Friday, December 17, 2010

వామ్మో.. తాజ్'మహల్..!!

     తాజ్'మహల్ ఒక్కసారి కూడా చూడలేదా..? అయితే వెంటనే ఆగ్రా వెళ్లి తాజ్ అందాలు తనివితీరా చూసేయండి.. లేకుంటే ముందు ముందు మీకా అవకాశం ఉండకపోవచ్చు.. అది సామాన్యులకు అందనంత ఎత్తులకు ఎదిగిపోతోంది మరి..

     అందాల తాజ్'మహల్ సందర్శన సామాన్యుడికి కలలో మాట కానుంది. ఒక్క తాజ్'మహల్ మాత్రమే కాదు.. ఈజిప్ట్'లోని గిజా పిరమిడ్స్, ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా.. అడుగడుగునా పిల్లకాలువలతో కనిపించే వెనిస్ నగరం.. ఇలాంటి ప్రపంచ వింతలను చూడాలంటే పెట్టి పుట్టాలి.. అవును..! ఇది నిజం..!!

    ప్రతిరోజూ వేల సంఖ్యలో వచ్చే పర్యాటకులు తాజ్'మహల్ వంటి కట్టడాల్లోకి దూసుకుపోతున్నారు. ఫోటోలు తీసుకుంటే ఫరవాలేదు.. తినుబండారాలు, కూల్'డ్రింక్'ల వ్యర్థాలతో చారిత్రక కట్టడాల ప్రాంగణాలను నింపేస్తున్నారు. వేల సంఖ్యలో వచ్చే పర్యాటకులు, వారి వాహనాలు.. లాంటి వాటితో చారిత్రక కట్టడాల ప్రాంగణాలు కుంగిపోతున్నాయట.! ఇది ఇలాగే కొనసాగితే మాస్ టూరిజం బారినపడి మన హెరిటేజ్ సైట్స్ మరో 20 ఏళ్లలో కుప్పకూలడం ఖాయమని అంతర్జాతీయ పురావస్తు శాస్త్రజ్ఞులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

     ప్రాచీన కట్టడాలను పరిరక్షించాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని వారు చెబుతున్నారు. ఇందులో భాగంగానే.. తాజ్'మహల్ వంటి వరల్డ్ హెరిటేజ్ సైట్ల సందర్శనకు.. టికెట్ ధరను భారీగా పెంచాలని సూచిస్తున్నారు. బ్రిటన్ వంటి దేశాల్లో.. ఇప్పటికే బస్సులు, రైళ్ల వంటి ప్రజాప్రయాణ సాధనాల్లో వచ్చిన టూరిస్టులను మాత్రమే ప్రాచీన కట్టడాల దగ్గరికి అనుమతిస్తున్నారు.
    
     మరి... ఇక తాజ్'మహల్'ను ఇక చూడలేమా..? అంటే.. చూడొచ్చు. భారీ మొత్తం పెట్టి టికెట్టు కొనలేని సామాన్య పర్యాటకులకోసం.. ప్రాచీన కట్టడాలకు కాస్త దూరంలో ప్లాట్'ఫారంలను ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచి మాత్రమే వాటిని చూడాల్సి ఉంటుంది. ఇక.. టికెట్టు కొన్నవారిని మాత్రం లోపలికి అనుమతిస్తారు. అడుగడుగూ చూడనిస్తారు.
    
     సో.. తాజ్'మహల్ కాస్ట్'లీగా మారకముందే.. ఓ సారి వెళ్లి చూసిరండి.. లేకుంటే వాహ్ తాజ్.. బదులు... వామ్మో తాజ్ అనాల్సి వస్తుంది...!!

No comments: