Sunday, November 21, 2010

సాక్షి: సోనియాపై కథనం - ఓ నిజం

     125 ఏళ్ల కాంగ్రెస్ పార్టీపై సాక్షి టీవీలో ప్రసారమైన కథనం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఇది కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి వ్యతిరేకంగా ఉందని.. సాక్షి టీవీలో (వేరే మీడియాలో రావొచ్చు) ఇలాంటి కథనాలు ప్రసారం చేయడం తగదని.. ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు రోడ్డెక్కారు. సాక్షి ప్రధాన కార్యాలయం ఎదుట సాక్షాత్తూ కొందరు మంత్రులు ధర్నాకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా సాక్షి దినపత్రిక ప్రతులను తగలబెడుతున్నారు.

ఏం జరిగింది.?
     కాంగ్రెస్ పార్టీ 125ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సాక్షి టీవీలో ఓ విశ్లేషణాత్మక కార్యక్రమం ప్రసారమైంది. ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్ పార్టీ తీరుతెన్నులు.. నానాటికీ తగ్గిపోతున్న ప్రాభవం అంటూ.. పార్టీ అధినేత్రి సోనియాపై కాస్త ఘాటైన వ్యాఖ్యలే కథనంలో కనిపించాయి.  ఇది జీర్ణించుకోలేని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలు సాక్షి టీవీపై మండిపడుతున్నారు. జగన్ కావాలనే ఇలాంటి కథనాలు ప్రసారం చేయిస్తున్నారని ధ్వజమెత్తుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పత్రికా దహనాలు, కార్యాలయాల ఎదుట ధర్నాలు మామూలైపోయాయి.

వ్యతిరేక కథనాలు ప్రసారం చేయకూడదా..?
     వాస్తవానికి రాజకీయాలు కావొచ్చు, ప్రభుత్వాలు కావొచ్చు..మరేదైనా అంశం కావొచ్చు.. వాటిపై సవివరంగా విశ్లేషించి.. ప్రసారం చేసే హక్కు మీడియాకు ఉంది. వాటిలోని మంచిచెడులను ప్రజలకు వివరించే బాధ్యత కూడా ఉంది. సాక్షికూడా ఇప్పుడు.. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితిని కళ్లకుకట్టింది. యూపీఏ ప్రభుత్వ కుంభకోణాలు, నానాటికీ దిగజారిపోతున్న పార్టీ ప్రాభవం, సోనియా పనితీరు.. లాంటి అంశాలను ప్రజల ముందుంచింది.

మరెందుకు వివాదం..?
     సాక్షి పత్రిక ప్రారంభమైనప్పటి నుంచి...(అంతకుముందు నుంచీ కూడా) దాన్ని తమ పత్రికగా భావించారు కాంగ్రెస్ పార్టీ నేతలు. కార్యకర్తలు. ఇందుకు ఆ పత్రిక యాజమాన్యం కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్... ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక ఆ రెండు పత్రికలు అంటూ బురదజల్లేవారు. వీటికి తగిన బుద్ధి చెప్పేందుకు మనకూ ఓ పత్రిక వస్తోందని తరచూ చెప్పేవారు. ఈ మాటలు కాంగ్రెస్ శ్రేణులకు బాగా వంటబట్టాయి. పత్రికను, రాజకీయాన్ని వేర్వేరుగా చూడాల్సిందిపోయి.. సాక్షి అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే సాక్షి అనే స్థాయికి వాటి మధ్య బంధం ఏర్పడిపోయింది.
     అయితే.. వై.ఎస్.హఠాన్మరణంతో సీన్ రివర్స్ అయింది. తండ్రి తర్వాత తానే ముఖ్యమంత్రి అని భావించిన జగన్.. ఆ కోరిక నెరవేరకపోవడంతో అధిష్టానంపై కక్షగట్టారు. క్రమంగా అధిష్టానం కూడా జగన్ వర్గీయులను సాగనంపుతుండడంతో అధిష్టానం ఆలోచనలను పసిగట్టిన పార్టీ శ్రేణులు కూడా జగన్ కు దూరమవుతూ వస్తున్నాయి. అందులో భాగంగానే.. ఒకప్పుడు సాక్షి తమదే అని భావించిన కాంగ్రెస్ శ్రేణులు.. ఇప్పుడు దానిపై కక్షగట్టాయి.

తాను తీసుకున్న గోతిలోనే..!
    సాక్షి యాజమాన్యం ఇప్పుడు  తాను తీసుకున్న గోతిలో తానే పడింది. పార్టీ పత్రికగా సాక్షిని ప్రచారం చేయడం ఎంత తప్పో ఇప్పుడు తెలిసివచ్చింది. రాజకీయనాయకుల చేతుల్లోని పత్రికలకు.. రాజకీయాలను, మీడియాను వేరుచేసి చూపడం అంత ఈజీకాదని మరోసారి రుజువైంది. పత్రిక ప్రారంభోత్సవంలోనూ, ఆ తర్వాత పలు సందర్భాల్లో సాక్షి ఎండీ జగన్మోహన్ రెడ్డి, ఆయన తండ్రి వై.ఎస్.ఆర్.. సాక్షి నాణేనికి రెండువైపులా చూపుతుందని చెప్పుకొచ్చారు. కానీ అవేవీ పార్టీ శ్రేణులను ప్రభావితం చేయలేకపోయాయి. అయితే.. వై.ఎస్.మరణం తర్వాత కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కూడా క్రమంగా సాక్షికి దూరమైపోయారు. ఇప్పుడు జగన్ కావాలనే ఇలాంటి కథనాలను ప్రసారం చేయిస్తున్నారని ఆ పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. వీటిని కూడా తోసిపుచ్చలేం..

జగనే సాక్షి - సాక్షే జగన్!
     సాక్షి ప్రారంభమైనప్పటి నుంచి అదెప్పుడూ ప్రజాపత్రికగా వ్యవహరించలేదు. పార్టీ పత్రికగానే గుర్తింపు తెచ్చుకుంది. జగన్ ఓదార్పుయాత్ర సమయంలో మిగిలిన వార్తలన్నింటినీ పక్కనపెట్టి.. 24గంటలూ దాన్నే ప్రసారం చేసింది. అలాంటిదాన్ని ప్రజలపక్షం అని ఎలా అంటాం.? అందుకే ఇప్పుడు సోనియాపై కథనాలు కూడా జగన్ వ్యూహరచనలో భాగమేనని అందరూ భావిస్తున్నారు.

No comments: