ఏటా డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినాన్ని జరుపుకోవడం 1988లో ప్రారంభమైంది. హెచ్ఐవీని నిర్మూలించాలనే సదుద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా చేపట్టిన గొప్ప కార్యక్రమం ఇది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 700 కోట్ల జనభా ఉండగా అందులో 110 కోట్ల మంది హెచ్ఐవీతో బాధపడుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. 1981 నుంచి 2007 వరకూ సుమారు రెండున్నరకోట్ల మంది ఈ వ్యాధిబారిన పడి చనిపోయారు. వైద్యరంగంలో అత్యాధునిక సదుపాయాలు, శాస్త్రవిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. ప్రపంచ దేశాలన్నీ హెచ్ఐవీ, ఎయిడ్స్ కు సంబంధించి ఎన్నో చట్టాలు చేశాయి. అయినా ఈ మహమ్మారి మాత్రం అంతకంతకూ విస్తరిస్తోంది తప్ప ఆగడం లేదు. ఇందుకు ప్రధాన కారణం అవగాహన లోపమే! ఈ వ్యాధి గురించి అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఏటా డిసెంబర్ ఒకటిన ప్రపంచ ఎయిడ్స్ దినాన్ని జరుపుకుంటున్నాం.
అవగాహన ఎప్పుడు కలుగుతుంది?
రెండున్నర దశాబ్దాలుగా ఎయిడ్స్ పై ప్రపంచవ్యాప్తంగా కోట్లాది రూపాయల ధనం వెచ్చించారు. ఇంకా వెచ్చిస్తూనే ఉన్నారు. డిసెంబర్ ఒకటినాడు కొంతమంది సెలబ్రిటీలతో రెడ్ రిబ్బన్ కట్టుకుని వీధుల్లో ర్యాలీలు, సభలు పెడితే ప్రజల్లో అవగాహన వస్తుందా..? ఈ ర్యాలీల్లో పాల్గొనేవారు, సభలకు వస్తున్నవారిలో ఎక్కువ మంది సెలబ్రిటీలను చూడటానికి తప్ప ఎయిడ్స్ గురించి తెలుసుకోవడానికి రావట్లేదు. అలాంటప్పుడు ఈరోజు ఉద్దేశం నెరవేరే అవకాశం ఎప్పుడూ ఉండదు. ర్యాలీలు, సభలు పెడుతున్న వ్యక్తులు, సంస్థలు కూడా ఎయిడ్స్ నిర్మూలన పేరుతో విరాళాలు సేకరించడానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవానికి తమ శరీరంలో హెచ్ఐవీ ఉందన్న సంగతి 21శాతం మందికి తెలియడం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. విచ్చలవిడి శృంగారం వల్లే ఎయిడ్స్ వస్తుందని చాలా మందికి తెలుసు. అలాంటి శృంగారానికి అలవాటుపడిన వారు ఏదో ఒకరోజు ఆ బలహీనత నుంచి బయటపడి పరీక్షలు చేయించుకుంటేకానీ తమ ముందున్న ముప్పు అర్థం కాదు. ఎంత త్వరగా ఈ బలహీనత నుంచి బయటపడతారో ఎయిడ్స్ మనకు అంత త్వరగా దూరమవుతుంది. " ఎయిడ్స్ రహితతరం కోసం కలసి పనిచేద్దాం"(Working Together for AIDS free Generation) అనే నినాదంతో ఈ ఏడాది ఎయిడ్స్ డే జరుపుకున్నాం. లక్ష్యం బాగానే ఉంది... కానీ దాన్ని అందుకోవడం ఎలా..?
ఇంటి నుంచే అవగాహన
ఎయిడ్స్ పై అవగాహన ఇంటినుంచే ప్రారంభం కావాలి. భారతదేశంలో సెక్స్ గురించి బహిరంగంగా మాట్లాడడాన్ని నేరంగా చూస్తారు. అందుకే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అసలు ఆ అంశం జోలికే వెళ్లరు. ఒకవేళ ఉత్సాహం కొద్దీ తెలుసుకోవాలనే తపనతో పిల్లలు సెక్స్ కు సంబంధించిన ప్రశ్నలు వేసినా.. పేరెంట్స్, టీచర్స్ వాళ్ల నోళ్లు మూసేస్తున్నారు. దీంతో.. అదేంటో తెలుసుకోవాలనే తపనతో కొంతమంది పెడదోవ పడుతుండగా.. బలహీనతనలు జయించలేక మరింతమంది హెచ్ఐవీని కొనితెచ్చుకుంటున్నారు. అగ్రదేశాల్లో అక్షరాస్యత ఎక్కువగా ఉన్నందువల్ల ఎయిడ్స్ మీద అవగాహన త్వరగా కలుగుతోంది. పైగా ఆ దేశాల్లో సెక్స్ లాంటి అంశాలపై ఓపెన్ గా మాట్లాడుకుంటారు. అయితే అక్షరాస్యతలోనూ, అభివృద్ధిలోనూ వెనుకబడిన భారత్, ఆఫ్రికా ఖండంలోని కొన్ని దేశాలు హెచ్ఐవీ వ్యాధి వ్యాప్తిలో అగ్రస్థానంలో ఉంటున్నాయి.

ఎయిడ్స్ కు మందులేదని, నివారణ ఒక్కటే మార్గమని మనకు తెలుసు! మందులేని జబ్బు మన దగ్గరికి రాకుండా ఉండాలంటే ముందు మనం మన బలహీనతలను జయించాలి. ముఖ్యంగా సెక్స్ అనే వీక్ నెస్ ను తరిమికొట్టాలి. సురక్షితంకాని సెక్స్ వల్లే హెచ్ఐవీ అధికంగా వ్యాప్తి చెందుతోందన్నది వాస్తవం. ఈ విషయం తెలిసి కూడా ఎంతోమంది జాగ్రత్తలు తీసుకోవడం లేదు. అంటే వారికి అది బలహీనత! దీని నుంచి బయటపడకుండా వ్యాధి సోకిన తర్వాత బాధపడితో లాభం ఏముంటుంది?. అందుకే వ్యాధి వచ్చినవారిని దగ్గరకు చేర్చి సపర్యలు చేయడమే కాకుండా.. అసలు వ్యాధిబారిన పడకుండా ఉండేలా హెచ్చరించాలి.
పేదలే సమిధలు
ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ విస్తరిస్తున్న క్రమాన్ని పరిశీలిస్తే.. ఎక్కువగా పేదలే దీనికి బలవుతున్నారు. భారత్, ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో పొట్టకూటికోసం వ్యభిచారకూపంలోకి వెళ్లినవారిలోనే హెచ్ఐవీ ఎక్కువగా కనిపిస్తోంది. సరైన పోషకాహారం లేకపోవడంతో వారిలోని రోగనిరోధక శక్తి చాలా వేగంగా క్షీణిస్తోంది. దీంతో వారు త్వరగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి శృంగారం వల్ల ఎయిడ్స్ వస్తుందని వారికి తెలుసు. కానీ ఆకలి వారి చేత ఆ పని చేయిస్తోంది.! ఆపూట కడుపు నింపుకోవాలంటే ఒళ్లు అమ్ముకోవాల్సిన దుస్థితిలో ఉన్న ఎవరైనా రేపటి గురించి ఆలోచించరు. అందుకే ఆ మహమ్మారిని వారు జయించలేకపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా రోజూ 15వందల మంది శిశువులు ఎయిడ్స్ తోనే జన్మిస్తున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. వారి తల్లిదండ్రులు చేసిన తప్పుకు వారు బలవుతున్నారు. ఎయిడ్స్ కు మందు కనిపెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. వాటిని కొనసాగిస్తూనే.. పొట్టకూటికోసం వ్యభిచారాన్ని ఎంచుకున్నవారికి కాస్త ఉపాధి కల్పిస్తే ఎయిడ్స్ ను కొంతమేర అరికట్టగలిగే అవకాశం ఉంది.
2 comments:
"ఎయిడ్స్ కు మందులేదని, నివారణ ఒక్కటే మార్గమని మనకు తెలుసు! మందులేని జబ్బు మన దగ్గరికి రాకుండా ఉండాలంటే ముందు మనం మన బలహీనతలను జయించాలి."
Ayya HIV/AIDS ku mandulu chala vunnayi. Mandu ledu anakanandi.
http://te.wikipedia.org/wiki/%E0%B0%8E%E0%B0%AF%E0%B0%BF%E0%B0%A1%E0%B1%8D%E0%B0%B8%E0%B1%8D
link oka saari chudandi
Seenu గారు,
ఎయిడ్స్ ను శాశ్వతంగా నిర్మూలించే మందు ఇంతవరకూ లేదు. మీరు చెప్పిన మందులు కొన్ని రోజులపాటు ఉపశమనాన్ని కలిగించడానికి మాత్రమే ఉపయోగపడతాయి. అంతేకానీ శాశ్వత నిర్మూలనకు కాదు.. మీరు సూచించిన లింక్ లోనే "ఎయిడ్స్ ను అరికట్టడం" అనే సెక్షన్ కింద ఎయిడ్స్ ను పూర్తిగా నివారించే చికిత్స ప్రస్తుతానికి లేదు" అనే విషయాన్ని గమనించగలరు.
Post a Comment