Tuesday, December 14, 2010

వీళ్లకా మనం ఓటేసింది?

     దైనా ఊరిలో కావచ్చు.. వీధిలో కావచ్చు.. ఇద్దరు వ్యక్తులు కొట్లాడుకుంటుంటే చూస్తున్న జనం వారిని సముదాయించేందుకు ప్రయత్నిస్తారు. పోట్లాడుకుంటున్నవారు కూడా ఆ క్షణంలో ఆవేశంతో ఏదైనా మాటకు మాట అనుకొని ఉండొచ్చు.. కానీ ఆ సంఘటన నుంచి కాస్త తేరుకున్న తర్వాత అలా జరిగి ఉండకపోయి ఉంటే బాగుండేది అని తప్పకుండా అనుకుంటారు. అలాగే.. వీధిలో అంతమంది ముందు.. తాను అలా చేయడం అవమానం కింద భావిస్తారు. చొక్కాలు చించుకుని, జుట్టు పట్టుకున్న తాను.. తెల్లవారితే వీధిలో తలెత్తుకు తిరిగేదెట్లా అని మథన పడతారు..

     కానీ.. మన ప్రజా ప్రతినిధులకు మాత్రం ఇలాంటి సిగ్గూ, లజ్జా ఏమీ ఉండవు.. టీవీ కెమెరాల ముందు ఎంత ఎక్కువ తిట్టుకుంటే అంత పబ్లిసిటీ.. ఇక చొక్కాలు చించుకుంటే.. రోజంతా వార్తల్లో ఉండొచ్చు. తెల్లారితే పేపర్ల నిండా తమ ఫోటోలు చూసి మురిసిపోవచ్చు. ఎవరేమనుకుంటే నాకేంటి..? తను టీవీలో, పేపర్లో వచ్చామా..? లేదా? అనేదే తనకు ముఖ్యం..

     అసెంబ్లీలో మన ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారా..? ఏంటి ఆ ఆవేశకావేశాలు.? వ్యక్తిగత విమర్శలు, సూటిపోటి మాటలు.. నువ్వెంత అంటే నువ్వెంత అనుకోవడాలు..!! ఛీ..ఛీ.. వీళ్లు మన ఎమ్మెల్యేలు అని చెప్పుకోవడానికే సిగ్గేస్తోంది. టీవీలో అసెంబ్లీ సమావేశాలు ప్రత్యక్ష ప్రసారమవుతున్నాయనే కదా.. వీళ్లిలా రెచ్చిపోయేది..? లేకుంటే ఒక మామూలు మనిషిలా.. ఎదుటి వ్యక్తిపై ఇలాంటి మాటలు మాట్లాడుతారా..? పేరుకేమో ప్రజా సమస్యలపై చర్చ.. కానీ.. అక్కడ జరిగేదంతా వ్యక్తిగత పరువు-ప్రతిష్టల పోటీ..!! అధికార, ప్రతిపక్షాలు ఒకరినొకరు విమర్శించుకోవడానికే సరిపోతోంది కానీ.. ఎక్కడ జరుగుతోంది చర్చ..? ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం.. నాడు అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాల వల్లే ఇప్పుడిలా జరుగుతోందని అధికారపక్షం... అప్పుడు మేం తప్పుచేశాం సరే... ఇప్పుడు మీరేం చేస్తున్నారని ప్రతిపక్షం.. ఇలా పరస్పర ఆరోపణలకే కాలం గడిచిపోతోంది.

     ప్రతిపక్షం గట్టిగా మాట్లాడితే వాళ్లను సస్పెండ్ చేయడం.. సభ నుంచి బయటకు పంపేయడం.. తమ పని కానిచ్చుకోవడం అధికార పక్షానికి అలవాటు.. ఇక.. ప్రతిపక్షం తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్నట్లు.. సభలో తాము చెప్పిందే జరగాలని పట్టుబట్టడం.. సస్పెండ్ కావడం కామన్..! సస్పెండ్ అయిన తర్వాత మార్షల్స్'తో చిన్నపాటి యుద్ధం, చొక్కాలు చించుకోవడం, బయటకు వచ్చి మీడియా ముందు చిరిగిన చొక్కాలతో తామేదో ఘనకార్యం చేసినట్లు అధికార పక్షంపై తిట్లదండకం విప్పడం ప్రతిపక్ష సభ్యులకు అలవాటుగా మారింది.

     ఒకసారి మన ప్రజాప్రతినిధులందరూ అంతర్మథనం చేసుకుంటే బాగుంటుంది.. అసెంబ్లీ ముగిసిన తర్వాత ఏరోజుకారోజు తాను తన నియోజక వర్గ ప్రజలకోసం ఏదైనా మేలు చేశానా.. అని ప్రతి ఎమ్మెల్యే తనను తాను ప్రశ్నించుకుంటే బాగుంటుంది..! తన అంతరాత్మకు సమాధానం చెప్పుకుంటే చాలు.. అంతకుమించి ప్రజలెవరకూ ఎమ్మెల్యే నుంచి మంచి ఆశించరు..!! ఓట్లేసి అసెంబ్లీకి పంపామని బాధపడటం తప్ప..!! మీరు మాకు మంచి చేయకపోయినా ఫరవాలేదు.. కానీ మా పేరు చెప్పుకుని మీ పబ్బం గడుపుకోవడానికి మాత్రం ప్రయత్నించకండి.. ప్లీజ్..!!!

2 comments:

Apparao said...

బాగా చెప్పారు

రాం చెరువు said...

ayya.. intha nikrushamga pravartinchE praja pratinidhulu andaru Otlu konukkoni ennukobadinavallE.. lEda.. meelanti.. naalanti vallu Otu vEyakapOvadam valla vatchina vaallE