Sunday, June 05, 2011

తొలకరి

తొలకరి పలకరించింది
సూర్య ప్రతాపానికి ఒంట్లో ఆవిరైపోయిన నీటికి.. కొత్త నీటిని జత చేస్తోంది
ఎండిపోయిన వాగూ వంకలపై గంగమ్మ పరవళ్లు తొక్కే సమయం వచ్చేసింది
మోడువారిన నేలను తనివితీరా ముద్దాడుతోంది..
భూమాత దాహమంతా తీరేలా తడిసి ముద్దవుతోంది


ఆకుపచ్చని ఆకుల్లోని తేమనంతా పీల్చుకున్న గాలి ఆకాశానికేగింది..
సత్తువనంతా పోగొట్టుకున్న పత్రం.. ఎండిపోయి నేల రాలింది..
రాలిన ఆకుల స్థానంలో మళ్లీ కొత్త ఆకులు మొలకెత్తబోతున్నాయి
ఎండిపోయిన చెట్ల కొమ్మలు మళ్లీ పచ్చగా కళకళలాడనున్నాయి

ఆకాశంలో నల్లని మబ్బులు కమ్ముకుంటున్నాయి..
ఉరుములు.. పిడుగులతో వాయుదేవుడు వచ్చేస్తున్నాడు..
పెరట్లో ఆరేసిన గుడ్డలను తొలగించేలోపే ముద్ద ముద్ద చేసేస్తున్నాడు
తువ్వాలు చుట్టుకుని గొడ్లు కాస్తున్న కాపర్లను చెట్లకిందకు పరుగులు తీయిస్తున్నాడు


నెలల తరబడి ఎదురుచూస్తున్న వానమట్టి వాసన మళ్లీ వచ్చేసింది
ఆరుగాలం శ్రమించి అలసిసొలసి రచ్చబండపై సేద తీరుతున్న అన్నదాతను తట్టి లేపుతోంది
పలుగు, పార పట్టి పొలాల వైపు పరుగులు తీయమంటోంది
రంకెలేస్తున్న ఎద్దులను కాడి కట్టమంటోంది
అన్నదాత ఆకలి తీరేలా మొలకలు విత్తమంటోంది
బీడువారిన మడులకు పచ్చకోక కప్పేందుకు వచ్చేస్తోంది
భూస్వాములను గిడ్డంగులను ఖాళీ చేయమంటోంది
పూటగడవని కూలీల మోములో చిరునవ్వులు చిందిస్తోంది
మగ మహారాజులను గోచీ కట్టమంటోంది..
మహాలక్ష్ములను చీరకొంగును బిగదీయమంటోంది..

వానావానా వల్లప్పా అంటూ పిల్లలంతా రాగాలు తీస్తున్నారు..
తొలకరికి తడిసి ముద్దవుతున్న పడుచుపిల్ల పెరట్లో పులకరించిపోతోంది
ఇంటి ముందు నీటిలో కాగితపు పడవులు పల్టీలు కొడుతున్నాయి
గలగలా పారుతున్న నీటికి బంకమట్టి అడ్డుకట్ట వేస్తోంది
బొప్పాయి కాండాలు తూములవుతున్నాయి
పాదాలకింద ఇసుక మట్టిని తోసుకెళ్తున్న తొలకరి గిలిగింతలు పెడుతోంది

చిటపట చినుకుల సవ్వడి సూర్యుడికే సవాల్ విసురుతోంది..
వడదెబ్బకు తన దగ్గర విరుగుడు ఉందంటోంది..
కారు మబ్బులను దాటే వరకూ భానుణ్ని తరిమితరిమి కొడుతోంది
మళ్లీ ఏడాది వరకూ ఇటువైపు చూడద్దంటోంది


(గమనిక: తొలకరి వస్తోందంటే పల్లెసీమలు పండగ వాతావరణాన్ని సంతరించుకుంటాయి. వీధుల్లో సందడి నెలకొంటుంది.. కొన్నేళ్లుగా నేనీ సందడికి దూరమైపోయా.. అందుకే నా అనుభవాలను అక్షరీకరించా..!)

Wednesday, June 01, 2011

మొబైల్ తో బ్రెయిన్ క్యాన్సర్..!!

     రోటీ, కపడా, మకాన్.. ఔర్‌ మొబైల్‌..! అవును మీరు విన్నది నిజమే.. ఇప్పుడు మొబైల్‌ ఫోన్ కూడా ప్రజల ప్రాథమిక అవసరంగా మారిపోయింది. అది జేబులో లేకుండా బయటకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు.. అయితే... రోటీ కపడా ఔర్‌ మకాన్‌ మనల్ని బతికిస్తుంటే... కొత్తగా వచ్చి చేరిన మొబైల్‌ మాత్రం మనల్ని నిలువునా చంపేస్తోంది...

     రోజూ గంటలకొద్దీ ఫోన్లు మాట్లాడేవారికి ఇది బ్యాడ్‌ న్యూస్‌..! మొబైల్‌ ఫోన్లలో గంటలకొద్దీ మాట్లాడుతుంటే.. మీకు త్వరలోనే బ్రెయిన్‌ క్యాన్సర్‌ రావొచ్చు..!! అవును ఇది నిజం. ఏదో అల్లాటప్పా సర్వే కాదిది.. సాక్షాత్తూ వరల్డ్‌ హెల్త్ ఆర్గనైజేషన్‌ చెబుతున్న అక్షర సత్యం.. 31 మంది శాస్త్రవేత్తలు 14 దేశాల్లో విస్తృతంగా పరిశోధనలు చేశారు. రోజూ 30 నిమిషాలపాటు ఫోన్లు మాట్లాడేవారిని ఈ సర్వేకి ప్రాతిపదికగా తీసుకుని.. పదేళ్లపాటు పరిశీలించారు.. మొబైల్‌ఫోన్లకు, బ్రెయిన్‌ క్యాన్సర్‌కున్న సంబంధంపై శాస్త్రీయంగా జరిగిన మొట్టమొదటి సర్వే ఇదే..!


     పదేళ్లపాటు రోజూ 30 నిమిషాలు ఫోన్లో మాట్లాడినవారికి బ్రెయిన్ క్యాన్సర్‌ వస్తున్నట్లు సర్వేలో తేలింది.. మరి జీవితకాలంపాటు ఫోన్ మాట్లాడే వారి పరిస్థితేంటి..? ప్రపంచవ్యాప్తంగా సుమారు 5వందల కోట్ల ఫోన్లు వాడుకలో ఉన్నాయి.. ఫోన్లతోపాటు.. ఫోన్లు వాడుతున్నవారి సంఖ్య కూడా ఏటికేడాది గణనీయంగా పెరిగిపోతోంది.

     కాన్సర్‌ను కలిగించే కారకాలలో ఇప్పటివరకూ సిగరెట్లు, సన్‌బెడ్లు, ఆస్‌బెస్టాస్‌లు ఉన్నాయి. ఈ జాబితాలో ఇప్పుడు మొబైల్‌ ఫోన్‌ కూడా చేరింది. చెవుల దగ్గర తిష్టవేసిన మొబైల్‌ ఫోన్లను వెంటనే తొలగించకపోతే.. గ్లియోమా అనే బ్రెయిన్‌ క్యాన్సర్‌ రావచ్చని WHO తెలిపింది.

     ఫోన్లు వాడుతున్నవారందరికీ క్యాన్సర్‌ వస్తుందని భావించాల్సిన అవసరం లేదని WHO వివరించింది. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మొబైల్‌ ప్రభావం నుంచి బయటపడవచ్చని సూచించింది. వాయిస్‌ కాల్స్‌ను నివారించి.. మెసేజ్‌ చేయడం ద్వారా.. హెడ్‌ఫోన్స్‌‌ను వాడడంద్వారా క్యాన్సర్‌ బారిన పడకుండా కాపాడుకోవచ్చని వెల్లడించింది.

     మొబైల్‌ ఫోన్లతో ముప్పును పసిగట్టిన ఫ్రాన్స్ ప్రభుత్వం ఇప్పటికే ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించింది. సెల్‌ఫోన్ల వల్ల కలిగే నష్టాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టింది.