
చైనా, మలేషియా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా.. ఇదే కోవలో ఇండియా..!! నల్లధనాన్ని విదేశాల్లో చెలామణీ చేస్తున్న ఆసియా దేశాల జాబితా ఇది. ఈ లిస్ట్'లో ఇండియాది ఐదో ర్యాంక్.! 2000 నుంచి 2008 వరకూ చేసిన సర్వే ఆధారంగా ఇండియా ఐదోస్థానం సంపాదించింది. వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ అనే సంస్థ ఈ సర్వే చేసింది. తన అధ్యయనంలో అంతర్జాతీయ ఆర్థిక విధానంలో ట్రాన్స్'పరెన్సీని కళ్లకు కట్టడానికి ప్రయత్నించింది.
ఇంతకూ.. ఇండియా నుంచి విదేశాలకు తరలివెళ్లిన సొమ్మెంతో తెలుసా..?
అక్షరాలా.. 5,20,000 కోట్ల రూపాయలు..! ఇక చైనా అయితే.. 110 లక్షల కోట్ల రూపాయలతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే.. అక్రమంగా ఆసియా దేశాల నుంచి తరలివెళ్తున్న సొమ్ములో ఈ ఐదు దేశాల వాటానే 96.5 శాతమట! ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ ఐదు దేశాల వాటా 44.9 శాతంగా ఉంది. అభివృద్ధికి, అవినీతికి ఉన్న వ్యత్యాసాన్ని బట్టి చైనా, మలేషియా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, ఇండియాల్లో అవినీతి ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. ఇండియాకు మొదటి 10స్థానాల్లో చోటు దక్కకపోవడం కాస్త ఊరటనిచ్చే అంశం. ఈ స్థానాన్ని చైనా ఆక్రమించుకుంది. రెండో స్థానంలో రష్యా, మూడో స్థానంలో మెక్సికో, నాలుగోస్థానంలో సౌదీ అరేబియా, ఐదో స్థానంలో మలేషియా నిలిచాయి.
