Monday, November 29, 2010

జగన్ రిజైన్

     హించినట్లే జరిగింది. కడప ఎంపీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. కడప ఎంపీ పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. ఆయనతో పాటు తల్లి వై.ఎస్.విజయలక్ష్మి కూడా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.

     వై.ఎస్.రాజశేఖరరెడ్డి హఠాన్మరణం తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, పార్టీ వైఖరి వై.ఎస్.కుటుంబాన్ని తీవ్రంగా కలచివేశాయనడంలో ఎలాంటి సందేహం లేదు. తండ్రి హఠాన్మరణం తట్టుకోలేక చనిపోయినవారిని ఓదార్చేందుకు కూడా అధిష్టానం అనుమతి ఇవ్వకపోవడం జగన్ ను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. దీనికితోడు 150మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేసినా.. తనను ఆ పదవిలో కూర్చోబెట్టలేదనే ఆక్రోశం మరోవైపు ఎలాగూ మనసులో ఉండిపోయింది. ఇంతలోనే.. రోశయ్య రాజీనామా చేయడం, ఆ స్థానంలో కిరణ్ కుమార్ రెడ్డిని గద్దెనెక్కించడం చకచకా జరిగిపోయాయి. ఇక్కడే అసలు మతలబు మొదలైంది.

     జగన్ కు చెక్ పెట్టేందుకే పార్టీ అధిష్టానం కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందులోభాగంగానే.. జగన్ కు చెక్ పెట్టేందుకు కిరణ్ కుమార్ రెడ్డి.. వై.ఎస్.ఆర్. సోదరుడు వివేకానందరెడ్డికి వలవేశారు. ఆజాద్ ద్వారా మంత్రివర్గంలో స్థానం కల్చించాలని నిర్ణయించారు. ఈ హఠాత్మరిణామం వై.ఎస్. కుటుంబీకులను మరింత కలచివేసింది. కుటుంబంలో చిచ్చు పెట్టేందుకు బాబాయిని పావుగా వాడుకుంటున్నారని జగన్ గ్రహించారు. 14 నెలలుగా ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నా ఓర్చుకున్నానని.. అయితే.. ఈ పరిణామం తర్వాత ఇక పార్టీలో కొనసాగడం కష్టమని ఆయన మేడమ్ సోనియాకు 5 పేజీల లేఖ రాశారు. రిజైన్ చేస్తున్నట్లు ప్రకటించారు.

     జగన్ అలా రిజైన చేశారో లేదో.. అప్పుడే రాష్ట్రవ్యాప్తంగా ఆయనకు మద్దతుగా చిన్నాచితకా నేతలు రాజీనామా బాట పట్టారు. అయితే.. ఆయన వెంట ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రం ఇంకా రాజీనామాకు సిద్ధపడలేదు. మంత్రివర్గ విస్తరణ అనంతరం.. జగన్ పార్టీ ప్రకటించిన తర్వాత వారు కూడా రాజీనామా చేసే అవకాశాలున్నాయి. అయితే.. ప్రస్తుతం జగన్ వెంట ఎంతమంది ఉన్నారు.. అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఏదేమైనా జగన్ రాష్ట్రంలో మరో సంచలనం కాబోతున్నారు. మరో ప్రాంతీయపార్టీకి తెరలేపబోతున్నారు. ఇది కాంగ్రెస్, టీడీపీలకు గట్టిపోటీ ఇవ్వడం ఖాయం.

No comments: