Saturday, January 08, 2011

నక్షత్రాలెన్నో తెలిసిందోచ్..!!

     వేసవికాలంలో ఆరుబయట నులకమంచం వేసుకుని.. ఆకాశంలో మబ్బుల మాటున చంద్రుణ్ని.. నక్షత్రాలను చూస్తూ పడుకుంటే.. ఆ హాయి వర్ణించలేనిది. ఇక.. పిల్లలైతే.. నక్షత్రాలను లెక్కబెడుతూ.. అమ్మో.. ఎన్ని చుక్కలో అంటూ అబ్బరపడుతుంటారు. వాటిని లెక్క పెట్టేందుకు ట్రై చేస్తారు.. కానీ వాటి అంతుచిక్కడం సాధ్యం కాదు కాబట్టి.. అలసి సొలసి అట్టే పడుకుండిపోతారు. కేవలం పిల్లలకే కాదు.. పెద్దలకు కూడా నక్షత్రాలను లెక్కపెట్టడం అంత ఈజీ కాదు.

     ఒకటి.. రెండు.. మూడు.. ఇరవై.. ముప్పై.. ఇలా.. లెక్కబెట్టుకుంటూ పోతే నక్షత్రాల లెక్క తెలుస్తుందా..? ఖచ్చితంగా తెలియదు. కానీ మొత్తం ఎన్ని నక్షత్రాలున్నాయో తెలుసుకోవాలని ఉబలాటం మాత్రం అందరిలోనూ ఉంటుంది. ఈ క్యూరియాసిటీ కేవలం పిల్లలకే కాదు.. పెద్దలోనూ ఉంటుంది. ఇదే ఆలోచన శాస్త్రవేత్తలకూ తట్టింది. దీంతో.. పరిశోధనలు చేసిన ఓ సైంటిస్టు ఆకాశంలో ఎన్ని నక్షత్రాలున్నాయో లెక్కగట్టాడు. పీటర్ వాన్ డోకమ్ అనే సైంటిస్టు.. విశ్వంలోని నక్షత్రాలెన్నో తేల్చేశాడు. ఇంతకీ ఎన్ని నక్షత్రాలున్నాయో కింది సంఖ్యను చూడండి..

                 300000000000000000000000

     అమ్మో.. ఇంత పెద్ద సంఖ్యా..? దీన్ని ఎలా లెక్కబెడతాం అనుకుంటున్నారు కదూ..! 3 పక్కన 23 సున్నాలున్నాయిక్కడ. దీన్ని తెలుగులో ఏమంటారో మనకు తెలియదు కానీ.. ఇంగ్లిష్'లో మాత్రం సెక్స్'టెలియన్ (sextillion) అంటారు.

     విశ్వంలో ఎన్ని నక్షత్రాలున్నాయో లెక్కగట్టే ప్రయత్నాలు గతంలోనూ జరిగాయి. మన గెలాక్సీ అయిన పాలపుంతలో వంద కోట్ల నక్షత్రాలున్నాయని అంచనావేశారు. ఇదేవిధంగా ప్రతి గెలాక్సీలోనూ వంద కోట్ల నక్షత్రాలుంటాయని భావించారు. కానీ అది నిజం కాదని డోకమ్ తన పరిశోధనలో తేల్చారు. ఒక్క గెలాక్సీలో లక్ష కోట్లు ఉన్నాయని తేల్చారు. ఇలా లెక్కలేసి మొత్తానికి విశ్వంలో 300 సెక్స్'టిలియన్ నక్షత్రాలున్నాయని డోకమ్ కనుగొన్నారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ సంఖ్య మనుషుల్లో ఉండే మొత్తం కణాలకి సమానమట..!

No comments: