Saturday, December 08, 2012

సోనియా, చంద్రబాబు క్విడ్ ప్రో కో...!!

     రాజ్యసభలో ఎఫ్ డీ ఐ లపై ఓటింగ్ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు గైర్వాజరు కావడం సంచలనం కలిగిస్తోంది. కానీ తమ ఓటింగ్ నిర్ణయాత్మకం కానందున గైర్హాజరైనా పెద్ద సమస్య లేదని ఆ పార్టీ ఎంపీలు చెబుతున్నారు.. వారన్నట్టు వారి ఓటుతో వచ్చే నష్టమేమీ లేదనుకుందాం... కానీ ఎఫ్ డీ ఐ లకు తాము పూర్తిగా వ్యతిరేకమని చెప్పుకొచ్చిన తెలుగుదేశం పార్టీ.. పెద్దఎత్తున ర్యాలీలు, ధర్నాలు కూడా చేపట్టింది. విపక్షాలన్నీ ఉమ్మడిగా చేసిన భారత్ బంద్ లో కూడా ఆ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నాయి.. అంతెందుకు? ఎఫ్ డి ఐ లపై జరిగిన చర్చలో కూడా ఆ పార్టీ నేతలు గొంతు చించుకున్నారు.. మరి ఎందుకు ఇలాంటి పని చేశారు?


మరి ఎందుకు గైర్హాజరు?
శుక్రవారం వరకూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు వ్యతిరేకమంటూ ఊదరగొట్టిన ఆ పార్టీ నేతలు ఓటింగ్ సమయంలో గైర్హాజరు కావడం ఆ పార్టీ శ్రేణులను నిశ్చేష్ఠులను చేసింది. ఒకరు గైరాహాజరైతే ఏదో కారణం ఉండొచ్చులే అనుకోవచ్చు. కానీ కీలకసమయంలో ఒకేసారి ముగ్గురు డుమ్మా కొట్టడం ఆషామాషీ విషయం కాదు. ఇప్పుడు అందరి అనుమానం ఏంటంటే.. చంద్రబాబుకు తెలిసే వీళ్లు గైర్హాజరయ్యారా అని..!! ఎందుకంటే.. పార్టీ మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్న అంశంపై చర్చ జరుగుతున్నపుడు అంత అలసత్వం ప్రదర్శించారంటే ఎవరికీ నమ్మబుద్ధి కాదు..!! పైగా.. చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తులుగా ఉన్న సుజనా చౌదరి, దేవేందర్ గౌడ్ లాంటి వాళ్ళు ఇంత పని చేశారంటే ఎవ్వరూ నమ్మరు..

చంద్రబాబుకు తెలిసే చేశారా..?
డాక్టర్ అపాయింట్ మెంట్ ఉండడం వల్ల చంద్రబాబుకు చెప్పే సభకు వెళ్లలేదని దేవేందర్ గౌడ్ చెప్తున్నారు. తలనొప్పిగా ఉండడం వల్ల ట్యాబ్లెట్ తెచ్చుకోవడానికి వెళ్లి వచ్చేసరికి సమయం మించిపోయిందని సుజనాచౌదరి  చెప్తున్నారు. వ్యక్తిగత కారణాల వల్లే వెళ్లలేకపోయానని గుండు సుధారాణి చెప్పారు. వీళ్లు చెప్పిన కారణాలు చూస్తే.. స్కూల్ కు ఎగ్గొట్టిన పిల్లాడు చెబుతున్న కారణాలలాగా అనిపిస్తాయి. అంతేకాని లక్షలాది మందికి ప్రాతినిధ్యం వహిస్తున్న, బాధ్యత గల ప్రజాప్రతినిధిగా చెప్తున్న కారణాలుగా అనిపించవు. తమ ఓటు నిర్ణయాత్మకం కానందువల్ల గైర్హాజరైనా పెద్ద నష్టమేమీలేదని దేవేందర్ గౌడ్ సమర్థించుకుంటున్నారు. 'మీ ఓటు నిర్ణయాత్మకం కాకపోవచ్చు.. కానీ మీ పార్టీకి ఒక విధానం ఉంది. ఆ విధానాన్ని మీరంతా గౌరవించాలికదా..!! అంతసేపూ సభలోనే ఉన్న మీరు ఓటింగ్ సమయంలో మాత్రమే బయటకు వెళ్లిపోవడంపై ఎలా అర్థం చేసుకోవాలి?'.

ఎంపీల వివరణలన్నీ విన్న తర్వాత సామాన్యుడికి కూడా ఓ విషయం స్పష్ఠంగా అర్థమవుతుంది.. దీని వెనుక ఏదో ఉందని..!! అది చంద్రబాబుకు తెలియకుండా జరిగిందనుకుంటే పొరపాటే..!! అత్యంత అనుంగులుగా పేరొందిన ఈ ఎంపీలు బాబుకు చెప్పకుండా ఏ పనీ చేయరు..!! అందుకే ఇప్పుడు బాబును అనుమానించాల్సి వస్తోంది..

చంద్రబాబుకు ఏంటి లాభం?
ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు ఎవరికీ తెలియనివి కావు.. కాంగ్రెస్, తెలుగుదేశం పరిస్థితులు అంతంతమాత్రంగానే కనిపిస్తున్నాయి. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్, టీఆర్ఎస్ లు ఈ రెండు పార్టీల నేతలకు వలవేసి లాగేస్తున్నాయి. పైగా జగన్ కు సానుభూతి, కేసీఆర్ కు ఉద్యమం బలమైన ఆయుధాలుగా ఉన్నాయి. వీరిద్దరికీ చెక్ చెప్పేందుకు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు బహిరంగంగా కాకపోయినా అంతర్గతంగా సహకరించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అందులో భాగంగానే టీడీపీ ఎంపీల గైర్హాజరయ్యారని అర్థం చేసుకోవచ్చు. డబ్బుకోసం తమ ఎంపీలను చంద్రబాబు ఓటింగ్ కు దూరంగా ఉంచారని అనుకోలేం..!! అంత నీచమైన స్థితికి చంద్రబాబు దిగజారారని ఊహించలేం..!! కానీ భవిష్యత్తులో ఉత్పన్నమయ్యే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు కాంగ్రెస్ కు సహకరించారనుకోవచ్చు.! క్విడ్ ప్రో కో సూత్రాన్ని గుర్తుకు తెచ్చుకుని ఉండొచ్చు..! 2014లో తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్ మద్దతివ్వచ్చేమో..!! ఏమో చెప్పలేం...!! రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శతృవులు ఉండరు కదా..!! ఏదైనా సాధ్యమే...!!

Sunday, December 02, 2012

బలహీనతను జయిస్తేనే ఎయిడ్స్ పై విజయం


     ఏటా డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినాన్ని జరుపుకోవడం 1988లో ప్రారంభమైంది. హెచ్ఐవీని నిర్మూలించాలనే సదుద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా చేపట్టిన గొప్ప కార్యక్రమం ఇది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 700 కోట్ల జనభా ఉండగా అందులో 110 కోట్ల మంది హెచ్ఐవీతో బాధపడుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. 1981 నుంచి 2007 వరకూ సుమారు రెండున్నరకోట్ల మంది ఈ వ్యాధిబారిన పడి చనిపోయారు. వైద్యరంగంలో అత్యాధునిక సదుపాయాలు, శాస్త్రవిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. ప్రపంచ దేశాలన్నీ హెచ్ఐవీ, ఎయిడ్స్ కు సంబంధించి ఎన్నో చట్టాలు చేశాయి. అయినా ఈ మహమ్మారి మాత్రం అంతకంతకూ విస్తరిస్తోంది తప్ప ఆగడం లేదు. ఇందుకు ప్రధాన కారణం అవగాహన లోపమే! ఈ వ్యాధి గురించి అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఏటా డిసెంబర్ ఒకటిన ప్రపంచ ఎయిడ్స్ దినాన్ని జరుపుకుంటున్నాం.

అవగాహన ఎప్పుడు కలుగుతుంది?
     రెండున్నర దశాబ్దాలుగా ఎయిడ్స్ పై ప్రపంచవ్యాప్తంగా కోట్లాది రూపాయల ధనం వెచ్చించారు. ఇంకా వెచ్చిస్తూనే ఉన్నారు. డిసెంబర్ ఒకటినాడు కొంతమంది సెలబ్రిటీలతో రెడ్ రిబ్బన్ కట్టుకుని వీధుల్లో ర్యాలీలు, సభలు పెడితే ప్రజల్లో అవగాహన వస్తుందా..? ఈ ర్యాలీల్లో పాల్గొనేవారు, సభలకు వస్తున్నవారిలో ఎక్కువ మంది సెలబ్రిటీలను చూడటానికి తప్ప ఎయిడ్స్ గురించి తెలుసుకోవడానికి రావట్లేదు. అలాంటప్పుడు ఈరోజు ఉద్దేశం నెరవేరే అవకాశం ఎప్పుడూ ఉండదు. ర్యాలీలు, సభలు పెడుతున్న వ్యక్తులు, సంస్థలు కూడా ఎయిడ్స్ నిర్మూలన పేరుతో విరాళాలు సేకరించడానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవానికి తమ శరీరంలో హెచ్ఐవీ ఉందన్న సంగతి 21శాతం మందికి తెలియడం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.  విచ్చలవిడి శృంగారం వల్లే ఎయిడ్స్ వస్తుందని చాలా మందికి తెలుసు. అలాంటి శృంగారానికి అలవాటుపడిన వారు ఏదో ఒకరోజు ఆ బలహీనత నుంచి బయటపడి పరీక్షలు చేయించుకుంటేకానీ తమ ముందున్న ముప్పు అర్థం కాదు. ఎంత త్వరగా ఈ బలహీనత నుంచి బయటపడతారో ఎయిడ్స్ మనకు అంత త్వరగా దూరమవుతుంది. " ఎయిడ్స్ రహితతరం కోసం కలసి పనిచేద్దాం"(Working Together for AIDS free Generation) అనే నినాదంతో ఈ ఏడాది ఎయిడ్స్ డే జరుపుకున్నాం. లక్ష్యం బాగానే ఉంది... కానీ దాన్ని అందుకోవడం ఎలా..?

ఇంటి నుంచే అవగాహన
     ఎయిడ్స్ పై అవగాహన ఇంటినుంచే ప్రారంభం కావాలి. భారతదేశంలో సెక్స్ గురించి బహిరంగంగా మాట్లాడడాన్ని  నేరంగా చూస్తారు. అందుకే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అసలు ఆ అంశం జోలికే వెళ్లరు. ఒకవేళ ఉత్సాహం కొద్దీ తెలుసుకోవాలనే తపనతో పిల్లలు సెక్స్ కు సంబంధించిన ప్రశ్నలు వేసినా.. పేరెంట్స్, టీచర్స్ వాళ్ల నోళ్లు మూసేస్తున్నారు. దీంతో.. అదేంటో తెలుసుకోవాలనే తపనతో కొంతమంది పెడదోవ పడుతుండగా.. బలహీనతనలు జయించలేక మరింతమంది హెచ్ఐవీని కొనితెచ్చుకుంటున్నారు. అగ్రదేశాల్లో అక్షరాస్యత ఎక్కువగా ఉన్నందువల్ల ఎయిడ్స్ మీద అవగాహన త్వరగా కలుగుతోంది. పైగా ఆ దేశాల్లో సెక్స్ లాంటి అంశాలపై ఓపెన్ గా మాట్లాడుకుంటారు. అయితే అక్షరాస్యతలోనూ, అభివృద్ధిలోనూ వెనుకబడిన భారత్, ఆఫ్రికా ఖండంలోని కొన్ని దేశాలు హెచ్ఐవీ వ్యాధి వ్యాప్తిలో అగ్రస్థానంలో ఉంటున్నాయి.

బలహీనతలను జయించడమే మార్గం!
     ఎయిడ్స్ కు మందులేదని, నివారణ ఒక్కటే మార్గమని మనకు తెలుసు! మందులేని జబ్బు మన దగ్గరికి రాకుండా ఉండాలంటే ముందు మనం మన బలహీనతలను జయించాలి. ముఖ్యంగా సెక్స్ అనే వీక్ నెస్ ను తరిమికొట్టాలి. సురక్షితంకాని సెక్స్ వల్లే హెచ్ఐవీ అధికంగా వ్యాప్తి  చెందుతోందన్నది వాస్తవం. ఈ విషయం తెలిసి కూడా ఎంతోమంది జాగ్రత్తలు తీసుకోవడం లేదు. అంటే వారికి అది బలహీనత! దీని నుంచి బయటపడకుండా వ్యాధి సోకిన తర్వాత బాధపడితో లాభం ఏముంటుంది?. అందుకే వ్యాధి వచ్చినవారిని దగ్గరకు చేర్చి సపర్యలు చేయడమే కాకుండా.. అసలు వ్యాధిబారిన పడకుండా ఉండేలా హెచ్చరించాలి.

పేదలే సమిధలు
     ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ విస్తరిస్తున్న క్రమాన్ని పరిశీలిస్తే.. ఎక్కువగా పేదలే దీనికి బలవుతున్నారు. భారత్, ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో పొట్టకూటికోసం వ్యభిచారకూపంలోకి వెళ్లినవారిలోనే హెచ్ఐవీ ఎక్కువగా కనిపిస్తోంది. సరైన పోషకాహారం లేకపోవడంతో వారిలోని రోగనిరోధక శక్తి చాలా వేగంగా క్షీణిస్తోంది. దీంతో వారు త్వరగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి శృంగారం వల్ల ఎయిడ్స్ వస్తుందని వారికి తెలుసు. కానీ ఆకలి వారి చేత ఆ పని చేయిస్తోంది.! ఆపూట కడుపు నింపుకోవాలంటే ఒళ్లు అమ్ముకోవాల్సిన దుస్థితిలో ఉన్న ఎవరైనా రేపటి గురించి ఆలోచించరు. అందుకే ఆ మహమ్మారిని వారు జయించలేకపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా రోజూ 15వందల మంది శిశువులు ఎయిడ్స్ తోనే జన్మిస్తున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. వారి తల్లిదండ్రులు చేసిన తప్పుకు వారు బలవుతున్నారు. ఎయిడ్స్ కు మందు కనిపెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. వాటిని కొనసాగిస్తూనే.. పొట్టకూటికోసం వ్యభిచారాన్ని ఎంచుకున్నవారికి కాస్త ఉపాధి కల్పిస్తే ఎయిడ్స్ ను కొంతమేర అరికట్టగలిగే అవకాశం ఉంది.
   

Wednesday, August 01, 2012

జగన్ గూటికి కేవీపీ!?

     వై.ఎస్.కు జీవితకాలం తోడునీడగా ఉన్న కేవీపీ రామచంద్రరావు.. ఆయన కుమారుడు జగన్ కు కూడా అండగా నిలవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.. ఇప్పటికే.. ఆయన జగన్ పార్టీకి అవసరమైనప్పుడల్లా సలహాలు, సూచనలు ఇస్తున్నట్లు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఆంతరంగకుల మాట!

గాంధీభవన్లో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి పదవీస్వీకారం సందర్భంగా జరిగిన సమావేశంలో.. కేవీపీ వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. గాంధీభవన్లో వై.ఎస్.ఫోటో లేకపోవడం ఆయన అభిమానులందరినీ కలచివేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వై.ఎస్.పై కాంగ్రెస్ నేతలు గతంలో చాలాసార్లు విమర్శలు చేసినా.. ఏనాడూ ఆయన ఆత్మబంధువు కేవీపీ నోరు తెరవలేదు.! కానీ వై.ఎస్.ను విమర్శిస్తూ.. పార్టీపై అతని ముద్రను చెరిపేయాలనుకుంటున్న కాంగ్రెస్ కు వీడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయమని కేవీపీ భావిస్తున్నట్లు తెలిసింది. అందుకే బహిరంగంగానే.. సాక్షాత్తూ సీఎం సాక్షిగా వై.ఎస్.ఫోటోపై కేవీపీ నిలదీశారు..

కాంగ్రెస్ పార్టీలో కూడా కేవీపీపై ఎంతో మంది నాయకులు పలు అనుమానాలు వ్యక్తంచేశారు. మధుయాస్కీ లాంటి నేతలు.. కేవీపీని జగన్ కోవర్టుగా బహిరంగంగా ప్రకటించారు. గాంధీభవన్లో కేవీపీ వ్యాఖ్యలతో.. ఆ వ్యాఖ్యలు నిజమే కాబోలు అని ఇప్పుడు గుసగుసలాడుకుంటున్నారు.. కానీ జగన్ కు సన్నిహితంగా ఉన్న కొందరు నేతలు మాత్రం.. కేవీపీ నిత్యం వై.ఎస్.కుటుంబానికి అండగానే ఉంటున్నారని.. అవసరమైనప్పుడల్లా జగన్్కు సూచనలు, సలహాలు ఇస్తున్నారని చెబుతున్నారు. మరికొందరేమో.. జగన్ ను పార్టీ పెట్టేలా ప్రోత్సహించిందే కేవీపీ అని.. ఆయన సూచన మేరకే యువనేత కాంగ్రెస్ పార్టీని వీడారని చెప్తున్నారు..

ఏదేమైనా... కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఉన్న పలువురు నేతలు 2013 మధ్యనాటికి జగన్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే.. ఎవరినిపడితే వారిని పార్టీలోకి స్వాగతించేందుకు కూడా జగన్ సిద్ధంగా లేనట్లు ఆయన సన్నిహితుల సమాచారం.. ప్రధానంగా వై.ఎస్.ను, తనను బాగా విమర్శించినవారినే మొదట పార్టీలో చేర్చుకోవాలని జగన్ భావిస్తున్నారట! తిట్టిన నోళ్ల నుంచే.. పొగిడించుకోవాలనేది ఇక్కడ యువనేత వ్యూహంగా కనిపిస్తోంది..!!

Sunday, January 01, 2012

కాంగ్రెస్ లో కలిసిపోనున్న జగన్ పార్టీ..!?


    2014 ఎన్నికల్లోగా కాంగ్రెస్ పార్టీలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీని జగన్ విలీనం చేయబోతున్నారని టైమ్స్ ఆఫ్ ఇండియా ఈరోజు ప్రధాన కథనాన్ని ప్రచురించింది. విశ్వసనీయ వర్గాలు ఈ మేరకు సమాచారం అందించినట్లు అందులో పేర్కొన్నారు.

     2010 నవంబర్ 18వ తేదీన జగన్ ఢిల్లీకి వెళ్లారు. ఆ పర్యటనలో కాంగ్రెస్ అధిష్టానానికి, జగన్ కు మధ్య ఈ మేరకు ఒప్పందం కుదిరిందని ఆ కథనం పేర్కొంది. ఇద్దరు ఎంపీలు జగన్ కు, కాంగ్రెస్ అధిష్టానానికి మధ్య సంధానకర్తలుగా వ్యవహరించారని తెలిపింది. గాలి జనార్ధన్ రెడ్డి లాంటి పరిస్థితి తనకు రాకుండా ఉండేందుకు జగన్ ఈ ప్రతిపాదన చేశారని.. ఇందుకు కాంగ్రెస్ హైకమాండ్ కూడా అంగీకరించిందని పేర్కొంది.. దీనికి సంబంధించి కాంగ్రెస్ ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయకపోయినా... ప్రాథమికంగా ఓకే చెప్పినట్లు సమాచారం.

     సీబీఐ కేసులో తనను అరెస్టు చేయకూడదని.. కేసు విచారణ వేగాన్ని తగ్గించాలని జగన్ షరతు పెట్టినట్లు సమాచారం. అలాగే పార్టీ విలీనం తర్వాత రాష్ట్రంలో తనకు ప్రధాన హోదా ఇవ్వాలని.. అలాగే చిరంజీవిని రాష్ట్ర రాజకీయాల నుంచి దూరంగా ఉంచాలని జగన్ కోరినట్లు తెలుస్తోంది. 2014లోపు తెలుగుదేశం పార్టీని పూర్తిగా బలహీనపర్చాలనే ఉమ్మడి అంగీకారానికి అటు కాంగ్రెస్, ఇటు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లు వ్యూహరచన చేశాయి. 2014లో రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు కృషి చేయాలని నిర్దేశించుకున్నాయి.

    జగన్ తో కుదిరిన ఒప్పందం మేరకే... చిరంజీవికి కేంద్ర మంత్రిపదవి వరించనుంది. అలాగే సీబీఐ కేసు వేగం కూడా నెమ్మదించింది. అంతేకాక జగన్ ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత సోనియాపై విమర్శలు మానేసి.. తెలుగుదేశం పార్టీనే టార్గెట్ గా చేసుకున్నారు. అడపాదడపా టీడీపీ కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తోంది. ఢిల్లీలో జగన్ కాంగ్రెస్ పార్టీతో ఒప్పందం కుదుర్చుకున్నారని.. అందుకే సోనియాపై ఇప్పుడు నోరెత్తడం లేదని విమర్శిస్తోంది..

     మరి ఈ ఒప్పందం ఎంతమేరకు వాస్తవమో తెలియాలంటే మరో రెండేళ్లు ఆగాల్సిందే..! ప్రేమే లక్ష్యం-సేవే మార్గం అంటూ పుట్టుకొచ్చిన ప్రజారాజ్యం పార్టీ కనీసం మూడేళ్లు కూడా గడవకముందే చేతులెత్తేసి.. షేక్ హ్యాండిచ్చింది. ఇప్పుడు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే మార్గంలో పయనించేటట్లు కనిపిస్తోంది. ఇదే జరిగితే.. రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్, టీడీపీల మధ్యే ప్రధాన పోరు ఉండే అవకాశం ఉంది...

Note: Times of Indiaలో వచ్చిన కథనాన్ని చూడాలనుకుంటే.. ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయవచ్చు.
http://timesofindia.indiatimes.com/city/hyderabad/Jagans-olive-branch-to-Cong/articleshow/11323109.cms