Friday, December 16, 2011

సీఎం కిరణ్ కుమార్తెను చూశారా..?

       ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి సంబంధించిన వివరాలు పెద్దగా తెలియవు. అతని ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ అందరికీ తెలిసినా.. కుటుంబసభ్యులు మాత్రం పెద్దగా వార్తల్లో కనిపించరు.. ఆయన సతీమణిని కూడా చాలా మంది చూసి ఉండరు.. కానీ గురువారం హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో కిరణ్ సతీమణితో పాటు కుమార్తె కూడా తళుక్కుమంది.. వాళ్లు సీఎం భార్య, కుమార్తె అనే విషయం అక్కడ చాలా మందికి తెలియదు. ఎందుకంటే.. వాళ్లు చాలా కూల్ గా వచ్చి విజిటర్స్ గ్యాలరీలో కూర్చుని ఫ్యాషన్ షోను తిలకించారు..

Wednesday, December 07, 2011

ఇదేనా జేపీ సత్తా..?

     రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును ఓటర్లందరూ తప్పనిసరిగా వినియోగించుకుని సత్తా చాటాలనేది లోక్ సత్తా ప్రాథమిక సిద్ధాంతం. ఇందుకోసం లోక్ సత్తా మొదటి నుంచి విస్తృత ప్రచారం చేసింది. ఓటు హక్కు వినియోగంపై లోక్ సత్తా అధినేత డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ వేలాది ఉపన్యాసాలు ఇచ్చి ఉంటారు.. 

     కానీ అసెంబ్లీ అవిశ్వాస తీర్మానం సందర్భంగా జేపీ ఓటుహక్కును వినియోగించుకోకపోవడం పలువురిని ఆశ్చర్యపరిచింది. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేస్తానంటూ ముందునుంచీ చెప్తూ వచ్చిన జేపీ.. తీరా ఓటింగ్ సమయానికి వచ్చేసరికి తటస్థంగా ఉండిపోయారు. ఇందుకు కారణాలేమిటో ఆయన కూడా స్పష్టంగా వెల్లడించలేదు.. తనది నిర్ణయాత్మక ఓటు కాకపోవడంతో తటస్థంగా ఉండిపోయానంటూ జేపీ చెప్పిన వివరణ సహేతుకంగా అనిపించలేదు. 

      అవిశ్వాస తీర్మానం అసెంబ్లీ ముందుకొచ్చేంతవరకూ మద్దతిస్తానని చెప్పిన జేపీ.. ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించడంపై తెరవెనుక ఏమైనా లాలూచీ పడ్డారా అనే సందేహం కూడా వినిపిస్తోంది. ఏదేమైనా పదిమందికీ ఉపన్యాసాలిచ్చే వ్యక్తి దాన్ని తనే ఆచరణలో పెట్టకపోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోందు. ముఖ్యంగా యువతలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్న జేపీ ఇలా వ్యవహరించడం ఆయన చిత్తశుద్ధికి తీరని మచ్చే..!

Saturday, December 03, 2011

సెక్స్‌ స్కూల్


డ్రైవింగ్‌ స్కూల్‌... డ్యాన్స్‌ స్కూల్‌... నర్సింగ్‌ స్కూల్... రెసిడెన్షియల్ స్కూల్... సెక్స్‌ స్కూల్..!! ఇదేంటీ.. లాస్ట్‌ చెప్పిన స్కూల్‌ పేరు కొత్తగా ఉందే అనుకుంటున్నారా..? లేకుంటే మేం తప్పు చదివామేమోనని ఫీలవుతున్నారా..? అలాంటిదేం లేదండీ.. మేం చదివింది కరెక్టే..!! అది - సెక్స్‌ స్కూలే..!! అవును.. ప్రపంచంలోనే తొలి సెక్స్‌ స్కూల్ ఆస్ట్రియాలో ప్రారంభమైంది..

ది ఆస్ట్రియన్ ఇంటర్నేషనల్ సెక్స్‌ స్కూల్..! పేరు వినగానే ఇక్కడ ఏం నేర్పిస్తారో మీకు ఈపాటికే అర్థమైపోయి ఉంటుంది.. అవును మనం ఊహించినట్లే ఇక్కడ సెక్స్‌లో మెళకువలు నేర్పిస్తారు.. సాధారణంగా సెక్స్‌ అనగానే నాలుగు గోడల మధ్య జరిగే రహస్య కార్యక్రమంగా భావిస్తారు.. కానీ ఈ స్కూల్‌ హెడ్‌మిస్సెస్ - వైల్వా మారియా మాత్రం అలా భావించలేదు.. సెక్స్‌ అనేది అంతులేని ఆనందాన్ని కలిగించే మధురానిభూతిగా మారియా వర్ణిస్తున్నారు. అందులో తెలియని ఎన్నో రహస్యాలు ఉన్నాయని.. వాటిలో మెళకువలు నేర్పించేందుకే సెక్స్‌ స్కూల్‌ను స్టార్ట్ చేసినట్లు ఆమె చెబుతున్నారు..

ఇది కో ఎడ్యుకేషన్ స్కూల్‌.. అంటే అమ్మాయిలు-అబ్బాయిలు కలిసి చదువుకునే పాఠశాల..! ఇందులో ప్రవేశం పొందాలంటే ఒక్కో టర్మ్‌కు 14వందల పౌండ్లు.. అంటే మన కరెన్సీలో లక్షా 13వేల రూపాయలు చెల్లించాలి.. 16 ఏళ్ల పైబడిన యువతీయువకులెవరైనా ఈ సెక్స్‌ స్కూల్‌లో చేరేందుకు అర్హులు!
 
కోర్సు సమయంలో అమ్మాయిలు-అబ్బాయిలు కలిసే ఉండాలి.. ఒకే గదిలో తమకు అసైన్ చేసిన హోంవర్క్‌ను పూర్తి చేయాలి.. థియరీ కంటే ఇక్కడ ప్రాక్టికల్స్‌కే అధిక ప్రాధాన్యమిస్తారు. శృంగార భంగిమలు, శృంగారం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మానవ శరీర నిర్మాణం.. ఇలా పలు అంశాలను శిక్షణలో భాగంగా నేర్పిస్తారు.. మంచి లవర్లుగా తీర్చిదిద్దుతారు.. కోర్సును దిగ్విజయంగా పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్ కూడా ఇస్తారు.

ప్రపంచంలో ఇదే మొట్టమొదటి సెక్స్‌ స్కూల్‌.! ఇప్పటికే ఇదే ఆస్ట్రియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ స్కూల్‌ యాడ్స్‌పై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఓ టీవీ చానల్‌ ఇప్పటికే ఈ స్కూల్‌ ప్రకటనలను నిషేదించింది. అయినే స్కూల్‌ యాజమాన్యం మాత్రం ఇవేవీ లెక్క చేయట్లేదు.. తమ స్కూల్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తుందని దీమాగా చెబుతోంది.

Sunday, November 13, 2011

భారతీయులంటే వీళ్లే...!!

           సాధారణంగా భారతదేశంలో ప్రజలు బద్దకస్తులు.. ప్రపంచ పరిణామాలను చాలా నెమ్మదిగా అంగీకరిస్తారు. మార్పును కోరుకోవడానికి వెంటనే సిద్ధపడరు.. ఎవరో ఒకరు ఒక మార్పును అంగీకరిస్తే.. వారిని చూసి మరొకరు అంగీకరిస్తారు. అంతేకానీ.. తనకు తానుగా కొత్తను స్వీకరించేందుకు ముందుకు రారు..

     భారతీయులపైన చాలా విమర్శలున్నాయి.. ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లేందుకు భారతీయులెవరూ సిద్ధపడరు.. హైక్లాస్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కావాలి.. అక్కడే చికిత్స చేయించుకోవాలనుకుంటారు.. ఎందుకంటే మన ప్రభుత్వాసుపత్రులపైన మనకు అంత నమ్మకం మరి..!!

     అలాగే.. ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలను చదివించేందుకు కూడా చాలా మంది ఒప్పుకోరు. ఎందుకంటే.. అక్కడ సరైన వసతులు ఉండవని.. టీచర్లు సరిగా స్కూలుకు రారని.. ఇలా ఎన్నో కారణాలు!!

     ఇక.. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే బస్సులను కూడా చాలా మంది ప్రయాణికులు తిట్టుకుంటూనే ఎక్కుతారు.. ఎక్కిన తర్వాత కూడా అద్దాలు లేవనో.. ఇంజిన్ సౌండ్ వస్తోందనో.. సీట్లు సక్రమంగా లేవనో .. నానా బూతులు తిడుతుంటారు.. లేటెస్ట ఇసూజూ ఇంజిన్ ఉండే హైక్లాసు బస్సులనే ఇష్టపడతారు..

     కానీ ఒక్క విషయంలో మాత్రం ప్రభుత్వం అంటే ప్రజలకు విపరీతమైన ప్రేమ..! అదేంటో తెలుసా.. ప్రభుత్వ ఉద్యోగం..!! అన్ని ప్రభుత్వ సర్వీసులను నానా బూతులు తిట్టే ప్రజలు.. గవర్నమెంట్ జాబ్స్ కోసం మాత్రం విపరీతంగా ట్రై చేస్తారు.. ఒక్క ఉద్యోగం ఇవ్వండటూ కాళ్లా వేళ్లా పడుతుంటారు.. సాధారణంగా "ప్రభుత్వ" అనే పేరు వినగానే చీత్కరించుకునేవాళ్లు.. ఉద్యోగం విషయానికొచ్చేటప్పటికి నానా సంబరపడిపోతుంటారు..
 
     ఇంతకూ ప్రభుత్వ ఉద్యోగం కోసం వీళ్లెందుకు అంత ఉత్సాహం చూపిస్తారో... మీకు అర్థమయిందిగా..!! దటీజ్ ఇండియా..!! దటీజ్ ఇండియన్స్..!!! ప్రౌడ్ టు బి యాన్ ఇండియన్..!!!

Thursday, October 27, 2011

మళ్లీ ముందుకు..!

హాయ్ ఫ్రెండ్స్..
ఇటీవలికాలంలో కొన్ని కారణాల వల్ల బ్లాగుకు దూరంగా ఉన్నాను.. కానీ ఇకపై క్రమం తప్పకుండా పోస్టులు రాసేందుకు ప్రయత్నిస్తాను.. త్వరలోనే ఓ మంచి పోస్టుతో మీ ముందుంటాను..
థ్యాంక్యూ...

Monday, September 05, 2011

టీమిండియాకు పూనమ్ పాండే కానుక

     పూనమ్ పాండే.. ఈ పేరు చాలా మందికి గుర్తుండే ఉంటుంది.. టీమిండియా వరల్డ్ కప్ గెలిస్తే.. ప్లేయర్ల ముందు నగ్నంగా  నిల్చుంటానంటూ ప్రామిస్ చేసిన మోడల్ ఈమే.! ఇప్పుడు మళ్లీ ఈ అందగత్తె వార్తల్లోకెక్కింది.. టీమిండియాకు కానుక అంటూ ఓ హాట్ హాట్ ఫోటోను రిలీజ్ చేసింది. ఇంగ్లండ్ గడ్డపై తొలి వన్డే రద్దయినప్పటికీ.. ఆ మ్యాచ్ లో టీమిండియా భేషుగ్గా ఆడిందని.. అందుకే వారికి ఈ హాట్ ఫోటోను కానుకగా ఇస్తున్నానని ప్రకటించింది. అంతేకాదండోయ్.. ముందు ముందు టీమిండియా మంచిగా ఆడితే మరిన్ని పసందైన చిత్రాలు రిలీజ్ చేస్తానంటోందీ అమ్మడు..! ఇదిగో.. ఈ ఫోటోయే టీమిండియాకు పూనమ్ పాండే ఇచ్చిన కానుక..!!



టీమిండియాకు కూడా ఈ టైమ్ లో ఇలాంటి కానుక చాలా అవసరం లెండి.. ఎందుకంటే.. టెస్టు మ్యాచ్ ల్లో వైట్ వాష్, ఏకైక ట్వంటీ 20లోనూ ఓటమి, గెలుస్తామనుకున్న మ్యాచ్ రద్దయిపోవడం.. లాంటి అననుకూల పరిణామాల మధ్య మన క్రికెట్ ప్లేయర్లకు ఇలాంటి కానుక కాస్త ఉత్సాహాన్నిస్తుందేమో చూడాలి మరి!! వాళ్ల సంగతేమో కానీ.. పూనమ్ పాండే మరిన్ని కానుకలకోసం అందాలను ఆస్వాదించే ఎంతోమంది ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కనీసం అలాంటివాళ్లకోసమైనా మన ప్లేయర్లు మంచిగా ఆడితే బాగుండు..!!

Monday, July 11, 2011

నేడో రేపో తెలంగాణ..!!

     తెలంగాణపై ప్రకటన చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభాన్ని వీలయినంత త్వరగా చక్కదిద్దాలని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోంది. అందులోభాగంగానే వారం, పది రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి కీలక ప్రకటన చేసేందుకు ఆ పార్టీ సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది.. ఇప్పటికే మూడు ప్రత్యామ్నాయాలను కూడా హైకమాండ్ రెడీ చేసినట్లు సమాచారం..

ఆప్షన్ 1: నిర్దిష్ట కాలపరిమితితో తెలంగాణను ప్రకటించడం

ఆప్షన్ 2: నిర్దిష్ట కాలపరిమితితో తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేస్తూ.. హైదరాబాద్ పై విస్తృతంగా చర్చించడం

ఆప్షన్ 3: రెండో ఎస్సార్సీ ఏర్పాటు చేయడం

ప్రస్తుతం ఈ మూడు ప్రత్యామ్నాయాలను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తయారుచేసినట్లు విశ్వసనీయ సమాచారం. వీటిపై ఇటు తెలంగాణవాదులు, అటు సమైక్యవాదుల అభిప్రాయాలను సేకరించి.. ఏదో ఒకదానిపై ఏకాభిప్రాయం సాధించి దాన్ని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.. 

ఈ ఆప్షన్స్ తో సమస్య సద్దుమణిగేనా..?
     ఈ మూడు ఆప్షన్స్ ను ఓ సారి పరిశీలిస్తే కొంతమేర సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టవచ్చని అర్థమవుతుంది..

ఆప్షన్ 1: నిర్దిష్ట కాలపరిమితితో తెలంగాణను ప్రకటించడం..:
     ఈ ఆప్షన్ అమలు చేసేందుకు సమైక్యవాదుల నుంచి వ్యతిరేకత రావడం సహజం.. ప్రస్తుతం యధాతథంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చేందుకు సమైక్యవాదులు అంగీకరించకపోవచ్చు.. కొంతకాలం ఇలాగే కొనసాగించినా.. ఆ తర్వాత తెలంగాణ విడిపోవడానికి వారి నుంచి సానుకూలత వస్తుందని ఆశించలేం..

ఆప్షన్ 2:  నిర్దిష్ట కాలపరిమితితో తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేస్తూ.. హైదరాబాద్ పై విస్తృతంగా చర్చించడం
     ఇది కొంతమేర ఏకాభిప్రాయ సాధనకు వీలయిన ఆప్షన్ గా కనిపిస్తోంది.. నిర్దిష్ట కాలపరిమితితో తెలంగాణ ఏర్పాటును ప్రకటిస్తే.. తెలంగాణ వాదుల నుంచి పెద్దగా అభ్యంతరాలు ఉండకపోవచ్చు.. అయితే.. హైదరాబాద్ లేని తెలంగాణను అంగీకరించేందుకు తెలంగాణవాదులు ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించరు. అదే సమయంలో హైదరాబాద్ పైనే ప్రస్తుతం సమైక్యవాదుల నుంచి పేచీ ఎదురవుతోందన్న విషయం తెలిసిందే..! అందుకే.. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రకటిస్తూ.. హైదరాబాద్ పై విస్తృతంగా చర్చించేందుకు సిద్ధమవడం ఇరుప్రాంతాలవారికీ కొంత సానుకూల పరిణామంగానే భావించవచ్చు.. విస్తృత చర్చల తర్వాత హైదరాబాద్ పై తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా ఇరుప్రాంతవాసులూ కట్టుబడి ఉంటే ఆ తర్వాత సమస్య ఉండకపోవచ్చు..

ఆప్షన్ 3: రెండో ఎస్సార్సీ ఏర్పాటు చేయడం..
     రెండో ఎస్సార్సీ ఏర్పాటు చేయడం అంటే.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును చెత్తకుప్పలో వేయడమే.. ఈ ఆప్షన్ కు సమైక్యవాదులు అంగీకరించినా.. తెలంగాణవాదులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరు. కాబట్టి ఆప్షన్ కు అవకాశమే లేదని అర్థమవుతుంది..

కనీసం ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ స్పందిస్తున్నందుకు సంతోషంగా ఉంది. నిర్ణయమేదైనా.. త్వరగా తీసుకుంటే ఇరుప్రాంతాలకు ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుంది.. ఈ ఆప్షన్స్ పైనైనా ఇరుప్రాంత నాయకులూ ఏకాభిప్రాయానికి రావాలని ఆశిద్దాం...

Thursday, July 07, 2011

దొంగల ముఠా కేంద్రం - DMK

ఎ. రాజా..
కనిమొళి
దయానిధి మారన్..

దొంగల ముఠా కేంద్రం (DMK)లో ప్రధాన సభ్యులు.. UPA ప్రభుత్వంలో ఎన్నో భాగస్వామ్య పక్షాలున్నాయి. ఆయా పార్టీలకు చెందిన మంత్రులెంతోమంది కేబినెట్ లో ఉన్నారు. అయితే.. ఎవరిపైనా లేనన్ని.. రానన్ని ఆరోపణలు కేవలం DMK సభ్యులపైన మాత్రమే రావడం ఆలోచించాల్సిన విషయం.. దేశాన్ని దోచుకోవాలనే పక్కా ప్లాన్ తోనే DMK... UPA ప్రభుత్వంలో చేరినట్లు కనిపిస్తోంది. ప్రభుత్వంలో చేరినది మొదలు వీరంతా.. సొంత వ్యవహారలను.. సొంత రాష్ట్ర ప్రయోజనాలను చక్కదిద్దుకునేందుకే ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తోంది. కనీసం తమిళనాడుకు ఎంతో కొంత మేలు జరిగినా బాగుండేది.. కానీ వీళ్లంతా.. సొంత ప్రయోజనాలకే పెద్దపీట వేశారు.

2G స్పెక్ట్రమ్ కుంభకోణంలో ఇప్పటికే దొంగల ముఠా కేంద్రం (DMK) అధ్యక్షుడు కరుణానిధి పార్టీకి చెందిన రాజా ఊచలు లెక్కబెడుతున్నారు. ఇక.. కూతురు కనిమొళి కూడా తీహార్ జైల్లో అల్లికలు నేర్చుకుంటూ పుస్తకాలు చదువుకుంటోంది.. ఇప్పుడు మనవడు దయానిధి మారన్ వంతు వచ్చింది. నేడో రేపో దయానిధి మారన్ కూడా తీహార్ జైలుకు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. పాపం ఈ వయసులో ముసలాయను ఎన్ని కష్టాలు వచ్చాయో..!

కుటుంబ రాజకీయాలు ఎంత ప్రమాదకరమో DMKను చూసి అర్థం చేసుకోవచ్చు.. కరుణానిధి నియంతృత్వ ధోరణి వల్లే.. కుటుంబసభ్యులకు తప్ప మరెవరికీ ఆ పార్టీలో అగ్రస్థానం దక్కలేదు. సొంత మనుషులు కావడంతో.. కరుణానిధి కూడా చూసీచూడనట్లు వ్యవహరించారు. చివరకు ఆ అలసత్వమే ఆయన కొంపముంచింది. రాజాను మందలిస్తే.. కనిమొళి ఏమనుకుంటుందోనని భయం.. ఎందుకంటే.. రాజాకు, కనిమొళికి మధ్య అంతటి సన్నిహిత సంబంధాలున్నాయి మరి..!

ఇక దయానిధి మారన్ మనవడైపోయాడు.. తమిళనాడులో దయానిధి మారన్ కు చెందిన సన్ నెట్ వర్క్ ప్రభావం అంతాఇంతా కాదు. దీంతో.. ఓ సారి తన్ని తరిమేసినా.. మళ్లీ దరిచేర్చుకున్నాడు. ఇక ఓ కుమారుడి ( స్టాలిన్)కు తమిళనాడు ఉపముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాడు. దీంతో.. ఇంకో కుమారుడు (అళగిరి) ఏమనుకుంటాడోనని తనను ఏకంగా కేంద్ర మంత్రి పదవి ఇప్పించాడు.. ఇదీ దొంగలముఠా కేంద్రం కుటుంబ పాలన..!

మొత్తానికి ఇంటిదొంగలు తిన్న ఇంటి వాసాలు లెక్కపెడుతున్నా... మీడియా కోడై కూసేంతవరకూ ప్రధాని మన్మోహన్ సింగ్ పట్టించుకోకపోవడం బాధాకరం. అయనా.. ఆయన చేతిలో ఏముందిలే! వీళ్లను బయటకు పంపిస్తే.. తన సీటుకే ఎసరు వస్తుందేమోనని ఆయన భయం..!

ఇంటిపనులు చక్కదిద్దుకోలేక కరుణానిధి చచ్చిపోతుంటే... మరోవైపు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, కరుణానిధి పాపాల చిట్టా బయటకు తీస్తోంది. కరుణానిధి హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలను వెలికితీస్తోంది. అవి కూడా బయటకు వస్తే.. పాపం ఈ దొంగలముఠా అంతా కలిసి తీహార్ జైల్లో ఒకరు జేబులు మరొకరు కొట్టుకుని బతకాలేమో..?

Sunday, June 05, 2011

తొలకరి

తొలకరి పలకరించింది
సూర్య ప్రతాపానికి ఒంట్లో ఆవిరైపోయిన నీటికి.. కొత్త నీటిని జత చేస్తోంది
ఎండిపోయిన వాగూ వంకలపై గంగమ్మ పరవళ్లు తొక్కే సమయం వచ్చేసింది
మోడువారిన నేలను తనివితీరా ముద్దాడుతోంది..
భూమాత దాహమంతా తీరేలా తడిసి ముద్దవుతోంది


ఆకుపచ్చని ఆకుల్లోని తేమనంతా పీల్చుకున్న గాలి ఆకాశానికేగింది..
సత్తువనంతా పోగొట్టుకున్న పత్రం.. ఎండిపోయి నేల రాలింది..
రాలిన ఆకుల స్థానంలో మళ్లీ కొత్త ఆకులు మొలకెత్తబోతున్నాయి
ఎండిపోయిన చెట్ల కొమ్మలు మళ్లీ పచ్చగా కళకళలాడనున్నాయి

ఆకాశంలో నల్లని మబ్బులు కమ్ముకుంటున్నాయి..
ఉరుములు.. పిడుగులతో వాయుదేవుడు వచ్చేస్తున్నాడు..
పెరట్లో ఆరేసిన గుడ్డలను తొలగించేలోపే ముద్ద ముద్ద చేసేస్తున్నాడు
తువ్వాలు చుట్టుకుని గొడ్లు కాస్తున్న కాపర్లను చెట్లకిందకు పరుగులు తీయిస్తున్నాడు


నెలల తరబడి ఎదురుచూస్తున్న వానమట్టి వాసన మళ్లీ వచ్చేసింది
ఆరుగాలం శ్రమించి అలసిసొలసి రచ్చబండపై సేద తీరుతున్న అన్నదాతను తట్టి లేపుతోంది
పలుగు, పార పట్టి పొలాల వైపు పరుగులు తీయమంటోంది
రంకెలేస్తున్న ఎద్దులను కాడి కట్టమంటోంది
అన్నదాత ఆకలి తీరేలా మొలకలు విత్తమంటోంది
బీడువారిన మడులకు పచ్చకోక కప్పేందుకు వచ్చేస్తోంది
భూస్వాములను గిడ్డంగులను ఖాళీ చేయమంటోంది
పూటగడవని కూలీల మోములో చిరునవ్వులు చిందిస్తోంది
మగ మహారాజులను గోచీ కట్టమంటోంది..
మహాలక్ష్ములను చీరకొంగును బిగదీయమంటోంది..

వానావానా వల్లప్పా అంటూ పిల్లలంతా రాగాలు తీస్తున్నారు..
తొలకరికి తడిసి ముద్దవుతున్న పడుచుపిల్ల పెరట్లో పులకరించిపోతోంది
ఇంటి ముందు నీటిలో కాగితపు పడవులు పల్టీలు కొడుతున్నాయి
గలగలా పారుతున్న నీటికి బంకమట్టి అడ్డుకట్ట వేస్తోంది
బొప్పాయి కాండాలు తూములవుతున్నాయి
పాదాలకింద ఇసుక మట్టిని తోసుకెళ్తున్న తొలకరి గిలిగింతలు పెడుతోంది

చిటపట చినుకుల సవ్వడి సూర్యుడికే సవాల్ విసురుతోంది..
వడదెబ్బకు తన దగ్గర విరుగుడు ఉందంటోంది..
కారు మబ్బులను దాటే వరకూ భానుణ్ని తరిమితరిమి కొడుతోంది
మళ్లీ ఏడాది వరకూ ఇటువైపు చూడద్దంటోంది


(గమనిక: తొలకరి వస్తోందంటే పల్లెసీమలు పండగ వాతావరణాన్ని సంతరించుకుంటాయి. వీధుల్లో సందడి నెలకొంటుంది.. కొన్నేళ్లుగా నేనీ సందడికి దూరమైపోయా.. అందుకే నా అనుభవాలను అక్షరీకరించా..!)

Wednesday, June 01, 2011

మొబైల్ తో బ్రెయిన్ క్యాన్సర్..!!

     రోటీ, కపడా, మకాన్.. ఔర్‌ మొబైల్‌..! అవును మీరు విన్నది నిజమే.. ఇప్పుడు మొబైల్‌ ఫోన్ కూడా ప్రజల ప్రాథమిక అవసరంగా మారిపోయింది. అది జేబులో లేకుండా బయటకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు.. అయితే... రోటీ కపడా ఔర్‌ మకాన్‌ మనల్ని బతికిస్తుంటే... కొత్తగా వచ్చి చేరిన మొబైల్‌ మాత్రం మనల్ని నిలువునా చంపేస్తోంది...

     రోజూ గంటలకొద్దీ ఫోన్లు మాట్లాడేవారికి ఇది బ్యాడ్‌ న్యూస్‌..! మొబైల్‌ ఫోన్లలో గంటలకొద్దీ మాట్లాడుతుంటే.. మీకు త్వరలోనే బ్రెయిన్‌ క్యాన్సర్‌ రావొచ్చు..!! అవును ఇది నిజం. ఏదో అల్లాటప్పా సర్వే కాదిది.. సాక్షాత్తూ వరల్డ్‌ హెల్త్ ఆర్గనైజేషన్‌ చెబుతున్న అక్షర సత్యం.. 31 మంది శాస్త్రవేత్తలు 14 దేశాల్లో విస్తృతంగా పరిశోధనలు చేశారు. రోజూ 30 నిమిషాలపాటు ఫోన్లు మాట్లాడేవారిని ఈ సర్వేకి ప్రాతిపదికగా తీసుకుని.. పదేళ్లపాటు పరిశీలించారు.. మొబైల్‌ఫోన్లకు, బ్రెయిన్‌ క్యాన్సర్‌కున్న సంబంధంపై శాస్త్రీయంగా జరిగిన మొట్టమొదటి సర్వే ఇదే..!


     పదేళ్లపాటు రోజూ 30 నిమిషాలు ఫోన్లో మాట్లాడినవారికి బ్రెయిన్ క్యాన్సర్‌ వస్తున్నట్లు సర్వేలో తేలింది.. మరి జీవితకాలంపాటు ఫోన్ మాట్లాడే వారి పరిస్థితేంటి..? ప్రపంచవ్యాప్తంగా సుమారు 5వందల కోట్ల ఫోన్లు వాడుకలో ఉన్నాయి.. ఫోన్లతోపాటు.. ఫోన్లు వాడుతున్నవారి సంఖ్య కూడా ఏటికేడాది గణనీయంగా పెరిగిపోతోంది.

     కాన్సర్‌ను కలిగించే కారకాలలో ఇప్పటివరకూ సిగరెట్లు, సన్‌బెడ్లు, ఆస్‌బెస్టాస్‌లు ఉన్నాయి. ఈ జాబితాలో ఇప్పుడు మొబైల్‌ ఫోన్‌ కూడా చేరింది. చెవుల దగ్గర తిష్టవేసిన మొబైల్‌ ఫోన్లను వెంటనే తొలగించకపోతే.. గ్లియోమా అనే బ్రెయిన్‌ క్యాన్సర్‌ రావచ్చని WHO తెలిపింది.

     ఫోన్లు వాడుతున్నవారందరికీ క్యాన్సర్‌ వస్తుందని భావించాల్సిన అవసరం లేదని WHO వివరించింది. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మొబైల్‌ ప్రభావం నుంచి బయటపడవచ్చని సూచించింది. వాయిస్‌ కాల్స్‌ను నివారించి.. మెసేజ్‌ చేయడం ద్వారా.. హెడ్‌ఫోన్స్‌‌ను వాడడంద్వారా క్యాన్సర్‌ బారిన పడకుండా కాపాడుకోవచ్చని వెల్లడించింది.

     మొబైల్‌ ఫోన్లతో ముప్పును పసిగట్టిన ఫ్రాన్స్ ప్రభుత్వం ఇప్పటికే ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించింది. సెల్‌ఫోన్ల వల్ల కలిగే నష్టాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టింది.

Thursday, May 19, 2011

కుక్క కరిస్తే...!

రాష్ట్రంలో కుక్కకాటు మరణాలు ఇటీవల ఆందోళన కలిగిస్తున్నాయి. రోజుకు కనీసం ఒకరైనా రేబిస్ వ్యాధి బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. రేబిస్ వ్యాధికి ఇప్పటికీ చికిత్స అందుబాటులో లేదు. వ్యాధి సోకకముందు జాగ్రత్తలు తీసుకోవడం మినహా చేసేదేమీ లేదు. ఈ వ్యాధి సోకి బతికి బయటపడిన రోగులు ఇప్పటివరకూ దేశంలో ఎక్కడాలేరని గణాంకాలు చెబుతున్నాయి. అందువల్ల కుక్క కరిచినట్లయితే.. పెంపుడు కుక్క అయినా సరే తప్పనిసరిగా కొన్ని జాగ్త్రత్తలు పాటించాలి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు: 


* రేబిస్ సోకితే చికిత్స లేదు ... నివారణ ఒక్కటే మార్గం
* కుక్క కరచిన వెంటనే గాయాన్ని సబ్బుతో గానీ, డెటాల్‌తో గానీ బాగా శుభ్రం చేయాలి. ఎక్కువసార్లు శుభ్రం చేయడం మంచిది.
* ఆ వెంటనే ప్రొఫలాక్సిస్ అనే ఇంజెక్షన్‌ను ఇవ్వాలి. ఇది మూడు దఫాలుగా ఇస్తారు.
* సాధారణ కుక్కలకు మాత్రమే ఈ ఇంజక్షన్ వర్తిస్తుంది. రేబిస్ వ్యాధి ఉన్న కుక్కలూ, పిచ్చి కుక్కలూ కరిస్తే ఈ ఇంజెక్షన్ పనిచేయదు.
* కుక్క కరచిన భాగంలో కట్లు వేయడం గానీ, దూది పెట్టడం గానీ చేయకూడదు. గాయానికి గాలి తగిలేలా ఉంచడం వల్ల రేబిస్ వృద్ధి చెందకుండా ఉంటుంది.
* రేబిస్ వ్యాధి ఉన్న కుక్క కరిచినప్పుడు ఐదు డోస్‌ల ఏఆర్‌వీ (యాంటీ రేబిస్ వ్యాక్సిన్) తీసుకోవాల్సిందే.
* కరచిన రోజు, తర్వాత 7వ రోజు, 14 రోజు, 28వ రోజు తీసుకోవాలి. చివరగా 90 రోజులకు బూస్టర్ డోస్ వాడా లి. ఇంట్రా డెర్మల్ (చర్మానికి), ఇంట్రా మస్క్యులర్ (కండరాలకు) రెండు విధాలుగా ఇంజెక్షన్ చేయించుకోవచ్చు.
* రేబిస్ ఉన్న కుక్క కరిస్తే వ్యాధి ఏడాదిలోగా ఎప్పుడైనా సోకవచ్చు. అందుకే ఏఆర్‌వీ తప్పకుండా వాడాలి.
* ఇంట్లో పెంచుకుంటున్న కుక్కలకు (పెట్ డాగ్స్) తప్పనిసరిగా బీపీఎల్ ఇనాక్టివేటెడ్ బ్రెయిన్ టిష్యూ వ్యాక్సిన్ వేయించాలి. 5 ఎంఎల్ సింగిల్ డోస్ సరిపోతుంది.
* మెడ, ఛాతీ, ముఖం తదితర భాగాల్లో కుక్క కరిస్తే వెంటనే ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాళ్లు, చేతులపై కరిస్తే మొదటిరోజు నుంచి నాలుగేళ్లలోపు ఎప్పుడైనా రేబిస్ సోకే ప్రమాదముంది.
* కుక్క పిచ్చిదా, రేబిస్ వ్యాధి ఉన్నదా అని తేల్చుకోవాలి. వ్యాధి ఉన్న కుక్క అయితే పదిరోజులకు మించి బతకదు.
* రేబిస్ వ్యాధి లైజా అనే వైరస్ నుంచి వస్తుంది.
* ఈ వ్యాధి గబ్బిలం కరచినా (బాట్ రేబిస్) వచ్చే అవకాశముంది.
* రేబిస్ వ్యాధి సోకిన వ్యక్తి వెలుతురును చూసినా. గాలి వీచినా. నీళ్లను చూసినా భయపడవచ్చు.
* ఎక్కువమంది నీళ్లను చూసి భయపడతారు. దీన్నే హైడ్రోఫోబియా అంటారు.
* రేబిస్ అంటు వ్యాధి. వ్యాధి సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు తుంపర కళ్లలో లేదా నోట్లో పడినా రేబిస్ ఎదుటి వ్యక్తికి సోకుతుంది.
* రేబిస్ రోగి వద్ద ఉన్న సహాయకులు కూడా ప్రొఫలాక్సిస్ డోస్ వేసుకోవాలి.
* నరాల బలహీనత వస్తుంది. బాగా అసహనంతో ఉంటారు. కండరాల నొప్పులు తదితర లక్షణాలు
కనిపిస్తాయి. 



పెంపుడు కుక్క కరిచినా ముప్పే 

కుక్కల్లో రేబిస్ క్రిములు ఉంటాయని, పెంపుడు కుక్క అయినాసరే కరిచినప్పుడు రేబిస్ సోకే ప్రమాదముందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇటీవల రాజమండ్రి మున్సిపల్ కాలనీకి చెందిన మంగం లక్ష్మీబాయి (60), బుధవారం పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం కాల్దరికి చెందిన కవురు సుబ్బారావు (40)లు పెంపుడు కుక్కలు కరవడం వల్లే రేబిస్ సోకి మరణించారు. సాధారణంగా రేబిస్ సోకిన కుక్క 15 రోజుల్లో మృతి చెందుతుంది.

గతంలో కరిచిన కుక్క చనిపోతే రేబిస్ సోకే ప్రమాదముందని భయపడి బాధితులు బొడ్డు చుట్టూ ఇంజెక్షన్లు చేయించుకునేవారు. కాని నేడు పరిస్థితి తారుమారైంది. కరిచిన కుక్క నెలల తరబడి బాగానే ఉన్నప్పటికీ అది కరవడంతో రేబిస్ వ్యాధి సోకిన వ్యక్తులు మాత్రం చనిపోతున్నారు. దీనిని బట్టి పిచ్చికుక్కల్లోనే కాదు, మామూలుగా ఉండే పెంపుడు కుక్కల్లోనూ రేబిస్ క్రిములు ఉంటాయని తెలుస్తోంది.



సాక్షి సౌజన్యంతో... )

Sunday, May 01, 2011

మన దేహం దెయ్యమా...?

మనది దెయ్యాల దేహం..
మన దేహంలో అణువణువూ దెయ్యాలే
కళ్లు, కాళ్లు, చెవులు, ముక్కు, నోరు.. ప్రతిదీ దెయ్యం ప్రతిరూపమే..
మీ పొట్టి, పొడవులకు కారణం దెయ్యాలే
రంగు, స్వరూపానికీ కారణం అవే..
సంతోషం, దుఃఖం, కోపం, ఆనందం...
ఇవి కూడా దెయ్యాల నుంచి వచ్చినవే..
మీ విజయానికి కారణం దెయ్యాలే..
మీ పరాజయానికీ బాధ్యత వాటిదే..
పరీక్షల్లో పాసైనా.. ఫెయిలనా..
తప్పు మీది కాదు.. దెయ్యాలదే..
మీ ప్రస్తుత పరిస్థితికి... మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు.. కారణం ఆ దెయ్యాలే...

ఇంతకూ ఈ దెయ్యాల గోలేంటి..?

మన శరీరంలోని కొన్ని భాగాలు.. మన తల్లిదండ్రుల భాగాలను పోలి ఉంటాయి.. మన ముక్కు.. మన అమ్మ ముక్కును పోలి ఉండొచ్చు.. మన నడక.. మన తాత నడకను గుర్తుకు తేవచ్చు.. మనలో కొన్ని శరీర భాగాలు లేదా లక్షణాలు.. మన పూర్వీకుల నుంచి సంక్రమిస్తాయని తెలుసు.. అయితే.. మన పూర్వీకులకు సంబంధించిన అన్ని లక్షణాలు యధాతథంగా ఒక తరం నుంచి మరో తరానికి రాకపోవచ్చు.. ఉదాహరణకు.. మన తల్లిలోని అన్ని లక్షణాలు మనకు రాకపోవచ్చు.. కానీ తల్లిలోని కొన్ని అంశాలు మాత్రం తప్పకుండా మనలో కనిపిస్తాయి.. అందుకే.. కొంతమంది పిల్లల్ని చూసినప్పుడు.. అచ్చం తల్లిపోలికే అని.. లేదా తండ్రి పోలికే అనే మాటలు వినిపిస్తుంటాయి..

అసలు.. లక్షణాలు ఎలా వస్తాయి..? ఎందుకు వస్తాయి..?

జీవశాస్త్ర భాషలో చెప్పాలంటే.. ఒక తరం నుంచి మరో తరానికి సంక్రమించే లక్షణాలను అనువంశిక లక్షణాలు అంటాం.. జన్యువుల ద్వారా ఈ అనువంశిక లక్షణాలు పిల్లలకు సంక్రమిస్తాయి.. మనలో ఏదైనా లక్షణం మన పూర్వీకులను పోలి ఉంది అంటే.. దానికి కారణం జన్యువులే.. కానీ జన్యువులలో కూడా అప్పుడప్పుడు మార్పులు జరుగుతుంటాయి.. ఇలాంటి వాటిని ఉత్పరివర్తనాలు అంటాం.. అందువల్లే.. మనలోని అన్ని లక్షణాలు మన తల్లిదండ్రులను పోలి ఉండవు. అయితే.. మన లోని ప్రతి అంశం.. మన పూర్వీకుల నుంచి సంక్రమించిందే అని నిర్ధారణ అయింది.

మరి దెయ్యాలకు, ఈ లక్షణాలకు ఉన్న సంబంధమేంటి..?

తల్లిదండ్రుల నుంచి వచ్చిన కొన్ని జన్యువులు.. పిల్లల్లో కొన్ని లక్షణాలు లేదా వ్యాధులకు కారణమవుతాయని పరిశోధనలో తేలింది. తల్లిదండ్రులలోని కొన్ని లక్షణాలు యధాతథంగా పిల్లలకు సంక్రమిస్తున్నాయి. దీన్నే జన్యు ముద్రగా నిర్ధారించారు. అదేవిధంగా.. జన్యువును కొన్ని రసాయన చర్యలకు గురిచేయడం ద్వారా వేర్వేరు ఫలితాలను గుర్తించారు. తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమించే జన్యువులలో ఏదేని జన్యువు లోపించినా... లేక ఒక జన్యువు ఎక్కువగా వచ్చినా పిల్లల్లో విపరీత లక్షణాలు వస్తున్నాయి.

వంశపారంపర్యంగా వచ్చే కొన్ని వ్యాధులకు కూడా జన్యువులే కారణం. స్థూలకాయం, బట్టతల లాంటి అనేకం ఇందుకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. అలాగే.. క్రోమోజోముల్లో మార్పులు చేయడం ద్వారా అవసరానికి తగ్గట్లు శరీరాన్ని పెంచుకోవచ్చు.. తగ్గించుకోవచ్చు..

తల్లిదండ్రులలోనో.. తాతముత్తాతలకో జరిగిన ఓ మార్పు.. ఆ తర్వాతి తరాలకు సంక్రమిస్తే.. అలాంటివాటిని ట్రాన్స్‌ జెనరేషనల్‌ ఎఫెక్ట్స్‌ అంటారు.. తాతముత్తాతల తిండి మనమళ్లు,మనవరాళ్ల జీవితకాలంపై నేరుగా ప్రభావం చూపుతోందని పరిశోధనలు చెబుతున్నాయి.  కొంతమంది పిల్లల్లో తాతలకున్న డయాబిటీస్‌ వ్యాధి సంక్రమించింది.

తల్లిదండ్రుల ఆహారం, వారి వ్యాధులు, వాడిన మందులు.. తదితరవాటి ప్రభావం.. వారి పిల్లలపై స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాదు.. మన లైఫ్‌ స్టెయిల్ కూడా మన పిల్లలు, వారి పిల్లలపై ఇంపాక్ట్‌ చూపిస్తోంది. ఆల్కహాల్‌ సేవించడం, డ్రగ్స్‌ తీసుకోవడం, పొగతాగడం లాంటి దురలవాట్లతోపాటు.. ఎక్సర్‌సైజ్‌, పనిలో ఒత్తిడి లాంటి అంశాలు కూడా భావితరాలకు సంక్రమిస్తున్నాయి..

అంటే.. మనలోని ప్రతి లక్షణం మన పూర్వీకుల నుంచే వచ్చింది. అయితే.. వాళ్లెవరూ ఇప్పుడు మనతో లేరు. చనిపోయారు. అయినా.. వారిలోని ఏదో ఒక లక్షణం లేదా స్వభావం మన తల్లిదండ్రుల ద్వారా మనకు, మన ద్వారా మన భవిష్యత్ తరాలకు సంక్రమిస్తోంది.. చనిపోయినవారు దెయ్యాలై తిరుగుతుంటారని మనం భావిస్తుంటాం. అందుకే.. మన దేహం ఓ దెయ్యం.. ఇంకా వివరంగా చెప్పాలంటే.. మన దేహం దెయ్యాల సమూహం..

Sunday, April 24, 2011

సత్యసాయి బాబా ఇకలేరు



     కోట్లాది ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న భగవాన్ శ్రీ సత్యసాయిబాబా కన్నుమూశారు. ఉదయం 7.40 నిమిషాలకు ఆయన తుది శ్వాస విడిచినట్లు బాబా బంధువులు ప్రకటించారు. బాబా ఇకలేరనే సమాచారం తెలుసుకున్న భక్తులు పెద్దఎత్తున పుట్టపర్తి తరలి వెళ్తున్నారు. వారంతా శోకసంద్రంలో మునిగిపోయారు.. మరోవైపు పుట్టపర్తిలో గంభీర వాతావరణం నెలకొంది. 86 ఏళ్లుగా పుట్టపర్తిలోనే తిరగాడిన సత్యసాయి.. ఇప్పుడు ముల్లోకాలకు తన దివ్యసందేశాలను వినిపించేందుకు బయలుదేరారని భక్తులు భావిస్తున్నారు. 


మార్చి 29న అస్వస్థతకు గురైన సత్యసాయి బాబా పుట్టపర్తిలోని సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆయన ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడం, మూత్రపిండాలు సరిగా స్పందించకపోవడంతో బాబా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. చివరకు ఈ ఉదయం తుది శ్వాస విడిచారు. సత్యసాయి పార్థిక దేహాన్ని ఈ సాయంత్రం నుంచి కుల్వంత్ హాల్లో భక్తులకు అందుబాటులో ఉంచనున్నారు. 27వ తేదీ తేదీ ఉదయం స్వామివారికి తుది కార్యక్రమాలు నిర్వహించనున్నారు.


తాను దేవుడినని సత్యసాయి ఎప్పుడూ ప్రకటించుకోలేదు.. దేహమే దైవమన్నారు. పవిత్ర హృదయంతో తోటివారిని ప్రేమించమన్నారు. ఏదో ఒక మతం తరపునగానీ, ఒక సంఘం తరపున గానీ బాబా సందేశాలను వినిపించలేదు. అందుకే ఆయన వాక్కులు విశ్వవ్యాప్తమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా భక్తులను సంపాదించిపెట్టాయి.


ఆయన సందేశాలకంటే.. ఆయన చేసిన సేవా కార్యక్రమాలవల్లే సత్యసాయి ఎక్కువగా అభిమానులను సంపాదించుకున్నారు. ఆంధ్ర, కర్నాటకలలోని పలు జిల్లాల్లో తాగునీరు అందుతోందంటే.. అది బాబా పుణ్యమే.. అంతేకాదు.. నర్సరీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్య అందిస్తూ.. సూపర్్ స్పెషాలిటీ ఆసుపత్రుల ద్వారా మెరుగైన వైద్యం అందిస్తూ.. బాబా చేసిన సేవ ఎనలేనిది..


ప్రస్తుతం బాబా భౌతికంగా దూరమైనా.. ఆయన సందేశాలు మాత్రం ఎన్నటికీ దూరం కాలేవు. ప్రస్తుతం సత్యసాయి ట్రస్ట్... బాబా ఆశయాలను, సందేశాలను మరింత ఇనుమడింపజేసేందుకు కృషిచేయాలి. ఇదే సత్యసాయి బాబాకు మనం అందించే నిజమైన నివాళి అవుతుంది..

Friday, April 15, 2011

వండర్ విలేజ్!

అనగనగా ఓ ఊరు..
కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేదు
అయినా.. లక్షలాదిగా తరలివెళ్తున్న జనం..
సైన్స్‌కు చిక్కని అద్భుతం ఆ గ్రామం సొంతం
2 దేశాల్లో సంచలనం సృష్టిస్తున్న కుగ్రామం

ఒక్కోసారి కొందరి వ్యక్తులకు అనుకోని ప్రాధాన్యత లభిస్తుంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా జనం నోళ్లలో నానుతుంటారు. అలాగే కొన్ని ఊర్లు కూడా ఇదే కోవలోకి వస్తాయి. అక్కడ పుట్టిన వ్యక్తుల వల్లనో.. ప్రాంత విశిష్టత వల్లనో ఆ ఊరికి చెప్పలేనంత పేరు వస్తుంది. అలాగే ఆఫ్రికా ఖండంలో కూడా ఓ ఊరు ఇప్పుడు సంచలనంగా మారింది.. లక్షలాది మందిని తన దగ్గరికి రప్పించుకుంటూ.. అద్భుతం సృష్టిస్తోంది..

ఆఫ్రికా ఖండం ఒకప్పుడు చీకటి ఖండం. కానీ ఇప్పుడు ఆ ఖండం రూపురేఖలు మారిపోయాయి.. ఆ ఖండంలోని కొన్ని దేశాలు అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడుతున్నాయి. అయితే.. ఇప్పటికీ కనీసం 3 పూటలా తిండిలేని ప్రజలెంతో మంది అక్కడ నివశిస్తున్నారు. ఉగాండా, సోమాలియా, రువాండా, కాంగో.. లాంటి ఎన్నో దేశాల ప్రజలు ఆహార కొరతతో ఇబ్బంది పడుతున్నారు. అక్కడి ప్రజలకు వైద్య, వైద్య సౌకర్యాలు కూడా అంతంత మాత్రమే..

అపార వనరులున్నా.. వాటిని వినియోగించుకోలేని దుస్థితి ఆఫ్రికా ఖండ ప్రజలది.. ఇందుకు కారణాలు అనేకం.. అక్షరాస్యత లేకపోవడం అభివృద్ధి వెనుకబాటుతనానికి ప్రధాన కారణం. మూఢనమ్మకాలు కూడా అక్కడి ప్రజలను ఆధునికతవైపు నడిపించలేకపోతున్నాయి. అందుకే.. కనీసం దుస్తులు కూడా వేసుకోని ప్రజలనెందరినో మనం ఇప్పటికీ ఆఫ్రికా ఖండంలో చూడొచ్చు..

ఇప్పుడు మనం చెప్పుకోబోయే గ్రామం కూడా ఆఫ్రికా ఖండంలోనే ఉంది. ఇంకా వివరాల్లోకి వెళ్తే.. టాంజానియా దేశంలోని ఓ మారుమూల పల్లె ఇది... దీని పేరు- సముంగె! అరుషా అనే నగరానికి 4వందల కిలోమీటర్ల దూరంలో ఈ సముంగె గ్రామం ఉంటుంది. ఇప్పుడిది ఓ సంచలనం.. టాంజానియా, కెన్యా దేశాలకు చెందిన లక్షలాది మంది ఈ మారుమూల పల్లెకు తరలివస్తున్నారు. అంతేకాదు.. విదేశీయులు కూడా ఇప్పుడిప్పుడే ఈ ఊరికి రావడం మొదలుపెట్టారు..

ఈ ఊరికి కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేదు. ఒకప్పుడు కాలిబాటే ఈ ఊరెళ్లడానికి మార్గం. కానీ ఇటీవలే వాహనాలు రావడం మొదలుపెట్టాయి. అవి కూడా రాళ్లు, గుట్టలు, వాగులు దాటుకుని రావాల్సిందే.. ఈ ఊరికి వెళ్లడం సాహసంతో కూడుకున్నపని.. రోడ్డు మార్గం లేకపోవడంతో.. వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోతుంటాయి. కనీసం వాటిని రిపేర్‌ చేసుకోవడానకి అక్కడ మెకానిక్‌లు కూడా కనిపించరు. వాహనదారులే వాటిని రిపేర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే.. మార్గమధ్యంలో ఎక్కడపడితే అక్కడ ఆగిపోయిన వాహనాలు.. వాటిని రిపేర్‌ చేసుకుంటున్నవారు మనకు కనిపిస్తుంటారు..

సముంగె గ్రామానికి ఘన చరిత్రేమీ లేదు.. ఈ ఏడాది జనవరి నుంచే ఇది ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా గత మూడు వారాల నుంచి ఈ ఊరికి వస్తున్న ప్రజల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఇక్కడికి వస్తున్నవారిలో చిన్నా పెద్దా అనే తేడా లేదు... పేద, ధనిక అనే బేధం లేదు.. తరతమ బేధాలు లేకుండా అందరూ ఇక్కడికి వస్తున్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా భరిస్తున్నారు.. సమీప గ్రామాల ప్రజలు కిలోమీటర్లకొద్దీ నడిచి వస్తున్నారు. కొంతమంది జీపుల్లో వస్తున్నారు. ఇక.. బాగా ఉన్న నేతలు హెలికాప్టర్లలో కూడా వస్తున్నారు..

ఇన్ని కష్టాలు పడి వారెందుకు అక్కడికి వెళ్తున్నారు..?

అంటే... అక్కడేమీ లేదు.. వారు వెళ్తున్నది కేవలం ఓ వ్యక్తికోసమే..!! అంబిలికిలె మ్వసపిలె అనే ఇతనికోసమే ప్రజలంతా వెళ్తున్నారు. ఇతనిప్పుడు టాంజానియాలో పెద్ద సెలబ్రిటీ..!

మ్వసపిలె ఏంచేస్తాడు..?

మ్వసపిలె చర్చిలో పాస్టర్‌గా పనిచేసి రిటైరయ్యాడు.. దేవుడు శాసిస్తాడు.. నేను పాటిస్తాను అనే రకం ఇతను..!! దేవుడన్నా.. అతని మహిమలన్నాఇతనికి విశ్వాసం ఎక్కువ..కొన్నేళ్లక్రితం దేవుడు కలలో కనిపించి.. ప్రజలకు ఏదైనా సేవ చేయాలని ఆదేశించారట..! అయితే ఆ విషయాన్ని మ్వసపిలె పెద్దగా పట్టించుకోలేదు. కానీ.. 2009లో మరోసారి దేవుడు ప్రత్యక్షమై మరోసారి ఆదేశించారట! అంతే.. ఇక.. అప్పటి నుంచి ఆయన ప్రజల సేవలో మునిగిపోయారు.. తనకు చేతనైననంత మేలు చేయాలని భావించారు...

సముంగెలోని తన ఇంటివద్దే ఒక చిన్న క్లినిక్‌ను స్టార్ట్‌ చేశాడు మ్వసపిలె! తన దగ్గరికి వచ్చేవాళ్లకు మందులివ్వడం.. వ్యాధిని నయం చేయడం అతను చేస్తున్న సేవ..! సేవ అంటే ఫ్రీగా చికిత్స చేస్తున్నాడనుకుంటే పొరపాటే..! చేసిన వైద్యానికి డబ్బులు వసూలు చేస్తాడు...!! అయినా మ్వసపిలె కోసం ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు.. తనేమీ స్వామీజీ కాదు.. తనకు దివ్యశక్తులు ఉన్నాయని తానెప్పుడూ ప్రకటించుకోలేదు.. తన దగ్గరికి రావాలని ఎవరినీ కోరలేదు.. అయినా ప్రజలు ఇతనికోసం పడిచస్తున్నారు... వచ్చే వాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందే కానీ.. తగ్గడం లేదు..

జనవరి వరకూ మ్వసపిలె గురించికానీ.. సముంగె ఊరి గురించి కానీ ఎవరికీ పెద్దగా తెలియదు. లోలియోండో ప్రాంతంలో ఇలాంటి ఓ ఊరుందని తెలుసుకానీ.. ఆ ఊరికి ఒక్కసారిగా ఇంతపేరు వస్తుందని ఎవరూ ఊహించలేదు.. కానీ సముంగె పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఇదంతా మ్వసపిలె వల్లే అంటారు స్థానికులు..

జనం ఎందుకు వస్తున్నారు?

అంటే.. అతని చికిత్స కోసమే..! అవును అతని వైద్యం కోసమే జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు.. మరి అతను చేస్తున్న వైద్యం ఏంటి..? ఆ వైద్యంలో ఉన్న మహత్తు ఏంటి..? మ్వసపిలె ఎలాంటి వైద్య విద్యా అభ్యసించలేదు.. అయినా.. అతను చేస్తున్న చికిత్స మాత్రం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మార్మాగిపోతోంది..

మరి మ్వసపిలె చేస్తున్న చికిత్స ఏంటి..? 

ఏమీ లేదండీ..! కేవలం అతను ఓ పానీయాన్ని అందిస్తారు.. అదే అతడు చేస్తున్న చికిత్స! టాంజానియాలో ముగరిగ అనే ఓకరకమైన వనమూలిక విరివిగా లభిస్తుంది.. ఈ మొక్క ఆకులు, కాండాలను సేకరించి.. బాగా మరిగించి మ్వసపిలె ఓ ద్రావకాన్ని తయారు చేస్తున్నాడు.. ఇదే ఇప్పుడు రోగులపాలిట దివ్వౌషుధం..! దీనిని ఇక్కడ మాత్రమే సేవించాలనేది మ్వసపిలె ఆదేశం.. ద్రావకాన్ని ఎక్కడికైనా తీసుకెళ్లి సేవిస్తే.. అది పనిచేయదట..! అందుకే ప్రజలంతా సముంగె గ్రామానికి పరుగులు తీస్తున్నారు...

తన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికో ఒక్కో మగ్గు చొప్పున ద్రావకాన్ని అందిస్తున్నాడు మ్వసపిలె..! ఇందుకు ఒక్కొక్కరి నుంచి 14 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నాడు.. మ్వసపిలె ఇస్తున్న ఆ పానీయం కోసం 14 రూపాయలు ఖర్చు చేసేందుకు ప్రజలు ఏమాత్రం వెనకాడటం లేదు.. అది దొరికితే చాలని పోటీ పడుతున్నారు.. సముంగె గ్రామానికి వస్తున్న ప్రజలనుకానీ, రోగులను కానీ మ్వసపిలె అసలు పట్టించుకోడు.. రోగాన్ని బట్టి ఇక్కడ చికిత్స ఉండదు.. జబ్బు ఏదైనా.. మనుషులు ఎవరైనా చికిత్స ఒక్కటే..! అందరికీ ఆ పానియమే మందు..!
మ్వసపిలె మందు తాగితే.. సర్వరోగాలూ నయమవుతాయనేది అక్కడికి వెళ్తున్న ప్రజల నమ్మకం.. అందుకే అక్కడికి జనం లక్షలాదిగా తరలివెళ్తున్నారు.. 20 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ అవుతోందంటో.. అక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు..

మార్చి 31వ తేదీనాటికి మ్వసపిలె మందుకోసం సుమారు 40 వేల మంది వెయిట్‌ చేస్తున్నారని అంచనా..! వీరందరికీ మందు సప్లై చేయడానికే 3,4 వారాల సమయం పడుతుందని స్తానికులు చెబుతున్నారు.. అయినా.. అక్కడికి వెళ్లినవారు వెనక్కి తిరిగి రావడానికి సుముఖంగా లేరు. మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచిన రోగులు కూడా ఉన్నారు. అయినా.. మందు సేవించిన తర్వాతే వెనక్కి వస్తామని వారంటున్నారు..

మ్వసపిలే మందు సర్వరోగ నివారిణి అనే ప్రచారం జరుగుతున్నా... HIV, ఎయిడ్స్‌కు అది దివ్యౌషుధం అని మందు వాడిన వారు చెబుతున్నారు.. ఈ మందు తీసుకున్న తర్వాత తామెంతో హుషారుగా ఉన్నట్లు రోగులు చెబుతున్నారు. దీంతో.. రోగులు లక్షలాదిగా తరలివెళ్తున్నారు. ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకుంటున్నవారు సైతం.. ఈ నాటుమందుకోసం బెడ్‌లు ఖాళీ చేసి సముంగెకు వెళ్తున్నారు..

సముంగెకు వెళ్తున్నవారిలో ఎక్కువమంది HIV బాధితులే..! ఈ మందు తీసుకున్న తర్వాత వారిలో చాలా మార్పు కనిపిస్తోందట! ఈ విషయాన్ని బాధితులే స్వయంగా చెబుతున్నారు. దీంతో.. ఎయిడ్స్‌కు మందుపై ఆశలు చిగురించాయి.. శాస్త్రపరంగా సాధ్యంకాని అద్భుతాన్ని మ్వసపిలె సాధించారని కొందరు చెబుతున్నారు..
మ్వసపిలె మందులో మహత్తు లేకపోతే.. అంతమంది అక్కడికి ఎందుకు వెళ్తారని టాంజానియా వాసులు ప్రశ్నిస్తున్నారు.. దీంతో.. కొంతమంది యూనివర్సిటీ ప్రొఫెసర్లు సముంగె వెళ్లి మందు తీసుకొచ్చి పరిశీలించారు. ఆ మందు సేవించడం వల్ల లాభమేమో తెలియదు కానీ.. నష్టమేమీ లేదని తేల్చారు. ఆ మందులోని ఔషధ గుణాలేవో తేల్చేందుకు మరిన్ని పరిశోధనలు చేస్తున్నారు.

శాస్త్రవేత్తల నుంచి కూడా ఎలాంటి అభ్యంతరం రాకపోవడంతో.. సాక్షాత్తూ టాంజానియా ప్రభుత్వమే రంగంలోకి దిగింది. సముంగె వెళ్తున్న ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించాలని స్థానిక అధికారులను ఆదేశించింది.. దీంతో.. అక్కడికి వెళ్తున్న ప్రజలకు దారిచూపిస్తున్నారు అక్కడి అధికారులు..

అయితే.. ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి కొత్తగా మందు ఇవ్వకూడదని మ్వసిపిలె నిర్ణయించాడు. ఇందుకు వేరే కారణాలేం లేవండీ.. మార్చి 31వ తేదీ నాటికి ఈ మందుకోసం 40 వేల మంది రోడ్లపైనే వెయిట్‌ చేస్తున్నారు. ఎండావానలను లెక్కచేయకుండా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో.. వీరందరికీ మందు ఇచ్చిన తర్వాతే కొత్తవారికి ఇస్తానని మ్వసపిలె తేల్చి చెప్పాడు.

తన మందులో శాస్త్రీయత ఎంతో తనకు తెలియదని మ్వసపిలె అంగీకరిస్తున్నాడు. దేవుడు ఆదేశించినట్లుగానే తాను ఈ మందును తయారు చేశానని చెప్తున్నాడు.. దీర్ఘకాలంగా రోగాలతో బాధపడుతున్నవారిని చూడలేక.. దేవుడు తన ద్వారా ఈ మందును చేయించారేమోనని మ్వసపిలె అంటున్నాడు.. అయితే.. ఈ మందు ఎయిడ్స్‌ రోగులకు ఉపశమనం కలిగించడం సంతోషం కలిగిస్తోందని చెబుతున్న మ్వసపిలే.. మున్ముందు మరింత మందికి వైద్యం అందించేందుకు పూర్తిస్థాయిలో ఒక పెద్ద కట్టడాన్ని నిర్మించాలనుకుంటున్నాడు.

మ్వసపిలే మందుకు వస్తున్న క్రేజ్‌ను ప్రపంచ మీడియా మొత్తం సముంగె గ్రామానికి పరుగులు పెడుతోంది. ఇప్పటికే బీబీసీ, స్టార్‌టీవీలు కూడా మ్వసపిలె మందుపై కథనాలు ప్రసారం చేశాయి. ఆధునిక శాస్త్రానికి సైతం సాధ్యంకాన్ని వండర్‌ డ్రగ్‌ను మ్వసపిలె సృష్టించారని తెలిపాయి. ఎంతోకాలంగా వైద్యశాస్త్రవేత్తలు ఎయిడ్స్‌కు మందు కనిపెట్టలేకపోయారని.. మ్వసపిలె సాధించారని టాంజానియా ప్రజలు గొప్పగా ఫీలవుతున్నారు. అంతేకాదు... మ్వసపిలెకు నోబెల్‌ ప్రైజ్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు..

మ్వసపిలే మందులో మహత్తు ఉందో లేదో తెలియదు కానీ.. దాన్ని వాడుతున్నవారు మాత్రం అది దివ్యౌషుధమని చెప్తున్నారు. దీంతో.. కేవలం 3 నెలల వ్యవధిలోనే మ్వసపిలె ప్రపంచవ్యాప్తంగా టాక్‌ ఆఫ్‌ ది పర్సన్‌గా మారిపోయారు. ఇక.. టాంజానియాలోని సముంగె అనే కుగ్రామం ఓ వండర్‌ డ్రగ్‌ను ప్రపంచానికి అందించిన వండర్‌ విలేజ్‌గా మార్మోగిపోతోంది..

Friday, March 11, 2011

మహాశయులారా... మన్నించండి..!!

బళ్లారి రాఘవ

తెలుగు నాటకరంగ కీర్తిని విశ్వవ్యాప్తం చేశావని విర్రవీగుతున్నావా..?
డాల్బీ, డిజిటల్ తెరలపై కదలాడే నేటీ హీరోల ముందు నీవెంత..?
అయినా.. నాటకాలాడుకునే నీకు నిలువెత్తు విగ్రహమెందుకు రాఘవా..
అందుకే నీకీ శిక్ష..! మన్నించు మహాశయా..!!



పలనాటి బ్రహ్మనాయుడు

నీ పౌరుషం పలనాటి గడ్డపై చూపించుకో..
నీ చాపకూటి సహపంక్తి భోజనాల ఆదర్శం ఎవరిక్కావాలి..?
నీ పలనాడు వెలకట్టలేని మాగాణా..? 
అందుకే.. నీకీ శిక్ష..! మన్నించు మహాశయా..!!





ఎర్రాప్రగడ

అశేష ఆగమ శాస్త్రాల్లో పట్టు సాధించావ్..
రామాయణ, భారతాల్లో పాండిత్యాన్ని ప్రదర్శించావ్.
కవిత్రయంలో ఒకడిగా గుర్తింపు పొందావ్..
కానీ.. మా ఆగ్రహాన్ని గుర్తించలేకపోయావ్...
అందుకే.. నీకీ శిక్ష..! మన్నించు మహాశయా..!!


గురజాడ అప్పారావు

దేశమును ప్రేమించుమన్నా.. మంచియన్నది పెంచుమన్నా..?
చెట్టపట్టాల్ పట్టుకుని దేశస్థులంతా నడవవలెనోయ్!
అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలెనోయ్!
విడిపోతామంటే.. కలిసుండమంటావేంటి గురజాడా..?
అందుకే.. నీకీ శిక్ష..! మన్నించు మహాశయా..!!




క్షేత్రయ్య

గుళ్లు, గోపురాలు తిరిగి క్షేత్రుడనిపించుకున్నావు
మొవ్వగోపాలుడొక్కడే పురుషుడన్నావు
మరి మేమెవరిమి క్షేత్రయ్యా..?
అయినా.. రాగాలు తీసుకునే నీకు రాతి విగ్రహమెందుకు..?
అందుకే.. నీకీ శిక్ష..! మన్నించు మహాశయా..!!


ముట్నూరి కృష్ణారావు

జాతీయోధ్యమానికి కృష్ణా పత్రిక పెట్టావ్
సంక్షుభిత సమాజానికి కొత్త వెలుగులిచ్చావ్
పోరాటాలతో ఎందరికో ఆలంబనగా నిలిచావ్
మరి ఇప్పటి ఉద్యమంలో ఎందుకు లేవు కృష్ణారావ్?
అందుకే నీకీ శిక్ష..! మన్నించు మహాశయా..!!



నన్నయ

నువ్వు ఆదికవి కానీ ఆధునిక కవివి కాదుగా..?
మా ఉద్యమాన్ని సిరాతో చెక్కడానికి..!
అయినా.. రాజమహేంద్రిని వదిలి..
భాగ్యనగరికి వచ్చావేంటి నన్నయా..?
అందుకే నీకీ శిక్ష..! మన్నించు మహాశయా..!!


రఘుపతి వెంకటరత్నం నాయుడు

బ్రహ్మసమాజాన్ని తెలుగునాటకి తెచ్చావ్..
సంఘసంస్కరణోద్యమాన్ని నడిపించావ్..
సమాజంలోని చెడును దునుమాడావ్..
మరి మా ప్రత్యేకవాదాన్ని ఎప్పుడు గుర్తిస్తావ్..?
అందుకే నీకీ శిక్ష..! మన్నించు మహాశయా..!!



సర్ ఆర్థర్ కాటన్

గోదావరి జలాలకు అడ్డుకట్టవేశావు..
ధవళేశ్వరం ఆనకట్టకు ఆద్యుడవయ్యావు..
ఆంధ్రను అన్నపూర్ణగా తీర్చిదిద్దావు..
మరి తెలంగాణను ఎందుకు మరిచావు..?
అందుకే నీకీ శిక్ష..! మన్నించు మహాశయా..!!


సర్ సి.ఆర్.రెడ్డి

నీ రసికత-సరసతలతో చలాన్నే మెప్పించావని విర్రవీగుతున్నావా!
సాహిత్యాన్నే సంసారంగా మార్చుకున్న బ్రహ్మచారివి.
ఆంధ్ర-తెలంగాణల కాపురంలో కష్టాలు నీకేం తెలుసు?
అందుకే నీకీ శిక్ష..! మన్నించు మహాశయా..!!




శ్రీ శ్రీ

ఎముకలు కుళ్లిన వయసు మళ్లిన సమాజం కాదు మాది
సీమాంధ్రులపై తెలంగాణ వాదులు చేస్తున్న మరో ప్రస్థానమిది
ప్రపంచం బాధనంతటినీ నీలో పలికిస్తావనిపించుకున్నావ్..!
మరి మా ఆగ్రహావేశాలను పట్టించుకునేందుకు ఎందుకు లేవు?
అందుకే నీకీ శిక్ష..! మన్నించు మహాశయా..!!



శ్రీకృష్ణదేవరాయలు

నీ పాలనలో స్వర్ణయుగం చూపించావు
రాజ్యంలో సర్వతోముఖాభివృద్ధి సాధించావు
అష్టదిగ్గజాలతో ఆరాధ్యుడవయ్యావు..
అన్నిటినీ మించి.. తెలుగు భాషను ప్రేమించావు
అందుకే.. నీకీ శిక్ష..! మన్నించు మహాశయా..!!



త్రిపురనేని రామస్వామి చౌదరి

అగ్రకులాధిక్యంపై విల్లు ఎక్కుపెట్టి..
అస్పృశ్యత నివారణకు కృషి చేస్తే సరిపోతుందా?
స్వాతంత్ర్య సంగ్రామంలో వీరగంధం పూసి ఊరుకుంటావా..?
తెలంగాణ మహోధ్యమాన్ని పట్టించుకోవా..?
అందుకే నీకీ శిక్ష..! మన్నించు మహాశయా..!!



ట్యాంక్'బండ్'పై నేలకూలిన మహానుభావులకు ఇదే నా నివాళి

(గమనిక: ఇందులో పద్యరీతులను, ఛందస్సును వెతక్కండి. ఏవైనా తప్పులుంటే భాషా పండితులు క్షమించండి.


ఫోటోలు: ఈనాడు సౌజన్యంతో..)

Wednesday, March 02, 2011

ఎటు పోతోందీ రాష్ట్రం..?

    రాష్ట్రంలో పాలన ఎటు పోతుందో అర్థంకావడం లేదు.. ఇన్నాళ్లూ దేశం యావత్తూ గర్వించేలా తలెత్తుకు ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. ప్రత్యేక, సమైక్య ఉద్యమాలు రాష్ట్రానికి ప్రపంచపటంలో ఒక ప్రత్యేక స్థానాన్ని కట్టబెడుతున్నాయి. 2009 డిసెంబర్ 9న చిదంబరం ప్రకటన, అనంతరం శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు, నివేదిక సమర్పణ.. తదితర పరిణామాల తర్వాత కూడా రాష్ట్ర విభజనపై కేంద్రం ఇంతవరకూ స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న సహాయనిరాకరణ, టీజేఏసీ ఉద్యమ కార్యక్రమాలు కిరణ్ సర్కారుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

     అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలో సహాయ నిరాకరణ ఊపందుకోవడం, సొంత పార్టీ ఎమ్మెల్యేలే సభను బాయ్'కాట్ చేయడం.. మిగిలిన తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు సైతం సభను నడవనీయకుండా చేస్తుండడంతో ఒక్కరోజు కూడా అసెంబ్లీ సక్రమంగా జరగలేదు. సభకు రావడం, వాయిదా వేసుకుని పోతుండడంతో.. విలువైన సమయమెంతో వృథా అవుతోంది. 

     ఇక.. తెలంగాణ జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు జరిగిన 48 గంటల బంద్, పల్లెపల్లెకు పట్టాలపైకి.. తదితర కార్యక్రమాలు దిగ్విజయం సాధించాయి. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఈ రెండు కార్యక్రమాల ద్వారా  తెలంగాణలో జనజీవనం పూర్తిగా స్తంభించింది. ఈ నేపథ్యంలోనే మార్చి 10వ తేదీన మిలియన్ మార్చ్ టు హైదరాబాద్ కార్యక్రమానికి టీజేఏసీ పిలుపునిచ్చింది. ఈజిప్టు తరహా ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. పూర్తి శాంతియుతంగా హైదరాబాద్ రోడ్లను దిగ్బంధించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.. రోడ్లపైనే వంటావార్పూ చేసుకుని రోజంతా బైఠాయించి.. తెలంగాణ ప్రజల ఆకాంక్షను ఢిల్లీ పెద్దలకు వినిపించేలా చేయడమే దీని లక్ష్యం.

      తెలంగాణ ప్రజలు ఇప్పటికే ఎన్నో ఉద్యమాలు చేశారు.. చేస్తూనే ఉన్నారు. కానీ ఇవేవీ పాలకులకు కనిపించినట్లు లేవు. ఇప్పటికైనా తెలంగాణపై స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటిస్తే ఎంతో మేలు చేసినవారవుతారు. ఇప్పటికే ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. పరీక్షలు జరుగుతాయో లేదోననే మీమాంసలో వారు కొట్టుమిట్టాడుతున్నారు. మరోవైపు.. సహాయ నిరాకరణతో ప్రభుత్వ పాలన పూర్తిగా స్తంభించింది. ప్రభుత్వ ఆదాయానికి కూడా భారీగా గండిపడుతోంది. వీటన్నిటికీ మించి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. 

     ఇక.. ఆపార్టీ ఈ పార్టీ అనే తేడాలేకుండా తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులందరూ అసెంబ్లీని బహిష్కరిస్తున్నారు. ఇందులో ఎవరి ప్రయోజనాలు వారివి..! ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అసెంబ్లీ నడుచుకోనప్పుడు.. అది జరిగినా, జరగకపోయినా పెద్దగా ఉపయోగం ఉండదు కూడా..! మరోవైపు.. ఇన్నాళ్లూ స్తబ్దుగా ఉన్న సీమాంధ్ర ప్రజాప్రతినిధులు మళ్లీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ వాదం ముందు సమైక్యవాదం సద్దుమణిగిపోయిందనే ప్రచారం జరుగుతున్నందున.. దాన్ని మళ్లీ వినిపించాలని భావిస్తున్నట్లు ఆ ప్రాంత నేతలు చెబుతున్నారు. అయితే.. ఇలాంటి పోటాపోటీ ఉద్యమాలు సామాన్యులకు చేటు తెస్తాయి తప్పా ఎలాంటి మేలూ చేకూర్చవు.

    తెలంగాణ వస్తే.. హైదరాబాద్'లోని సీమాంధ్రులకు రక్షణ ఉండదని చెబుతున్న సీమాంధ్ర నేతలు.. తెలంగాణఉద్యమానికి పోటీగా అసెంబ్లీని బహిష్కరించడం, మళ్లీ సమైక్య ఉద్యమాన్ని చేపట్టడమంటే.. తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టడమే అవుతుంది. విజయవాడలోనో, గుంటూరులోనో.. కర్నూలులోనో కూర్చుని ఇలాంటి కార్యక్రమాలు, ప్రకటనలు చేయడం వల్ల వారికొచ్చే నష్టమేమీ లేదు. కానీ.. హైదరాబాద్'లోని సీమాంధ్ర ప్రజలకు మాత్రం హాని కలిగిస్తుంది. అందుకే.. ఇప్పటికైనా సీమాంధ్ర నాయకులు సంయమనం పాటించాలి. రెచ్చగొట్టే ప్రసంగాలు, పోటీ చర్యలు మానుకోవాలి. అదే సమయంలో తెలంగాణ వస్తే హైదరాబాద్'లో స్థిరపడినవారెవరకీ నష్టం చేకూరదని చెబుతున్న తెలంగాణవాదులు కూడా వారికి భరోసా కల్పించాలి. 

     10న జరిగే మిలియన్ మార్చ్ కార్యక్రమాన్ని హింసాత్మకంగా మార్చేందుకు కొన్ని అసాంఘిక శక్తులు కుట్రపన్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో.. తెలంగాణవాదులు కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. రెచ్చగొట్టే ప్రసంగాలు, చర్యలు లేకుండా ఓర్పుతో వ్యవహరించాలి.

    కానీ.. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను ఓసారి పరిశీలిస్తే.. త్వరలోనే రాష్ట్రపతి పాలన రావచ్చేమో అన్న అనుమానం కలుగుతోంది. పరిస్థితిని సద్దుమణిగే సత్తా సీఎం కిరణ్'కు లేకపోవడం.. కేంద్రప్రభుత్వం తాత్సారం చేస్తుండడంతో.. రాష్ట్రంలో పరిస్థితి నానాటికీ దిగజారుతోందనేది వాస్తవం..!!

Thursday, February 17, 2011

ఎమ్మెల్యేలూ...శెభాష్..!!?

ఎస్.. నిజంగా మనం ప్రజాస్వామ్య దేశంలోనే ఉన్నాం..
ప్రజాస్వామ్యం ఎంత ఉంది అంటే.. మాటల్లో వర్ణించలేనంత..!!
చేతలతో మాత్రమే కొట్టుకునేంత..!!!

ప్రజాస్వామ్యం మనదేశంలో ఇంకా బలంగా ఉందని చెప్పడానికి మన ఎమ్మెల్యేలే సాక్షి..! శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో వారు వ్యవహరించిన తీరు.. ప్రజాస్వామ్యానికి నిదర్శనం..
సభలో కూడా తనకు ఇష్టమొచ్చినట్లు వ్యవహరించే అవకాశం ఎమ్మెల్యేలకు ఉండడం ప్రజాస్వామ్యం కాదా..?
రాజ్యాంగంతో సంబంధం లేకుండా.. చట్టాలతో పనిలేకుండా.. స్వేచ్ఛగా నినాదాలు చేయడం.. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం.. ఆయనపై పేపర్లు విసిరేయడం.. మైకులు విరగ్గొట్టడం.. ఆయన కుర్చీని లాగిపారేయడం... గుడ్..!!
నిజమైన ప్రజాస్వామ్యం అనిపించారు మన ఎమ్మెల్యేలు..

ప్రజల ఆకాంక్షలకు మన ఎమ్మెల్యేలు పట్టం కడుతున్నారు..! 
నియోజకవర్గాల్లోని సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించండి చాలు అంటే... ఏకంగా కాల్చివస్తున్నారు..!
తాము ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యే నుంచి ప్రజలు ఇంతకంటే ఏం కోరుకుంటారు చెప్పండి..?

ప్రజాస్వామ్యానికి తామే ప్రతినిధులమని చాటారు ఇవాళ మన ఎమ్మెల్యేలు..!
నిరసనలు శాంతియుతంగానే ఉండాలని ఎవరు చెప్పారు..? మనది ప్రజాస్వామ్య దేశం..! ఎలాగైనా నిరసనలు చేసుకోవచ్చు.. ఎలాగైనా ఆందోళనకు దిగొచ్చు.. సాటి ఎమ్మెల్యేలను నోటికొచ్చినట్లు దుమ్మెత్తిపోయొచ్చు..!! తమకు నచ్చకపోతే చేయి చేసుకోవచ్చు..!! ఎస్.. ఇదే నిజమైన ప్రజాస్వామ్యం..

స్వేచ్చగా మాట్లాడుకోవడం.. ప్రజాస్వామ్యం..!
ఇష్టమొచ్చినట్లు తిట్టడం.. ప్రజాస్వామ్యం..!!
కానివాణ్ని కొట్టడం.. ప్రజాస్వామ్యం..!!!
ప్రజలెన్నుకున్న తర్వాత.. ఏమైనా చేసే అధికారమే... ప్రజాస్వామ్యం..!!!!

(తిట్టేందుకు మాటలు చాలక.. పొగిడాను.. క్షమించండి..)

Monday, February 07, 2011

చిరు తొందర..! చిందర వందర..!!

అలసితీ.. సొలసితీ..!!
     సామాజిక న్యాయం సాధించేవరకూ తమ సూరీడు అస్తమించడంటూ పుట్టుకొచ్చిన ప్రజారాజ్యం పార్టీ పురిటినొప్పులు తీరకముందే అస్తమించింది. 125 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చేతిలో బందీగా చిక్కింది. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయంగా ప్రజారాజ్యం పుట్టిందని ఆ పార్టీ అధినేత చిరంజీవి ప్రగల్భాలు పలికారు. ఎవరి సాయమూ అక్కర్లేకుండానే తాము అధికారంలోకి రాబోతున్నామని 2009 ఎన్నికల ముందు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత తెలిసొచ్చింది తన సత్తా ఏంటో.. చిరంజీవికి..! ఆకాశంలో సూర్యుణ్ని తానేనని ఇన్నాళ్లూ భావించిన మెగాస్టార్ ఇప్పుడు నేలచూపులు చూడాల్సి వచ్చింది. అటు పూర్తిగా ప్రతిపక్ష పాత్ర పోషించలేక.. అలాగని అధికార కాంగ్రెస్'కు వత్తాసు పలకలేక త్రిశంకుస్వర్గంలో ఉండాల్సివచ్చింది. ప్రతిపక్షంలో ఉండడం కంటే అధికార పార్టీకి అండగా నిలిస్తే కాస్తోకూస్తో మేలు జరుగుతుందని త్వరగానే గ్రహించారు చిరంజీవి. అప్పటి నుంచి అధికార కాంగ్రెస్'కు అండగా ఉంటూ ఇవాల్టికి దాని గూటికి చేరాల్సి వచ్చింది.

     పట్టుమని రెండున్నరేళ్లు గడవక ముందే చిరంజీవి ఎందుకు ప్రజారాజ్యం జెండా పీకేశారు..? బలమైన సామాజిక వర్గం అండ పుష్కలంగా ఉన్నాఎందుకు పార్టీని విలీనం చేయాల్సి వచ్చింది.? మెగాస్టార్'గా ఆంధ్ర రాష్ట్రాన్ని ఓ ఊపు ఊపిన చిరంజీవి.. పార్టీని ప్రజలకు చేరువ చేయడంలో ఎందుకు విఫలమయ్యారు..? ఇలా ఎన్నో ప్రశ్నలు రాష్ట్ర ప్రజలనే కాక.. తెలుగుజాతి యావత్తునూ కుదుపేస్తున్నాయి.. అయితే.. ఈ ప్రశ్నలన్నింటికీ తరచితరచి చూస్తే ఎన్నో జవాబులు దొరుకుతాయి..

పార్టీ ఆవిర్భావ సభలో చిరంజీవి
పార్టీ పుట్టుక:
  
2006 ఆగస్టు 26వ తేదీన ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భవించింది. తిరుపతిలో లక్షలాది ప్రజల సాక్షిగా ఆ పార్టీ సూర్యుడు ఉదయించాడు. సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించి.. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ ఆదర్శంగా ప్రజారాజ్యం ఉద్భవించింది. తానుకూడా ఎన్టీఆర్ లాగే అధికారాన్ని కైవసం చేసుకుంటానని చిరంజీవి భావించి.. ఆర్భాటంగా పార్టీ ప్రకటించారు. ఓవైపు వై.ఎస్.రాజశేఖరరెడ్డి, మరోవైపు చంద్రబాబునాయుడు లాంటి రాజకీయ ఉద్దండుల నడుమ చిరంజీవి రాజకీయ ప్రవేశం జరిగింది. చిరంజీవి చరిష్మా చూసిన ఎంతోమంది ఇతరపార్టీల నేతలు ప్రజారాజ్యానికి వలసలు కట్టారు. తన సామాజిక వర్గం కూడా చిరంజీవికి అండగా ఉంటుందని భావించిన ఎంతోమంది నేతలు.. జై చిరంజీవ అన్నారు.

ఇదీ మన సింబల్
  
2009 ఎన్నికలు:

    2009 ఎన్నికలు రానే వచ్చాయి. ఫలితాలు వచ్చాకగానీ తెలియలేదు చిరంజీవి సత్తా ఏంటో..! కేవలం 18 శాతం ఓట్లతో 18 సీట్లు మాత్రమే చిరంజీవి.. పాలకొల్లులో ఓటమి మూటగట్టుకోవాల్సి వచ్చింది. దీంతో.. ఆకాశాన సూరీడు కాస్తా నేలదిగి వచ్చాడు. సీఎం కుర్చీని పక్కనపెట్టి అసెంబ్లీలో తనది అటో ఇటో తేల్చుకోలేని దుస్థితి ఏర్పడింది. ఇంతలోనే నాటి ముఖ్యమంత్రి వై.ఎస్. చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్'కు పీఆర్పీ నేతలతోపాటు స్వయంగా చిరంజీవే ఆకర్షితుడయ్యాడనేది విశ్వసనీయ సమాచారం.. అందుకే చిరంజీవికి కేంద్ర మంతి పదవి ఇవ్వాల్సిందిగా పార్టీ అధిష్టానానికి సూచించినట్లు తెలుస్తోంది. ఇక.. వై.ఎస్. మరణానంతరం కూడా కాంగ్రెస్'కు అండగానే నిలిచిన చిరంజీవికి పార్టీ నడపడం పెద్ద సవాల్'గా మారింది.

జెండా.. అజెండా
ఒక్కొక్కరే దూరం..దూరం..!
  
పార్టీ ఆవిర్భావంలో ప్రముఖపాత్ర పోషించిన మిత్రా, పరకాల ప్రభాకర్, హరిరామజోగయ్య లాంటి సీనియర్లు బాహాటంగా చిరంజీవిపై విమర్శలు గుప్పించడం.. అది పార్టీ కాదని.. ప్రైవేటు కంపెనీ అని చేసిన వ్యాఖ్యలు.. ఆ పార్టీ దుస్థితిని తేటతెల్లం చేశాయి. అదే సమయంలో పార్టీ ఎమ్మెల్యేలు కూడా చిరంజీవికి దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది.

     రాజకీయం తెలియదని చిరంజీవిపై సొంత పార్టీ నాయకులే విమర్శించే స్థితి వచ్చింది. కానీ చిరంజీవి మాటతీరులో మాత్రం అదే గాంభీర్యం.. అదే ఉత్సాహం..!! జెండా పీకేద్దాం.. అని ఏడాది కిందటే అంతర్గత సమావేశంలో అన్నట్లు వచ్చిన ఓ వార్త అప్పట్లో పెద్ద సంచలనం.. కానీ దానిపై చిరంజీవి ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. కంఠంలో ప్రాణమున్నంతవరకూ ప్రజాసేవకే అంకితమని.. పార్టీ జెండా పీకే పరిస్థితే రాదని స్పష్టంచేశారు.

వై.ఎస్.మరణానంతరం:  

     ఇంతలోనే ఎన్నో పరిణామాలు..! వై.ఎస్. మరణానంతరం రాష్ట్రంలో పరిస్థితులు వేగంగా మారిపోయాయి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికొచ్చిన జగన్, సంక్షోభంలో రాష్ట్రసర్కార్.. ఇలా ఎన్నో అంశాలు చిరంజీవికి కలిసొచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి చిరంజీవి గాలిలో ఆశాదీపమయ్యారు. తమ ఇంట్లో దీపం వెలిగించే సూరీడయ్యాడు. అందుకే జగన్ దూరమైనా.. చిరంజీవి ఉన్నాడనే ధైర్యం ఆ పార్టీకి కలిగింది. ఇందుకు చిరంజీవి స్టేట్'మెంట్లు కూడా దోహదపడ్డాయి. అవసరమైతే ప్రజలపై భారం పడకుండా కాంగ్రెస్ సర్కారుకు అండగా నిలుస్తామని పదేపదే చెప్పేవారు.

ఉభయతారకం:

     అయితే.. కాంగ్రెస్-ప్రజారాజ్యం పార్టీల విలీనం ఉభయతారకంగా చెప్పవచ్చు. జనాకర్షక నేత కరువై రాష్ట్రంలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీకి చిరంజీవి ఆశాదీపం! వై.ఎస్.ఆర్.తనయుడిగా జగన్'కున్న ఫాలోయింగ్ నుంచి పార్టీని గట్టెక్కించాలంటే.. చిరంజీవి లాంటి చరిష్మా ఉన్న నేత(?) కాంగ్రెస్'కు తప్పనిసరైంది. అందుకే.. ఆయన్ను పార్టీలోకి తెచ్చేందుకు దొరికిన ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోలేదు..

ప్రజలతో మమేకమై..!
ఎన్నో కారణాలు!  

     చిరంజీవిని పార్టీలోకి తెచ్చుకునేందుకు మరో కారణమూ ఉంది. ఇన్నాళ్లూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి రెడ్డి సామాజిక వర్గం ప్రధాన ఓటుబ్యాంకుగా ఉంది. కానీ వై.ఎస్.ఆర్. మరణం.. ఆ తర్వాత జగన్ పార్టీ నుంచి వైదొలగడంతో ఆ సామాజిక వర్గం తమకు దూరమైందనే భావన కాంగ్రెస్ అధిష్టానంలో ఏర్పడింది. దీన్ని భర్తీ చేయాలంటే మరో సామాజిక వర్గాన్ని దరిచేర్చుకోవాల్సిన పరిస్థితి. ఇందుకు చిరంజీవితోపాటు అతని సామాజికవర్గమైతే సరిపోతుందనే  నిర్ణయానికి వచ్చింది.

సొంతపార్టీ సమస్యలు:  

     ఇక.. పార్టీ ఉన్నా.. ఉన్నదని చెప్పుకోలేని దుస్థితిలో ప్రజారాజ్యం పార్టీ ఉంది. ఆవిర్భావం సమయంలో వచ్చిన నేతలు మళ్లీ సొంతగూళ్లకు పయనమవడం, ఎమ్మెల్యేలు కూడా మాట వినకపోవడం.. భవిష్యత్తులోనైనా పార్టీని అధికారంలోకి తీసుకొస్తామనే నమ్మకం లేకపోవడం.. చిరంజీవికి పెద్ద సమస్యలుగా మారాయి. పార్టీ నడపాలంటే డబ్బు కావాలి. అధికారంలో లేకపోవడం, అధికారంలోకి వస్తుందనే నమ్మకం లేకపోవడంతో ఆ పార్టీకి విరాళాలు కరువయ్యాయి. ఇక.. చేతి నుంచి డబ్బు ఖర్చు పెట్టి పార్టీ నడిపేంత దయాగుణం చిరంజీవికి లేదాయె..! దీంతో.. కాంగ్రెస్ గూటికి చేరడమే మేలనుకున్నారు మెగాస్టార్!

విలీనం దిశగా..!!
     కాంగ్రెస్'లో ప్రజారాజ్యం విలీనానికి మరో కారణమూ ఉంది. ప్రత్యేక ఉద్యమాల సమయంలో తాను సమైక్యాంధ్రకు జైకొట్టడంతో తెలంగాణలో అడుగు పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఓ ప్రాంతం మద్దతు లేకుండా అధికారంలోకి రావడం కల్ల.! దీంతో పార్టీని నమ్ముకున్న కొద్దిమందికి ఓ దారి చూపాలని చిరు భావించారు. అందుకే నమ్ముకున్నవారిని నట్టేట ముంచడం కన్నా.. గౌరవప్రదంగా కాంగ్రెస్'లో విలీనం చేసి పీఆర్పీ నేతలకు దారి చూపించారు. తాను కూడా గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు. సోనియాను కలిసి బయటకు వచ్చిన అనంతరం.. పార్టీని విలీనం చేయబోతున్నామని ప్రకటించినప్పుడు.. తన గుండెపైనున్న భారమంతా దిగిపోయినంత సంతోషం కనిపించింది చిరు ముఖంలో..!

జై కాంగ్రెస్, జై సోనియా!  

     ఇకపై.. చిరంజీవి సోనియా అమ్మ కూచి! అమ్మ చెప్పింది చేయాలి.. అమ్మకు జై కొట్టాలి. అమ్మ దర్శనం జరిగిందో లేదో.. అప్పుడే కాంగ్రెస్'వాదిగా మారిపోయారు ప్రజారాజ్యం చిరంజీవి..! పార్టీ అధిష్టానం ఏ నిర్ణయానికి కట్టుబడితే ఆ నిర్ణయానికి కట్టుబడుతానని ఇప్పటికే ప్రకటించేశారు కూడా! పనిలోపనిగా వై.ఎస్.పాలన అవినీతిమయమంటూ పరోక్షంగా జగన్'పై విమర్శలు షురూ చేశారు.. ఇన్నాళ్లూ తన వెనుక గాంధీ, అంబేద్కర్, పూలే, మదర్ థెరిసా లాంటి చిత్రపటాలను పెట్టుకున్న చిరంజీవి.. ఇప్పుడు నెహ్రూ, ఇందిర, రాజీవ్, సోనియా, మన్మోహన్ లాంటి పటాల ముందు కూర్చొని జై కాంగ్రెస్, జై సోనియా అనాలి.. ఇప్పటికే స్టార్ట్ చేశారు కూడా!!

ఇక జగనే.. ఉమ్మడి శతృవు!
ఓట్లేసినోళ్లు ఏంకావాలి?  

     బాధాకరమైన విషయమేంటంటే... ఎంతోమంది అభిమానులు, తమ సామాజికవర్గ ప్రజలు చిరంజీవిని తమ నేతగా భావించారు. ఇంతోకొంతో ఆయన్ను నమ్మి 70 లక్షలమంది ఓట్లేశారు. వాళ్లంతా కేవలం చిరంజీవిని చూసి ఓట్లేసినవారే! కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు ప్రత్యామ్నాయంగా చిరంజీవి ఎదుగుతాడని, పాలనలో మార్పు తెస్తాడని భావించి ఓట్లేశారు. ఇప్పుడు వారి ఆశలు, ఆశయాలపై చిరంజీవి నీళ్లు చల్లారు.. వారిని నట్టేట ముంచారు. తాము జై చిరంజీవ అంటే.. చిరు మాత్రం జై కాంగ్రెస్, జైజై కాంగ్రెస్ అనడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

     ఎవరేమనుకుంటేనేం..? చిరంజీవి సంతోషంగా ఉన్నారు. ఇన్నాళ్లూ తనుమోసిన భారాన్ని దించేసుకుని హాయిగా ఊపిరి పీల్చుకుని రెస్టు తీసుకుంటున్నారు. ఇటీవలే విదేశాలకెళ్లి స్మార్ట్'గా తయారై.. మరోసారి ముఖానికి రంగేసుకునేందుకు రెడీ అయిపోయారు. ఇప్పుడు పార్టీ బాదరబందీలేవీ లేకపోవడంతో.. పూర్తిస్థాయిలో సినిమాలకు సమయం కేటాయించవచ్చు.. సో త్వరలోనే.. చిరంజీవి కెమెరా ముందుకు రాబోతున్నారు. అభిమానులకు మెగాస్టార్ మరోసారి కనువిందు చేయబోతున్నారు. సో.. అభిమానులూ రెడీగా ఉండండి.. థియేటర్లలో చప్పట్లు కొట్టడానికి..! (మిమ్మల్ని కూడా ఏదో ఒక రోజు సోనియమ్మ చెంతకు చేరుస్తాడు).. జై చిరంజీవ.. జై సోనియా.. జై కాంగ్రెస్.. జైజై కాంగ్రెస్..!!!