Tuesday, December 28, 2010

పొగబారుతున్న బతుకులకు విముక్తి

క్లీన్'కుక్ స్టౌవ్'తో వంట చేస్తున్న మహిళ
     గ్రామాల్లో పొగబారిపోతున్న పేదల జీవితాలు మారిపోనున్నాయి. సంప్రదాయ పొయ్యిల నుంచి విడుదలయ్యే పొగ వల్ల సంభవించే మరణాలు తగ్గనున్నాయి. విషతుల్యమైన పొగతో ప్రమాదాన్ని తగ్గించే క్లీన్ స్టౌలు త్వరలో గ్రామీణ భారతానికి అందుబాటులోకి రానున్నాయి.

     భారత దేశ ఆర్థిక వృద్ధి రేటు రెండంకెలకు సమీపంలో ఉన్నా.. పేదల బతుకు చిత్రంలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు. దేశంలో సంపన్నుల ఆదాయం ఏ యేటికాయేడు పెరుగుతున్నా.. బడుగుల ఆర్థిక స్థితిగతుల్లో పురోగతి లేదు. పేదరికం కారణంగా గ్రామాల్లో ఇప్పటికీ చాలా మంది కట్టెలు, పిడకలను ఉపయోగించే వంట చేసుకుంటున్నారు. ఈ సంప్రదాయ పొయ్యిలు విడుదల చేసే పొగతో.. వారి జీవితాలు పొగబారిపోతున్నాయి. వంటగదుల నుంచి విడుదలయ్యే పొగతో దేశంలో ఏటా 4 లక్షల మంది చనిపోతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వెల్లడిస్తోంది. అంతేకాక సరైన వెంటిలేషన్ లేకపోవడం వల్ల పొగచూరి.. వ్యాధుల బారిన పడుతున్నవారెందరో..!! న్యుమోనియా, హృద్రోగ సమస్యలు, తగినంత బరువు లేకుండా శిశువుల జననం వంటి సమస్యలతో ఎంతో మంది సతమతమవుతున్నారు.

     అందుకే.. గ్రామీణ పేదల బతుకు చిత్రాన్ని మార్చేందుకు బ్రిటన్'కు చెందిన స్వచ్చంధ సంస్థ ముందుకొచ్చింది. బయోగ్యాస్, LPG గ్యాస్ వాడే స్తోమత లేనివారి కోసం క్లీన్ కుక్ స్టౌలను తయారుచేసింది. ఇవి గ్రీన్'హౌస్ గ్యాస్, పొగతో సంభవించే మరణాలను తగ్గిస్తాయి. ఇందులో కూడా వంట చెరకు, పిడకలు వాడొచ్చు. అయితే.. ఈ స్టౌలు తక్కువ పొగను విడుదల చేస్తాయి. అలాగే తక్కువ కట్టెలతోనే ఎక్కువ వంట చేసుకోవచ్చు.

     షెల్ ఫౌండేషన్ క్లీన్ స్టౌలను భారత మార్కెట్లో ప్రవేశ పెట్టనుంది. ప్రైవేటు భాగస్వామ్యంతో వీటిని మార్కెటింగ్ చేయనున్నారు. స్టౌ తయారీదారులు మైక్రో ఫైనాన్షియర్ల సహకారంతో ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్రలలో వీటిని ప్రమోట్ చేయాలని భావిస్తున్నారు. వచ్చే పదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా కోటి ఇళ్లకు ఈ క్లీన్ కుక్ స్టౌలను అందజేయాలని ఫౌండేషన్ లక్ష్యంగా పెట్టుకుంది.

1 comment:

Sudheer Reddy Gudipally said...

గ్రామీణ భారతానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది.. కానీ దీని ధర ఎంతో మరి! 100 రూపాయలవరకైతే భరించగలరు.. లేదంటే ప్రభుత్వమే ఉచితంగా ఇవ్వాలి.