రాష్ట్రంలో పాలన ఎటు పోతుందో అర్థంకావడం లేదు.. ఇన్నాళ్లూ దేశం యావత్తూ గర్వించేలా తలెత్తుకు ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. ప్రత్యేక, సమైక్య ఉద్యమాలు రాష్ట్రానికి ప్రపంచపటంలో ఒక ప్రత్యేక స్థానాన్ని కట్టబెడుతున్నాయి. 2009 డిసెంబర్ 9న చిదంబరం ప్రకటన, అనంతరం శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు, నివేదిక సమర్పణ.. తదితర పరిణామాల తర్వాత కూడా రాష్ట్ర విభజనపై కేంద్రం ఇంతవరకూ స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న సహాయనిరాకరణ, టీజేఏసీ ఉద్యమ కార్యక్రమాలు కిరణ్ సర్కారుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
ఇక.. తెలంగాణ జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు జరిగిన 48 గంటల బంద్, పల్లెపల్లెకు పట్టాలపైకి.. తదితర కార్యక్రమాలు దిగ్విజయం సాధించాయి. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఈ రెండు కార్యక్రమాల ద్వారా తెలంగాణలో జనజీవనం పూర్తిగా స్తంభించింది. ఈ నేపథ్యంలోనే మార్చి 10వ తేదీన మిలియన్ మార్చ్ టు హైదరాబాద్ కార్యక్రమానికి టీజేఏసీ పిలుపునిచ్చింది. ఈజిప్టు తరహా ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. పూర్తి శాంతియుతంగా హైదరాబాద్ రోడ్లను దిగ్బంధించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.. రోడ్లపైనే వంటావార్పూ చేసుకుని రోజంతా బైఠాయించి.. తెలంగాణ ప్రజల ఆకాంక్షను ఢిల్లీ పెద్దలకు వినిపించేలా చేయడమే దీని లక్ష్యం.
ఇక.. ఆపార్టీ ఈ పార్టీ అనే తేడాలేకుండా తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులందరూ అసెంబ్లీని బహిష్కరిస్తున్నారు. ఇందులో ఎవరి ప్రయోజనాలు వారివి..! ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అసెంబ్లీ నడుచుకోనప్పుడు.. అది జరిగినా, జరగకపోయినా పెద్దగా ఉపయోగం ఉండదు కూడా..! మరోవైపు.. ఇన్నాళ్లూ స్తబ్దుగా ఉన్న సీమాంధ్ర ప్రజాప్రతినిధులు మళ్లీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ వాదం ముందు సమైక్యవాదం సద్దుమణిగిపోయిందనే ప్రచారం జరుగుతున్నందున.. దాన్ని మళ్లీ వినిపించాలని భావిస్తున్నట్లు ఆ ప్రాంత నేతలు చెబుతున్నారు. అయితే.. ఇలాంటి పోటాపోటీ ఉద్యమాలు సామాన్యులకు చేటు తెస్తాయి తప్పా ఎలాంటి మేలూ చేకూర్చవు.
తెలంగాణ వస్తే.. హైదరాబాద్'లోని సీమాంధ్రులకు రక్షణ ఉండదని చెబుతున్న సీమాంధ్ర నేతలు.. తెలంగాణఉద్యమానికి పోటీగా అసెంబ్లీని బహిష్కరించడం, మళ్లీ సమైక్య ఉద్యమాన్ని చేపట్టడమంటే.. తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టడమే అవుతుంది. విజయవాడలోనో, గుంటూరులోనో.. కర్నూలులోనో కూర్చుని ఇలాంటి కార్యక్రమాలు, ప్రకటనలు చేయడం వల్ల వారికొచ్చే నష్టమేమీ లేదు. కానీ.. హైదరాబాద్'లోని సీమాంధ్ర ప్రజలకు మాత్రం హాని కలిగిస్తుంది. అందుకే.. ఇప్పటికైనా సీమాంధ్ర నాయకులు సంయమనం పాటించాలి. రెచ్చగొట్టే ప్రసంగాలు, పోటీ చర్యలు మానుకోవాలి. అదే సమయంలో తెలంగాణ వస్తే హైదరాబాద్'లో స్థిరపడినవారెవరకీ నష్టం చేకూరదని చెబుతున్న తెలంగాణవాదులు కూడా వారికి భరోసా కల్పించాలి.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలో సహాయ నిరాకరణ ఊపందుకోవడం, సొంత పార్టీ ఎమ్మెల్యేలే సభను బాయ్'కాట్ చేయడం.. మిగిలిన తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు సైతం సభను నడవనీయకుండా చేస్తుండడంతో ఒక్కరోజు కూడా అసెంబ్లీ సక్రమంగా జరగలేదు. సభకు రావడం, వాయిదా వేసుకుని పోతుండడంతో.. విలువైన సమయమెంతో వృథా అవుతోంది.

తెలంగాణ ప్రజలు ఇప్పటికే ఎన్నో ఉద్యమాలు చేశారు.. చేస్తూనే ఉన్నారు. కానీ ఇవేవీ పాలకులకు కనిపించినట్లు లేవు. ఇప్పటికైనా తెలంగాణపై స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటిస్తే ఎంతో మేలు చేసినవారవుతారు. ఇప్పటికే ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. పరీక్షలు జరుగుతాయో లేదోననే మీమాంసలో వారు కొట్టుమిట్టాడుతున్నారు. మరోవైపు.. సహాయ నిరాకరణతో ప్రభుత్వ పాలన పూర్తిగా స్తంభించింది. ప్రభుత్వ ఆదాయానికి కూడా భారీగా గండిపడుతోంది. వీటన్నిటికీ మించి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.


10న జరిగే మిలియన్ మార్చ్ కార్యక్రమాన్ని హింసాత్మకంగా మార్చేందుకు కొన్ని అసాంఘిక శక్తులు కుట్రపన్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో.. తెలంగాణవాదులు కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. రెచ్చగొట్టే ప్రసంగాలు, చర్యలు లేకుండా ఓర్పుతో వ్యవహరించాలి.
కానీ.. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను ఓసారి పరిశీలిస్తే.. త్వరలోనే రాష్ట్రపతి పాలన రావచ్చేమో అన్న అనుమానం కలుగుతోంది. పరిస్థితిని సద్దుమణిగే సత్తా సీఎం కిరణ్'కు లేకపోవడం.. కేంద్రప్రభుత్వం తాత్సారం చేస్తుండడంతో.. రాష్ట్రంలో పరిస్థితి నానాటికీ దిగజారుతోందనేది వాస్తవం..!!
2 comments:
this bush doctrine got into every one, if you are not with me you are against me, what ever the right telangana people thinks they have, rest of the people have same kind of rights to express their feelings, ignoring that and trying to threaten them is not going to help in any way for benefit of "our" state "our" people.
Hi raju garu, your post is very nice. almost all common man think in your way.Each region of people have their own opinions but ultimately Central govt should react immediately. Otherwise Our state become indo-pak issue. Any way nice article. good.
Post a Comment