Friday, January 28, 2011

అభివృద్ధిలో కాదు.. అవినీతిలో పోటీ..!!

       అభివృద్ధిలో భారత్.. చైనాతో పోటీ పడుతోందా..? అభివృద్ధి సంగతేమో కానీ.. అవినీతి, అక్రమ సంపాదనలో మాత్రం ఖచ్చితంగా పోటీ పడుతోంది. ఏ దేశం నుంచి ఎంతెంత నల్లధనం విదేశాల్లో షికారు చేస్తోంది అనే విషయం తెలిస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం..

     చైనా, మలేషియా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా.. ఇదే కోవలో ఇండియా..!! నల్లధనాన్ని విదేశాల్లో చెలామణీ చేస్తున్న ఆసియా దేశాల జాబితా ఇది. ఈ లిస్ట్'లో ఇండియాది ఐదో ర్యాంక్.! 2000 నుంచి 2008 వరకూ చేసిన సర్వే ఆధారంగా ఇండియా ఐదోస్థానం సంపాదించింది. వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ అనే సంస్థ ఈ సర్వే చేసింది. తన అధ్యయనంలో అంతర్జాతీయ ఆర్థిక విధానంలో ట్రాన్స్'పరెన్సీని కళ్లకు కట్టడానికి ప్రయత్నించింది.

    ఇంతకూ.. ఇండియా నుంచి విదేశాలకు తరలివెళ్లిన సొమ్మెంతో తెలుసా..?
అక్షరాలా.. 5,20,000 కోట్ల రూపాయలు..! ఇక చైనా అయితే.. 110 లక్షల కోట్ల రూపాయలతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే.. అక్రమంగా ఆసియా దేశాల నుంచి తరలివెళ్తున్న సొమ్ములో ఈ ఐదు దేశాల వాటానే 96.5 శాతమట! ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ ఐదు దేశాల వాటా 44.9 శాతంగా ఉంది. అభివృద్ధికి, అవినీతికి ఉన్న వ్యత్యాసాన్ని బట్టి చైనా, మలేషియా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, ఇండియాల్లో అవినీతి ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

     ఆసియా తర్వాత మధ్య ఈశాన్య, తూర్పు ఆఫ్రికా దేశాల నుంచి 17.9 శాతం అక్రమ నిధులు విదేశాలకు తరలివెళ్తున్నాయి. తర్వాతి స్థానాల్లో ఐరోపా 17.8 శాతం, పాశ్చాత్య దేశాలు 15.4శాతం, ఆఫ్రికా 4.5 శాతం నిధులు వెళ్గాతున్నాయి.

     ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. ఇండియాకు మొదటి 10స్థానాల్లో చోటు దక్కకపోవడం కాస్త ఊరటనిచ్చే అంశం. ఈ స్థానాన్ని చైనా ఆక్రమించుకుంది. రెండో స్థానంలో రష్యా, మూడో స్థానంలో మెక్సికో, నాలుగోస్థానంలో సౌదీ అరేబియా, ఐదో స్థానంలో మలేషియా నిలిచాయి.

     ఇండియా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఆర్థిక సంస్కరణలే కారణమని చెప్పిన GFI.. ఆ అభివృద్ధి ఫలాలు మాత్రం ప్రజలకు అందలేదని కుండబద్దలు కొట్టింది. ఉన్నవాడు దొంగతనంగా దోచుకుని దాచుకుంటున్నాడని.. లేనివాడు మాత్రం అడుక్కుతింటూనే ఉన్నాడని స్పష్టంచేసింది.

Saturday, January 22, 2011

మొబైల్ ఫోన్లతో ముప్పు..!!

కామన్ పీపుల్'కూ కామనైపోయింది
      రోటీ, కపడా, మకాన్ ఔర్ మొబైల్.. అవును.. మొబైల్ ఫోన్ ఇప్పుడు నిత్యావసరంగా మారిపోయింది. ఒకప్పుడు స్టేటస్ సింబల్'గా గుర్తింపు పొందిన సెల్'ఫోను.. ఇప్పుడు అందరి జేబుల్లో కామనైపోయింది. మొబైల్ ఫోన్ ఒకప్పుడు కేవలం మాట్లాడుకునేందుకు మాత్రమే ఉపయోగపడేది. కానీ ఇప్పుడు అదే ప్రపంచమైపోయింది. దానితో ఇప్పుడు చేయని పనిలేదు. ఆన్'లైన్ లావాదేవీలు, సినిమాలు, పాటలు, గేమ్'లు, వీడియో చాటింగ్'లు.. ఇలా మొబైల్ ఫోనుంటే చాలు అన్ని పనులూ చేసుకునే సౌకర్యం ఉంది.

     అంతర్జాతీయ సెల్'ఫోను నియంత్రణ సంస్థ జరిపిన సర్వే ప్రకారం 1998లో సెల్'ఫోను వినియోగం కేవలం 5 శాతం మాత్రమే. అయితే 2009 నాటికి అది 67 శాతానికి పెరిగింది. ప్రస్తుతం ఇది సుమారు 87 శాతానికి చేరువైంది. మొబైల్ ఫోను వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో.. అంతకుమించి అనర్థాలు కూడా కలుగుతున్నాయి. సెల్'ఫోను రేడియేషన్ బారిన పడి నిత్యం ఎంతోమంది అనారోగ్యం పాలవుతున్నారు.

     ప్రతి మొబైల్ ఫోను దాని SAR(Specific Absorption Rate) విలువతో మార్కెట్'లోకి ప్రవేశిస్తుంది. దీన్నిబట్టి మొబైల్ గ్రహించే సామర్థ్యాన్ని అంచనా వేయవచ్చు. ప్రస్తుతం మనకు GSM, CDMA సిమ్'కార్డులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో GSMతో పోల్చితే CDMA ఫోన్లు తక్కువ ఉద్గార శక్తిని కలిగిఉంటాయి. CDMA చైనా ఫోన్లు వాడితో ఎక్కువ రేడియేషన్ బారిన పడే ప్రమాదముంది.

రేడియేషన్ వల్ల కలిగే అనర్థాలు:
మొబైల్ - ఒక నిత్యావసరం
*  అరిథెమియా అనే గుండెకు సంబంధించిన వ్యాధి
* మైగ్రేన్
* ఇన్'సోమ్నియా - నిద్రలేమి
* పార్కిన్సన్ వ్యాధి - నరాల బలహీనత, పక్షవాతం
* ఏకాగ్రతాలోపం
* వెన్ను నొప్పి
* నోటి క్యాన్సర్

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
* సెల్'ఫోనును కనీసం 23 సెంటీమీటర్ల దూరంలో ఉంచి వాడాలి
* నిద్రపోతున్నప్పుడు దిండు కింద లేదా పక్కన పెట్టుకోవడం మంచిది కాదు
మెదడుపై మొబైల్ ప్రభావం
* బస్సులోనో, స్కూటరులోనో ప్రయాణించేటప్పుడు మాట్లాడకపోవడమే మంచిది. బలహీన నెట్'వర్క్ కారణంగా           ఎక్కువ తీవ్రతతో రేడియేషన్ కలుగుతుంది.
* అండర్'గ్రౌండ్స్, లిఫ్టులు, క్లోజ్'డ్ భవంతులలో వాడినా ఇదే సమస్య తలెత్తుతుంది.
* కాల్'ను వీలయినంత త్వరగా ముగించాలి. 6 నిమిషాల వ్యవధిలోపు కాల్'ను ముగిస్తే మంచిది.
* కాల్'కు కాల్'కు మధ్య కనీసం 10 నిమిషాల గ్యాప్ ఉండేలా చూసుకోవాలి.
* చెవులకు ఏదైనా లోహపు వస్తువులు ధరించి ఉన్నట్లయితే.. కాల్ మాట్లాడిన తర్వాత కూడా రేడియేషన్ ప్రభావం కాసేపు ఉంటుంది.
* బ్లూ టూత్'ను వినియోగించాలి
* యాంటీ రేడియేషన్ చిప్స్'ను ఫోనుకు అతికించుకోవాలి
* మార్కెట్'లో లభించే రేడియేషన్ ఫిల్టర్ కార్డును వినియోగిస్తే మంచిది.
* 15 ఏళ్లలోపు పిల్లలకు సెల్'ఫోనును దూరంగా ఉంచడమే మేలు.
* గర్భిణిలు ఫోనును అస్సలు వినియోగించకూడదు. అతిగా వాడితే బుద్ధిహీన పిల్లలు పుట్టే ప్రమాదముంది.
* వృద్ధులు సెల్'ఫోనును తక్కువగా వాడాలి.

Sunday, January 16, 2011

పల్లెకు దూరంగా తొలిసారి..!!

     సంక్రాంతి పండగొచ్చిందంటే చాలు పల్లెలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ఇక.. సమృద్ధిగా వర్షాలు పడి పంటలు బాగా పండిన ఏడైతే ఇక చెప్పనక్కర్లేదు.. ఈసారి కూడా మా పల్లెలో అలాంటి వాతావరణమే ఉంది. కొన్నేళ్లుగా వర్షాలు సరిగా లేక.. పంటలు కోల్పోయిన రైతులు.. ఈసారి మాత్రం రెండు పంటలు పండిస్తూ ఆనందంతో ఉన్నారు. దీంతో.. పల్లె కొత్త కళ సంతరించుకుంది.

     ఇక పెద్ద పండగగా పిలుచుకునే సంక్రాంతి వచ్చిందంటే చాలు.. ఊరిలో కొత్త ముఖాలు కనిపిస్తాయి. సంవత్సరంలో ఏరోజూ పల్లెలో కనిపించని వారందరూ పండగ రాగానే ఊళ్లో వాలిపోతారు. దేశవిదేశాల్లో ఎక్కడున్నా పండగకు మాత్రం ఊళ్లో ఉండాలని కోరుకుంటారు.

     ఈసారి చలి చంపేస్తోంది. సాధారణంగా చలి నుంచి బయట పడేందుకు పల్లెల్లో ఉదయం తొలి కోడి కూసింది మొదలు చలిమంటలు వేస్తుంటారు. ఓ చోట మంట వేస్తే చాలు అక్కడ ఓ పది మంది వాలిపోయి చలి కాచుకుంటుంటారు. ఈ చలిమంటలు దాదాపు అందరి ఇళ్లలోనూ కనిపిస్తుంటాయి. ఇక భోగి పండగ రోజైతే ఈ చలి మంట కాస్త పెద్దదిగా ఉంటుంది. కుటుంబసభ్యులు, బంధుమిత్రులందరూ తోడవడంతో.. కాస్త హడావుడి ఉంటుంది. ఇక ఇళ్ల ముందు రంగు రంగుల ముగ్గులు కనువిందు చేస్తాయి. ప్రతి ఏటా మా ఇంటి ముందు ముగ్గు తప్పనిసరిగా మా అక్క వేస్తుంది.. మా అక్కల పిల్లలందరూ దానికి రంగులద్దుతుంటారు.

     పండగపూట మా అక్కలు, బావలు, వారి పిల్లలు.. ఇలా బంధువులంతా మా ఇంటికి వస్తుంటారు. మూడు రోజులపాటు మా ఇల్లంతా డీటీఎస్ సౌండ్'తో మార్మోగిపోతుంటుంది. మామూలు రోజుల్లో మా అమ్మ, నాన్న తప్ప ఇంట్లో ఎవరూ ఉండరు. పండగపూట మా అందరి కోలాహలం చూసి చుట్టుపక్కల వాళ్లు బెంబేలెత్తిపోతుంటారు.

     కనుమ రోజు సాయంత్రం మా ఊరి పొలిమేర్లలో చిట్లాకుప్ప వేస్తారు. ఊళ్లోని పశువులన్నింటిని అందంగా అలంకరించి ఆ కుప్ప దగ్గరికి తీసుకొస్తారు. పొద్దు కూకే సమయంలో కుప్పకు మంట పెడతారు. అలా మంట పెట్టగానే.. పశువులన్నీ పరుగులు తీస్తాయి. వాటిని పట్టుకునేందుకు వాటి యజమానులు తీసే పరుగులు.. కుప్ప దగ్గర మహిళల ఆటపాటలు.. అందరినీ తప్పకుండా ఆకట్టుకుంటాయి.

     ఇక పొలం గట్లపై నడుస్తూ.. బురద కాల్వల్లో పడుతూ లేస్తూ.. వరి కంకులను చేత్తో పట్టుకుని ఒక్కో గింజ నములుతూ.. ఇలా ఎన్నో తీపి గుర్తులు.. ఇక.. సిటీల్లోనే చిన్నప్పటి నుండి ఉంటున్నవారు పొలం గట్లపై నడుస్తున్నప్పుడు వారు పడుతున్న పాట్లను చూసి తీరాల్సిందే! ముఖ్యంగా లంగా ఓణీ వేసుకున్న అమ్మాయిలు..  పొలంగట్టుపై నడుస్తున్నప్పుడు వారి ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. కానీ ఇదొక మరిచిపోలేని అనుభవం..

     కానీ ఈ సంక్రాంతి మాత్రం నాకు వీటన్నింటినీ దూరం చేసింది. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎప్పుడూ నేను సంక్రాంతికి ఊరికి వెళ్లకుండా ఉండలేదు.. ఈసారి తప్ప! గురువారం రోజు నైట్ డ్యూటీ చేయడంతో శుక్రవారం పగలంతా నిద్రపోయాను. సో.. భోగి పండుగ అలా అయిపోయింది. అలాగే శుక్రవారం కూడా నైట్ డ్యూటీ చేయడంతో శనివారం కూడా పండుగ నాకు తెలియకుండానే ముగిసింది. ఇలా కాదనుకుని.. ఆదివారం మాత్రం కాస్త నాన్ వెజ్ తెచ్చుకుని స్వయంగా వండుకుని పండుగ మూడ్ తెచ్చుకున్నా..! ఈసారి పిండి వంటలు లేవు..! ఆటపాటలు లేవు! చలి మంటలు లేవ్!! ఇదీ ఈసారి సంక్రాంతి అనుభవం..! 32 ఏళ్లుగా పల్లెలో పండగ చేసుకున్న నాకు.. ఈ సారి మాత్రం ఆ లోటు స్పష్టంగా కనిపించింది.

Saturday, January 08, 2011

నక్షత్రాలెన్నో తెలిసిందోచ్..!!

     వేసవికాలంలో ఆరుబయట నులకమంచం వేసుకుని.. ఆకాశంలో మబ్బుల మాటున చంద్రుణ్ని.. నక్షత్రాలను చూస్తూ పడుకుంటే.. ఆ హాయి వర్ణించలేనిది. ఇక.. పిల్లలైతే.. నక్షత్రాలను లెక్కబెడుతూ.. అమ్మో.. ఎన్ని చుక్కలో అంటూ అబ్బరపడుతుంటారు. వాటిని లెక్క పెట్టేందుకు ట్రై చేస్తారు.. కానీ వాటి అంతుచిక్కడం సాధ్యం కాదు కాబట్టి.. అలసి సొలసి అట్టే పడుకుండిపోతారు. కేవలం పిల్లలకే కాదు.. పెద్దలకు కూడా నక్షత్రాలను లెక్కపెట్టడం అంత ఈజీ కాదు.

     ఒకటి.. రెండు.. మూడు.. ఇరవై.. ముప్పై.. ఇలా.. లెక్కబెట్టుకుంటూ పోతే నక్షత్రాల లెక్క తెలుస్తుందా..? ఖచ్చితంగా తెలియదు. కానీ మొత్తం ఎన్ని నక్షత్రాలున్నాయో తెలుసుకోవాలని ఉబలాటం మాత్రం అందరిలోనూ ఉంటుంది. ఈ క్యూరియాసిటీ కేవలం పిల్లలకే కాదు.. పెద్దలోనూ ఉంటుంది. ఇదే ఆలోచన శాస్త్రవేత్తలకూ తట్టింది. దీంతో.. పరిశోధనలు చేసిన ఓ సైంటిస్టు ఆకాశంలో ఎన్ని నక్షత్రాలున్నాయో లెక్కగట్టాడు. పీటర్ వాన్ డోకమ్ అనే సైంటిస్టు.. విశ్వంలోని నక్షత్రాలెన్నో తేల్చేశాడు. ఇంతకీ ఎన్ని నక్షత్రాలున్నాయో కింది సంఖ్యను చూడండి..

                 300000000000000000000000

     అమ్మో.. ఇంత పెద్ద సంఖ్యా..? దీన్ని ఎలా లెక్కబెడతాం అనుకుంటున్నారు కదూ..! 3 పక్కన 23 సున్నాలున్నాయిక్కడ. దీన్ని తెలుగులో ఏమంటారో మనకు తెలియదు కానీ.. ఇంగ్లిష్'లో మాత్రం సెక్స్'టెలియన్ (sextillion) అంటారు.

     విశ్వంలో ఎన్ని నక్షత్రాలున్నాయో లెక్కగట్టే ప్రయత్నాలు గతంలోనూ జరిగాయి. మన గెలాక్సీ అయిన పాలపుంతలో వంద కోట్ల నక్షత్రాలున్నాయని అంచనావేశారు. ఇదేవిధంగా ప్రతి గెలాక్సీలోనూ వంద కోట్ల నక్షత్రాలుంటాయని భావించారు. కానీ అది నిజం కాదని డోకమ్ తన పరిశోధనలో తేల్చారు. ఒక్క గెలాక్సీలో లక్ష కోట్లు ఉన్నాయని తేల్చారు. ఇలా లెక్కలేసి మొత్తానికి విశ్వంలో 300 సెక్స్'టిలియన్ నక్షత్రాలున్నాయని డోకమ్ కనుగొన్నారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ సంఖ్య మనుషుల్లో ఉండే మొత్తం కణాలకి సమానమట..!

Tuesday, January 04, 2011

సూర్యుడి ఓనరమ్మ..!!


    గాలి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు.. ఇవన్నీ ఎవరి సొంతం? వీటి యజమాని ఎవరు? విశ్వంలోని ప్రతిదానినీ స్థిరాస్తిలాగా అమ్మడం, కొనడం చేయవచ్చా? ఇవన్నీ సిల్లీ క్వశ్చన్లుగా అనిపిస్తున్నాయి కదూ..! కానీ ఇదంతా సాధ్యమే అంటోంది ఓ స్పానిష్ వనిత..! సకల జీవకోటికి ప్రాణాధారమైన కాంతిని ప్రసాదిస్తున్న సూర్యుణ్ని కొనుక్కున్నానంటోంది.. ఇక నుంచి సన్'లైట్ వాడుకుంటే ట్యాక్స్ వేస్తానని బెదిరిస్తోంది.

     అనంత విశ్వంలోని కోటానుకోట్ల నక్షత్రాలలో సూర్యుడు కూడా ఒకటి. సౌర మండలానికి కాంతిని ప్రసాదిస్తూ భూమిపై జీవం మనుగడకు కారణం సూర్యభగవానుడే! భగభగమండుతూ లక్షల డిగ్రీల ఉష్ణోగ్రతను పుట్టిస్తున్న సూర్యుడు ఇప్పుడు ఓ స్పానిష్ లేడీ సొంతమయ్యాడు. స్పెయిన్'లోని విగో పట్టణానికి చెందిన ఏంజెల్స్ దురాన్'కు సూర్యుణ్ని కొనుక్కోవాలన్న కోరిక పుట్టింది. వెంటనే రిజిస్ట్రేషన్ ఆఫీస్'కు వెళ్లి తన పేరున రిజిస్టర్ చేసేసుకుంది.

    మరి సూర్యుణ్ని అధికారులు ఎలా రిజిస్టర్ చేశారనే డౌట్ వస్తోంది కదూ..? అంతర్జాతీయ చట్టాల్లో ఉన్న చిన్నపాటి లొసుగులే దురాన్'కు కలిసొచ్చాయి. చంద్రుడు, గ్రహాలు, సూర్యుడు.. ఇలా విశ్వంలోని ఏ భాగంపై కూడా ఏ దేశానికీ హక్కు లేదనేది ఇంటర్నేషనల్ అగ్రిమెంట్.! దేశాలకు హక్కు లేదు కానీ.. వ్యక్తులకు కాదు కదా అని లా పాయింట్ లాగింది దురాన్..! వాదించి సూర్యుణ్ని చేజిక్కించుకుని.. సంబంధిత పత్రాలు కూడా సొంతం చేసుకుంది.

     స్పానిష్ అమ్మడు కొనుక్కుంటే కొనుక్కోనీ... మనకొచ్చిన నష్టమేంటి? సూర్యరశ్మిని ఆమె అడ్డుకోలేదు కదా.. అని అనుకుంటున్నారు కదూ..! ఇక్కడే మనం తప్పులో కాలేస్తున్నాం.. సోలార్ ఎనర్జీపై ట్యాక్స్ వేస్తానంటోంది దురాన్.! ఫోటోవోల్టాయిక్ ప్లాంట్లపై పన్ను వేయాలంటూ స్పెయిన్ ప్రభుత్వాన్ని కోరింది. ఇలా పన్ను వేస్తే.. దురాన్'కి ఏటా 600 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందట! అయితే.. ఇలాంటి విజ్ఞప్తులకు ప్రభుత్వం ఒప్పుకునేంత సీన్ లేదంటున్నారు న్యాయనిపుణులు..! మరి దురాన్ నెక్ట్స్ ఏం లా పాయింట్ లాగుతుందో చూడాలి మరి!!

Saturday, January 01, 2011

జనవరి ఫస్ట్..!!!

జనవరి ఫస్ట్
జగతి ప్రణమిల్లే రోజు..
సంబరాలు అంబరాన్ని తాకే రోజు..
కలిమిలేములు, కష్టసుఖాలు, కులమతాలు వదిలేసి కరచాలనం చేసే రోజు..
కల్మషాలను వదిలేసి హృదయ కవాటాలు తెరుచుకునే రోజు..
విందులు, వినోదాలు, వేడుకల గుబాళింపుతో హోరెత్తే రోజు..

ఇది అన్ని రోజుల లాంటిది కాదు.. కొత్త రోజు.. సరికొత్త రోజు..
కొత్త కాంతి, కొత్త ఆశలు మొలకెత్తే రోజు..
నిన్నటిని సమాధిని చేసి.. కొత్త వెలుగుల వైపు అడుగులు వేసే రోజు..
కష్టనష్టాలను వదిలేసి.. ఆనందకర జీవితానికి నాంది పలికే రోజు..
ఈరోజు ఇక్కడే ఆగిపోవాలని.. ప్రతి తనువు తహతహలాడే రోజు..

జనవరి ఫస్ట్..
పార్టీల్లో మునిగి తేలడానికేనా ఈ రోజు..?
విషెస్ చెప్పుకోవడంతో ముగిసిపోతుందా..?
ఈరోజు తర్వాత మళ్లీ పాత జీవితాన్ని తలకెత్తుకుంటే సరిపోతుందా..?

కానే కాదు..
ఇలా అయితే కొత్త సంవత్సరం జరుపుకోవాల్సిన అవసరమే లేదు..
కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో సరికొత్త కాంతులు తీసుకురావాలి..
కష్టనష్టాలు తొలగిపోయి సుఖసంతోషాలు కలగాలి..
సరికొత్త ఆలోచనలు, పురోభివృద్ధికి కొత్త సంవత్సరం వేదిక కావాలి..
నూతన లక్ష్యాలు, గమ్యాలకు ఈ రోజు బాట వేయాలి..
కొత్త దుస్తులతోపాటు.. కొత్త జీవితం వైపు అడుగులు వేయాలి..
భయాలు తొలగిపోయి.. జీవితంలో భానూదయం కలగాలి..
నూతన విజయాలకు ఈరోజు సోపానం కావాలి..
నులివెచ్చని కిరణాలతో సకల జగత్తు మేల్కోవాలి..
కొత్త సంవత్సరంలో ప్రతి రోజూ ఓ వెలుగు దివ్వె కావాలి..


అందరికీ...
నూతన సంవత్సర శుభాకాంక్షలు