
ఆప్షన్ 1: నిర్దిష్ట కాలపరిమితితో తెలంగాణను ప్రకటించడం
ఆప్షన్ 2: నిర్దిష్ట కాలపరిమితితో తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేస్తూ.. హైదరాబాద్ పై విస్తృతంగా చర్చించడం
ఆప్షన్ 3: రెండో ఎస్సార్సీ ఏర్పాటు చేయడం
ప్రస్తుతం ఈ మూడు ప్రత్యామ్నాయాలను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తయారుచేసినట్లు విశ్వసనీయ సమాచారం. వీటిపై ఇటు తెలంగాణవాదులు, అటు సమైక్యవాదుల అభిప్రాయాలను సేకరించి.. ఏదో ఒకదానిపై ఏకాభిప్రాయం సాధించి దాన్ని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది..
ఈ ఆప్షన్స్ తో సమస్య సద్దుమణిగేనా..?
ఈ మూడు ఆప్షన్స్ ను ఓ సారి పరిశీలిస్తే కొంతమేర సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టవచ్చని అర్థమవుతుంది..
ఆప్షన్ 1: నిర్దిష్ట కాలపరిమితితో తెలంగాణను ప్రకటించడం..:
ఈ ఆప్షన్ అమలు చేసేందుకు సమైక్యవాదుల నుంచి వ్యతిరేకత రావడం సహజం.. ప్రస్తుతం యధాతథంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చేందుకు సమైక్యవాదులు అంగీకరించకపోవచ్చు.. కొంతకాలం ఇలాగే కొనసాగించినా.. ఆ తర్వాత తెలంగాణ విడిపోవడానికి వారి నుంచి సానుకూలత వస్తుందని ఆశించలేం..
ఆప్షన్ 2: నిర్దిష్ట కాలపరిమితితో తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేస్తూ.. హైదరాబాద్ పై విస్తృతంగా చర్చించడం
ఇది కొంతమేర ఏకాభిప్రాయ సాధనకు వీలయిన ఆప్షన్ గా కనిపిస్తోంది.. నిర్దిష్ట కాలపరిమితితో తెలంగాణ ఏర్పాటును ప్రకటిస్తే.. తెలంగాణ వాదుల నుంచి పెద్దగా అభ్యంతరాలు ఉండకపోవచ్చు.. అయితే.. హైదరాబాద్ లేని తెలంగాణను అంగీకరించేందుకు తెలంగాణవాదులు ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించరు. అదే సమయంలో హైదరాబాద్ పైనే ప్రస్తుతం సమైక్యవాదుల నుంచి పేచీ ఎదురవుతోందన్న విషయం తెలిసిందే..! అందుకే.. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రకటిస్తూ.. హైదరాబాద్ పై విస్తృతంగా చర్చించేందుకు సిద్ధమవడం ఇరుప్రాంతాలవారికీ కొంత సానుకూల పరిణామంగానే భావించవచ్చు.. విస్తృత చర్చల తర్వాత హైదరాబాద్ పై తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా ఇరుప్రాంతవాసులూ కట్టుబడి ఉంటే ఆ తర్వాత సమస్య ఉండకపోవచ్చు..
ఆప్షన్ 3: రెండో ఎస్సార్సీ ఏర్పాటు చేయడం..
రెండో ఎస్సార్సీ ఏర్పాటు చేయడం అంటే.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును చెత్తకుప్పలో వేయడమే.. ఈ ఆప్షన్ కు సమైక్యవాదులు అంగీకరించినా.. తెలంగాణవాదులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరు. కాబట్టి ఆప్షన్ కు అవకాశమే లేదని అర్థమవుతుంది..
కనీసం ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ స్పందిస్తున్నందుకు సంతోషంగా ఉంది. నిర్ణయమేదైనా.. త్వరగా తీసుకుంటే ఇరుప్రాంతాలకు ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుంది.. ఈ ఆప్షన్స్ పైనైనా ఇరుప్రాంత నాయకులూ ఏకాభిప్రాయానికి రావాలని ఆశిద్దాం...