Tuesday, November 30, 2010

నిలువునా చీలిన వై.ఎస్.ఫ్యామిలీ..!

    రిత్ర పునరావృతమవుతుందేమో అనిపిస్తోంది.. అవును..! ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డిని విభేదించి.. బాబాయి వై.ఎస్.వివేకానంద రెడ్డి బయటకు వచ్చేశారు. ఇన్నాళ్లూ ఒకేతాటిపై నడిచిన వై.ఎస్.ఫ్యామిలీ ఇప్పుడు నిట్టనిలువునా చీలిపోయింది. అబ్బాయ్ నుంచి బాబాయ్ ని విడదీయడంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పూర్తిగా సక్సెస్ అయింది. జగన్ ను కలిసిన తర్వాత కూడా పార్టీకే పూర్తి విధేయత ప్రకటించిన వివేకానంద రెడ్డి.. కాంగ్రెస్ పార్టీలో లీడర్ అనిపించుకున్నారు.


వివేకా ఎందుకు దూరమయ్యారు.?
     వాస్తవానికి వై.ఎస్.వివేకానందరెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి మధ్య వై.ఎస్.ఆర్. ఉన్నకాలంలోనే మనస్ఫర్థలు ఉన్నాయనే ఊహాగానాలు వినిపించాయి. వై.ఎస్.ఆర్. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంపీగా ఉన్న వివేకా చేత రాజీనామా చేయించి.. తాను ఎంపీ కావాలని జగన్ పట్టుబట్టారు. అయిష్టంగానే వివేకా రాజీనామా చేసినా.. అధిష్టానం అంగీకరించకపోవడంతో జగన్ కోరిక నెరవేరలేదు. అప్పుడే బాబాయ్-అబ్బాయ్ మధ్య విభేదాలు పొడచూపాయి. ఇక.. అప్పటి నుంచి అన్న వై.ఎస్.ఆర్ చెప్పినట్లే నడుచుకున్న వివేకా.. జగన్ ను పెద్దగా పట్టించుకోలేదు. వై.ఎస్.ఆర్. మరణానంతరం.. అబ్బాయితో బాబాయి అంటీముట్టనట్లుగానే ఉన్నారు. ఓదార్పు యాత్రలో కూడా పాల్గొన్న సందర్భాలు లేవు. అంతేకాక.. అబ్బాయి ఓ వైపు ఓదార్పు యాత్ర జరుపుతున్న సమయంలోనే పార్టీ అధిష్టానానికి విధేయతను ప్రకటిస్తూ లేఖ రాశారు. సహజంగా శాంతస్వభావి అయిన వివేకా.. అబ్బాయి దుందుడుకు వైఖరిని సమర్థించలేకపోయారు. ఆవేశంతో తీసుకునే నిర్ణయాలు సఫలం కావని సన్నిహితుల ద్వారా జగన్ కు చేరవేసేవారు. అయినా జగన్ పట్టించుకున్న దాఖలాలు లేవు. అందుకే ఇప్పుడు వివేకా తన దారిలో తాను నడవాలనుకున్నారు. 2సార్లు ఎంపీగా, మరో 2సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన తాను మంత్రిపదవిని తీసుకోవడంలో తప్పులేదనేది వివేకా భావన.! తొలిసారి ఎంపీగా ఎన్నికైన జగన్.. ముఖ్యమంత్రి కావాలని కోరడంలో లేని తప్పు.. తాను మంత్రి పదవిని ఆశిస్తే.. తప్పేంటని వివేకా ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి వై.ఎస్.ఫ్యామిలీ గోడలు నిట్టనిలువునా చీలిపోయాయి.

వై.ఎస్.నేర్పిన విద్యయే..!
     రాజకీయంగా వై.ఎస్.ఆర్. ఆలోచనలు ఎంతో పకడ్బందీగా ఉండేవి. శతృవులను దెబ్బతీసేందుకు ఎంతకైనా తెగించేవారు. కుటుంబసభ్యులు, ఆత్మీయుల మధ్య చిచ్చుపెట్టి.. తన పాచిక పారేలా చేయడంలో వై.ఎస్.ఆర్. దిట్ట.! గతంలో ఓసారి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు, ఆయన సోదరుడు రామమూర్తినాయుడుకు మధ్య ఇలాంటి సంఘటనే జరిగింది. అన్నను కాదని.. తమ్ముడు రామమూర్తినాయుడు వై.ఎస్. చెంత చేరారు. ఇది వై.ఎస్.ఆర్. వ్యూహమే.! కేవలం చంద్రబాబు ఫ్యామిలీలోనే కాదు.. ఇతర పార్టీల నేతలను కూడా ఏదోరకంగా ఆకట్టుకునేవారు. ఇదంతా రాజకీయంలో భాగమనేవారు. వై.ఎస్.ఆర్. ఎత్తుగడలను చూసి అందరూ షాకయ్యేవారు. గతంలో TRS, TDPలకు చెందిన కొంతమంది MLAలను వై.ఎస్.ఆర్. ఇలాగే రాజకీయ వ్యూహాల్లో బంధించారు.
     ఇప్పుడు వై.ఎస్.ఫ్యామిలీ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇదే వ్యూహాన్ని అనుసరించింది. ఫ్యామిలీలో కూడా జగన్ కు మద్దతిచ్చేవారెవరూ లేరని చెప్పేందుకే వివేకాను తనవైపు తిప్పుకుంది. గతంలో వివేకాకు జరిగిన అవమానాలకు ప్రతీకారం తీర్చుకునే అవకాశం కల్పించింది.

జగన్ చేసింది కరెక్టా..?
     వై.ఎస్.రాజశేఖరరెడ్డి పార్టీకి పూర్తి విధేయుడిగా పనిచేశారు. ఎన్నో అవమానాలు భరించారు. అయినా సహించారు. కానీ ఏనాడూ పార్టీని వీడి బయటకు పోలేదు. ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి తానే దిక్కని నమ్మారు. అందుకు తగ్గట్లే.. రాష్ట్రమంతటా తనకంటూ ప్రత్యేక కేడర్ ను సృష్టించుకున్నారు. (ఇప్పుడు జగన్ వెంట ఉన్నవారు ఆ కేడర్ లోని వారే) తను నమ్మినవారిని అక్కున చేర్చుకున్నారు. పార్టీకి విధేయంగా ఉంటూనే.. స్వేచ్ఛ అనుభవించారు. ఇదంతా.. వై.ఎస్. పవర్ పాలిటిక్స్ వల్లే సాధ్యమైంది. అయితే.. ఆయన పవర్ లోకి వచ్చేందుకు 30 ఏళ్లు పట్టింది. కానీ జగన్ ఎంపీగా ఎన్నికయి కేవలం ఒకటిన్నర ఏడాది మాత్రమే అయింది. మరి ఇంతలోనే ఏకంగా ముఖ్యమంత్రి కావాలనుకోవడం అత్యాశే అవుతుంది. అది కూడా కాంగ్రెస్ పార్టీలో..! ఎంతోమంది వృద్ధానువృద్ధులు అలాంటి పదవులకోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు.
     తన తండ్రి చనిపోయినప్పుడు 150 మంది ఎమ్మెల్యేలు తనకు మద్దతుగా సంతకాలు చేశారని జగన్ చెబుతున్నారు. కానీ.. వారంతా ఏ మూమెంట్ లో సంతకాలు చేశారో జగన్ ఓసారి గుర్తు చేసుకోవాలి. తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేని ఎమ్మెల్యేలంతా తనపై సానుభూతితో అలా చేశారని భావించాలి.

2 comments:

Thirmal Reddy said...

Nice Analysis

Thirmal Reddy
thirmal.reddy@gmail.com

clnraju said...

thank u annayya....