Friday, February 22, 2013

వీళ్లు సీతయ్యలు..! మారరు..! మాట వినరు..!!!

ఫిబ్రవరి 21, 2013 గురువారం సాయంత్రం 7 గంటల సమయం.. దిల్ సుఖ్ నగర్ ప్రాంతం ఒక్కసారిగా బాంబుపేలుళ్లతో దద్దరిల్లింది. ప్రాణనష్టం.., క్షతగాత్రులు.., పోలీసులు.. మీడియా హడావుడి.. మనకు కొత్తేమీ కాదు..!

     వాస్తవానికి పేలుళ్లు ఎలా జరిగాయి..? ఎవరు చేశారు..? లాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం కష్టం.. కానీ ఎక్కడ పేలుళ్లు జరిగినా దానికి ఉగ్రవాదులే కారణమనే అభిప్రాయం కలగడం మామూలైపోయింది. ఇక మన పాలకులు కూడా విచారణ జరుపుతున్నాం.. నివేదిక వచ్చాకే చెబుతాం.. అంటూ మాటల గారడీ చేస్తుంటారు. అయితే.. దిల్ సుఖ్ నగర్ పేలుళ్లు జరగడానికి ముందే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు హెచ్చరికలు వచ్చాయని తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి  షిండే కూడా తాము ముందే హెచ్చరించాని చెప్పారు. మరి.. రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు..? కనీసం ఇలా దాడులు జరిగే ప్రమాదముందని ఒక్క ప్రకటన కానీ.. స్టేట్ మెంట్ కానీ ఎందుకు ఇవ్వలేదు..? కేంద్రం నుంచి వచ్చిన హెచ్చరికలను రాష్ట్ర ప్రభుత్వం మామూలు వార్నింగ్ లాగే తీసుకుని పెడచెవిన పెట్టిందని అర్థమవుతోంది. అందుకే దుర్ఘటన జరిగింది. కొంచెం మేల్కొని జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ చర్య జరిగేది కాదేమో..!!

      పేలుళ్లు జరిగాయి సరే.. ఇప్పుడేం చేయాలి? యధావిథిగా కేంద్రం, రాష్ట్రం అప్రమత్తమయ్యాయి. కేంద్రం తన బలగాలను హుటాహుటిన హైదరాబాద్ పంపించింది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కూడా తనదైన శైలిలో విచారణ మొదలు పెట్టింది.. కేసులు బుక్ చేసింది.. ముఖ్యమంత్రి కూడా పేలుళ్లు జరిగిన 15 నిమిషాల వ్యవధిలోనే ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అయితే.. ఇక్కడే ఆనవాళ్లు మిస్ అయ్యాయి.. హుటాహుటిన ముఖ్యమంత్రితో పాటు మిగిలిన నేతలు అక్కడి చేరుకోవడంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.. మృతదేహాలు, క్షతగాత్రులను తరలించే సమయంలో కూడా అక్కడ కీలకమైన ఆధారాలు మాయమైనట్లు తెలుస్తోంది. వాస్తవానికి అలా జరగడం సహజం.. మృతదేహాలు, క్షతగాత్రులను తీసుకెళ్లేటప్పుడు ఆధారాలు మాయమవుతాయన్న ఆలోచన సహజంగా కలగదు.. కనీసం ముఖ్యమంత్రి లాంటి నేతలు వెళ్లినప్పుడైనా పోలీసులు కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది..

     ఇక మీడియా సంగతి చెప్పనక్కర్లేదు.. ఎక్స్ క్లూజివ్ మోజులో కొట్టుకుపోతున్న మన మీడియా చానళ్లకు ఏది ప్రసారం చేయాలో, ఏది ప్రసారం చేయకూడదో కూడా అర్థం కావట్లేదు.. రక్తపు ముద్దలు కనిపిస్తే చాలు అన్న చందంగా రిపోర్టర్లు పోటీ పడ్డారు. ఎక్కడ ఏ చిన్న రక్తపుబొట్టు కనిపించినా దాన్ని జూమ్ ఇన్ చేసి స్టోరీలు అల్లేశారు. ఇంకొంతమంది రిపోర్టర్లయితే క్షతగాత్రుల మూతిమీద మైకు పెట్టి ఎలా జరిగింది.. మీరిక్కడ ఎందుకున్నారు.. మీ పక్కన ఎవరున్నారు.. ఆ టైమ్ లో మీరేం చేస్తున్నారు.. లాంటి ప్రశ్నల వర్షం కురిపించారు.. అసలే షాక్ లో ఉన్న ఆ బాధితుడు ఈ ప్రశ్నలన్నింటికి ఎక్కడ సమాధానం చెప్పగలరు? అంతటి కనీసజ్ఞానం కూడా రిపోర్టర్లు బాధితుల నుంచి చీవాట్లు, తిట్లు కూడా ఎదుర్కొన్నారు. అయినా వీళ్లు మారరు.. మాట వినరు.. ఎందుకంటే వీళ్లు సీతయ్యలు!

     వరల్డ్ ట్రేడ్ టవర్స్ మీద దాడి జరిగినప్పుడు 2వేల మందికి పైగా చనిపోయారు.. కానీ ఆ ఘటన జరిగినప్పుడు కానీ, ఆ తర్వాత కానీ మనకు ఒక్క నెత్తుటి విజువల్ కూడా టీవీలో కనిపించలేదు.. కానీ దిల్ సుఖ్ నగర్ పేలుడు జరిగిన వెంటనే మన టీవీల నుంచి నెత్తుటి విజువల్సే..! ఎవరు ఎంత ఎక్కువ నెత్తురు చూపిస్తే.. వారికంత రేటింగ్స్ వస్తాయి అన్నట్లు టీవీ చానల్స్ రెచ్చిపోయాయి.. అసలే నెత్తుటి విజువల్స్.. ఆ పైన మధ్యలో EXCLUSIVE అనే పెద్ద అక్షరాలతో హడావుడి చేశారు. అసలు ఏది ఎక్స్ క్లూజివ్..? ఏది ఎక్స్ క్లూజివ్ కాదు..? అనే కనీస జ్ఞానాన్ని కూడా టీవీ చానల్స్ మరిచిపోయినట్లున్నాయి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మీడియా బాధ్యత చాలా ఉంటుంది. మీడియా ద్వారా వార్త వేగంగా వ్యాప్తి చెందుతుంది. అలాంటి సమయంలో మీడియా ఎంతో సంయమనంతో వ్యవహరించాలి. కానీ మన వాళ్లకు అవేవీ పట్టట్లేదు.. దొరికిందే చాలు అన్నట్లు అల్లుకుపోతున్నారు..

     నేర వార్తలు ప్రసారం చేయడం వల్ల ఇంతో కొంతో నేరు సంస్కృతి పెరిగే ప్రమాదముందని భావంచి ఇప్పటికే ప్రభుత్వం కొన్ని గైడ్ లైన్స్ రూపొందించింది. వాటిని చాలా చానల్స్ అమలు చేస్తున్నాయి. ఇటీవలికాలంలో చాలా వరకూ నేరవార్తలకు ప్రాధాన్యం తగ్గించి ప్రసారం చేస్తున్నాయి. మరి ఇలాంటి పేలుళ్లు జరిగినప్పుడు మీడియా ఇంకెంత బాధ్యతతో వ్యవహరించాలి..? రక్తం చూపించకుండా వార్తను ప్రసారం చేయలేవా..? అసలు ఎందుకు అలాంటి విజువల్స్ చూపించాలి..? ఎందుకు ప్రేక్షకులను భయపెట్టాలి..? ఎంత భయపెడితే అంత ఎక్కువగా రేటింగ్స్ వస్తాయనుకుంటున్నారేమో..? ఇంకో ముఖ్య విషయం ఏంటంటే.. ఘటనాస్థలంలో ఉన్న రిపోర్టర్లు చేసే హడావుడి చేసి చాలా మంది విసిగిపోతున్నారు. విషయం ఏమీ లేకపోయినా.. ఏదో కల్పించుకుని చెప్పేస్తున్నారు.. చిన్నపాటి కాగితం కనిపించినా.. అది విద్రోహుల చర్యే అంటూ నిర్ధారించేస్తున్నారు.. ఒక్కసారిగా మీడియా ప్రతినిధులందరూ వెళ్లి లైవ్ లు, పీటూసీలు అంటూ హడావుడి చేస్తుండడంతో అక్కడి ఆధారాలు కూడా మిస్సవుతున్నాయి. విచారణకు ఆధారాలు చాలా కీలకం.. అలాంటివి మిస్ కాకుండా చూడాల్సిన బాధ్యత అందరి పైనా ఉంటుంది.. సీతయ్య వేషం నుంచి బయటపడినప్పుడే ఇది సాధ్యం..!!