Sunday, May 01, 2011

మన దేహం దెయ్యమా...?

మనది దెయ్యాల దేహం..
మన దేహంలో అణువణువూ దెయ్యాలే
కళ్లు, కాళ్లు, చెవులు, ముక్కు, నోరు.. ప్రతిదీ దెయ్యం ప్రతిరూపమే..
మీ పొట్టి, పొడవులకు కారణం దెయ్యాలే
రంగు, స్వరూపానికీ కారణం అవే..
సంతోషం, దుఃఖం, కోపం, ఆనందం...
ఇవి కూడా దెయ్యాల నుంచి వచ్చినవే..
మీ విజయానికి కారణం దెయ్యాలే..
మీ పరాజయానికీ బాధ్యత వాటిదే..
పరీక్షల్లో పాసైనా.. ఫెయిలనా..
తప్పు మీది కాదు.. దెయ్యాలదే..
మీ ప్రస్తుత పరిస్థితికి... మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు.. కారణం ఆ దెయ్యాలే...

ఇంతకూ ఈ దెయ్యాల గోలేంటి..?

మన శరీరంలోని కొన్ని భాగాలు.. మన తల్లిదండ్రుల భాగాలను పోలి ఉంటాయి.. మన ముక్కు.. మన అమ్మ ముక్కును పోలి ఉండొచ్చు.. మన నడక.. మన తాత నడకను గుర్తుకు తేవచ్చు.. మనలో కొన్ని శరీర భాగాలు లేదా లక్షణాలు.. మన పూర్వీకుల నుంచి సంక్రమిస్తాయని తెలుసు.. అయితే.. మన పూర్వీకులకు సంబంధించిన అన్ని లక్షణాలు యధాతథంగా ఒక తరం నుంచి మరో తరానికి రాకపోవచ్చు.. ఉదాహరణకు.. మన తల్లిలోని అన్ని లక్షణాలు మనకు రాకపోవచ్చు.. కానీ తల్లిలోని కొన్ని అంశాలు మాత్రం తప్పకుండా మనలో కనిపిస్తాయి.. అందుకే.. కొంతమంది పిల్లల్ని చూసినప్పుడు.. అచ్చం తల్లిపోలికే అని.. లేదా తండ్రి పోలికే అనే మాటలు వినిపిస్తుంటాయి..

అసలు.. లక్షణాలు ఎలా వస్తాయి..? ఎందుకు వస్తాయి..?

జీవశాస్త్ర భాషలో చెప్పాలంటే.. ఒక తరం నుంచి మరో తరానికి సంక్రమించే లక్షణాలను అనువంశిక లక్షణాలు అంటాం.. జన్యువుల ద్వారా ఈ అనువంశిక లక్షణాలు పిల్లలకు సంక్రమిస్తాయి.. మనలో ఏదైనా లక్షణం మన పూర్వీకులను పోలి ఉంది అంటే.. దానికి కారణం జన్యువులే.. కానీ జన్యువులలో కూడా అప్పుడప్పుడు మార్పులు జరుగుతుంటాయి.. ఇలాంటి వాటిని ఉత్పరివర్తనాలు అంటాం.. అందువల్లే.. మనలోని అన్ని లక్షణాలు మన తల్లిదండ్రులను పోలి ఉండవు. అయితే.. మన లోని ప్రతి అంశం.. మన పూర్వీకుల నుంచి సంక్రమించిందే అని నిర్ధారణ అయింది.

మరి దెయ్యాలకు, ఈ లక్షణాలకు ఉన్న సంబంధమేంటి..?

తల్లిదండ్రుల నుంచి వచ్చిన కొన్ని జన్యువులు.. పిల్లల్లో కొన్ని లక్షణాలు లేదా వ్యాధులకు కారణమవుతాయని పరిశోధనలో తేలింది. తల్లిదండ్రులలోని కొన్ని లక్షణాలు యధాతథంగా పిల్లలకు సంక్రమిస్తున్నాయి. దీన్నే జన్యు ముద్రగా నిర్ధారించారు. అదేవిధంగా.. జన్యువును కొన్ని రసాయన చర్యలకు గురిచేయడం ద్వారా వేర్వేరు ఫలితాలను గుర్తించారు. తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమించే జన్యువులలో ఏదేని జన్యువు లోపించినా... లేక ఒక జన్యువు ఎక్కువగా వచ్చినా పిల్లల్లో విపరీత లక్షణాలు వస్తున్నాయి.

వంశపారంపర్యంగా వచ్చే కొన్ని వ్యాధులకు కూడా జన్యువులే కారణం. స్థూలకాయం, బట్టతల లాంటి అనేకం ఇందుకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. అలాగే.. క్రోమోజోముల్లో మార్పులు చేయడం ద్వారా అవసరానికి తగ్గట్లు శరీరాన్ని పెంచుకోవచ్చు.. తగ్గించుకోవచ్చు..

తల్లిదండ్రులలోనో.. తాతముత్తాతలకో జరిగిన ఓ మార్పు.. ఆ తర్వాతి తరాలకు సంక్రమిస్తే.. అలాంటివాటిని ట్రాన్స్‌ జెనరేషనల్‌ ఎఫెక్ట్స్‌ అంటారు.. తాతముత్తాతల తిండి మనమళ్లు,మనవరాళ్ల జీవితకాలంపై నేరుగా ప్రభావం చూపుతోందని పరిశోధనలు చెబుతున్నాయి.  కొంతమంది పిల్లల్లో తాతలకున్న డయాబిటీస్‌ వ్యాధి సంక్రమించింది.

తల్లిదండ్రుల ఆహారం, వారి వ్యాధులు, వాడిన మందులు.. తదితరవాటి ప్రభావం.. వారి పిల్లలపై స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాదు.. మన లైఫ్‌ స్టెయిల్ కూడా మన పిల్లలు, వారి పిల్లలపై ఇంపాక్ట్‌ చూపిస్తోంది. ఆల్కహాల్‌ సేవించడం, డ్రగ్స్‌ తీసుకోవడం, పొగతాగడం లాంటి దురలవాట్లతోపాటు.. ఎక్సర్‌సైజ్‌, పనిలో ఒత్తిడి లాంటి అంశాలు కూడా భావితరాలకు సంక్రమిస్తున్నాయి..

అంటే.. మనలోని ప్రతి లక్షణం మన పూర్వీకుల నుంచే వచ్చింది. అయితే.. వాళ్లెవరూ ఇప్పుడు మనతో లేరు. చనిపోయారు. అయినా.. వారిలోని ఏదో ఒక లక్షణం లేదా స్వభావం మన తల్లిదండ్రుల ద్వారా మనకు, మన ద్వారా మన భవిష్యత్ తరాలకు సంక్రమిస్తోంది.. చనిపోయినవారు దెయ్యాలై తిరుగుతుంటారని మనం భావిస్తుంటాం. అందుకే.. మన దేహం ఓ దెయ్యం.. ఇంకా వివరంగా చెప్పాలంటే.. మన దేహం దెయ్యాల సమూహం..

No comments: