అనగనగా ఓ ఊరు..
కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేదు
అయినా.. లక్షలాదిగా తరలివెళ్తున్న జనం..
సైన్స్‌కు చిక్కని అద్భుతం ఆ గ్రామం సొంతం
2 దేశాల్లో సంచలనం సృష్టిస్తున్న కుగ్రామం
ఒక్కోసారి కొందరి వ్యక్తులకు అనుకోని ప్రాధాన్యత లభిస్తుంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా జనం నోళ్లలో నానుతుంటారు. అలాగే కొన్ని ఊర్లు కూడా ఇదే కోవలోకి వస్తాయి. అక్కడ పుట్టిన వ్యక్తుల వల్లనో.. ప్రాంత విశిష్టత వల్లనో ఆ ఊరికి చెప్పలేనంత పేరు వస్తుంది. అలాగే ఆఫ్రికా ఖండంలో కూడా ఓ ఊరు ఇప్పుడు సంచలనంగా మారింది.. లక్షలాది మందిని తన దగ్గరికి రప్పించుకుంటూ.. అద్భుతం సృష్టిస్తోంది..
ఆఫ్రికా ఖండం ఒకప్పుడు చీకటి ఖండం. కానీ ఇప్పుడు ఆ ఖండం రూపురేఖలు మారిపోయాయి.. ఆ ఖండంలోని కొన్ని దేశాలు అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడుతున్నాయి. అయితే.. ఇప్పటికీ కనీసం 3 పూటలా తిండిలేని ప్రజలెంతో మంది అక్కడ నివశిస్తున్నారు. ఉగాండా, సోమాలియా, రువాండా, కాంగో.. లాంటి ఎన్నో దేశాల ప్రజలు ఆహార కొరతతో ఇబ్బంది పడుతున్నారు. అక్కడి ప్రజలకు వైద్య, వైద్య సౌకర్యాలు కూడా అంతంత మాత్రమే..
అపార వనరులున్నా.. వాటిని వినియోగించుకోలేని దుస్థితి ఆఫ్రికా ఖండ ప్రజలది.. ఇందుకు కారణాలు అనేకం.. అక్షరాస్యత లేకపోవడం అభివృద్ధి వెనుకబాటుతనానికి ప్రధాన కారణం. మూఢనమ్మకాలు కూడా అక్కడి ప్రజలను ఆధునికతవైపు నడిపించలేకపోతున్నాయి. అందుకే.. కనీసం దుస్తులు కూడా వేసుకోని ప్రజలనెందరినో మనం ఇప్పటికీ ఆఫ్రికా ఖండంలో చూడొచ్చు..
ఇప్పుడు మనం చెప్పుకోబోయే గ్రామం కూడా ఆఫ్రికా ఖండంలోనే ఉంది. ఇంకా వివరాల్లోకి వెళ్తే.. టాంజానియా దేశంలోని ఓ మారుమూల పల్లె ఇది... దీని పేరు- సముంగె! అరుషా అనే నగరానికి 4వందల కిలోమీటర్ల దూరంలో ఈ సముంగె గ్రామం ఉంటుంది. ఇప్పుడిది ఓ సంచలనం.. టాంజానియా, కెన్యా దేశాలకు చెందిన లక్షలాది మంది ఈ మారుమూల పల్లెకు తరలివస్తున్నారు. అంతేకాదు.. విదేశీయులు కూడా ఇప్పుడిప్పుడే ఈ ఊరికి రావడం మొదలుపెట్టారు..
ఈ ఊరికి కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేదు. ఒకప్పుడు కాలిబాటే ఈ ఊరెళ్లడానికి మార్గం. కానీ ఇటీవలే వాహనాలు రావడం మొదలుపెట్టాయి. అవి కూడా రాళ్లు, గుట్టలు, వాగులు దాటుకుని రావాల్సిందే.. ఈ ఊరికి వెళ్లడం సాహసంతో కూడుకున్నపని.. రోడ్డు మార్గం లేకపోవడంతో.. వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోతుంటాయి. కనీసం వాటిని రిపేర్ చేసుకోవడానకి అక్కడ మెకానిక్‌లు కూడా కనిపించరు. వాహనదారులే వాటిని రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే.. మార్గమధ్యంలో ఎక్కడపడితే అక్కడ ఆగిపోయిన వాహనాలు.. వాటిని రిపేర్ చేసుకుంటున్నవారు మనకు కనిపిస్తుంటారు..
సముంగె గ్రామానికి ఘన చరిత్రేమీ లేదు.. ఈ ఏడాది జనవరి నుంచే ఇది ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా గత మూడు వారాల నుంచి ఈ ఊరికి వస్తున్న ప్రజల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఇక్కడికి వస్తున్నవారిలో చిన్నా పెద్దా అనే తేడా లేదు... పేద, ధనిక అనే బేధం లేదు.. తరతమ బేధాలు లేకుండా అందరూ ఇక్కడికి వస్తున్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా భరిస్తున్నారు.. సమీప గ్రామాల ప్రజలు కిలోమీటర్లకొద్దీ నడిచి వస్తున్నారు. కొంతమంది జీపుల్లో వస్తున్నారు. ఇక.. బాగా ఉన్న నేతలు హెలికాప్టర్లలో కూడా వస్తున్నారు..
ఇన్ని కష్టాలు పడి వారెందుకు అక్కడికి వెళ్తున్నారు..?
అంటే... అక్కడేమీ లేదు.. వారు వెళ్తున్నది కేవలం ఓ వ్యక్తికోసమే..!! అంబిలికిలె మ్వసపిలె అనే ఇతనికోసమే ప్రజలంతా వెళ్తున్నారు. ఇతనిప్పుడు టాంజానియాలో పెద్ద సెలబ్రిటీ..!
మ్వసపిలె ఏంచేస్తాడు..?
మ్వసపిలె చర్చిలో పాస్టర్‌గా పనిచేసి రిటైరయ్యాడు.. దేవుడు శాసిస్తాడు.. నేను పాటిస్తాను అనే రకం ఇతను..!! దేవుడన్నా.. అతని మహిమలన్నాఇతనికి విశ్వాసం ఎక్కువ..కొన్నేళ్లక్రితం దేవుడు కలలో కనిపించి.. ప్రజలకు ఏదైనా సేవ చేయాలని ఆదేశించారట..! అయితే ఆ విషయాన్ని మ్వసపిలె పెద్దగా పట్టించుకోలేదు. కానీ.. 2009లో మరోసారి దేవుడు ప్రత్యక్షమై మరోసారి ఆదేశించారట! అంతే.. ఇక.. అప్పటి నుంచి ఆయన ప్రజల సేవలో మునిగిపోయారు.. తనకు చేతనైననంత మేలు చేయాలని భావించారు...
సముంగెలోని తన ఇంటివద్దే ఒక చిన్న క్లినిక్‌ను స్టార్ట్ చేశాడు మ్వసపిలె! తన దగ్గరికి వచ్చేవాళ్లకు మందులివ్వడం.. వ్యాధిని నయం చేయడం అతను చేస్తున్న సేవ..! సేవ అంటే ఫ్రీగా చికిత్స చేస్తున్నాడనుకుంటే పొరపాటే..! చేసిన వైద్యానికి డబ్బులు వసూలు చేస్తాడు...!! అయినా మ్వసపిలె కోసం ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు.. తనేమీ స్వామీజీ కాదు.. తనకు దివ్యశక్తులు ఉన్నాయని తానెప్పుడూ ప్రకటించుకోలేదు.. తన దగ్గరికి రావాలని ఎవరినీ కోరలేదు.. అయినా ప్రజలు ఇతనికోసం పడిచస్తున్నారు... వచ్చే వాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందే కానీ.. తగ్గడం లేదు..
జనవరి వరకూ మ్వసపిలె గురించికానీ.. సముంగె ఊరి గురించి కానీ ఎవరికీ పెద్దగా తెలియదు. లోలియోండో ప్రాంతంలో ఇలాంటి ఓ ఊరుందని తెలుసుకానీ.. ఆ ఊరికి ఒక్కసారిగా ఇంతపేరు వస్తుందని ఎవరూ ఊహించలేదు.. కానీ సముంగె పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఇదంతా మ్వసపిలె వల్లే అంటారు స్థానికులు..
జనం ఎందుకు వస్తున్నారు?
అంటే.. అతని చికిత్స కోసమే..! అవును అతని వైద్యం కోసమే జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు.. మరి అతను చేస్తున్న వైద్యం ఏంటి..? ఆ వైద్యంలో ఉన్న మహత్తు ఏంటి..? మ్వసపిలె ఎలాంటి వైద్య విద్యా అభ్యసించలేదు.. అయినా.. అతను చేస్తున్న చికిత్స మాత్రం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మార్మాగిపోతోంది..
మరి మ్వసపిలె చేస్తున్న చికిత్స ఏంటి..?

ఏమీ లేదండీ..! కేవలం అతను ఓ పానీయాన్ని అందిస్తారు.. అదే అతడు చేస్తున్న చికిత్స! టాంజానియాలో ముగరిగ అనే ఓకరకమైన వనమూలిక విరివిగా లభిస్తుంది.. ఈ మొక్క ఆకులు, కాండాలను సేకరించి.. బాగా మరిగించి మ్వసపిలె ఓ ద్రావకాన్ని తయారు చేస్తున్నాడు.. ఇదే ఇప్పుడు రోగులపాలిట దివ్వౌషుధం..! దీనిని ఇక్కడ మాత్రమే సేవించాలనేది మ్వసపిలె ఆదేశం.. ద్రావకాన్ని ఎక్కడికైనా తీసుకెళ్లి సేవిస్తే.. అది పనిచేయదట..! అందుకే ప్రజలంతా సముంగె గ్రామానికి పరుగులు తీస్తున్నారు...
తన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికో ఒక్కో మగ్గు చొప్పున ద్రావకాన్ని అందిస్తున్నాడు మ్వసపిలె..! ఇందుకు ఒక్కొక్కరి నుంచి 14 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నాడు.. మ్వసపిలె ఇస్తున్న ఆ పానీయం కోసం 14 రూపాయలు ఖర్చు చేసేందుకు ప్రజలు ఏమాత్రం వెనకాడటం లేదు.. అది దొరికితే చాలని పోటీ పడుతున్నారు.. సముంగె గ్రామానికి వస్తున్న ప్రజలనుకానీ, రోగులను కానీ మ్వసపిలె అసలు పట్టించుకోడు.. రోగాన్ని బట్టి ఇక్కడ చికిత్స ఉండదు.. జబ్బు ఏదైనా.. మనుషులు ఎవరైనా చికిత్స ఒక్కటే..! అందరికీ ఆ పానియమే మందు..!
మ్వసపిలె మందు తాగితే.. సర్వరోగాలూ నయమవుతాయనేది అక్కడికి వెళ్తున్న ప్రజల నమ్మకం.. అందుకే అక్కడికి జనం లక్షలాదిగా తరలివెళ్తున్నారు.. 20 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతోందంటో.. అక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు..
మార్చి 31వ తేదీనాటికి మ్వసపిలె మందుకోసం సుమారు 40 వేల మంది వెయిట్ చేస్తున్నారని అంచనా..! వీరందరికీ మందు సప్లై చేయడానికే 3,4 వారాల సమయం పడుతుందని స్తానికులు చెబుతున్నారు.. అయినా.. అక్కడికి వెళ్లినవారు వెనక్కి తిరిగి రావడానికి సుముఖంగా లేరు. మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచిన రోగులు కూడా ఉన్నారు. అయినా.. మందు సేవించిన తర్వాతే వెనక్కి వస్తామని వారంటున్నారు..
మ్వసపిలే మందు సర్వరోగ నివారిణి అనే ప్రచారం జరుగుతున్నా... HIV, ఎయిడ్స్‌కు అది దివ్యౌషుధం అని మందు వాడిన వారు చెబుతున్నారు.. ఈ మందు తీసుకున్న తర్వాత తామెంతో హుషారుగా ఉన్నట్లు రోగులు చెబుతున్నారు. దీంతో.. రోగులు లక్షలాదిగా తరలివెళ్తున్నారు. ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకుంటున్నవారు సైతం.. ఈ నాటుమందుకోసం బెడ్లు ఖాళీ చేసి సముంగెకు వెళ్తున్నారు..
సముంగెకు వెళ్తున్నవారిలో ఎక్కువమంది HIV బాధితులే..! ఈ మందు తీసుకున్న తర్వాత వారిలో చాలా మార్పు కనిపిస్తోందట! ఈ విషయాన్ని బాధితులే స్వయంగా చెబుతున్నారు. దీంతో.. ఎయిడ్స్‌కు మందుపై ఆశలు చిగురించాయి.. శాస్త్రపరంగా సాధ్యంకాని అద్భుతాన్ని మ్వసపిలె సాధించారని కొందరు చెబుతున్నారు..
మ్వసపిలె మందులో మహత్తు లేకపోతే.. అంతమంది అక్కడికి ఎందుకు వెళ్తారని టాంజానియా వాసులు ప్రశ్నిస్తున్నారు.. దీంతో.. కొంతమంది యూనివర్సిటీ ప్రొఫెసర్లు సముంగె వెళ్లి మందు తీసుకొచ్చి పరిశీలించారు. ఆ మందు సేవించడం వల్ల లాభమేమో తెలియదు కానీ.. నష్టమేమీ లేదని తేల్చారు. ఆ మందులోని ఔషధ గుణాలేవో తేల్చేందుకు మరిన్ని పరిశోధనలు చేస్తున్నారు.

శాస్త్రవేత్తల నుంచి కూడా ఎలాంటి అభ్యంతరం రాకపోవడంతో.. సాక్షాత్తూ టాంజానియా ప్రభుత్వమే రంగంలోకి దిగింది. సముంగె వెళ్తున్న ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించాలని స్థానిక అధికారులను ఆదేశించింది.. దీంతో.. అక్కడికి వెళ్తున్న ప్రజలకు దారిచూపిస్తున్నారు అక్కడి అధికారులు..
అయితే.. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్తగా మందు ఇవ్వకూడదని మ్వసిపిలె నిర్ణయించాడు. ఇందుకు వేరే కారణాలేం లేవండీ.. మార్చి 31వ తేదీ నాటికి ఈ మందుకోసం 40 వేల మంది రోడ్లపైనే వెయిట్ చేస్తున్నారు. ఎండావానలను లెక్కచేయకుండా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో.. వీరందరికీ మందు ఇచ్చిన తర్వాతే కొత్తవారికి ఇస్తానని మ్వసపిలె తేల్చి చెప్పాడు.
తన మందులో శాస్త్రీయత ఎంతో తనకు తెలియదని మ్వసపిలె అంగీకరిస్తున్నాడు. దేవుడు ఆదేశించినట్లుగానే తాను ఈ మందును తయారు చేశానని చెప్తున్నాడు.. దీర్ఘకాలంగా రోగాలతో బాధపడుతున్నవారిని చూడలేక.. దేవుడు తన ద్వారా ఈ మందును చేయించారేమోనని మ్వసపిలె అంటున్నాడు.. అయితే.. ఈ మందు ఎయిడ్స్ రోగులకు ఉపశమనం కలిగించడం సంతోషం కలిగిస్తోందని చెబుతున్న మ్వసపిలే.. మున్ముందు మరింత మందికి వైద్యం అందించేందుకు పూర్తిస్థాయిలో ఒక పెద్ద కట్టడాన్ని నిర్మించాలనుకుంటున్నాడు.
మ్వసపిలే మందుకు వస్తున్న క్రేజ్‌ను ప్రపంచ మీడియా మొత్తం సముంగె గ్రామానికి పరుగులు పెడుతోంది. ఇప్పటికే బీబీసీ, స్టార్టీవీలు కూడా మ్వసపిలె మందుపై కథనాలు ప్రసారం చేశాయి. ఆధునిక శాస్త్రానికి సైతం సాధ్యంకాన్ని వండర్ డ్రగ్‌ను మ్వసపిలె సృష్టించారని తెలిపాయి. ఎంతోకాలంగా వైద్యశాస్త్రవేత్తలు ఎయిడ్స్‌కు మందు కనిపెట్టలేకపోయారని.. మ్వసపిలె సాధించారని టాంజానియా ప్రజలు గొప్పగా ఫీలవుతున్నారు. అంతేకాదు... మ్వసపిలెకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు..
మ్వసపిలే మందులో మహత్తు ఉందో లేదో తెలియదు కానీ.. దాన్ని వాడుతున్నవారు మాత్రం అది దివ్యౌషుధమని చెప్తున్నారు. దీంతో.. కేవలం 3 నెలల వ్యవధిలోనే మ్వసపిలె ప్రపంచవ్యాప్తంగా టాక్ ఆఫ్ ది పర్సన్‌గా మారిపోయారు. ఇక.. టాంజానియాలోని సముంగె అనే కుగ్రామం ఓ వండర్ డ్రగ్‌ను ప్రపంచానికి అందించిన వండర్ విలేజ్‌గా మార్మోగిపోతోంది..