Wednesday, December 07, 2011

ఇదేనా జేపీ సత్తా..?

     రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును ఓటర్లందరూ తప్పనిసరిగా వినియోగించుకుని సత్తా చాటాలనేది లోక్ సత్తా ప్రాథమిక సిద్ధాంతం. ఇందుకోసం లోక్ సత్తా మొదటి నుంచి విస్తృత ప్రచారం చేసింది. ఓటు హక్కు వినియోగంపై లోక్ సత్తా అధినేత డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ వేలాది ఉపన్యాసాలు ఇచ్చి ఉంటారు.. 

     కానీ అసెంబ్లీ అవిశ్వాస తీర్మానం సందర్భంగా జేపీ ఓటుహక్కును వినియోగించుకోకపోవడం పలువురిని ఆశ్చర్యపరిచింది. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేస్తానంటూ ముందునుంచీ చెప్తూ వచ్చిన జేపీ.. తీరా ఓటింగ్ సమయానికి వచ్చేసరికి తటస్థంగా ఉండిపోయారు. ఇందుకు కారణాలేమిటో ఆయన కూడా స్పష్టంగా వెల్లడించలేదు.. తనది నిర్ణయాత్మక ఓటు కాకపోవడంతో తటస్థంగా ఉండిపోయానంటూ జేపీ చెప్పిన వివరణ సహేతుకంగా అనిపించలేదు. 

      అవిశ్వాస తీర్మానం అసెంబ్లీ ముందుకొచ్చేంతవరకూ మద్దతిస్తానని చెప్పిన జేపీ.. ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించడంపై తెరవెనుక ఏమైనా లాలూచీ పడ్డారా అనే సందేహం కూడా వినిపిస్తోంది. ఏదేమైనా పదిమందికీ ఉపన్యాసాలిచ్చే వ్యక్తి దాన్ని తనే ఆచరణలో పెట్టకపోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోందు. ముఖ్యంగా యువతలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్న జేపీ ఇలా వ్యవహరించడం ఆయన చిత్తశుద్ధికి తీరని మచ్చే..!

No comments: