Thursday, December 16, 2010

జేపీసీ అంటే...?


     ప్పుడు దేశవ్యాప్తంగా 2G స్పెక్ట్రమ్ కుంభకోణం సంచలనం సృష్టిస్తోంది. దీనిపై జేపీసీ వేయాల్సిందేనంటూ కేంద్రంలో ప్రతిపక్షం ముక్తకంఠంతో కోరుతోంది. ఇందుకు యూపీఏలోని మమతా బెనర్జీ లాంటి వాళ్లు కూడా మద్దతు పలుకుతున్నారు. అయినా యూపీఏ ప్రభుత్వం మాత్రం ససేమిరా అంటోంది. మన్మోహన్ సర్కార్'కు జేపీసీ అంటే ఎందుకింత భయం..? ప్రతిపక్షాలు జేపీసీ కోసమే ఎందుకు పట్టుబడుతున్నాయి..? అసలు జేపీసీ అంటే ఏంటి?
జేపీసీ అంటే...
     ఓ నిర్దిష్ట అంశంపై విచారణ జరిపేందుకు ఉభయ సభల్లో ఏసభలోనైనా ఓ తీర్మానం ఆమోదించి, మరో సభ కూడా దానికి ఆమోదం తెలిపితే జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ ఏర్పడుతుంది. ఉభయ సభల ప్రిసైడింగ్‌ ఆఫీసర్లు (స్పీకరు, ఉపరాష్టప్రతి) చర్చించి కూడా ఈ కమిటీని ఏర్పాటు చేసే వీలుంది. ఈ కమిటీల సభ్యులను ఆయా సభలు ఎన్నుకోవచ్చు లేదా ప్రిసైడింగ్‌ ఆఫీసర్లు (స్పీకరు, ఉపరాష్టప్రతి) నామినేట్‌ చేయవచ్చు.ఇతర పార్లమెంటరీ కమిటీల విషయానికి వస్తే, అవి వివిధ గ్రూప్‌ల నుంచి రూపుదిద్దుకుంటాయి. జేపీసీలో సభ్యుల సంఖ్య కూడా సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఒక జేపీసీలో 15 మంది సభ్యులే ఉంటే మరో దానిలో 30 మంది ఉంటారు. రాజ్యసభ నుంచి కమిటీలో ఉండే సభ్యుల కంటే కూడా రెట్టింపు సంఖ్యలో లోక్‌సభ నుంచి సభ్యులు ఉంటారు.

     జేపీసీ తన విచారణకు ముగించేందుకు ముందే లోక్‌సభ కాలపరిమితి ముగిసిపోతే.... లోక్‌సభ కాలపరిమితి ముగిసే లోగా లేదా అది రద్దు అయ్యే లోగా ఓ కమిటీ తన పనిని పూర్తి చేయలేకపోతే, అదే విషయాన్ని అది సభకు తెలియజేస్తుంది. అలాంటి సందర్భాల్లో అప్పటి వరకూ అది తయారు చేసిన ప్రాథమిక నివేదిక, మెమొరాండమ్‌ లేదా నోట్‌ను తదుపరి కమిటీకి అందుబాటులో ఉంచుతారు.


జేపీసీ అధికారాలేంటి....
     నిపుణులు, ప్రభుత్వ సంస్థలు, సంఘాలు, వ్యక్తులు లేదా ఆ అంశంపై ఆసక్తి గల వర్గాల నుంచి సుమోటోగా లేదా ఆయా వర్గాల అభ్యర్థన మేరకు సాక్ష్యాలను సేకరిం చే అధికారం జేపీసీకి ఉంది. తన ముందు హాజరు కావా ల్సిందిగా సమన్లు జారీ చేసే అధికారం జేపీసీకి ఉంది. కమిటీ ముందు హాజరుకావడంలో ఓ సాక్షి విఫలమైతే అది సభాఉల్లంఘన కిందకు వస్తుంది. నోటిమాటగా లేదా లిఖితపూర్వకంగా జేపీసీ ఆయా సాక్ష్యాలను సేకరించవ చ్చు. తన పరిశీలిస్తున్న నిర్దిష్ట అంశానికి సంబంధించిన డాక్యుమెంట్ల కోసం ఆయా విభాగాలను కోరవచ్చు. సాధారణంగా పార్లమెంటరీ కమిటీల ప్రొసీడింగ్స్‌ అన్నీ గోప్యంగా ఉన్నప్పటికీ, జేపీసీ తీరు మాత్రం అలా కాదు. సాధారణంగా ఇవి ఎంతో సంచలనాత్మకమైన అంశాలపై ఏర్పడినందున, వీటి పనితీరుపై ప్రజల్లో ఎంతగానో ఆసక్తి ఉన్నందున కమిటీ పనితీరుపై చైర్మన్‌ ఎప్పటికప్పుడు మీడి యా సమావేశాల్లో వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది.

మంత్రులనూ పిలిచే అధికారం...
     సాక్ష్యం ఇవ్వాల్సిందిగా సాధారణంగా మంత్రులను ఆయా పార్లమెంటరీ కమిటీలు పిలువవు. సెక్యూరిటీలు, బ్యాంకింగ్‌ లావాదేవీల్లో అవకతవకలకు సంబంధించిన ఉల్లంఘనల విషయానికి వస్తే మాత్రం ఈ సంప్రదాయా నికి కూడా మినహాయింపు ఉంది. స్పీకరు అనుమతితో, నిర్దిష్ట అంశాలపై సమాచారం కోరవ చ్చు. అంతేగాకుండా ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రులను తన ముందు హాజరు కావాల్సిందిగా ఆదేశించవచ్చు. 

స్పీకరుదే తుది నిర్ణయం
     దేశ ప్రయోజనాలకు భంగకరమని భావించినప్పుడు ఏదైనా అధికారిక పత్రాన్ని సమర్పించడాన్ని ప్రభుత్వం నిలిపివేయవచ్చు లేదా తిరస్కరించవచ్చు. ఓ వ్యక్తిని సాక్ష్యం కోసం పిలవడంలో, ఓ డాక్యుమెంట్‌ సమర్పణలో తుది నిర్ణయం మాత్రం స్పీకరుదే.

ఇప్పటి వరకూ ఎన్ని జేపీసీలు?

     ఇప్పటి వరకూ నాలుగు జేపీసీలు మాత్రమే ఏర్పాటయ్యాయి. 

1. మొట్టమొదటి జేపీసీ బోఫోర్స్‌పై విచారణకు ఏర్పడింది. నాటి రక్షణ మంత్రి కేసీ పంత్‌ ఈ తీర్మానాన్ని 1987 ఆగస్టు6న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఓ వారం తరువాత రాజ్యసభ కూడా దీనికి ఆమోదం తెలిపింది. ఈ కమిటీకి బి.శంకరానంద్‌ నేతృత్వం వహించారు. 50 సిట్టింగులు జరిగాయి. 1988 ఏప్రిల్‌ 26న ఈ కమిటీ తన నివేదికను సమర్పించింది. కాంగ్రెస్‌ ఎంపీలతో కమిటీని నింపివేశారని ఆరోపిస్తూ విపక్షం ఈ కమిటీని బహిష్కరించింది. జేపీసీ నివేదికను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టినప్పటికీ, విపక్షం దాన్ని తిరస్కరించింది.

2. రెండో జేపీసీని హర్షద్‌ మెహతా కుంభకోణం రట్టయినప్పుడు ఏర్పాటు చేశారు. సెక్యూరిటీలు, బ్యాంకింగ్‌ లావాదేవీల్లో అవకతవకలపై విచారణ దీని ప్రధాన ఉద్దేశం. దీనికి కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు రామ్‌ నివాస్‌ మీర్థా నేతృత్వం వహించారు. కమిటీ ఏర్పాటుకు సంబంధించిన తీర్మానాన్ని 1992 ఆగస్టు6న లోక్‌సభలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ అప్పటి మంత్రి గులామ్‌ నబీ అజాద్‌ ప్రవేశపెట్టారు. మరుసటి రోజే రాజ్యసభ దీన్ని ఆమోదించింది. ఈ జేపీసీ సిఫారసులను పూర్తిగా ఆమోదించలేదు లేదా ఆచరించలేదు.

3. మూడో జేపీసీని స్టాక్‌ మార్కెట్‌ కుంభకోణంపై పరిశీలనకు 2001లో ఏర్పాటు చేశారు. 2001 ఏప్రిల్‌ 26న పార్లమెంటరీ వ్యవహారాల శాఖ నాటి మంత్రి ప్రమోద్‌ మహాజన్‌ లోక్‌సభలో ఈ తీర్మానం ప్రవేశపెట్టారు. బీజేపీ సీనియర్‌ సభ్యుడు లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ (రిటైర్డ్‌) ప్రకాష్‌ మణి త్రిపాఠి దీనికి నేతృత్వం వహించారు. 105 సార్లు కమిటీ సమావేశమైంది. 2002 డిసెంబర్‌ 19న కమిటీ తన నివేదికను సమర్పించింది. స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణలో పెను మార్పులను ఈ కమిటీ సూచించింది. 

4. నాలుగో జేపీసీని 2003 ఆగస్టులో ఏర్పాటు చేశారు. శీతల పానీయాలు, పళ్ళరసాలు, ఇతర పానీయాల్లో క్రిమిసంహారకాల అవశేషాలు, సురక్షిత ప్రమాణాలను పరిశీలించేందుకు ఇది రూపుదిద్దుకుంది. ఎన్‌సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ దీనికి నేతృత్వం వహించారు. కమిటీ 17 సార్లు సమావేశమైంది. తన నివేదికను 2004 ఫిబ్రవరి 4న కమిటీ సమర్పించింది. శీతలపానీయాల్లో క్రిమిసంహారకాల అవశేషాలు ఉన్నట్లు కమిటీ ధ్రువీకరించింది. తాగునీటి సురక్షిత ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేయాల్సిందిగా సూచించింది. 

3 comments:

Thirmal Reddy said...

Excellent, very informative. Proud of you CLN.

Thirmal Reddy
thirmal.reddy@gmail.com

C L N RAJU said...

Thank u soo much for ur comment anna...

angelgallela said...

Really yaar very informative. thanks a lot.