![]() |
అలసితీ.. సొలసితీ..!! |
పట్టుమని రెండున్నరేళ్లు గడవక ముందే చిరంజీవి ఎందుకు ప్రజారాజ్యం జెండా పీకేశారు..? బలమైన సామాజిక వర్గం అండ పుష్కలంగా ఉన్నాఎందుకు పార్టీని విలీనం చేయాల్సి వచ్చింది.? మెగాస్టార్'గా ఆంధ్ర రాష్ట్రాన్ని ఓ ఊపు ఊపిన చిరంజీవి.. పార్టీని ప్రజలకు చేరువ చేయడంలో ఎందుకు విఫలమయ్యారు..? ఇలా ఎన్నో ప్రశ్నలు రాష్ట్ర ప్రజలనే కాక.. తెలుగుజాతి యావత్తునూ కుదుపేస్తున్నాయి.. అయితే.. ఈ ప్రశ్నలన్నింటికీ తరచితరచి చూస్తే ఎన్నో జవాబులు దొరుకుతాయి..
పార్టీ ఆవిర్భావ సభలో చిరంజీవి |
2006 ఆగస్టు 26వ తేదీన ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భవించింది. తిరుపతిలో లక్షలాది ప్రజల సాక్షిగా ఆ పార్టీ సూర్యుడు ఉదయించాడు. సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించి.. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ ఆదర్శంగా ప్రజారాజ్యం ఉద్భవించింది. తానుకూడా ఎన్టీఆర్ లాగే అధికారాన్ని కైవసం చేసుకుంటానని చిరంజీవి భావించి.. ఆర్భాటంగా పార్టీ ప్రకటించారు. ఓవైపు వై.ఎస్.రాజశేఖరరెడ్డి, మరోవైపు చంద్రబాబునాయుడు లాంటి రాజకీయ ఉద్దండుల నడుమ చిరంజీవి రాజకీయ ప్రవేశం జరిగింది. చిరంజీవి చరిష్మా చూసిన ఎంతోమంది ఇతరపార్టీల నేతలు ప్రజారాజ్యానికి వలసలు కట్టారు. తన సామాజిక వర్గం కూడా చిరంజీవికి అండగా ఉంటుందని భావించిన ఎంతోమంది నేతలు.. జై చిరంజీవ అన్నారు.
ఇదీ మన సింబల్ |
2009 ఎన్నికలు:
2009 ఎన్నికలు రానే వచ్చాయి. ఫలితాలు వచ్చాకగానీ తెలియలేదు చిరంజీవి సత్తా ఏంటో..! కేవలం 18 శాతం ఓట్లతో 18 సీట్లు మాత్రమే చిరంజీవి.. పాలకొల్లులో ఓటమి మూటగట్టుకోవాల్సి వచ్చింది. దీంతో.. ఆకాశాన సూరీడు కాస్తా నేలదిగి వచ్చాడు. సీఎం కుర్చీని పక్కనపెట్టి అసెంబ్లీలో తనది అటో ఇటో తేల్చుకోలేని దుస్థితి ఏర్పడింది. ఇంతలోనే నాటి ముఖ్యమంత్రి వై.ఎస్. చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్'కు పీఆర్పీ నేతలతోపాటు స్వయంగా చిరంజీవే ఆకర్షితుడయ్యాడనేది విశ్వసనీయ సమాచారం.. అందుకే చిరంజీవికి కేంద్ర మంతి పదవి ఇవ్వాల్సిందిగా పార్టీ అధిష్టానానికి సూచించినట్లు తెలుస్తోంది. ఇక.. వై.ఎస్. మరణానంతరం కూడా కాంగ్రెస్'కు అండగానే నిలిచిన చిరంజీవికి పార్టీ నడపడం పెద్ద సవాల్'గా మారింది.
![]() |
జెండా.. అజెండా |
పార్టీ ఆవిర్భావంలో ప్రముఖపాత్ర పోషించిన మిత్రా, పరకాల ప్రభాకర్, హరిరామజోగయ్య లాంటి సీనియర్లు బాహాటంగా చిరంజీవిపై విమర్శలు గుప్పించడం.. అది పార్టీ కాదని.. ప్రైవేటు కంపెనీ అని చేసిన వ్యాఖ్యలు.. ఆ పార్టీ దుస్థితిని తేటతెల్లం చేశాయి. అదే సమయంలో పార్టీ ఎమ్మెల్యేలు కూడా చిరంజీవికి దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది.
రాజకీయం తెలియదని చిరంజీవిపై సొంత పార్టీ నాయకులే విమర్శించే స్థితి వచ్చింది. కానీ చిరంజీవి మాటతీరులో మాత్రం అదే గాంభీర్యం.. అదే ఉత్సాహం..!! జెండా పీకేద్దాం.. అని ఏడాది కిందటే అంతర్గత సమావేశంలో అన్నట్లు వచ్చిన ఓ వార్త అప్పట్లో పెద్ద సంచలనం.. కానీ దానిపై చిరంజీవి ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. కంఠంలో ప్రాణమున్నంతవరకూ ప్రజాసేవకే అంకితమని.. పార్టీ జెండా పీకే పరిస్థితే రాదని స్పష్టంచేశారు.
వై.ఎస్.మరణానంతరం:
ఇంతలోనే ఎన్నో పరిణామాలు..! వై.ఎస్. మరణానంతరం రాష్ట్రంలో పరిస్థితులు వేగంగా మారిపోయాయి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికొచ్చిన జగన్, సంక్షోభంలో రాష్ట్రసర్కార్.. ఇలా ఎన్నో అంశాలు చిరంజీవికి కలిసొచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి చిరంజీవి గాలిలో ఆశాదీపమయ్యారు. తమ ఇంట్లో దీపం వెలిగించే సూరీడయ్యాడు. అందుకే జగన్ దూరమైనా.. చిరంజీవి ఉన్నాడనే ధైర్యం ఆ పార్టీకి కలిగింది. ఇందుకు చిరంజీవి స్టేట్'మెంట్లు కూడా దోహదపడ్డాయి. అవసరమైతే ప్రజలపై భారం పడకుండా కాంగ్రెస్ సర్కారుకు అండగా నిలుస్తామని పదేపదే చెప్పేవారు.
ఉభయతారకం:
అయితే.. కాంగ్రెస్-ప్రజారాజ్యం పార్టీల విలీనం ఉభయతారకంగా చెప్పవచ్చు. జనాకర్షక నేత కరువై రాష్ట్రంలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీకి చిరంజీవి ఆశాదీపం! వై.ఎస్.ఆర్.తనయుడిగా జగన్'కున్న ఫాలోయింగ్ నుంచి పార్టీని గట్టెక్కించాలంటే.. చిరంజీవి లాంటి చరిష్మా ఉన్న నేత(?) కాంగ్రెస్'కు తప్పనిసరైంది. అందుకే.. ఆయన్ను పార్టీలోకి తెచ్చేందుకు దొరికిన ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోలేదు..
![]() |
ప్రజలతో మమేకమై..! |
చిరంజీవిని పార్టీలోకి తెచ్చుకునేందుకు మరో కారణమూ ఉంది. ఇన్నాళ్లూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి రెడ్డి సామాజిక వర్గం ప్రధాన ఓటుబ్యాంకుగా ఉంది. కానీ వై.ఎస్.ఆర్. మరణం.. ఆ తర్వాత జగన్ పార్టీ నుంచి వైదొలగడంతో ఆ సామాజిక వర్గం తమకు దూరమైందనే భావన కాంగ్రెస్ అధిష్టానంలో ఏర్పడింది. దీన్ని భర్తీ చేయాలంటే మరో సామాజిక వర్గాన్ని దరిచేర్చుకోవాల్సిన పరిస్థితి. ఇందుకు చిరంజీవితోపాటు అతని సామాజికవర్గమైతే సరిపోతుందనే నిర్ణయానికి వచ్చింది.
సొంతపార్టీ సమస్యలు:
ఇక.. పార్టీ ఉన్నా.. ఉన్నదని చెప్పుకోలేని దుస్థితిలో ప్రజారాజ్యం పార్టీ ఉంది. ఆవిర్భావం సమయంలో వచ్చిన నేతలు మళ్లీ సొంతగూళ్లకు పయనమవడం, ఎమ్మెల్యేలు కూడా మాట వినకపోవడం.. భవిష్యత్తులోనైనా పార్టీని అధికారంలోకి తీసుకొస్తామనే నమ్మకం లేకపోవడం.. చిరంజీవికి పెద్ద సమస్యలుగా మారాయి. పార్టీ నడపాలంటే డబ్బు కావాలి. అధికారంలో లేకపోవడం, అధికారంలోకి వస్తుందనే నమ్మకం లేకపోవడంతో ఆ పార్టీకి విరాళాలు కరువయ్యాయి. ఇక.. చేతి నుంచి డబ్బు ఖర్చు పెట్టి పార్టీ నడిపేంత దయాగుణం చిరంజీవికి లేదాయె..! దీంతో.. కాంగ్రెస్ గూటికి చేరడమే మేలనుకున్నారు మెగాస్టార్!
![]() |
విలీనం దిశగా..!! |
జై కాంగ్రెస్, జై సోనియా!
ఇకపై.. చిరంజీవి సోనియా అమ్మ కూచి! అమ్మ చెప్పింది చేయాలి.. అమ్మకు జై కొట్టాలి. అమ్మ దర్శనం జరిగిందో లేదో.. అప్పుడే కాంగ్రెస్'వాదిగా మారిపోయారు ప్రజారాజ్యం చిరంజీవి..! పార్టీ అధిష్టానం ఏ నిర్ణయానికి కట్టుబడితే ఆ నిర్ణయానికి కట్టుబడుతానని ఇప్పటికే ప్రకటించేశారు కూడా! పనిలోపనిగా వై.ఎస్.పాలన అవినీతిమయమంటూ పరోక్షంగా జగన్'పై విమర్శలు షురూ చేశారు.. ఇన్నాళ్లూ తన వెనుక గాంధీ, అంబేద్కర్, పూలే, మదర్ థెరిసా లాంటి చిత్రపటాలను పెట్టుకున్న చిరంజీవి.. ఇప్పుడు నెహ్రూ, ఇందిర, రాజీవ్, సోనియా, మన్మోహన్ లాంటి పటాల ముందు కూర్చొని జై కాంగ్రెస్, జై సోనియా అనాలి.. ఇప్పటికే స్టార్ట్ చేశారు కూడా!!
![]() |
ఇక జగనే.. ఉమ్మడి శతృవు! |
బాధాకరమైన విషయమేంటంటే... ఎంతోమంది అభిమానులు, తమ సామాజికవర్గ ప్రజలు చిరంజీవిని తమ నేతగా భావించారు. ఇంతోకొంతో ఆయన్ను నమ్మి 70 లక్షలమంది ఓట్లేశారు. వాళ్లంతా కేవలం చిరంజీవిని చూసి ఓట్లేసినవారే! కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు ప్రత్యామ్నాయంగా చిరంజీవి ఎదుగుతాడని, పాలనలో మార్పు తెస్తాడని భావించి ఓట్లేశారు. ఇప్పుడు వారి ఆశలు, ఆశయాలపై చిరంజీవి నీళ్లు చల్లారు.. వారిని నట్టేట ముంచారు. తాము జై చిరంజీవ అంటే.. చిరు మాత్రం జై కాంగ్రెస్, జైజై కాంగ్రెస్ అనడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
ఎవరేమనుకుంటేనేం..? చిరంజీవి సంతోషంగా ఉన్నారు. ఇన్నాళ్లూ తనుమోసిన భారాన్ని దించేసుకుని హాయిగా ఊపిరి పీల్చుకుని రెస్టు తీసుకుంటున్నారు. ఇటీవలే విదేశాలకెళ్లి స్మార్ట్'గా తయారై.. మరోసారి ముఖానికి రంగేసుకునేందుకు రెడీ అయిపోయారు. ఇప్పుడు పార్టీ బాదరబందీలేవీ లేకపోవడంతో.. పూర్తిస్థాయిలో సినిమాలకు సమయం కేటాయించవచ్చు.. సో త్వరలోనే.. చిరంజీవి కెమెరా ముందుకు రాబోతున్నారు. అభిమానులకు మెగాస్టార్ మరోసారి కనువిందు చేయబోతున్నారు. సో.. అభిమానులూ రెడీగా ఉండండి.. థియేటర్లలో చప్పట్లు కొట్టడానికి..! (మిమ్మల్ని కూడా ఏదో ఒక రోజు సోనియమ్మ చెంతకు చేరుస్తాడు).. జై చిరంజీవ.. జై సోనియా.. జై కాంగ్రెస్.. జైజై కాంగ్రెస్..!!!
4 comments:
"చిరంజీవి లాంటి చరిష్మా ఉన్న నేత".
He is not a leader. He failed miserably in politics. The real leader lead followers in adverse conditions. Where as Chiru ride on his follower for his personal gains.
"సో త్వరలోనే.. చిరంజీవి కెమెరా ముందుకు రాబోతున్నారు. అభిమానులకు మెగాస్టార్ మరోసారి కనువిందు చేయబోతున్నారు"
People will reject this "political failure" for betraying them (70 - 80 Lakh Telugu people) and selling them to Sonia to gain personally.
Chiranjeevi is like Sachin. I hope he gives better performance now in Politics
this is timely nice and well balanced article .Congratulations
one of the big waste fellow in this world
Post a Comment