Sunday, July 28, 2013

తెలంగాణ టు రాహుల్ వయా జగన్

తెలంగాణ టు రాహుల్ వయా జగన్..
... చదవడానికి, వినడానికి వింతగా ఉన్నా ఇది వాస్తవం.. ఎన్నో ఏళ్లుగా నాన్చుతూ వస్తున్న తెలంగాణ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడు తేల్చేయాలనుకోవడం వెనుక ఎన్నో కారణాలు, వ్యూహాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్ర విభజన జరగడానికి ప్రధాన కారణం జగనే!
     ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలియనిది కాదు. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో నామరూపాలు లేకుండా పోతాయని ఆ పార్టీ పెద్దలు ఎప్పుడో గమనించారు. ఇన్నాళ్లూ పార్టీని కేంద్రంలో అధికారంలో ఉంచిన ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి దుస్థితిని వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎలాగైనా మళ్లీ అధికారంలోకి రావాలంటే ఏపీని విస్మరించకూడదని నిర్ణయించుకున్నారు.. ఇందుకు ఎంచుకున్న ఓ అస్త్రమే - రాష్ట్రవిభజన!

రాష్ట్ర విభజన కాంగ్రెస్ కు ఎలా లబ్ది చూకూరుస్తుంది..?

     తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాంతంలో పూర్తిస్థాయిలో పట్టు సాధించవచ్చని కాంగ్రెస్ వ్యూహం. తెలంగాణ ఏర్పాటు చేస్తే.. టీఆరెస్ ప్రభావం పెద్దగా ఉండబోదని ఆ పార్టీ పెద్దలు అంచనా వేస్తున్నారు. అందుకే ఆ పార్టీని పక్కనపెట్టి క్రెడిట్ మొత్తం తామే కొట్టేయాలనే వ్యూహంతో ఉన్నారు. నిజానికి తెలంగాణ ఏర్పాటు చేస్తే.. కాంగ్రెస్ ఇక్కడ భారీగా లబ్ది పొందడం ఖాయం. తెలంగాణ రాష్ట్రంలో అధికారంతో పాటు, కేంద్రంలో యూపీఏ-3 అధికారంలోకి రావడానికి దోహదపడేలా ఈ ప్రాంతంలో మెజారిటీ ఎంపీ సీట్లను గెలుచుకునే అవకాశం ఉంటుంది..

మరి సీమాంధ్రలో..!!
     తెలంగాణ ఏర్పాటు చేస్తే సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి నామరూపాలు లేకుండా పోవడం ఖాయం. ఈ విషయం ఆ పార్టీ పెద్దలకు తెలియనిదేమీ కాదు.. అయినా ఆ పార్టీ లెక్కచేయట్లేదు. ఇందుకు ప్రధాన కారణం జగన్.! అవును.. తెలంగాణ ఏర్పాటు చేయడం ద్వారా సీమాంధ్రలో సమీకరణాలు పూర్తిగా మారిపోతాయి. అక్కడ టీడీపీ, వైసీపీల మధ్యే ప్రధాన పోరు ఉంటుంది. కాంగ్రెస్ ఓటు బ్యాంకు సాధారణంగా జగన్ పార్టీవైపే వెళ్తుంది. సీమాంధ్రలో జగన్ పార్టీ మెజారిటీ సీట్లు సాధిస్తుందని కాంగ్రెస్ కు తెలుసు. జగన్ పార్టీ సీట్లు సాధిస్తే కాంగ్రెస్ కు ఏంటి లాభం అనే సందేహం రావచ్చు.. కానీ జగన్ పార్టీకి సీట్లు వస్తే.. అవి కాంగ్రెస్ కు వచ్చినట్లే..! ఎందుకంటే వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఇప్పటికే యూపీఏకే మద్దతిస్తామని ప్రకటించారు ! అందుకే కాంగ్రెస్ పార్టీ కూడా ధీమాగా రాష్ట్ర విభజనకు ముందడుగు వేస్తోంది. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ దెబ్బ తిన్నా.. జగన్ పార్టీ బలపడితే తాము బలపడినట్లేనని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఢిల్లీలో రాష్ట్ర విభజన సంకేతాలు రాగానే వైసీపీ ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేయడం వెనుక కూడా వ్యూహమిదే..! తెలంగాణలో ఎలాగూ పార్టీ పని అయిపోయిందని భావించిన వైసీపీ నేతలు.. కనీసం సీమాంధ్రపై పూర్తి పట్టు సాధించాలని నిర్ణయించుకున్నారు. అందుకే రాజీనామాల అస్త్రం సంధించారు. పూర్తిస్థాయి సమైక్యవాదులుగా మారిపోయారు. కాంగ్రెస్ పెద్దల సూచనల మేరకే వాళ్లు ఇలా చేశారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.
     ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు పార్టీని బతికిస్తారనే నమ్మకం అధిష్టానానికి లేదు. అందుకే వారు జగన్ నే నమ్ముకున్నారు. జగన్ ఎప్పటికైనా తమకే మద్దతిస్తారని.. వీలైతే పార్టీని విలీనం చేస్తారని కాంగ్రెస్ పార్టీ గట్టిగా నమ్ముతోంది. అందుకే సీమాంధ్ర కాంగ్రెస్ నేతల నుంచి ఎన్ని ఒత్తిడులు ఎదురైనా.. అధిష్టానం లెక్కచేయట్లేదు. రాష్ట్ర విభజన దిశగానే ముందడుగు వేస్తోంది. పైగా ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర పెద్దలు పార్టీని గట్టెక్కిస్తారనే నమ్మకం సోనియాకు లేదు. అందుకే జగన్ ను నమ్ముకోవడమే మేలనే నిర్ణయానికొచ్చింది కాంగ్రెస్. ప్రస్తుత పరిణామాలను చూస్తే.. విభజన జరిగిన తక్షణమే జగన్ జైలు నుంచి బయటపడే సూచనలు కనిపిస్తున్నాయి..

జగన్ స్ట్రాంగ్ గా ఉంటే..?
     కాంగ్రెస్ వైఖరిపై జగన్ గట్టిగా ఉంటే రాష్ట్ర విభజన అంత సులువు కాదు. కానీ జగన్ అలా ఉండలేని పరిస్థితి. కేసుల నుంచి బయటపడాలంటే కాంగ్రెస్ పార్టీయే జగన్ కు దిక్కు.! ఒక విధంగా ఇక్కడ కూడా క్విడ్ ప్రో కో అనే చెప్పొచ్చు.. జగన్ మద్దతు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో మళ్లీ అధికారంలోకి రావడం ఈజీ అవుతుంది. రాహుల్ గాంధీ ప్రధాని కోరిక నెరవేరుతుంది. అదే సమయంలో కాంగ్రెస్ కు మద్దతివ్వడం ద్వారా జగన్ తన కేసుల నుంచి బయటపడేందుకు మార్గం సుగమమవుతుంది.