Sunday, January 16, 2011

పల్లెకు దూరంగా తొలిసారి..!!

     సంక్రాంతి పండగొచ్చిందంటే చాలు పల్లెలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ఇక.. సమృద్ధిగా వర్షాలు పడి పంటలు బాగా పండిన ఏడైతే ఇక చెప్పనక్కర్లేదు.. ఈసారి కూడా మా పల్లెలో అలాంటి వాతావరణమే ఉంది. కొన్నేళ్లుగా వర్షాలు సరిగా లేక.. పంటలు కోల్పోయిన రైతులు.. ఈసారి మాత్రం రెండు పంటలు పండిస్తూ ఆనందంతో ఉన్నారు. దీంతో.. పల్లె కొత్త కళ సంతరించుకుంది.

     ఇక పెద్ద పండగగా పిలుచుకునే సంక్రాంతి వచ్చిందంటే చాలు.. ఊరిలో కొత్త ముఖాలు కనిపిస్తాయి. సంవత్సరంలో ఏరోజూ పల్లెలో కనిపించని వారందరూ పండగ రాగానే ఊళ్లో వాలిపోతారు. దేశవిదేశాల్లో ఎక్కడున్నా పండగకు మాత్రం ఊళ్లో ఉండాలని కోరుకుంటారు.

     ఈసారి చలి చంపేస్తోంది. సాధారణంగా చలి నుంచి బయట పడేందుకు పల్లెల్లో ఉదయం తొలి కోడి కూసింది మొదలు చలిమంటలు వేస్తుంటారు. ఓ చోట మంట వేస్తే చాలు అక్కడ ఓ పది మంది వాలిపోయి చలి కాచుకుంటుంటారు. ఈ చలిమంటలు దాదాపు అందరి ఇళ్లలోనూ కనిపిస్తుంటాయి. ఇక భోగి పండగ రోజైతే ఈ చలి మంట కాస్త పెద్దదిగా ఉంటుంది. కుటుంబసభ్యులు, బంధుమిత్రులందరూ తోడవడంతో.. కాస్త హడావుడి ఉంటుంది. ఇక ఇళ్ల ముందు రంగు రంగుల ముగ్గులు కనువిందు చేస్తాయి. ప్రతి ఏటా మా ఇంటి ముందు ముగ్గు తప్పనిసరిగా మా అక్క వేస్తుంది.. మా అక్కల పిల్లలందరూ దానికి రంగులద్దుతుంటారు.

     పండగపూట మా అక్కలు, బావలు, వారి పిల్లలు.. ఇలా బంధువులంతా మా ఇంటికి వస్తుంటారు. మూడు రోజులపాటు మా ఇల్లంతా డీటీఎస్ సౌండ్'తో మార్మోగిపోతుంటుంది. మామూలు రోజుల్లో మా అమ్మ, నాన్న తప్ప ఇంట్లో ఎవరూ ఉండరు. పండగపూట మా అందరి కోలాహలం చూసి చుట్టుపక్కల వాళ్లు బెంబేలెత్తిపోతుంటారు.

     కనుమ రోజు సాయంత్రం మా ఊరి పొలిమేర్లలో చిట్లాకుప్ప వేస్తారు. ఊళ్లోని పశువులన్నింటిని అందంగా అలంకరించి ఆ కుప్ప దగ్గరికి తీసుకొస్తారు. పొద్దు కూకే సమయంలో కుప్పకు మంట పెడతారు. అలా మంట పెట్టగానే.. పశువులన్నీ పరుగులు తీస్తాయి. వాటిని పట్టుకునేందుకు వాటి యజమానులు తీసే పరుగులు.. కుప్ప దగ్గర మహిళల ఆటపాటలు.. అందరినీ తప్పకుండా ఆకట్టుకుంటాయి.

     ఇక పొలం గట్లపై నడుస్తూ.. బురద కాల్వల్లో పడుతూ లేస్తూ.. వరి కంకులను చేత్తో పట్టుకుని ఒక్కో గింజ నములుతూ.. ఇలా ఎన్నో తీపి గుర్తులు.. ఇక.. సిటీల్లోనే చిన్నప్పటి నుండి ఉంటున్నవారు పొలం గట్లపై నడుస్తున్నప్పుడు వారు పడుతున్న పాట్లను చూసి తీరాల్సిందే! ముఖ్యంగా లంగా ఓణీ వేసుకున్న అమ్మాయిలు..  పొలంగట్టుపై నడుస్తున్నప్పుడు వారి ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. కానీ ఇదొక మరిచిపోలేని అనుభవం..

     కానీ ఈ సంక్రాంతి మాత్రం నాకు వీటన్నింటినీ దూరం చేసింది. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎప్పుడూ నేను సంక్రాంతికి ఊరికి వెళ్లకుండా ఉండలేదు.. ఈసారి తప్ప! గురువారం రోజు నైట్ డ్యూటీ చేయడంతో శుక్రవారం పగలంతా నిద్రపోయాను. సో.. భోగి పండుగ అలా అయిపోయింది. అలాగే శుక్రవారం కూడా నైట్ డ్యూటీ చేయడంతో శనివారం కూడా పండుగ నాకు తెలియకుండానే ముగిసింది. ఇలా కాదనుకుని.. ఆదివారం మాత్రం కాస్త నాన్ వెజ్ తెచ్చుకుని స్వయంగా వండుకుని పండుగ మూడ్ తెచ్చుకున్నా..! ఈసారి పిండి వంటలు లేవు..! ఆటపాటలు లేవు! చలి మంటలు లేవ్!! ఇదీ ఈసారి సంక్రాంతి అనుభవం..! 32 ఏళ్లుగా పల్లెలో పండగ చేసుకున్న నాకు.. ఈ సారి మాత్రం ఆ లోటు స్పష్టంగా కనిపించింది.

1 comment:

angelgallela said...

hmmmmmmmmmm Dear this time being in the city I missed the atmosphere of Sankranthi. To enjoy the feast of Sankranthi the best place is the Village where people express their joy in decorating the houses with Muggulu.