Sunday, June 05, 2011

తొలకరి

తొలకరి పలకరించింది
సూర్య ప్రతాపానికి ఒంట్లో ఆవిరైపోయిన నీటికి.. కొత్త నీటిని జత చేస్తోంది
ఎండిపోయిన వాగూ వంకలపై గంగమ్మ పరవళ్లు తొక్కే సమయం వచ్చేసింది
మోడువారిన నేలను తనివితీరా ముద్దాడుతోంది..
భూమాత దాహమంతా తీరేలా తడిసి ముద్దవుతోంది


ఆకుపచ్చని ఆకుల్లోని తేమనంతా పీల్చుకున్న గాలి ఆకాశానికేగింది..
సత్తువనంతా పోగొట్టుకున్న పత్రం.. ఎండిపోయి నేల రాలింది..
రాలిన ఆకుల స్థానంలో మళ్లీ కొత్త ఆకులు మొలకెత్తబోతున్నాయి
ఎండిపోయిన చెట్ల కొమ్మలు మళ్లీ పచ్చగా కళకళలాడనున్నాయి

ఆకాశంలో నల్లని మబ్బులు కమ్ముకుంటున్నాయి..
ఉరుములు.. పిడుగులతో వాయుదేవుడు వచ్చేస్తున్నాడు..
పెరట్లో ఆరేసిన గుడ్డలను తొలగించేలోపే ముద్ద ముద్ద చేసేస్తున్నాడు
తువ్వాలు చుట్టుకుని గొడ్లు కాస్తున్న కాపర్లను చెట్లకిందకు పరుగులు తీయిస్తున్నాడు


నెలల తరబడి ఎదురుచూస్తున్న వానమట్టి వాసన మళ్లీ వచ్చేసింది
ఆరుగాలం శ్రమించి అలసిసొలసి రచ్చబండపై సేద తీరుతున్న అన్నదాతను తట్టి లేపుతోంది
పలుగు, పార పట్టి పొలాల వైపు పరుగులు తీయమంటోంది
రంకెలేస్తున్న ఎద్దులను కాడి కట్టమంటోంది
అన్నదాత ఆకలి తీరేలా మొలకలు విత్తమంటోంది
బీడువారిన మడులకు పచ్చకోక కప్పేందుకు వచ్చేస్తోంది
భూస్వాములను గిడ్డంగులను ఖాళీ చేయమంటోంది
పూటగడవని కూలీల మోములో చిరునవ్వులు చిందిస్తోంది
మగ మహారాజులను గోచీ కట్టమంటోంది..
మహాలక్ష్ములను చీరకొంగును బిగదీయమంటోంది..

వానావానా వల్లప్పా అంటూ పిల్లలంతా రాగాలు తీస్తున్నారు..
తొలకరికి తడిసి ముద్దవుతున్న పడుచుపిల్ల పెరట్లో పులకరించిపోతోంది
ఇంటి ముందు నీటిలో కాగితపు పడవులు పల్టీలు కొడుతున్నాయి
గలగలా పారుతున్న నీటికి బంకమట్టి అడ్డుకట్ట వేస్తోంది
బొప్పాయి కాండాలు తూములవుతున్నాయి
పాదాలకింద ఇసుక మట్టిని తోసుకెళ్తున్న తొలకరి గిలిగింతలు పెడుతోంది

చిటపట చినుకుల సవ్వడి సూర్యుడికే సవాల్ విసురుతోంది..
వడదెబ్బకు తన దగ్గర విరుగుడు ఉందంటోంది..
కారు మబ్బులను దాటే వరకూ భానుణ్ని తరిమితరిమి కొడుతోంది
మళ్లీ ఏడాది వరకూ ఇటువైపు చూడద్దంటోంది


(గమనిక: తొలకరి వస్తోందంటే పల్లెసీమలు పండగ వాతావరణాన్ని సంతరించుకుంటాయి. వీధుల్లో సందడి నెలకొంటుంది.. కొన్నేళ్లుగా నేనీ సందడికి దూరమైపోయా.. అందుకే నా అనుభవాలను అక్షరీకరించా..!)

3 comments:

Anonymous said...

అయితే తొలకరి పలకరించిందంటారు, సంతోషం :)

Padmarpita said...

తొలకరి జల్లు మీ టపాలో పులకరించిందండి.....బాగారాసారు!

kranthi kumar said...

super master .............