Friday, December 03, 2010

వై.ఎస్.కోటకు బీటలు..!!

     కాంగ్రెస్‌ పార్టీకి.. ముఖ్యంగా వై.ఎస్.కుటుంబానికి పులివెందుల కంచుకోట..! కానీ ఇప్పుడు వై.ఎస్.కుటుంబంలో కలతలు రేగడంతో.. వర్గపోరుకు ఆజ్యం పోసినట్లైంది.. 4 దశాబ్దాలుగా పులివెందులలో వై.ఎస్.ఫ్యామిలీదే పెత్తనం..! వీరికి ఎదురు నిలిచినవారందరూ ఓడిపోయారు. అటు కడప పార్లమెంట్‌ నియోజకవర్గంపైనా పులివెందుల ఆధిపత్యమే కొనసాగుతోంది.. కానీ ఇప్పుడు సీన్‌ రివర్స్‌ కాబోతోంది..

పులివెందుల కోటకు బీటలు వారాయి.. బాబాయ్‌ వివేకా.. అబ్బాయ్‌ జగన్‌ల మధ్య పొడసూపిన విభేదాలు కడప జిల్లా రాజకీయాలను మలుపు తిప్పబోతున్నాయి.. ఇన్నాళ్లూ పులివెందుల, కడప పార్లమెంట్‌ నియోజకవర్గాలు వై.ఎస్.ఫ్యామిలీ కంచుకోటలుగా ఉన్నాయి..

వై.ఎస్.ఫ్యామిలీ రాజకీయ చరిత్ర: 
1978లో తొలిసారిగా వై.ఎస్.కుటుంబం రాజకీయాల్లోకి ఎంటరైంది. పులివెందుల నుంచి తొలిసారి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
1983లో కూడా వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు.. 
1985లో వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో ప్రస్తుత జడ్పీ ఛైర్‌పర్సన్‌ జ్యోతిరెడ్డి భర్త సదాశివరెడ్డిపై పోటీ చేసి మూడోసారి ఎమ్మెల్యేగా వై.ఎస్. ఎన్నికయ్యారు..
1989లో వై.ఎస్.వివేకానంద రెడ్డి రాజకీయాల్లోకి ప్రవేశించారు. అన్న వై.ఎస్.రాజశేఖరరెడ్డి కడప పార్లమెంట్ స్థానానికి పోటీ చేయడంతో.. వివేకా ఎమ్మెల్యే బరిలో నిలిచారు. సదాశివరెడ్డిపై పోటీచేసిన గెలిచిన వివేకా తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
1989లోనే వై.ఎస్.రాజశేఖరరెడ్డి కడప పార్లమెంట్‌ స్థానం నుంచి.. టీడీపీ అభ్యర్థి ఎం.వి.రమణారెడ్డిపై గెలుపొంది పార్లమెంట్‌లో అడుగు పెట్టారు.
1991లో జరిగిన ఎన్నికల్లో వివేకానంద దూరంగా ఉండిపోయారు. వై.ఎస్.చిన్నాన్న పురుషోత్తం రెడ్డి.. టీడీపీ అభ్యర్థిని ఓడించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
అదే ఏడాది జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో వై.ఎస్. రెండోసారి కడప నుంచి ఎంపీగా గెలుపొందారు..
అలాగే.. 1996, 1998లలో కూడా వై.ఎస్.రాజశేఖరరెడ్డి.. టీడీపీ అభ్యర్థి కందుల రాజమోహన్‌ రెడ్డిపై పోటీచేసి ఎంపీగా గెలిచారు..
1994లో మళ్లీ వివేకా ఎంటరయ్యారు. టీడీపీ అభ్యర్థి రామమునిరెడ్డిపై పోటీచేసి.. పులివెందుల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
ఆ తర్వాత 1999, 2004, 2009లలో వై.ఎస్.రాజశేఖరరెడ్డి పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
వై.ఎస్.మరణానంతరం ఆయన సతీమణి విజయమ్మ ఏకగ్రీవంగా పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు.
2004లో కడప పార్లమెంట్‌ స్థానం నుంచి వివేకానందరెడ్డి.. టీడీపీ అభ్యర్థి మైసూరారెడ్డిని ఓడించారు..
2009లో వై.ఎస్.జగన్మోహన్‌ రెడ్డి టీడీపీ అభ్యర్థి పాలెం శ్రీకాంత్‌రెడ్డిపై గెలిచి తొలిసారి ఎంపీ అయ్యారు.
మారిన సీన్..!

1978నుంచి పులివెందుల, కడప పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో వై.ఎస్. ఏం చెప్తే అదే జరుగుతోంది.. కానీ ఇప్పుడు సీన్‌ మారింది. వై.ఎస్.కుటుంబం చీలిన నేపథ్యంలో వర్గపోరుకు తెరలేచింది. ఈ వర్గపోరు.. కేవలం పులివెందులకే పరిమితం కాదని.. కడప జిల్లావ్యాప్తంగా దీని ప్రభావం ఉంటుందనేది సుస్పష్టం.
     అధిష్టానం ఆదేశిస్తే.. జగన్‌పై పోటీ చేసేందుకైనా సిద్ధమన్న వివేకా.. అబ్బాయిపై కయ్యానికి కాలు దువ్వారు. పులివెందులతోపాటు కడప పార్లమెంట్‌ నియోజకవర్గంలోని కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, బద్వేలు తదితర ప్రాంతాల్లో వివేకాకు సత్సంబంధాలు ఉన్నాయి. అదే ఇప్పుడు ఆయన బలం..!
జగన్ వ్యాపారలావాదేవీల్లో బెంగళూరులో బిజీగా ఉన్నప్పుడు.. వై.ఎస్.హైదరాబాద్‌లో రాష్ట్రరాజకీయాల్లో మునిగి తేలుతున్నప్పుడు.. జిల్లా వ్యవహారాలన్నీ వివేకానే చక్కదిద్దేవారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల నేతలతో ఆయనకు పరిచయాలు ఉన్నాయి. జగన్‌ విభేదించి బయటకు రావడానికి ఇది కూడా ఓ కారణం. సో... కడప రాజకీయాలను ఇకముందు వై.ఎస్.ఫ్యామిలీ ముందు.. ఆ తర్వాత.. అని చెప్పుకోవాల్సి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.. 

3 comments:

Chittoor Murugesan said...

బాసు ,
బాగా కష్ఠపడి వ్రాసేరు. కాని చిన్న విషయం మరిచి పోయారు. రామమూర్తి నాయుడు చంద్రబాబు తమ్ముడే. కాని ఆయనగారి వెయిటెంత? బాబు గారి వెయిటెంత.

వై.ఎస్. కవర్ పేజి అయితే వై.ఎస్. వివేకా శతకోటి న్యూస్ ప్రింట్ పేజిల్లో ఒక పేజి

Anonymous said...

పేజి కూడా కాదు. ఇక్కడో ఒక మూల ఒక అక్షరం.

Anonymous said...

ఇతర ప్రాంతాల వారికి అలానే అనిపించవచ్చు. కానీ ఆ ప్రాంత ప్రజల దగ్గర వివేకానంద రెడ్డి కి మంచి పట్టు ఉంది. పులివెందుల మరియు కడప ఉపఎన్నిక ల లో పోటీ నువ్వా నేనా అన్నట్లు గా ఉండొచ్చు.