చిత్తూరు జిల్లా తిరుపతి
సమీపంలోని శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ పై కొంతమంది ఆరోపణలు
గుప్పిస్తున్నారు. కూలీలను కాల్చి చంపడం నేరమని మాట్లాడుతున్నారు. కూలీలు ఏం తప్పు
చేశారని ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్యాయంగా కూలీలను పొట్టన
పెట్టుకునిందని విమర్శిస్తున్నారు.. ఇక తమిళనాడులో ఆంధ్ర ప్రజలు, ఆస్తులపై తమిళులు
కక్షగట్టారు. ఆంధ్రా బస్సులను ధ్వంసం చేస్తున్నారు..
కూలీలా..? హంతకులా..?
తమిళుల ఆగ్రహంలో అర్థం
ఉండొచ్చు.. కానీ అక్కడ చనిపోయింది తమిళుల ఆత్మాభిమానాలను దశదిశలా వ్యాపింపజేసిన
మహాపురుషులు కాదనే విషయాన్ని వాళ్లు గుర్తుపెట్టుకోవాలి. తమిళుల ఆత్మాభిమానాన్ని,
గౌరవాన్ని మంటగలపిన కూలీలు వాళ్లు. పొట్టకూటికోసం చిప్ప చేతబట్టుకుని శేషాచలం అడవులకు
వచ్చిన కూలీలు కాదు వాళ్లు. వాళ్ళంతా డబ్బుపై వ్యామోహంతో ఎలాంటి నీచానికైనా
పాల్పడే మనస్తత్వమున్న వ్యక్తులు..
స్మగ్లింగ్ నేరం కాదా..?
ఎర్రచందనం స్మగ్లింగ్
నేరమనే విషయం అందరికీ తెలిసింది.. ఎర్రచందనాన్ని దొంగచాటుగా కొట్టి తరలిస్తున్న
కూలీలకు ఆ విషయం ఇంకా బాగా తెలుసు. అయినా వాళ్లంతా శేషాచలానికి వచ్చారు.. అంటే
స్మగ్లింగ్ నేరమని తెలిసీ వచ్చారు.. ఇలాంటి అక్రమాలకు పాల్పడేటప్పుడు ప్రాణాలకు
ప్రమాదం ఉంటుందని కూడా వారికి తెలుసు. అయినా వాళ్లు లెక్కచేయలేదు. పొట్టకూటికోసం
పాకులాడే కూలీలెవరూ ఇలాంటి పనులు చేయరు.. శేషాచలం అడవుల్లో హతమైన కూలీలందరూ
డబ్బుకోసం ఎలాంటి అఘాయిత్యాలకైనా పాల్పడే హంతకులే..!
అమాయక కూలీలను అన్యాయంగా
పొట్టన పెట్టుకున్నారని.. మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని కొంతమంది పెద్దలు విమర్శలు
గుప్పిస్తున్నారు. మరి.. ఎర్రచందనం స్మగ్లింగ్ నేరమని తెలిసీ అడవుల్లోకీ ఈ
కూలిలంతా ఎందుకొచ్చారు..? కొన్ని నెలల కిందట ఓ అటవీ అధికారిని శేషాచలం అడవుల్లోనే
బండరాళ్ళతో మోది పాశవికంగా హత్య చేసినప్పుడు ఈ సోకాల్డ్ మానవ హక్కుల పరిరక్షకులు
ఏమయ్యారు..? అప్పుడు అటవీ అధాకారిని మర్డర్ చేసింది కూలీల వేషంలో ఉన్న
హంతకులు కాదా..?
ఏది నేరం..? ఏది న్యాయం..?
ఇక తమిళనాడులో ఆంధ్రా ఎన్
కౌంటర్ పై అనేక విమర్శలు వస్తున్నాయి.. వారు అలా ప్రవర్తించడాన్ని తప్పుబట్టలేం..
అయితే.. తమిళనాడులో పేరొందిన స్మగ్లర్ వీరప్పన్ ఉదంతం ఇక్కడోసారి గుర్తు
చేసుకోవాలి. వీరప్పన్ కోసం తమిళనాడు సర్కార్ ఎంత పెద్ద పోరాటం చేసిందో తెలుసు..
వీరప్పన్ కోసం తమిళనాడు ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో తెలుసు. నాడు వాళ్ళ
రాష్ట్రంలో సంపద కొల్లగొడుతున్న వీరప్పన్ ను హత్య చేయడంపై తమిళనాడు మొత్తం సంబరాలు
చేసుకుంది. ఇప్పుడు అదే తమిళనాడుకు చెందిన కూలీలు పక్కరాష్ట్రం సంపదను దోచుకెళ్లూ చనిపోతే
మాత్రం పెద్ద నేరం.. ఇదేం న్యాయం..? సంపద ఏ రాష్ట్రానికైనా సంపదే..! నేరం ఎక్కడైనా నేరమే..!