Sunday, April 24, 2011

సత్యసాయి బాబా ఇకలేరు



     కోట్లాది ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న భగవాన్ శ్రీ సత్యసాయిబాబా కన్నుమూశారు. ఉదయం 7.40 నిమిషాలకు ఆయన తుది శ్వాస విడిచినట్లు బాబా బంధువులు ప్రకటించారు. బాబా ఇకలేరనే సమాచారం తెలుసుకున్న భక్తులు పెద్దఎత్తున పుట్టపర్తి తరలి వెళ్తున్నారు. వారంతా శోకసంద్రంలో మునిగిపోయారు.. మరోవైపు పుట్టపర్తిలో గంభీర వాతావరణం నెలకొంది. 86 ఏళ్లుగా పుట్టపర్తిలోనే తిరగాడిన సత్యసాయి.. ఇప్పుడు ముల్లోకాలకు తన దివ్యసందేశాలను వినిపించేందుకు బయలుదేరారని భక్తులు భావిస్తున్నారు. 


మార్చి 29న అస్వస్థతకు గురైన సత్యసాయి బాబా పుట్టపర్తిలోని సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆయన ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడం, మూత్రపిండాలు సరిగా స్పందించకపోవడంతో బాబా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. చివరకు ఈ ఉదయం తుది శ్వాస విడిచారు. సత్యసాయి పార్థిక దేహాన్ని ఈ సాయంత్రం నుంచి కుల్వంత్ హాల్లో భక్తులకు అందుబాటులో ఉంచనున్నారు. 27వ తేదీ తేదీ ఉదయం స్వామివారికి తుది కార్యక్రమాలు నిర్వహించనున్నారు.


తాను దేవుడినని సత్యసాయి ఎప్పుడూ ప్రకటించుకోలేదు.. దేహమే దైవమన్నారు. పవిత్ర హృదయంతో తోటివారిని ప్రేమించమన్నారు. ఏదో ఒక మతం తరపునగానీ, ఒక సంఘం తరపున గానీ బాబా సందేశాలను వినిపించలేదు. అందుకే ఆయన వాక్కులు విశ్వవ్యాప్తమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా భక్తులను సంపాదించిపెట్టాయి.


ఆయన సందేశాలకంటే.. ఆయన చేసిన సేవా కార్యక్రమాలవల్లే సత్యసాయి ఎక్కువగా అభిమానులను సంపాదించుకున్నారు. ఆంధ్ర, కర్నాటకలలోని పలు జిల్లాల్లో తాగునీరు అందుతోందంటే.. అది బాబా పుణ్యమే.. అంతేకాదు.. నర్సరీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్య అందిస్తూ.. సూపర్్ స్పెషాలిటీ ఆసుపత్రుల ద్వారా మెరుగైన వైద్యం అందిస్తూ.. బాబా చేసిన సేవ ఎనలేనిది..


ప్రస్తుతం బాబా భౌతికంగా దూరమైనా.. ఆయన సందేశాలు మాత్రం ఎన్నటికీ దూరం కాలేవు. ప్రస్తుతం సత్యసాయి ట్రస్ట్... బాబా ఆశయాలను, సందేశాలను మరింత ఇనుమడింపజేసేందుకు కృషిచేయాలి. ఇదే సత్యసాయి బాబాకు మనం అందించే నిజమైన నివాళి అవుతుంది..

1 comment:

Lakshmi Raghava said...

బాబా కొసం పరితపిస్తుంటే మీ బ్లాగు చూసా..ఇందులో మూడవ పేరా గుర్తుంచుకోవాలి..బాబా ని ఒక్కసారి చుదగాలిగాననే తృప్తి!! ఓం సాయి రాం