Tuesday, November 30, 2010

నిలువునా చీలిన వై.ఎస్.ఫ్యామిలీ..!

    రిత్ర పునరావృతమవుతుందేమో అనిపిస్తోంది.. అవును..! ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డిని విభేదించి.. బాబాయి వై.ఎస్.వివేకానంద రెడ్డి బయటకు వచ్చేశారు. ఇన్నాళ్లూ ఒకేతాటిపై నడిచిన వై.ఎస్.ఫ్యామిలీ ఇప్పుడు నిట్టనిలువునా చీలిపోయింది. అబ్బాయ్ నుంచి బాబాయ్ ని విడదీయడంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పూర్తిగా సక్సెస్ అయింది. జగన్ ను కలిసిన తర్వాత కూడా పార్టీకే పూర్తి విధేయత ప్రకటించిన వివేకానంద రెడ్డి.. కాంగ్రెస్ పార్టీలో లీడర్ అనిపించుకున్నారు.


వివేకా ఎందుకు దూరమయ్యారు.?
     వాస్తవానికి వై.ఎస్.వివేకానందరెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి మధ్య వై.ఎస్.ఆర్. ఉన్నకాలంలోనే మనస్ఫర్థలు ఉన్నాయనే ఊహాగానాలు వినిపించాయి. వై.ఎస్.ఆర్. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంపీగా ఉన్న వివేకా చేత రాజీనామా చేయించి.. తాను ఎంపీ కావాలని జగన్ పట్టుబట్టారు. అయిష్టంగానే వివేకా రాజీనామా చేసినా.. అధిష్టానం అంగీకరించకపోవడంతో జగన్ కోరిక నెరవేరలేదు. అప్పుడే బాబాయ్-అబ్బాయ్ మధ్య విభేదాలు పొడచూపాయి. ఇక.. అప్పటి నుంచి అన్న వై.ఎస్.ఆర్ చెప్పినట్లే నడుచుకున్న వివేకా.. జగన్ ను పెద్దగా పట్టించుకోలేదు. వై.ఎస్.ఆర్. మరణానంతరం.. అబ్బాయితో బాబాయి అంటీముట్టనట్లుగానే ఉన్నారు. ఓదార్పు యాత్రలో కూడా పాల్గొన్న సందర్భాలు లేవు. అంతేకాక.. అబ్బాయి ఓ వైపు ఓదార్పు యాత్ర జరుపుతున్న సమయంలోనే పార్టీ అధిష్టానానికి విధేయతను ప్రకటిస్తూ లేఖ రాశారు. సహజంగా శాంతస్వభావి అయిన వివేకా.. అబ్బాయి దుందుడుకు వైఖరిని సమర్థించలేకపోయారు. ఆవేశంతో తీసుకునే నిర్ణయాలు సఫలం కావని సన్నిహితుల ద్వారా జగన్ కు చేరవేసేవారు. అయినా జగన్ పట్టించుకున్న దాఖలాలు లేవు. అందుకే ఇప్పుడు వివేకా తన దారిలో తాను నడవాలనుకున్నారు. 2సార్లు ఎంపీగా, మరో 2సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన తాను మంత్రిపదవిని తీసుకోవడంలో తప్పులేదనేది వివేకా భావన.! తొలిసారి ఎంపీగా ఎన్నికైన జగన్.. ముఖ్యమంత్రి కావాలని కోరడంలో లేని తప్పు.. తాను మంత్రి పదవిని ఆశిస్తే.. తప్పేంటని వివేకా ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి వై.ఎస్.ఫ్యామిలీ గోడలు నిట్టనిలువునా చీలిపోయాయి.

వై.ఎస్.నేర్పిన విద్యయే..!
     రాజకీయంగా వై.ఎస్.ఆర్. ఆలోచనలు ఎంతో పకడ్బందీగా ఉండేవి. శతృవులను దెబ్బతీసేందుకు ఎంతకైనా తెగించేవారు. కుటుంబసభ్యులు, ఆత్మీయుల మధ్య చిచ్చుపెట్టి.. తన పాచిక పారేలా చేయడంలో వై.ఎస్.ఆర్. దిట్ట.! గతంలో ఓసారి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు, ఆయన సోదరుడు రామమూర్తినాయుడుకు మధ్య ఇలాంటి సంఘటనే జరిగింది. అన్నను కాదని.. తమ్ముడు రామమూర్తినాయుడు వై.ఎస్. చెంత చేరారు. ఇది వై.ఎస్.ఆర్. వ్యూహమే.! కేవలం చంద్రబాబు ఫ్యామిలీలోనే కాదు.. ఇతర పార్టీల నేతలను కూడా ఏదోరకంగా ఆకట్టుకునేవారు. ఇదంతా రాజకీయంలో భాగమనేవారు. వై.ఎస్.ఆర్. ఎత్తుగడలను చూసి అందరూ షాకయ్యేవారు. గతంలో TRS, TDPలకు చెందిన కొంతమంది MLAలను వై.ఎస్.ఆర్. ఇలాగే రాజకీయ వ్యూహాల్లో బంధించారు.
     ఇప్పుడు వై.ఎస్.ఫ్యామిలీ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇదే వ్యూహాన్ని అనుసరించింది. ఫ్యామిలీలో కూడా జగన్ కు మద్దతిచ్చేవారెవరూ లేరని చెప్పేందుకే వివేకాను తనవైపు తిప్పుకుంది. గతంలో వివేకాకు జరిగిన అవమానాలకు ప్రతీకారం తీర్చుకునే అవకాశం కల్పించింది.

జగన్ చేసింది కరెక్టా..?
     వై.ఎస్.రాజశేఖరరెడ్డి పార్టీకి పూర్తి విధేయుడిగా పనిచేశారు. ఎన్నో అవమానాలు భరించారు. అయినా సహించారు. కానీ ఏనాడూ పార్టీని వీడి బయటకు పోలేదు. ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి తానే దిక్కని నమ్మారు. అందుకు తగ్గట్లే.. రాష్ట్రమంతటా తనకంటూ ప్రత్యేక కేడర్ ను సృష్టించుకున్నారు. (ఇప్పుడు జగన్ వెంట ఉన్నవారు ఆ కేడర్ లోని వారే) తను నమ్మినవారిని అక్కున చేర్చుకున్నారు. పార్టీకి విధేయంగా ఉంటూనే.. స్వేచ్ఛ అనుభవించారు. ఇదంతా.. వై.ఎస్. పవర్ పాలిటిక్స్ వల్లే సాధ్యమైంది. అయితే.. ఆయన పవర్ లోకి వచ్చేందుకు 30 ఏళ్లు పట్టింది. కానీ జగన్ ఎంపీగా ఎన్నికయి కేవలం ఒకటిన్నర ఏడాది మాత్రమే అయింది. మరి ఇంతలోనే ఏకంగా ముఖ్యమంత్రి కావాలనుకోవడం అత్యాశే అవుతుంది. అది కూడా కాంగ్రెస్ పార్టీలో..! ఎంతోమంది వృద్ధానువృద్ధులు అలాంటి పదవులకోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు.
     తన తండ్రి చనిపోయినప్పుడు 150 మంది ఎమ్మెల్యేలు తనకు మద్దతుగా సంతకాలు చేశారని జగన్ చెబుతున్నారు. కానీ.. వారంతా ఏ మూమెంట్ లో సంతకాలు చేశారో జగన్ ఓసారి గుర్తు చేసుకోవాలి. తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేని ఎమ్మెల్యేలంతా తనపై సానుభూతితో అలా చేశారని భావించాలి.

Monday, November 29, 2010

జగన్ రిజైన్

     హించినట్లే జరిగింది. కడప ఎంపీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. కడప ఎంపీ పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. ఆయనతో పాటు తల్లి వై.ఎస్.విజయలక్ష్మి కూడా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.

     వై.ఎస్.రాజశేఖరరెడ్డి హఠాన్మరణం తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, పార్టీ వైఖరి వై.ఎస్.కుటుంబాన్ని తీవ్రంగా కలచివేశాయనడంలో ఎలాంటి సందేహం లేదు. తండ్రి హఠాన్మరణం తట్టుకోలేక చనిపోయినవారిని ఓదార్చేందుకు కూడా అధిష్టానం అనుమతి ఇవ్వకపోవడం జగన్ ను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. దీనికితోడు 150మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేసినా.. తనను ఆ పదవిలో కూర్చోబెట్టలేదనే ఆక్రోశం మరోవైపు ఎలాగూ మనసులో ఉండిపోయింది. ఇంతలోనే.. రోశయ్య రాజీనామా చేయడం, ఆ స్థానంలో కిరణ్ కుమార్ రెడ్డిని గద్దెనెక్కించడం చకచకా జరిగిపోయాయి. ఇక్కడే అసలు మతలబు మొదలైంది.

     జగన్ కు చెక్ పెట్టేందుకే పార్టీ అధిష్టానం కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందులోభాగంగానే.. జగన్ కు చెక్ పెట్టేందుకు కిరణ్ కుమార్ రెడ్డి.. వై.ఎస్.ఆర్. సోదరుడు వివేకానందరెడ్డికి వలవేశారు. ఆజాద్ ద్వారా మంత్రివర్గంలో స్థానం కల్చించాలని నిర్ణయించారు. ఈ హఠాత్మరిణామం వై.ఎస్. కుటుంబీకులను మరింత కలచివేసింది. కుటుంబంలో చిచ్చు పెట్టేందుకు బాబాయిని పావుగా వాడుకుంటున్నారని జగన్ గ్రహించారు. 14 నెలలుగా ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నా ఓర్చుకున్నానని.. అయితే.. ఈ పరిణామం తర్వాత ఇక పార్టీలో కొనసాగడం కష్టమని ఆయన మేడమ్ సోనియాకు 5 పేజీల లేఖ రాశారు. రిజైన్ చేస్తున్నట్లు ప్రకటించారు.

     జగన్ అలా రిజైన చేశారో లేదో.. అప్పుడే రాష్ట్రవ్యాప్తంగా ఆయనకు మద్దతుగా చిన్నాచితకా నేతలు రాజీనామా బాట పట్టారు. అయితే.. ఆయన వెంట ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రం ఇంకా రాజీనామాకు సిద్ధపడలేదు. మంత్రివర్గ విస్తరణ అనంతరం.. జగన్ పార్టీ ప్రకటించిన తర్వాత వారు కూడా రాజీనామా చేసే అవకాశాలున్నాయి. అయితే.. ప్రస్తుతం జగన్ వెంట ఎంతమంది ఉన్నారు.. అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఏదేమైనా జగన్ రాష్ట్రంలో మరో సంచలనం కాబోతున్నారు. మరో ప్రాంతీయపార్టీకి తెరలేపబోతున్నారు. ఇది కాంగ్రెస్, టీడీపీలకు గట్టిపోటీ ఇవ్వడం ఖాయం.

Sunday, November 28, 2010

Incredible India

What is INDIA...???

"A Nation where pizza reachs home faster than Ambulance & Police"

"Where you get Car loan @ 8% but Education loan @ 12%.."

"Where Rice is Rs.20 but Sim card is Free.."

"Where people worship Goddess Durga but want to kill their Girl child"

"Where Olympic shooter wins gold, government gives 3 Crore, Another shooter dies fighting with terrorist government pays 1Lakh.."

Really.........

"INCREDIBLE INDIA"

Friday, November 26, 2010

ఆయుధంగా మిరపకాయ..!

     మిరపకాయతో ఏం చేయొచ్చు..? వంటల్లో వాడొచ్చు.. బజ్జీలు చేయొచ్చు..
కానీ అదే మిరపకాయతో శతృవుల గుండెలు దడదడలాడించొచ్చు... ఉగ్రవాదులను తరిమి తరిమి కొట్టొచ్చు.. దేశాన్ని కాపాడొచ్చు..

భుట్ జొలాకియా:
     మిరపకాయ ఘాటు అంటే మనకు గుర్తుకొచ్చేది గుంటూరు మిర్చి.. ఎందుకంటే నోట్లో పెట్టుకుంటే చాలు. కళ్ల నుంచి నీళ్లు కారుతాయి.. కానీ అసోం మిర్చి ఇంతకంటే ఎన్నో రెట్లు ఘాటైనదంటే నమ్ముతారా..? ఇదే ఇప్పుడు మన సైన్యానికి ఆయుధం కాబోతోంది. అసోం, నాగాలాండ్, మణిపూర్ లలో అధికంగా పండే భుట్ జొలాకియా అనే మిర్చిని యుద్ధ ఆయుధంగా వాడేందుకు DRDO ప్రయత్నిస్తోంది.
ఇదీ భుట్ చరిత్ర

ఏది ఘాటు?:
     మామూలు మిర్చీ ఘాటు 2500 స్కొవిల్లీ యూనిట్స్ (మిర్చి ఘాటును స్కొవెల్లీ యూనిట్స్ లో కొలుస్తారు) ఉంటే.. భుట్ జొలాకియా మిర్చి ఘాటు 4వేల రెట్లు అధికంగా 10 లక్షల స్కొవిల్లీ యూనిట్స్ ఉంటుంది. ఇది వరల్ట్ హాటెస్ట్ మిర్చీ. ప్రపంచంలో నోటిని భగ్గుమనిపించే మిర్చి వెరైటీలు చాలానే ఉన్నాయి. టబస్కో సాస్ అనే రకంలో స్కొవిల్లీ హీట్ యూనిట్ రేంజ్ 2600 నుంచి 5 వేలు ఉంటుంది. ఇక జలపెనో రకంలో 9వేల వరకూ ఉంటుంది. థాయ్ హాట్ లో 60 వేల వరకూ.. మెక్సికోలో పండే రెడ్ సావినాలో 5లక్షల 80 వేల వరకూ ఉంటుంది. కానీ అసోంలో పండే భుజ్ జొలాకియాలో 1041427 యూనిట్ల ఘాటు ఉంటుంది.

ఆయుధంగా భుట్ జొలాకియా:
     ఈ ఘాటుపైనే ఇప్పుడు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ - DRDO దృష్టిపెట్టింది. తీవ్రవాదులు, శతృవులను ఎదుర్కోవడానికి కొత్త టెక్నాలజీతో అత్యాధునిక ఆయుధాలు రూపొందించి సైన్యానికి ఇచ్చే DRDO ఇప్పుడు మిర్చిలో దాగున్న ఘాటును గుర్తించింది. ఆ ఘాటును తీవ్రవాదులపై ప్రయోగించడానికి అనుగుణంగా బాంబ్ షెల్స్ ను రూపొందించింది. చిల్లీ గ్రనేడ్ లను తయారుచేసింది.

     త్వరలోనే ఈ రాక్షస మిర్చీ.. ఇండియన్ ఆర్మీ అమ్ములపొదిలో అద్భుతమైన ఆయుధంగా మారనుంది. భారత శతృవుల్లారా..? బివేర్ ఆఫ్ భుట్ జొలాకియా..! జై భారత్..!!

Wednesday, November 24, 2010

రోశయ్య రాజీనామా

     కాంగ్రెస్ మార్క్ అంటే ఏంటో మరోసారి తెలిసింది. ఎప్పుడు ఎవరిని పదవిలో నుంచి తొలగిస్తుందో.. ఎప్పుడు ఎవరిని అందలం ఎక్కిస్తుందో కాంగ్రెస్ పార్టీకే తెలియదు. అలాంటిదే రోశయ్య రాజీనామా కూడా..!
    14 నెలల 22రోజుల పాటు రాష్ట్రాన్ని పరిపాలించిన రోశయ్య అధిష్టానం ఆదేశాలను తు.చ. తప్పకుండా పాటించారు. పాలనలో తనదైన మార్కు వేయకపోయినా.. అధిష్టానం దృష్టిలో మాత్రం పెద్దాయనగానే మిగిలిపోయారు. వయోభారం, పని ఒత్తిడి భరించలేకే రాజీనామా చేస్తున్నానని రోశయ్య చెప్పినా.. పాపం పెద్దాయన వల్ల రాష్ట్ర పరిపాలన సరిగా సాగడం లేదని అధిష్టానం గ్రహించింది.
     రాజీనామా చేస్తా.. మీరే పరిపాలించుకుంటారా అని పుట్టపర్తిలో అని 24 గంటలు గడవక ముందే రోశయ్య రాజీనామా చేశారు. రాజీనామా వాక్కులను పుట్టపర్తి సాయిబాబా దీవించినట్లున్నారు. లేకుంటే రోశయ్య ఇప్పటికిప్పుడు దిగిపోతారని ఎవరైనా ఊహించారా..?
     సాక్షిలో సోనియా, మన్మోహన్ లపై వ్యతిరేక కథనాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. జగన్ ను కంట్రోల్ లో పెట్టాలని నిర్ణయానికొచ్చిన అధిష్టానం ముందుగా.. అతడి అనుచరగణంపై దృష్టిపెట్టనుంది. అందులోభాగంగానే సీఎం మార్పు.! సీఎంను మార్చడం ద్వారా కొత్త మంత్రివర్గానికి అవకాశం కలుగుతుంది. ఈసారి జగన్ వర్గీయులెవరికీ కేబినెట్లో స్థానం దక్కకపోవడం ఖాయం. ఇది జగన్ కు పెద్ద షాకే.! ఇలా తనకు అవకాశమున్న ప్రతిదారినీ మూసేయాలని అధిష్టానం భావిస్తోంది. జగన్ పై ఇప్పటికిప్పుడు వేటు పడకపోయినా.. తన అనుచరగణంపై మాత్రం అధిష్టానం కొరడా ఝళిపించబోతోంది.
     సీఎల్పీ భేటీలో జగన్ వర్గీయులు తప్పకుండా నిరసన తెలియజేస్తారేమోనని భావించిన ప్రణబ్ ముఖర్జీ.. చాలా తెలివిగా పని కానిచ్చేశారు. నేరుగా సోనియా సందేశాన్ని చదవి వినిపించి.. కొత్త నేత ఎంపిక బాధ్యతను సోనియాకు కట్టబెడుతూ తీర్మానాన్ని పకడ్బందీగా ఆమోదింపజేసుకున్నారు. ఇదే జగన్ వర్గానికి తొలి ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. ఇక రాష్ట్రంలో కొత్త సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్ ను ఆటాడుకోవడం ఖాయం..

Tuesday, November 23, 2010

రెడ్ వైన్ తో డయాబెటీస్ కంట్రోల్!!

     డయాబిటీస్‌తో మీరు బాధపడుతున్నారా..? 
ఏం చేయాలో అర్థం కావడం లేదా..? 
ఎన్ని మందులు వాడుతున్నా ఉపయోగం లేదా..? 
అయితే.. మీకో చిన్న సలహా..! 
ప్రతిరోజూ- జస్ట్‌ రెడ్‌వైన్‌ తీసుకోండి.. 
అంతే.. మీ డయాబిటీస్‌ మాయం.. 
     మొండి వ్యాధుల్లో డయాబిటీస్‌ కూడా ఒకటి. సామాన్యంగా ఇది ఓ పట్టాన కంట్రోల్‌ లోకి రాదు.. అందుకే.. దీనికో మందు గుర్తించారు శాస్త్రవేత్తలు.
అదే రెడ్‌వైన్‌..
అవును.. రెడ్‌వైన్‌ మీ డయాబిటీస్‌ను కంట్రోల్‌లో ఉంచుతుంది. లండన్‌లో నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైంది.. ప్రతిరోజూ కొంచెం రెడ్‌వైన్‌ తీసుకోవడం ద్వారా.. శరీరంలోని చక్కెర శాతాన్ని నియంత్రించుకోవచ్చట.! సాధారణంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో అలసట, గుండెపోటు, నరాల బలహీనత, అంధత్వం లాంటి సమస్యలు కనిపిస్తాయి. కేవలం చక్కెర శాతాన్ని నియంత్రించుకోవడం ద్వారా వీటన్నింటినీ అదుపులో పెట్టుకోవచ్చు. ద్రాక్ష పైపొరలోని పాలీఫినైల్స్.. శరీరంలోని గ్లూకోజ్‌ లెవల్స్‌ని తగిన మోతాదులో ఉంచుతాయి. దాదాపు 12 రకాల రెడ్‌వైన్స్‌ని పరిశీలించిన నిర్వాహకులు.. వాటిలో పాలీఫినైల్స్‌ అధికంగా ఉన్నట్లు గుర్తించారు. అందుకే డయాబిటీస్‌తో బాధపడుతున్నవారికి రెడ్‌వైన్‌ ఎంతో ఉపయోగపడుతుందట.!

తక్కువ తాగితేనే..!
అయితే.. ఇవన్నీ మతిలేని పరిశోధనలని బ్రిటీష్‌ ప్రభుత్వ పరిశోధన సంస్థ- డయాబిటీస్‌ యూకే కొట్టిపడేసింది. వైన్‌ ఎక్కువగా తీసుకుంటే స్థూలకాయంతో బాధపడాల్సి వస్తుందని హెచ్చరించింది.

Sunday, November 21, 2010

సాక్షి: సోనియాపై కథనం - ఓ నిజం

     125 ఏళ్ల కాంగ్రెస్ పార్టీపై సాక్షి టీవీలో ప్రసారమైన కథనం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఇది కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి వ్యతిరేకంగా ఉందని.. సాక్షి టీవీలో (వేరే మీడియాలో రావొచ్చు) ఇలాంటి కథనాలు ప్రసారం చేయడం తగదని.. ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు రోడ్డెక్కారు. సాక్షి ప్రధాన కార్యాలయం ఎదుట సాక్షాత్తూ కొందరు మంత్రులు ధర్నాకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా సాక్షి దినపత్రిక ప్రతులను తగలబెడుతున్నారు.

ఏం జరిగింది.?
     కాంగ్రెస్ పార్టీ 125ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సాక్షి టీవీలో ఓ విశ్లేషణాత్మక కార్యక్రమం ప్రసారమైంది. ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్ పార్టీ తీరుతెన్నులు.. నానాటికీ తగ్గిపోతున్న ప్రాభవం అంటూ.. పార్టీ అధినేత్రి సోనియాపై కాస్త ఘాటైన వ్యాఖ్యలే కథనంలో కనిపించాయి.  ఇది జీర్ణించుకోలేని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలు సాక్షి టీవీపై మండిపడుతున్నారు. జగన్ కావాలనే ఇలాంటి కథనాలు ప్రసారం చేయిస్తున్నారని ధ్వజమెత్తుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పత్రికా దహనాలు, కార్యాలయాల ఎదుట ధర్నాలు మామూలైపోయాయి.

వ్యతిరేక కథనాలు ప్రసారం చేయకూడదా..?
     వాస్తవానికి రాజకీయాలు కావొచ్చు, ప్రభుత్వాలు కావొచ్చు..మరేదైనా అంశం కావొచ్చు.. వాటిపై సవివరంగా విశ్లేషించి.. ప్రసారం చేసే హక్కు మీడియాకు ఉంది. వాటిలోని మంచిచెడులను ప్రజలకు వివరించే బాధ్యత కూడా ఉంది. సాక్షికూడా ఇప్పుడు.. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితిని కళ్లకుకట్టింది. యూపీఏ ప్రభుత్వ కుంభకోణాలు, నానాటికీ దిగజారిపోతున్న పార్టీ ప్రాభవం, సోనియా పనితీరు.. లాంటి అంశాలను ప్రజల ముందుంచింది.

మరెందుకు వివాదం..?
     సాక్షి పత్రిక ప్రారంభమైనప్పటి నుంచి...(అంతకుముందు నుంచీ కూడా) దాన్ని తమ పత్రికగా భావించారు కాంగ్రెస్ పార్టీ నేతలు. కార్యకర్తలు. ఇందుకు ఆ పత్రిక యాజమాన్యం కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్... ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక ఆ రెండు పత్రికలు అంటూ బురదజల్లేవారు. వీటికి తగిన బుద్ధి చెప్పేందుకు మనకూ ఓ పత్రిక వస్తోందని తరచూ చెప్పేవారు. ఈ మాటలు కాంగ్రెస్ శ్రేణులకు బాగా వంటబట్టాయి. పత్రికను, రాజకీయాన్ని వేర్వేరుగా చూడాల్సిందిపోయి.. సాక్షి అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే సాక్షి అనే స్థాయికి వాటి మధ్య బంధం ఏర్పడిపోయింది.
     అయితే.. వై.ఎస్.హఠాన్మరణంతో సీన్ రివర్స్ అయింది. తండ్రి తర్వాత తానే ముఖ్యమంత్రి అని భావించిన జగన్.. ఆ కోరిక నెరవేరకపోవడంతో అధిష్టానంపై కక్షగట్టారు. క్రమంగా అధిష్టానం కూడా జగన్ వర్గీయులను సాగనంపుతుండడంతో అధిష్టానం ఆలోచనలను పసిగట్టిన పార్టీ శ్రేణులు కూడా జగన్ కు దూరమవుతూ వస్తున్నాయి. అందులో భాగంగానే.. ఒకప్పుడు సాక్షి తమదే అని భావించిన కాంగ్రెస్ శ్రేణులు.. ఇప్పుడు దానిపై కక్షగట్టాయి.

తాను తీసుకున్న గోతిలోనే..!
    సాక్షి యాజమాన్యం ఇప్పుడు  తాను తీసుకున్న గోతిలో తానే పడింది. పార్టీ పత్రికగా సాక్షిని ప్రచారం చేయడం ఎంత తప్పో ఇప్పుడు తెలిసివచ్చింది. రాజకీయనాయకుల చేతుల్లోని పత్రికలకు.. రాజకీయాలను, మీడియాను వేరుచేసి చూపడం అంత ఈజీకాదని మరోసారి రుజువైంది. పత్రిక ప్రారంభోత్సవంలోనూ, ఆ తర్వాత పలు సందర్భాల్లో సాక్షి ఎండీ జగన్మోహన్ రెడ్డి, ఆయన తండ్రి వై.ఎస్.ఆర్.. సాక్షి నాణేనికి రెండువైపులా చూపుతుందని చెప్పుకొచ్చారు. కానీ అవేవీ పార్టీ శ్రేణులను ప్రభావితం చేయలేకపోయాయి. అయితే.. వై.ఎస్.మరణం తర్వాత కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కూడా క్రమంగా సాక్షికి దూరమైపోయారు. ఇప్పుడు జగన్ కావాలనే ఇలాంటి కథనాలను ప్రసారం చేయిస్తున్నారని ఆ పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. వీటిని కూడా తోసిపుచ్చలేం..

జగనే సాక్షి - సాక్షే జగన్!
     సాక్షి ప్రారంభమైనప్పటి నుంచి అదెప్పుడూ ప్రజాపత్రికగా వ్యవహరించలేదు. పార్టీ పత్రికగానే గుర్తింపు తెచ్చుకుంది. జగన్ ఓదార్పుయాత్ర సమయంలో మిగిలిన వార్తలన్నింటినీ పక్కనపెట్టి.. 24గంటలూ దాన్నే ప్రసారం చేసింది. అలాంటిదాన్ని ప్రజలపక్షం అని ఎలా అంటాం.? అందుకే ఇప్పుడు సోనియాపై కథనాలు కూడా జగన్ వ్యూహరచనలో భాగమేనని అందరూ భావిస్తున్నారు.

Saturday, November 20, 2010

మతిలేని ప్రభుత్వం

ఎస్సై పరీక్ష వాయిదా వేసి ప్రభుత్వం తన చేతగాని తనాన్ని మరోసారి నిరూపించుకుంది. ఫ్రీజోన్ అంశం తేలేవరకూ ఎస్సై పరీక్ష వాయిదా వేయాలంటూ తెలంగాణా వ్యాప్తంగా నిరసనలు తలెత్తాయి. ఉస్మానియా యూనివర్సిటీ భగ్గుమంది. వీధుల్లోకి వచ్చిన విద్యార్థులు నానా హంగామా చేశారు. పరిస్థితి చేయిదాటిపోతోందని గ్రహించిన ప్రభుత్వం.. వెంటనే ఎస్సై పరీక్షను అన్నిచోట్లా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. 24 గంటల్లోనే నిర్ణయం మార్చుకుంది.

భగ్గుమన్న సీమాంధ్ర
     ఎస్సై పరీక్షను వాయిదా వేస్తున్నట్లు హోంమంత్రి అలా ప్రకటించారో లేదో అప్పుడే సీమాంధ్రలో నిరసన జ్వాలలు ఎగసిపడ్డాయి. తెలంగాణ విద్యార్థుల ఒత్తిడికి తలొగ్గి.. ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని సీమాంధ్ర విద్యార్థులు ఆరోపించారు. ప్రభుత్వాన్ని నడిపేది పాలకులా.. లేక తెలంగాణ విద్యార్థులా అని ప్రశ్నించారు.. వీధుల్లోకి వచ్చి నానా హంగామా చేసేసరికి.. ప్రభుత్వం వెనుకంజ వేసి పరీక్ష వాయిదా వేసిందని.. ఇప్పుడు తాము కూడా వీధుల్లోకి వచ్చాం కాబట్టి పరీక్ష జరపాలని డిమాండ్ చేస్తున్నారు..

చేతకాని ప్రభుత్వం
     ప్రస్తుతం రాష్ట్రంలో మళ్లీ గతేడాది డిసెంబర్ నాటి పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ భగ్గుమంటుంటే.. సీమాంధ్ర శాంతంగా ఉంటోంది. అదే తెలంగాణ ప్రశాంతంగా ఉంటే సీమాంధ్రలో పరిస్థితి విరుద్ధంగా ఉంటోంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఇరుప్రాంతాలను ప్రభావితం చేస్తాయని తెలుసు. కానీ ప్రభుత్వం మాత్రం ఇవేవీ ఆలోచించినట్లు లేదు.. ఎస్సై పరీక్ష వాయిదా వేసే ముందు.. సీమాంధ్రలో నిరసన జ్వాలలు వస్తాయని ప్రభుత్వం ఎందుకు గ్రహించలేదు.? తెలంగాణ విద్యార్థుల ఆందోళనలకు తలొగ్గి.. పరీక్ష వాయిదే వేస్తే.. సీమాంధ్ర విద్యార్థులు ఊరుకుంటారని ప్రభుత్వ పెద్దలు తప్పుడు అంచనా వేశారు. దాని ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నారు.
      ప్రభుత్వం నిర్ణయం తీసుకునేముందు.. ఇరు ప్రాంత విద్యార్థులతో చర్చించి సామరస్యపూరక వాతావరణం కల్పించి ఉంటే బాగుండేది. పరిస్థితిని ఇరుప్రాంతాలవారికి వివరిస్తే.. వాళ్లు తప్పకుండా అర్థం చేసుకుంటారు. అలా చేయకుండా.. ప్రభుత్వం తన ఇష్టానుసారం వ్యవహరించింది. తన చేతగానితనాన్ని మరోసారి నిరూపించుకుంది..

Friday, November 19, 2010

హాయ్

హాయ్ ఫ్రెండ్స్...
బ్లాగ్ ప్రపంచంలోకి వచ్చినందుకు ఆనందంగా ఉంది. కొన్నిసార్లు మనసులో ఏవేవో ఆలోచనలు తన్నుకొస్తుంటాయి. వాటిని అందరితో పంచుకోవాలనిపిస్తుంటుంది. అందుకే ఓ బ్లాగ్ ఉంటే బాగుండు అనిపించింది. అందులో భాగమే ఈ 'నా లోకం' బ్లాగ్..
     నా లోకాన్ని మీరందరూ ఆదరిస్తారని ఆశిస్తూ....

సి.ఎల్.ఎన్.రాజు