్లమెంటరీ వ్యవహారాల శాఖ నాటి మంత్రి ప్రమోద్‌ మహాజన్‌ లోక్‌సభలో ఈ తీర్మానం ప్రవేశపెట్టారు. బీజేపీ సీనియర్‌ సభ్యుడు లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ (రిటైర్డ్‌) ప్రకాష్‌ మణి త్రిపాఠి దీనికి నేతృత్వం వహించారు. 105 సార్లు కమిటీ సమావేశమైంది. 2002 డిసెంబర్‌ 19న కమిటీ తన నివేదికను సమర్పించింది. స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణలో పెను మార్పులను ఈ కమిటీ సూచించింది. 

4. నాలుగో జేపీసీని 2003 ఆగస్టులో ఏర్పాటు చేశారు. శీతల పానీయాలు, పళ్ళరసాలు, ఇతర పానీయాల్లో క్రిమిసంహారకాల అవశేషాలు, సురక్షిత ప్రమాణాలను పరిశీలించేందుకు ఇది రూపుదిద్దుకుంది. ఎన్‌సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ దీనికి నేతృత్వం వహించారు. కమిటీ 17 సార్లు సమావేశమైంది. తన నివేదికను 2004 ఫిబ్రవరి 4న కమిటీ సమర్పించింది. శీతలపానీయాల్లో క్రిమిసంహారకాల అవశేషాలు ఉన్నట్లు కమిటీ ధ్రువీకరించింది. తాగునీటి సురక్షిత ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేయాల్సిందిగా సూచించింది. 

Tuesday, December 14, 2010

వీళ్లకా మనం ఓటేసింది?

     దైనా ఊరిలో కావచ్చు.. వీధిలో కావచ్చు.. ఇద్దరు వ్యక్తులు కొట్లాడుకుంటుంటే చూస్తున్న జనం వారిని సముదాయించేందుకు ప్రయత్నిస్తారు. పోట్లాడుకుంటున్నవారు కూడా ఆ క్షణంలో ఆవేశంతో ఏదైనా మాటకు మాట అనుకొని ఉండొచ్చు.. కానీ ఆ సంఘటన నుంచి కాస్త తేరుకున్న తర్వాత అలా జరిగి ఉండకపోయి ఉంటే బాగుండేది అని తప్పకుండా అనుకుంటారు. అలాగే.. వీధిలో అంతమంది ముందు.. తాను అలా చేయడం అవమానం కింద భావిస్తారు. చొక్కాలు చించుకుని, జుట్టు పట్టుకున్న తాను.. తెల్లవారితే వీధిలో తలెత్తుకు తిరిగేదెట్లా అని మథన పడతారు..

     కానీ.. మన ప్రజా ప్రతినిధులకు మాత్రం ఇలాంటి సిగ్గూ, లజ్జా ఏమీ ఉండవు.. టీవీ కెమెరాల ముందు ఎంత ఎక్కువ తిట్టుకుంటే అంత పబ్లిసిటీ.. ఇక చొక్కాలు చించుకుంటే.. రోజంతా వార్తల్లో ఉండొచ్చు. తెల్లారితే పేపర్ల నిండా తమ ఫోటోలు చూసి మురిసిపోవచ్చు. ఎవరేమనుకుంటే నాకేంటి..? తను టీవీలో, పేపర్లో వచ్చామా..? లేదా? అనేదే తనకు ముఖ్యం..

     అసెంబ్లీలో మన ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారా..? ఏంటి ఆ ఆవేశకావేశాలు.? వ్యక్తిగత విమర్శలు, సూటిపోటి మాటలు.. నువ్వెంత అంటే నువ్వెంత అనుకోవడాలు..!! ఛీ..ఛీ.. వీళ్లు మన ఎమ్మెల్యేలు అని చెప్పుకోవడానికే సిగ్గేస్తోంది. టీవీలో అసెంబ్లీ సమావేశాలు ప్రత్యక్ష ప్రసారమవుతున్నాయనే కదా.. వీళ్లిలా రెచ్చిపోయేది..? లేకుంటే ఒక మామూలు మనిషిలా.. ఎదుటి వ్యక్తిపై ఇలాంటి మాటలు మాట్లాడుతారా..? పేరుకేమో ప్రజా సమస్యలపై చర్చ.. కానీ.. అక్కడ జరిగేదంతా వ్యక్తిగత పరువు-ప్రతిష్టల పోటీ..!! అధికార, ప్రతిపక్షాలు ఒకరినొకరు విమర్శించుకోవడానికే సరిపోతోంది కానీ.. ఎక్కడ జరుగుతోంది చర్చ..? ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం.. నాడు అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాల వల్లే ఇప్పుడిలా జరుగుతోందని అధికారపక్షం... అప్పుడు మేం తప్పుచేశాం సరే... ఇప్పుడు మీరేం చేస్తున్నారని ప్రతిపక్షం.. ఇలా పరస్పర ఆరోపణలకే కాలం గడిచిపోతోంది.

     ప్రతిపక్షం గట్టిగా మాట్లాడితే వాళ్లను సస్పెండ్ చేయడం.. సభ నుంచి బయటకు పంపేయడం.. తమ పని కానిచ్చుకోవడం అధికార పక్షానికి అలవాటు.. ఇక.. ప్రతిపక్షం తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్నట్లు.. సభలో తాము చెప్పిందే జరగాలని పట్టుబట్టడం.. సస్పెండ్ కావడం కామన్..! సస్పెండ్ అయిన తర్వాత మార్షల్స్'తో చిన్నపాటి యుద్ధం, చొక్కాలు చించుకోవడం, బయటకు వచ్చి మీడియా ముందు చిరిగిన చొక్కాలతో తామేదో ఘనకార్యం చేసినట్లు అధికార పక్షంపై తిట్లదండకం విప్పడం ప్రతిపక్ష సభ్యులకు అలవాటుగా మారింది.

     ఒకసారి మన ప్రజాప్రతినిధులందరూ అంతర్మథనం చేసుకుంటే బాగుంటుంది.. అసెంబ్లీ ముగిసిన తర్వాత ఏరోజుకారోజు తాను తన నియోజక వర్గ ప్రజలకోసం ఏదైనా మేలు చేశానా.. అని ప్రతి ఎమ్మెల్యే తనను తాను ప్రశ్నించుకుంటే బాగుంటుంది..! తన అంతరాత్మకు సమాధానం చెప్పుకుంటే చాలు.. అంతకుమించి ప్రజలెవరకూ ఎమ్మెల్యే నుంచి మంచి ఆశించరు..!! ఓట్లేసి అసెంబ్లీకి పంపామని బాధపడటం తప్ప..!! మీరు మాకు మంచి చేయకపోయినా ఫరవాలేదు.. కానీ మా పేరు చెప్పుకుని మీ పబ్బం గడుపుకోవడానికి మాత్రం ప్రయత్నించకండి.. ప్లీజ్..!!!

Saturday, December 11, 2010

ఆటోవాడి మోసాలు - పార్ట్ 2

     హైదరాబాద్ లో ఆటోవాళ్ల మోసాలు అన్నీ ఇన్నీ కావు. ఓసారి మా ఫ్రెండ్ దిల్'సుఖ్ నగర్ నుంచి లక్డీకపూల్ వెళ్లాలి. సరే అనే రోడ్డుపైన నిల్చుంది. ఒకటి రెండు ఆటోలు ఆపితే.. వాళ్లు ఆగకుండా వెళ్లిపోయారు. చివరకు ఒకడు  ఆపాడు. తను అడగ్గానే లక్డీకపూల్ వచ్చేందుకు సరేనన్నాడు. సరే అని ఎక్కి కూర్చుంది. మీటర్ చూస్తే.. అప్పటికే అది ఆన్'లో ఉంది. మీటర్ మళ్లీ ఆన్ చేయండి అని వెంటనే అడిగింది. అతడు ఓసారి మీటర్ వైపు చూసి.. మేడమ్ ఇప్పడు మీటర్ 40 రూపాయలు అయింది. మీరు దిగేటప్పుడు ఈ 40 రూపాయలు మైనస్ చేసి ఇవ్వండి అన్నాడు. కొంచెం తటపటాయిస్తూనే మా ఫ్రెండ్ సరేనంది. లక్డీకపూల్ వెళ్లేసరికి మీటర్ 120 రూపాయలు దాటింది. దిగేటప్పుడు వంద రూపాయల నోటు ఇచ్చింది. 120లో 40 రూపాయలు తీసేస్తే 80 రూపాయలు అవుతుంది.. మిగిలిన 20 రూపాయలు ఇవ్వు.. అని అంది..

     కానీ.. ఆటోవాడు రివర్స్ అయ్యాడు. మీటర్ 120 రూపాయలు అయింది. మీరే ఇంకా 20 రూపాయలు ఇవ్వాలి అన్నాడు. మా ఫ్రెండ్ ఖంగుతింది. అదేంటి.. నువ్వే కదా 40 రూపాయలు పట్టుకుని మిగిలింది ఇవ్వు అన్నావ్ అని గట్టిగా అడిగింది. ఎంతసేపు వాదించినా.. ఎంతగట్టిగా గద్దించినా ఉపయోగం లేకపోయింది. చుట్టుపక్కల అందరూ ఆటోవాళ్లే..! వాళ్లు కూడా ఆటోవాడికి సపోర్ట్'గానే మాట్లాడారు. మీటర్ ఎంతయిందో అంతా ఇచ్చేయండి మేడమ్ అన్నారు. తను స్టోరీ అంతా చెప్పినా కూడా సదరు ఆటోవాలాలు నమ్మలేదు. దీంతో.. చేసేదేం లేక.. 20 రూపాయలు సమర్పించుకుని.. తిట్టుకుంటూ ఆఫీస్'కు వెళ్లింది..

     చూశారుగా..! ఇది ఇంకో రకం ఆటోవాడి మోసం.. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. మన జేబు ఎలా ఖాళీ చేయాలో హైదరాబాద్ ఆటోవాలాలకు తెలిసినంతగా మరెవరికీ తెలియదేమో..! బీ కేర్'ఫుల్ ఫ్రెండ్స్..!!!

Saturday, December 04, 2010

ఆటో ఎక్కుతున్నారా..? ఓసారి ఆలోచించండి..!!

     హైదరాబాద్ లో ఆటో ఎక్కాలంటేనే భయమేస్తోంది. ఇదేంటి.. ఆటో ఎక్కడానికి ఆడవాళ్లు భయపడాలికానీ.. మగవాడివై ఉండి నీకెందుకు భయం అనుకుంటున్నారా..? కానీ నా అనుభవం వింటే మీరు కూడా ఆటో ఎక్కాలంటే ఓసారి తప్పకుండా ఆలోచిస్తారు..

     సుమారు ఆరేడు నెలల క్రితం సంఘటన ఇది. మార్నింగ్ షిఫ్ట్ డ్యూటీ కాగానే ఆఫీస్ నుంచి బయటకు వచ్చా.. (మా ఆఫీస్ ఖైరతాబాద్ లో ఉంది.) అక్కడి నుంచి హిమాయత్ నగర్ లో ఉంటున్న మా ఫ్రెండ్ ను కలిసేందుకు బయలుదేరా.! ఖైరతాబాద్ లో రోడ్డు దాటి ఆటోస్టాండ్ దగ్గరికి వెళ్లా.. హిమాయత్ నగర్ కు వస్తావా అని అడిగా.. వాడు అడ్డంగా తలూపి వెళ్లిపోయాడు. ఇంకొకడి దగ్గరికి వెళ్లా.. వాడు హిమాయత్ నగర్ అనగానే Sixty rupees అని ఠక్కున అనేశాడు. నేను మీటర్ లేదా అని అడిగా..! ఉంది సార్ అన్నాడు. మరి మీటర్ రేటు ఇస్తాను.. ఇష్టముంటే రా.. లేకుంటే వద్దు అని చెప్పాను. వాడు కాసేపు ఊ....ఆ.. అని సరేనన్నాడు.. ఆటో ఎక్కగానే మీటర్ వేశాడు.
  
     కాసేపట్లోనే ఆటో హిమాయత్ నగర్ చేరుకుంది. మీటరు 36 రూపాయలు అయింది. సరే.. 40 రూపాయలు తీసుకో అంటూ.. ఆటో దిగుతుండగానే hundred rupees change ఉందా... అని అడిగా.. ఉంది సార్.. అన్నాడు. సరే అని పర్స్ లో నుంచి hundred rupees తీసి ఇచ్చా.. నేను పర్సు వైపు చూస్తూ.. దాన్ని మడిచి ప్యాంటు జేబులో పెట్టుకున్నా..
సరే ఛేంజ్ ఇస్తాడు కదా అని వెయిట్ చేస్తున్నా... కానీ వాడు రివర్స్ లో నాకు షాక్ ఇచ్చాడు.. సర్.. పైసా దే.. అని ఉర్దూలో అన్నాడు.. అదేంటి.. hundred rupees ఇచ్చాను కదా.. అన్నాను.. నై సర్.. పైసా దే... అన్నాడు..
  
     ఒక్కసారిగా నాకు దిమ్మ తిరిగిపోయింది. ఇదేంటి ఇప్పుడే కదా hundred rupees తీసి ఇచ్చాను.. అనుకున్నా..! నాకు వెంటనే అర్థమయింది.. వీడు నన్ను మోసం చేస్తున్నాడని... వెంటనే నేను కూడా రివర్స్  అయ్యా... ఏంటి తమాషా చేస్తున్నావా...? పద పోలీస్ స్టేషన్ కి... అంటూ.. కాస్త ఫోర్స్ గా వాడిపైకి వెళ్లా... అంతలో వాడికి రైట్ సైడ్ కాలి దగ్గర hudred rupees note కనిపించింది.. తీ.. అక్కడ కనిపిస్తున్న hundred rupees తీ.. అన్నాను.. ఇదేంటి.. తమాషా చేస్తున్నావా... అని ఆ hundred rupees తీసుకున్నా..

     అప్పటికే చాలా మంది మా వాగ్వాదం చూసి అక్కడ గుమికూడారు.. వాళ్లలో ఒకాయన hundred rupees కి ఛేంజ్ ఇచ్చారు.. మీటర్ రేటు 36 రూపాయలు మాత్రమే వాడికిచ్చా..! అంతసేపూ తెలుగులో మాట్లాడుతూ వచ్చిన ఆటోవాడు.. ఒక్కసారిగా తెలుగు రానట్లు నటించాడు.. ఉర్దూ తప్ప ఒక్క తెలుగు ముక్క కూడా మాట్లాడలేదు.. నాతోపాటు అక్కడున్నవారంతా ఆటోవాణ్ని నానా మాటలు అన్నారు.. ఇదీ నా స్వానుభవం.. అప్పటి నుంచి అటో ఎక్కుతున్న ప్రతిసారి ఈ సంఘటన మదిలో మెదలుతుంది..

     నాలాంటివాళ్లెందరికో హైదరాబాద్ లో ఇలాంటి సంఘటనలు ఎదురయి ఉంటాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. ఆటోవాడి ముందు అమాయకుడిగా కనిపించినా.. వాళ్లు నిట్టనిలువునా ముంచేయడం ఖాయం.. కానీ అందరు ఆటోవాళ్లు ఇలాంటి వాళ్లే అని నేను చెప్పడం లేదు.. అక్కడక్కడా మంచివాళ్లు కూడా ఉంటారు. ఇబ్బందల్లా.. ఇలాంటి జాదూగాళ్లవల్లే.. !  సో.. ఫ్రెండ్స్... ఆటో ఎక్కేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి.. ఎక్కేముందే.. సరిపడా చిల్లర జేబులో ఉంచుకుంటే మంచింది.. డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా వేరే వ్యాపకాలు లేకుండా వాడివైపు చూస్తూనే ఉండండి...! నా అనుభవం మీకు ఎదురు కాకూడదని ఆశిస్తున్నాను...

(ఆటోవాడి మోసాల్లో మరొక టైపును తర్వాతి పోస్టులో చూడండి..)
(మీకు కూడా ఇలాంటి సంఘటనలు ఎదురై ఉండొచ్చు. మీకిష్టమైతే వాటిని షేర్ చేసుకోండి.. కొందరికైనా మేలు జరుగుతుంది..)

Friday, December 03, 2010

వై.ఎస్.కోటకు బీటలు..!!

     కాంగ్రెస్‌ పార్టీకి.. ముఖ్యంగా వై.ఎస్.కుటుంబానికి పులివెందుల కంచుకోట..! కానీ ఇప్పుడు వై.ఎస్.కుటుంబంలో కలతలు రేగడంతో.. వర్గపోరుకు ఆజ్యం పోసినట్లైంది.. 4 దశాబ్దాలుగా పులివెందులలో వై.ఎస్.ఫ్యామిలీదే పెత్తనం..! వీరికి ఎదురు నిలిచినవారందరూ ఓడిపోయారు. అటు కడప పార్లమెంట్‌ నియోజకవర్గంపైనా పులివెందుల ఆధిపత్యమే కొనసాగుతోంది.. కానీ ఇప్పుడు సీన్‌ రివర్స్‌ కాబోతోంది..

పులివెందుల కోటకు బీటలు వారాయి.. బాబాయ్‌ వివేకా.. అబ్బాయ్‌ జగన్‌ల మధ్య పొడసూపిన విభేదాలు కడప జిల్లా రాజకీయాలను మలుపు తిప్పబోతున్నాయి.. ఇన్నాళ్లూ పులివెందుల, కడప పార్లమెంట్‌ నియోజకవర్గాలు వై.ఎస్.ఫ్యామిలీ కంచుకోటలుగా ఉన్నాయి..

వై.ఎస్.ఫ్యామిలీ రాజకీయ చరిత్ర: 
1978లో తొలిసారిగా వై.ఎస్.కుటుంబం రాజకీయాల్లోకి ఎంటరైంది. పులివెందుల నుంచి తొలిసారి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
1983లో కూడా వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు.. 
1985లో వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో ప్రస్తుత జడ్పీ ఛైర్‌పర్సన్‌ జ్యోతిరెడ్డి భర్త సదాశివరెడ్డిపై పోటీ చేసి మూడోసారి ఎమ్మెల్యేగా వై.ఎస్. ఎన్నికయ్యారు..
1989లో వై.ఎస్.వివేకానంద రెడ్డి రాజకీయాల్లోకి ప్రవేశించారు. అన్న వై.ఎస్.రాజశేఖరరెడ్డి కడప పార్లమెంట్ స్థానానికి పోటీ చేయడంతో.. వివేకా ఎమ్మెల్యే బరిలో నిలిచారు. సదాశివరెడ్డిపై పోటీచేసిన గెలిచిన వివేకా తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
1989లోనే వై.ఎస్.రాజశేఖరరెడ్డి కడప పార్లమెంట్‌ స్థానం నుంచి.. టీడీపీ అభ్యర్థి ఎం.వి.రమణారెడ్డిపై గెలుపొంది పార్లమెంట్‌లో అడుగు పెట్టారు.
1991లో జరిగిన ఎన్నికల్లో వివేకానంద దూరంగా ఉండిపోయారు. వై.ఎస్.చిన్నాన్న పురుషోత్తం రెడ్డి.. టీడీపీ అభ్యర్థిని ఓడించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
అదే ఏడాది జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో వై.ఎస్. రెండోసారి కడప నుంచి ఎంపీగా గెలుపొందారు..
అలాగే.. 1996, 1998లలో కూడా వై.ఎస్.రాజశేఖరరెడ్డి.. టీడీపీ అభ్యర్థి కందుల రాజమోహన్‌ రెడ్డిపై పోటీచేసి ఎంపీగా గెలిచారు..
1994లో మళ్లీ వివేకా ఎంటరయ్యారు. టీడీపీ అభ్యర్థి రామమునిరెడ్డిపై పోటీచేసి.. పులివెందుల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
ఆ తర్వాత 1999, 2004, 2009లలో వై.ఎస్.రాజశేఖరరెడ్డి పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
వై.ఎస్.మరణానంతరం ఆయన సతీమణి విజయమ్మ ఏకగ్రీవంగా పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు.
2004లో కడప పార్లమెంట్‌ స్థానం నుంచి వివేకానందరెడ్డి.. టీడీపీ అభ్యర్థి మైసూరారెడ్డిని ఓడించారు..
2009లో వై.ఎస్.జగన్మోహన్‌ రెడ్డి టీడీపీ అభ్యర్థి పాలెం శ్రీకాంత్‌రెడ్డిపై గెలిచి తొలిసారి ఎంపీ అయ్యారు.
మారిన సీన్..!

1978నుంచి పులివెందుల, కడప పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో వై.ఎస్. ఏం చెప్తే అదే జరుగుతోంది.. కానీ ఇప్పుడు సీన్‌ మారింది. వై.ఎస్.కుటుంబం చీలిన నేపథ్యంలో వర్గపోరుకు తెరలేచింది. ఈ వర్గపోరు.. కేవలం పులివెందులకే పరిమితం కాదని.. కడప జిల్లావ్యాప్తంగా దీని ప్రభావం ఉంటుందనేది సుస్పష్టం.
     అధిష్టానం ఆదేశిస్తే.. జగన్‌పై పోటీ చేసేందుకైనా సిద్ధమన్న వివేకా.. అబ్బాయిపై కయ్యానికి కాలు దువ్వారు. పులివెందులతోపాటు కడప పార్లమెంట్‌ నియోజకవర్గంలోని కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, బద్వేలు తదితర ప్రాంతాల్లో వివేకాకు సత్సంబంధాలు ఉన్నాయి. అదే ఇప్పుడు ఆయన బలం..!
జగన్ వ్యాపారలావాదేవీల్లో బెంగళూరులో బిజీగా ఉన్నప్పుడు.. వై.ఎస్.హైదరాబాద్‌లో రాష్ట్రరాజకీయాల్లో మునిగి తేలుతున్నప్పుడు.. జిల్లా వ్యవహారాలన్నీ వివేకానే చక్కదిద్దేవారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల నేతలతో ఆయనకు పరిచయాలు ఉన్నాయి. జగన్‌ విభేదించి బయటకు రావడానికి ఇది కూడా ఓ కారణం. సో... కడప రాజకీయాలను ఇకముందు వై.ఎస్.ఫ్యామిలీ ముందు.. ఆ తర్వాత.. అని చెప్పుకోవాల్సి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.. 

Tuesday, November 30, 2010

నిలువునా చీలిన వై.ఎస్.ఫ్యామిలీ..!

    రిత్ర పునరావృతమవుతుందేమో అనిపిస్తోంది.. అవును..! ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డిని విభేదించి.. బాబాయి వై.ఎస్.వివేకానంద రెడ్డి బయటకు వచ్చేశారు. ఇన్నాళ్లూ ఒకేతాటిపై నడిచిన వై.ఎస్.ఫ్యామిలీ ఇప్పుడు నిట్టనిలువునా చీలిపోయింది. అబ్బాయ్ నుంచి బాబాయ్ ని విడదీయడంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పూర్తిగా సక్సెస్ అయింది. జగన్ ను కలిసిన తర్వాత కూడా పార్టీకే పూర్తి విధేయత ప్రకటించిన వివేకానంద రెడ్డి.. కాంగ్రెస్ పార్టీలో లీడర్ అనిపించుకున్నారు.


వివేకా ఎందుకు దూరమయ్యారు.?
     వాస్తవానికి వై.ఎస్.వివేకానందరెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి మధ్య వై.ఎస్.ఆర్. ఉన్నకాలంలోనే మనస్ఫర్థలు ఉన్నాయనే ఊహాగానాలు వినిపించాయి. వై.ఎస్.ఆర్. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంపీగా ఉన్న వివేకా చేత రాజీనామా చేయించి.. తాను ఎంపీ కావాలని జగన్ పట్టుబట్టారు. అయిష్టంగానే వివేకా రాజీనామా చేసినా.. అధిష్టానం అంగీకరించకపోవడంతో జగన్ కోరిక నెరవేరలేదు. అప్పుడే బాబాయ్-అబ్బాయ్ మధ్య విభేదాలు పొడచూపాయి. ఇక.. అప్పటి నుంచి అన్న వై.ఎస్.ఆర్ చెప్పినట్లే నడుచుకున్న వివేకా.. జగన్ ను పెద్దగా పట్టించుకోలేదు. వై.ఎస్.ఆర్. మరణానంతరం.. అబ్బాయితో బాబాయి అంటీముట్టనట్లుగానే ఉన్నారు. ఓదార్పు యాత్రలో కూడా పాల్గొన్న సందర్భాలు లేవు. అంతేకాక.. అబ్బాయి ఓ వైపు ఓదార్పు యాత్ర జరుపుతున్న సమయంలోనే పార్టీ అధిష్టానానికి విధేయతను ప్రకటిస్తూ లేఖ రాశారు. సహజంగా శాంతస్వభావి అయిన వివేకా.. అబ్బాయి దుందుడుకు వైఖరిని సమర్థించలేకపోయారు. ఆవేశంతో తీసుకునే నిర్ణయాలు సఫలం కావని సన్నిహితుల ద్వారా జగన్ కు చేరవేసేవారు. అయినా జగన్ పట్టించుకున్న దాఖలాలు లేవు. అందుకే ఇప్పుడు వివేకా తన దారిలో తాను నడవాలనుకున్నారు. 2సార్లు ఎంపీగా, మరో 2సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన తాను మంత్రిపదవిని తీసుకోవడంలో తప్పులేదనేది వివేకా భావన.! తొలిసారి ఎంపీగా ఎన్నికైన జగన్.. ముఖ్యమంత్రి కావాలని కోరడంలో లేని తప్పు.. తాను మంత్రి పదవిని ఆశిస్తే.. తప్పేంటని వివేకా ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి వై.ఎస్.ఫ్యామిలీ గోడలు నిట్టనిలువునా చీలిపోయాయి.

వై.ఎస్.నేర్పిన విద్యయే..!
     రాజకీయంగా వై.ఎస్.ఆర్. ఆలోచనలు ఎంతో పకడ్బందీగా ఉండేవి. శతృవులను దెబ్బతీసేందుకు ఎంతకైనా తెగించేవారు. కుటుంబసభ్యులు, ఆత్మీయుల మధ్య చిచ్చుపెట్టి.. తన పాచిక పారేలా చేయడంలో వై.ఎస్.ఆర్. దిట్ట.! గతంలో ఓసారి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు, ఆయన సోదరుడు రామమూర్తినాయుడుకు మధ్య ఇలాంటి సంఘటనే జరిగింది. అన్నను కాదని.. తమ్ముడు రామమూర్తినాయుడు వై.ఎస్. చెంత చేరారు. ఇది వై.ఎస్.ఆర్. వ్యూహమే.! కేవలం చంద్రబాబు ఫ్యామిలీలోనే కాదు.. ఇతర పార్టీల నేతలను కూడా ఏదోరకంగా ఆకట్టుకునేవారు. ఇదంతా రాజకీయంలో భాగమనేవారు. వై.ఎస్.ఆర్. ఎత్తుగడలను చూసి అందరూ షాకయ్యేవారు. గతంలో TRS, TDPలకు చెందిన కొంతమంది MLAలను వై.ఎస్.ఆర్. ఇలాగే రాజకీయ వ్యూహాల్లో బంధించారు.
     ఇప్పుడు వై.ఎస్.ఫ్యామిలీ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇదే వ్యూహాన్ని అనుసరించింది. ఫ్యామిలీలో కూడా జగన్ కు మద్దతిచ్చేవారెవరూ లేరని చెప్పేందుకే వివేకాను తనవైపు తిప్పుకుంది. గతంలో వివేకాకు జరిగిన అవమానాలకు ప్రతీకారం తీర్చుకునే అవకాశం కల్పించింది.

జగన్ చేసింది కరెక్టా..?
     వై.ఎస్.రాజశేఖరరెడ్డి పార్టీకి పూర్తి విధేయుడిగా పనిచేశారు. ఎన్నో అవమానాలు భరించారు. అయినా సహించారు. కానీ ఏనాడూ పార్టీని వీడి బయటకు పోలేదు. ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి తానే దిక్కని నమ్మారు. అందుకు తగ్గట్లే.. రాష్ట్రమంతటా తనకంటూ ప్రత్యేక కేడర్ ను సృష్టించుకున్నారు. (ఇప్పుడు జగన్ వెంట ఉన్నవారు ఆ కేడర్ లోని వారే) తను నమ్మినవారిని అక్కున చేర్చుకున్నారు. పార్టీకి విధేయంగా ఉంటూనే.. స్వేచ్ఛ అనుభవించారు. ఇదంతా.. వై.ఎస్. పవర్ పాలిటిక్స్ వల్లే సాధ్యమైంది. అయితే.. ఆయన పవర్ లోకి వచ్చేందుకు 30 ఏళ్లు పట్టింది. కానీ జగన్ ఎంపీగా ఎన్నికయి కేవలం ఒకటిన్నర ఏడాది మాత్రమే అయింది. మరి ఇంతలోనే ఏకంగా ముఖ్యమంత్రి కావాలనుకోవడం అత్యాశే అవుతుంది. అది కూడా కాంగ్రెస్ పార్టీలో..! ఎంతోమంది వృద్ధానువృద్ధులు అలాంటి పదవులకోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు.
     తన తండ్రి చనిపోయినప్పుడు 150 మంది ఎమ్మెల్యేలు తనకు మద్దతుగా సంతకాలు చేశారని జగన్ చెబుతున్నారు. కానీ.. వారంతా ఏ మూమెంట్ లో సంతకాలు చేశారో జగన్ ఓసారి గుర్తు చేసుకోవాలి. తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేని ఎమ్మెల్యేలంతా తనపై సానుభూతితో అలా చేశారని భావించాలి.

Monday, November 29, 2010

జగన్ రిజైన్

     హించినట్లే జరిగింది. కడప ఎంపీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. కడప ఎంపీ పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. ఆయనతో పాటు తల్లి వై.ఎస్.విజయలక్ష్మి కూడా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.

     వై.ఎస్.రాజశేఖరరెడ్డి హఠాన్మరణం తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, పార్టీ వైఖరి వై.ఎస్.కుటుంబాన్ని తీవ్రంగా కలచివేశాయనడంలో ఎలాంటి సందేహం లేదు. తండ్రి హఠాన్మరణం తట్టుకోలేక చనిపోయినవారిని ఓదార్చేందుకు కూడా అధిష్టానం అనుమతి ఇవ్వకపోవడం జగన్ ను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. దీనికితోడు 150మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేసినా.. తనను ఆ పదవిలో కూర్చోబెట్టలేదనే ఆక్రోశం మరోవైపు ఎలాగూ మనసులో ఉండిపోయింది. ఇంతలోనే.. రోశయ్య రాజీనామా చేయడం, ఆ స్థానంలో కిరణ్ కుమార్ రెడ్డిని గద్దెనెక్కించడం చకచకా జరిగిపోయాయి. ఇక్కడే అసలు మతలబు మొదలైంది.

     జగన్ కు చెక్ పెట్టేందుకే పార్టీ అధిష్టానం కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందులోభాగంగానే.. జగన్ కు చెక్ పెట్టేందుకు కిరణ్ కుమార్ రెడ్డి.. వై.ఎస్.ఆర్. సోదరుడు వివేకానందరెడ్డికి వలవేశారు. ఆజాద్ ద్వారా మంత్రివర్గంలో స్థానం కల్చించాలని నిర్ణయించారు. ఈ హఠాత్మరిణామం వై.ఎస్. కుటుంబీకులను మరింత కలచివేసింది. కుటుంబంలో చిచ్చు పెట్టేందుకు బాబాయిని పావుగా వాడుకుంటున్నారని జగన్ గ్రహించారు. 14 నెలలుగా ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నా ఓర్చుకున్నానని.. అయితే.. ఈ పరిణామం తర్వాత ఇక పార్టీలో కొనసాగడం కష్టమని ఆయన మేడమ్ సోనియాకు 5 పేజీల లేఖ రాశారు. రిజైన్ చేస్తున్నట్లు ప్రకటించారు.

     జగన్ అలా రిజైన చేశారో లేదో.. అప్పుడే రాష్ట్రవ్యాప్తంగా ఆయనకు మద్దతుగా చిన్నాచితకా నేతలు రాజీనామా బాట పట్టారు. అయితే.. ఆయన వెంట ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రం ఇంకా రాజీనామాకు సిద్ధపడలేదు. మంత్రివర్గ విస్తరణ అనంతరం.. జగన్ పార్టీ ప్రకటించిన తర్వాత వారు కూడా రాజీనామా చేసే అవకాశాలున్నాయి. అయితే.. ప్రస్తుతం జగన్ వెంట ఎంతమంది ఉన్నారు.. అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఏదేమైనా జగన్ రాష్ట్రంలో మరో సంచలనం కాబోతున్నారు. మరో ప్రాంతీయపార్టీకి తెరలేపబోతున్నారు. ఇది కాంగ్రెస్, టీడీపీలకు గట్టిపోటీ ఇవ్వడం ఖాయం.

Sunday, November 28, 2010

Incredible India

What is INDIA...???

"A Nation where pizza reachs home faster than Ambulance & Police"

"Where you get Car loan @ 8% but Education loan @ 12%.."

"Where Rice is Rs.20 but Sim card is Free.."

"Where people worship Goddess Durga but want to kill their Girl child"

"Where Olympic shooter wins gold, government gives 3 Crore, Another shooter dies fighting with terrorist government pays 1Lakh.."

Really.........

"INCREDIBLE INDIA"

Friday, November 26, 2010

ఆయుధంగా మిరపకాయ..!

     మిరపకాయతో ఏం చేయొచ్చు..? వంటల్లో వాడొచ్చు.. బజ్జీలు చేయొచ్చు..
కానీ అదే మిరపకాయతో శతృవుల గుండెలు దడదడలాడించొచ్చు... ఉగ్రవాదులను తరిమి తరిమి కొట్టొచ్చు.. దేశాన్ని కాపాడొచ్చు..

భుట్ జొలాకియా:
     మిరపకాయ ఘాటు అంటే మనకు గుర్తుకొచ్చేది గుంటూరు మిర్చి.. ఎందుకంటే నోట్లో పెట్టుకుంటే చాలు. కళ్ల నుంచి నీళ్లు కారుతాయి.. కానీ అసోం మిర్చి ఇంతకంటే ఎన్నో రెట్లు ఘాటైనదంటే నమ్ముతారా..? ఇదే ఇప్పుడు మన సైన్యానికి ఆయుధం కాబోతోంది. అసోం, నాగాలాండ్, మణిపూర్ లలో అధికంగా పండే భుట్ జొలాకియా అనే మిర్చిని యుద్ధ ఆయుధంగా వాడేందుకు DRDO ప్రయత్నిస్తోంది.
ఇదీ భుట్ చరిత్ర

ఏది ఘాటు?:
     మామూలు మిర్చీ ఘాటు 2500 స్కొవిల్లీ యూనిట్స్ (మిర్చి ఘాటును స్కొవెల్లీ యూనిట్స్ లో కొలుస్తారు) ఉంటే.. భుట్ జొలాకియా మిర్చి ఘాటు 4వేల రెట్లు అధికంగా 10 లక్షల స్కొవిల్లీ యూనిట్స్ ఉంటుంది. ఇది వరల్ట్ హాటెస్ట్ మిర్చీ. ప్రపంచంలో నోటిని భగ్గుమనిపించే మిర్చి వెరైటీలు చాలానే ఉన్నాయి. టబస్కో సాస్ అనే రకంలో స్కొవిల్లీ హీట్ యూనిట్ రేంజ్ 2600 నుంచి 5 వేలు ఉంటుంది. ఇక జలపెనో రకంలో 9వేల వరకూ ఉంటుంది. థాయ్ హాట్ లో 60 వేల వరకూ.. మెక్సికోలో పండే రెడ్ సావినాలో 5లక్షల 80 వేల వరకూ ఉంటుంది. కానీ అసోంలో పండే భుజ్ జొలాకియాలో 1041427 యూనిట్ల ఘాటు ఉంటుంది.

ఆయుధంగా భుట్ జొలాకియా:
     ఈ ఘాటుపైనే ఇప్పుడు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ - DRDO దృష్టిపెట్టింది. తీవ్రవాదులు, శతృవులను ఎదుర్కోవడానికి కొత్త టెక్నాలజీతో అత్యాధునిక ఆయుధాలు రూపొందించి సైన్యానికి ఇచ్చే DRDO ఇప్పుడు మిర్చిలో దాగున్న ఘాటును గుర్తించింది. ఆ ఘాటును తీవ్రవాదులపై ప్రయోగించడానికి అనుగుణంగా బాంబ్ షెల్స్ ను రూపొందించింది. చిల్లీ గ్రనేడ్ లను తయారుచేసింది.

     త్వరలోనే ఈ రాక్షస మిర్చీ.. ఇండియన్ ఆర్మీ అమ్ములపొదిలో అద్భుతమైన ఆయుధంగా మారనుంది. భారత శతృవుల్లారా..? బివేర్ ఆఫ్ భుట్ జొలాకియా..! జై భారత్..!!

Wednesday, November 24, 2010

రోశయ్య రాజీనామా

     కాంగ్రెస్ మార్క్ అంటే ఏంటో మరోసారి తెలిసింది. ఎప్పుడు ఎవరిని పదవిలో నుంచి తొలగిస్తుందో.. ఎప్పుడు ఎవరిని అందలం ఎక్కిస్తుందో కాంగ్రెస్ పార్టీకే తెలియదు. అలాంటిదే రోశయ్య రాజీనామా కూడా..!
    14 నెలల 22రోజుల పాటు రాష్ట్రాన్ని పరిపాలించిన రోశయ్య అధిష్టానం ఆదేశాలను తు.చ. తప్పకుండా పాటించారు. పాలనలో తనదైన మార్కు వేయకపోయినా.. అధిష్టానం దృష్టిలో మాత్రం పెద్దాయనగానే మిగిలిపోయారు. వయోభారం, పని ఒత్తిడి భరించలేకే రాజీనామా చేస్తున్నానని రోశయ్య చెప్పినా.. పాపం పెద్దాయన వల్ల రాష్ట్ర పరిపాలన సరిగా సాగడం లేదని అధిష్టానం గ్రహించింది.
     రాజీనామా చేస్తా.. మీరే పరిపాలించుకుంటారా అని పుట్టపర్తిలో అని 24 గంటలు గడవక ముందే రోశయ్య రాజీనామా చేశారు. రాజీనామా వాక్కులను పుట్టపర్తి సాయిబాబా దీవించినట్లున్నారు. లేకుంటే రోశయ్య ఇప్పటికిప్పుడు దిగిపోతారని ఎవరైనా ఊహించారా..?
     సాక్షిలో సోనియా, మన్మోహన్ లపై వ్యతిరేక కథనాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. జగన్ ను కంట్రోల్ లో పెట్టాలని నిర్ణయానికొచ్చిన అధిష్టానం ముందుగా.. అతడి అనుచరగణంపై దృష్టిపెట్టనుంది. అందులోభాగంగానే సీఎం మార్పు.! సీఎంను మార్చడం ద్వారా కొత్త మంత్రివర్గానికి అవకాశం కలుగుతుంది. ఈసారి జగన్ వర్గీయులెవరికీ కేబినెట్లో స్థానం దక్కకపోవడం ఖాయం. ఇది జగన్ కు పెద్ద షాకే.! ఇలా తనకు అవకాశమున్న ప్రతిదారినీ మూసేయాలని అధిష్టానం భావిస్తోంది. జగన్ పై ఇప్పటికిప్పుడు వేటు పడకపోయినా.. తన అనుచరగణంపై మాత్రం అధిష్టానం కొరడా ఝళిపించబోతోంది.
     సీఎల్పీ భేటీలో జగన్ వర్గీయులు తప్పకుండా నిరసన తెలియజేస్తారేమోనని భావించిన ప్రణబ్ ముఖర్జీ.. చాలా తెలివిగా పని కానిచ్చేశారు. నేరుగా సోనియా సందేశాన్ని చదవి వినిపించి.. కొత్త నేత ఎంపిక బాధ్యతను సోనియాకు కట్టబెడుతూ తీర్మానాన్ని పకడ్బందీగా ఆమోదింపజేసుకున్నారు. ఇదే జగన్ వర్గానికి తొలి ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. ఇక రాష్ట్రంలో కొత్త సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్ ను ఆటాడుకోవడం ఖాయం..

Tuesday, November 23, 2010

రెడ్ వైన్ తో డయాబెటీస్ కంట్రోల్!!

     డయాబిటీస్‌తో మీరు బాధపడుతున్నారా..? 
ఏం చేయాలో అర్థం కావడం లేదా..? 
ఎన్ని మందులు వాడుతున్నా ఉపయోగం లేదా..? 
అయితే.. మీకో చిన్న సలహా..! 
ప్రతిరోజూ- జస్ట్‌ రెడ్‌వైన్‌ తీసుకోండి.. 
అంతే.. మీ డయాబిటీస్‌ మాయం.. 
     మొండి వ్యాధుల్లో డయాబిటీస్‌ కూడా ఒకటి. సామాన్యంగా ఇది ఓ పట్టాన కంట్రోల్‌ లోకి రాదు.. అందుకే.. దీనికో మందు గుర్తించారు శాస్త్రవేత్తలు.
అదే రెడ్‌వైన్‌..
అవును.. రెడ్‌వైన్‌ మీ డయాబిటీస్‌ను కంట్రోల్‌లో ఉంచుతుంది. లండన్‌లో నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైంది.. ప్రతిరోజూ కొంచెం రెడ్‌వైన్‌ తీసుకోవడం ద్వారా.. శరీరంలోని చక్కెర శాతాన్ని నియంత్రించుకోవచ్చట.! సాధారణంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో అలసట, గుండెపోటు, నరాల బలహీనత, అంధత్వం లాంటి సమస్యలు కనిపిస్తాయి. కేవలం చక్కెర శాతాన్ని నియంత్రించుకోవడం ద్వారా వీటన్నింటినీ అదుపులో పెట్టుకోవచ్చు. ద్రాక్ష పైపొరలోని పాలీఫినైల్స్.. శరీరంలోని గ్లూకోజ్‌ లెవల్స్‌ని తగిన మోతాదులో ఉంచుతాయి. దాదాపు 12 రకాల రెడ్‌వైన్స్‌ని పరిశీలించిన నిర్వాహకులు.. వాటిలో పాలీఫినైల్స్‌ అధికంగా ఉన్నట్లు గుర్తించారు. అందుకే డయాబిటీస్‌తో బాధపడుతున్నవారికి రెడ్‌వైన్‌ ఎంతో ఉపయోగపడుతుందట.!

తక్కువ తాగితేనే..!
అయితే.. ఇవన్నీ మతిలేని పరిశోధనలని బ్రిటీష్‌ ప్రభుత్వ పరిశోధన సంస్థ- డయాబిటీస్‌ యూకే కొట్టిపడేసింది. వైన్‌ ఎక్కువగా తీసుకుంటే స్థూలకాయంతో బాధపడాల్సి వస్తుందని హెచ్చరించింది.

Sunday, November 21, 2010

సాక్షి: సోనియాపై కథనం - ఓ నిజం

     125 ఏళ్ల కాంగ్రెస్ పార్టీపై సాక్షి టీవీలో ప్రసారమైన కథనం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఇది కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి వ్యతిరేకంగా ఉందని.. సాక్షి టీవీలో (వేరే మీడియాలో రావొచ్చు) ఇలాంటి కథనాలు ప్రసారం చేయడం తగదని.. ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు రోడ్డెక్కారు. సాక్షి ప్రధాన కార్యాలయం ఎదుట సాక్షాత్తూ కొందరు మంత్రులు ధర్నాకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా సాక్షి దినపత్రిక ప్రతులను తగలబెడుతున్నారు.

ఏం జరిగింది.?
     కాంగ్రెస్ పార్టీ 125ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సాక్షి టీవీలో ఓ విశ్లేషణాత్మక కార్యక్రమం ప్రసారమైంది. ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్ పార్టీ తీరుతెన్నులు.. నానాటికీ తగ్గిపోతున్న ప్రాభవం అంటూ.. పార్టీ అధినేత్రి సోనియాపై కాస్త ఘాటైన వ్యాఖ్యలే కథనంలో కనిపించాయి.  ఇది జీర్ణించుకోలేని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలు సాక్షి టీవీపై మండిపడుతున్నారు. జగన్ కావాలనే ఇలాంటి కథనాలు ప్రసారం చేయిస్తున్నారని ధ్వజమెత్తుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పత్రికా దహనాలు, కార్యాలయాల ఎదుట ధర్నాలు మామూలైపోయాయి.

వ్యతిరేక కథనాలు ప్రసారం చేయకూడదా..?
     వాస్తవానికి రాజకీయాలు కావొచ్చు, ప్రభుత్వాలు కావొచ్చు..మరేదైనా అంశం కావొచ్చు.. వాటిపై సవివరంగా విశ్లేషించి.. ప్రసారం చేసే హక్కు మీడియాకు ఉంది. వాటిలోని మంచిచెడులను ప్రజలకు వివరించే బాధ్యత కూడా ఉంది. సాక్షికూడా ఇప్పుడు.. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితిని కళ్లకుకట్టింది. యూపీఏ ప్రభుత్వ కుంభకోణాలు, నానాటికీ దిగజారిపోతున్న పార్టీ ప్రాభవం, సోనియా పనితీరు.. లాంటి అంశాలను ప్రజల ముందుంచింది.

మరెందుకు వివాదం..?
     సాక్షి పత్రిక ప్రారంభమైనప్పటి నుంచి...(అంతకుముందు నుంచీ కూడా) దాన్ని తమ పత్రికగా భావించారు కాంగ్రెస్ పార్టీ నేతలు. కార్యకర్తలు. ఇందుకు ఆ పత్రిక యాజమాన్యం కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్... ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక ఆ రెండు పత్రికలు అంటూ బురదజల్లేవారు. వీటికి తగిన బుద్ధి చెప్పేందుకు మనకూ ఓ పత్రిక వస్తోందని తరచూ చెప్పేవారు. ఈ మాటలు కాంగ్రెస్ శ్రేణులకు బాగా వంటబట్టాయి. పత్రికను, రాజకీయాన్ని వేర్వేరుగా చూడాల్సిందిపోయి.. సాక్షి అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే సాక్షి అనే స్థాయికి వాటి మధ్య బంధం ఏర్పడిపోయింది.
     అయితే.. వై.ఎస్.హఠాన్మరణంతో సీన్ రివర్స్ అయింది. తండ్రి తర్వాత తానే ముఖ్యమంత్రి అని భావించిన జగన్.. ఆ కోరిక నెరవేరకపోవడంతో అధిష్టానంపై కక్షగట్టారు. క్రమంగా అధిష్టానం కూడా జగన్ వర్గీయులను సాగనంపుతుండడంతో అధిష్టానం ఆలోచనలను పసిగట్టిన పార్టీ శ్రేణులు కూడా జగన్ కు దూరమవుతూ వస్తున్నాయి. అందులో భాగంగానే.. ఒకప్పుడు సాక్షి తమదే అని భావించిన కాంగ్రెస్ శ్రేణులు.. ఇప్పుడు దానిపై కక్షగట్టాయి.

తాను తీసుకున్న గోతిలోనే..!
    సాక్షి యాజమాన్యం ఇప్పుడు  తాను తీసుకున్న గోతిలో తానే పడింది. పార్టీ పత్రికగా సాక్షిని ప్రచారం చేయడం ఎంత తప్పో ఇప్పుడు తెలిసివచ్చింది. రాజకీయనాయకుల చేతుల్లోని పత్రికలకు.. రాజకీయాలను, మీడియాను వేరుచేసి చూపడం అంత ఈజీకాదని మరోసారి రుజువైంది. పత్రిక ప్రారంభోత్సవంలోనూ, ఆ తర్వాత పలు సందర్భాల్లో సాక్షి ఎండీ జగన్మోహన్ రెడ్డి, ఆయన తండ్రి వై.ఎస్.ఆర్.. సాక్షి నాణేనికి రెండువైపులా చూపుతుందని చెప్పుకొచ్చారు. కానీ అవేవీ పార్టీ శ్రేణులను ప్రభావితం చేయలేకపోయాయి. అయితే.. వై.ఎస్.మరణం తర్వాత కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కూడా క్రమంగా సాక్షికి దూరమైపోయారు. ఇప్పుడు జగన్ కావాలనే ఇలాంటి కథనాలను ప్రసారం చేయిస్తున్నారని ఆ పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. వీటిని కూడా తోసిపుచ్చలేం..

జగనే సాక్షి - సాక్షే జగన్!
     సాక్షి ప్రారంభమైనప్పటి నుంచి అదెప్పుడూ ప్రజాపత్రికగా వ్యవహరించలేదు. పార్టీ పత్రికగానే గుర్తింపు తెచ్చుకుంది. జగన్ ఓదార్పుయాత్ర సమయంలో మిగిలిన వార్తలన్నింటినీ పక్కనపెట్టి.. 24గంటలూ దాన్నే ప్రసారం చేసింది. అలాంటిదాన్ని ప్రజలపక్షం అని ఎలా అంటాం.? అందుకే ఇప్పుడు సోనియాపై కథనాలు కూడా జగన్ వ్యూహరచనలో భాగమేనని అందరూ భావిస్తున్నారు.

Saturday, November 20, 2010

మతిలేని ప్రభుత్వం

ఎస్సై పరీక్ష వాయిదా వేసి ప్రభుత్వం తన చేతగాని తనాన్ని మరోసారి నిరూపించుకుంది. ఫ్రీజోన్ అంశం తేలేవరకూ ఎస్సై పరీక్ష వాయిదా వేయాలంటూ తెలంగాణా వ్యాప్తంగా నిరసనలు తలెత్తాయి. ఉస్మానియా యూనివర్సిటీ భగ్గుమంది. వీధుల్లోకి వచ్చిన విద్యార్థులు నానా హంగామా చేశారు. పరిస్థితి చేయిదాటిపోతోందని గ్రహించిన ప్రభుత్వం.. వెంటనే ఎస్సై పరీక్షను అన్నిచోట్లా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. 24 గంటల్లోనే నిర్ణయం మార్చుకుంది.

భగ్గుమన్న సీమాంధ్ర
     ఎస్సై పరీక్షను వాయిదా వేస్తున్నట్లు హోంమంత్రి అలా ప్రకటించారో లేదో అప్పుడే సీమాంధ్రలో నిరసన జ్వాలలు ఎగసిపడ్డాయి. తెలంగాణ విద్యార్థుల ఒత్తిడికి తలొగ్గి.. ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని సీమాంధ్ర విద్యార్థులు ఆరోపించారు. ప్రభుత్వాన్ని నడిపేది పాలకులా.. లేక తెలంగాణ విద్యార్థులా అని ప్రశ్నించారు.. వీధుల్లోకి వచ్చి నానా హంగామా చేసేసరికి.. ప్రభుత్వం వెనుకంజ వేసి పరీక్ష వాయిదా వేసిందని.. ఇప్పుడు తాము కూడా వీధుల్లోకి వచ్చాం కాబట్టి పరీక్ష జరపాలని డిమాండ్ చేస్తున్నారు..

చేతకాని ప్రభుత్వం
     ప్రస్తుతం రాష్ట్రంలో మళ్లీ గతేడాది డిసెంబర్ నాటి పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ భగ్గుమంటుంటే.. సీమాంధ్ర శాంతంగా ఉంటోంది. అదే తెలంగాణ ప్రశాంతంగా ఉంటే సీమాంధ్రలో పరిస్థితి విరుద్ధంగా ఉంటోంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఇరుప్రాంతాలను ప్రభావితం చేస్తాయని తెలుసు. కానీ ప్రభుత్వం మాత్రం ఇవేవీ ఆలోచించినట్లు లేదు.. ఎస్సై పరీక్ష వాయిదా వేసే ముందు.. సీమాంధ్రలో నిరసన జ్వాలలు వస్తాయని ప్రభుత్వం ఎందుకు గ్రహించలేదు.? తెలంగాణ విద్యార్థుల ఆందోళనలకు తలొగ్గి.. పరీక్ష వాయిదే వేస్తే.. సీమాంధ్ర విద్యార్థులు ఊరుకుంటారని ప్రభుత్వ పెద్దలు తప్పుడు అంచనా వేశారు. దాని ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నారు.
      ప్రభుత్వం నిర్ణయం తీసుకునేముందు.. ఇరు ప్రాంత విద్యార్థులతో చర్చించి సామరస్యపూరక వాతావరణం కల్పించి ఉంటే బాగుండేది. పరిస్థితిని ఇరుప్రాంతాలవారికి వివరిస్తే.. వాళ్లు తప్పకుండా అర్థం చేసుకుంటారు. అలా చేయకుండా.. ప్రభుత్వం తన ఇష్టానుసారం వ్యవహరించింది. తన చేతగానితనాన్ని మరోసారి నిరూపించుకుంది..

Friday, November 19, 2010

హాయ్

హాయ్ ఫ్రెండ్స్...
బ్లాగ్ ప్రపంచంలోకి వచ్చినందుకు ఆనందంగా ఉంది. కొన్నిసార్లు మనసులో ఏవేవో ఆలోచనలు తన్నుకొస్తుంటాయి. వాటిని అందరితో పంచుకోవాలనిపిస్తుంటుంది. అందుకే ఓ బ్లాగ్ ఉంటే బాగుండు అనిపించింది. అందులో భాగమే ఈ 'నా లోకం' బ్లాగ్..
     నా లోకాన్ని మీరందరూ ఆదరిస్తారని ఆశిస్తూ....

సి.ఎల్.ఎన్.రాజు